రాకాసి గుట్టల్లో బృహత్ శిలలు

dolmenప్రపంచంలో మరెక్కడా కనిపించని నిర్మాణాలు.. దక్షిణ భారత దేశ సంస్కృతికి అద్దంపట్టే చిత్రాలు.. బృహత్ శిలలు! బ్రిటన్ లోని స్టోన్‌హెంజ్ రేంజ్ శిలలు మన తెలంగాణలోనూ ఉన్నాయని మీకు తెలుసా? ఖమ్మం జిల్లా గుండాల మండలం పడుగోనిగూడెం సమీపంలోని రాకాసి గుట్టల్లో బృహత్ సంస్కృతికి సంబంధించిన ఆధారాలున్నాయి. ఎత్తైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతంలో అద్భుతమైన శిలా స్మారక నిర్మాణాలు కనిపిస్తాయి. వాటి వీక్షణం..


ఈ వారం డిస్కవరీ తెలంగాణం..

వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన సంస్కృతే బృహత్ శిలా సంస్కృతి. రాతి శిలా యుగం వీరి కాలంలోనే అంతరించి ఇనుప లోహ యుగం ఈ దశ నుంచే ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతున్నారు. పడుగోనిగూడెం సమీపంలోని రాకాసి గుట్టల్లో నాటి ప్రజల ప్రగతిని భావితరాలకు అందిస్తున్న ఆనవాళ్లున్నాయి. నాటి జీవనాన్ని జ్ఞాపకాలుగా స్మృతి శిలల్లోను, శిలాస్మారక నిర్మాణాల్లోను పదిలపరిచిన విశిష్ట సంస్కృతి బృహత్ శిలా సంస్కృతి. మహోన్నతమైన భారతీయ నాగరికత వికాసంలో అద్వితీయ పాత్ర పోషించిన ఈ సంస్కృతి క్రీ.పూ 2000 సంవత్సరాల నుంచి క్రీ.పూ. 3 వందల సంవత్సరాల వరకు విరాజిల్లింది.

shilapetika
ఆకట్టుకునే డోల్మెన్‌లు

నాటి ప్రజలు స్మృతి చిహ్నాలుగా రూపొందించుకున్న ఈ శిలల్ని, శిలాస్మారక నిర్మాణాలైన మెన్‌హీర్, స్టోన్ సర్కిల్, డోల్మెన్ తదితర పేర్లతో చరిత్రకారులు పిలుస్తున్నారు. వీటన్నింటిలోనూ డోల్మెన్ నిర్మాణాలు ముఖ్యమైనవి. దీర్ఘ చతురస్రాకారంలో భారీగా ఉన్న శిలా ఫలకాలను నిలబెట్టి వాటిపై కప్పులాగా మరొక బృహత్ శిలా ఫలకాన్ని ఉంచారు. ఈ భారీ నిర్మాణాలనే డోల్మెన్‌లు అని పిలుస్తున్నారు. దక్కన్‌లో వాస్తు నిర్మాణాలకు ఇవి నాంది పలికాయని చరిత్ర చెబుతోంది. భారతదేశంలో మరెక్కడా కనిపించని విశిష్టమైన డోల్మెన్లు ఇక్కడ బయటపడ్డాయి. బౌద్ధ స్తూప వాస్తు నిర్మాణ రీతిలో నిర్మించిన కొన్ని డోల్మెన్‌లు బౌద్ధుల కంటే సుమారు వెయ్యి సంవత్సరాల ముందే ఇక్కడ కనిపించడం ఆసక్తికరమైన అంశం.

అద్భుతమైన హస్తకళ

బృహత్ శిలాయగం నాటి ప్రజల హస్తకళ అద్భుతమైనది. ఇక్కడ బయటపడిన శిల్పాలు ఇదే చెబుతున్నాయి. శిల్ప కళాకృతులలో స్త్రీ, పురుషుల రూపాలను భారీ పరిమాణంలో రూపొందించి డోల్మెన్‌లకు ఎదురుగా ఉంచారు. కొన్ని చోట్ల జంట శిలలు కూడా ఉన్నాయి. భారత ఉపఖండంలో శిల్పకళకు సంబంధించిన మొదటి ఆధారాలు హరప్పా నాగరికతలో లభించినప్పటికీ తదనంతరం మౌర్యుల కాలం వరకు ఈ శిల్పకళకు సంబంధించిన సమాచారం బయటపడలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం హరప్పా అనంతరం బయటపడిన శిల్పాలు ఇవే కావొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

rolu
పూర్వీకులే దేవుళ్లు

బృహత్ శిలా సంస్కృతికి చెందిన ప్రజలు పూర్వీకులను దైవంగా కొలిచేవారు. మరణానంతరం పూర్వికుల అస్థికలను శిలా పేటికలలో భద్రపరిచేవారు. ఆ పేటికలను గుట్టలపై డోల్మెన్‌ల లోపల పెట్టేవారు. శత్రువుల నుంచి దాడులు ఎదురైనప్పుడు, రోగాలు వ్యాపించినప్పుడు ఈ పేటికల దగ్గరకు వచ్చి పూజలు చేసేవారు. అలాంటి శిలాపేటికలు కూడా ఇప్పుడిక్కడ దర్శనమిస్తున్నాయి. శిలా పేటికలు, వాటి మూతలు ఎంతో నైపుణ్యంతో నిర్మించారు. అరుదైన శిలా వాస్తుకు సంబంధించిన ఆవశేషాలూ ఇక్కడ ఉన్నాయి. శిలలను తొలిచి తయారు చేసిన రోళ్లు, నీటి తొట్టేవంటి శిలా రూపాలు కూడా దొరికాయి.

రాకాసి గుట్టలా?

బృహత్ శిలలు ఉన్న ఈ గుట్టల్ని రాకాసి గుట్టలు అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ గుట్టలపై రాక్షసులు ఉండేవారట. ఓ సందర్భంలో భీముడు ఈ గుట్ట మీది నుంచి వెళ్తుంటే రాక్షసులు అడ్డుకున్నారట. అప్పుడు భీమునుకి, రాక్షసులకు భీకరమైన పోరాటం జరిగిందట. కొన్ని రోజుల పాటు జరిగిన ఈ పోరాటంలో భీముడు రాక్షసులందరినీ హతమార్చి శిలలుగా మార్చేశాడని ఇక్కడి గిరిజనులు నమ్ముతున్నారు. అందుకే వీటికి రాకాసి గుట్టలని వారు పిలుచుకుంటున్నారు. కానీ లోతుగా చరిత్రను పరిశీలిస్తే..ఈ శిలలు బృహత్ శిలా సంస్కృతికి సంబంధించినవని అర్థం అవుతోంది.

nititotti
పురావస్తు శాఖ దృష్టి సారిస్తే..

రాకాసి గుట్టలపై పురావస్తుశాఖ వారు దృష్టి సారిస్తే మరిన్ని అవశేషాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. అరుదైన సంస్కృతికి సంబంధించిన అవశేషాలు ఇక్కడ లభ్యమవ్వడంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దవచ్చని అంటున్నారు. ప్రజలకు అవగాహనా లేకపోవడం వల్ల ఇప్పటికే కొన్ని శిలలు ధ్వంసమయ్యాయి. ప్రపంచ దేశాల్లో కేవలం బ్రిటన్‌లోనే స్టోన్‌హెంజ్ గృహ శిలా సంస్కృతికి కేంద్రం ఉంది. అక్కడికి లక్షలాది పర్యాటకులు వెళ్లి చూసి వస్తుంటారు. ఈ రాకాసి గుట్టల్ని కూడా అంతటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చు.

కామెంట్‌లు