నేలకొండపల్లి బౌద్ధ స్తూపం మరికొన్ని విశేషాలు

నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వివరాలతో ఏర్పాటు చేసిన బోర్డు
ఖమ్మం జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో నేలకొండపల్లివుంది. ఖమ్మంనుంచి కోదాడ వెళ్ళే ఏ బస్ అయినా ఇటునుంచే వెళుతుంది. హైదరాబాద్ విజయవాడలకు రామారమి 140 కిలో మీటర్ల దూరంలో వుంది.  కోదాడకు 16 కిలోమీటర్ల దూరం వుంటుంది.

నేలకొండపల్లి దిగగానే బౌద్ధస్థూపానికి ఎటువైపు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అడిగితే, ఎర్రదిబ్బకి ఆటో కావాలని అడగండి అర్ధం అవుతుంది అని చెప్పారు. దీన్ని ఎర్రదిబ్బ లేదా విరాట్రాజు దిబ్బ అని స్థానికంగా పిలుస్తారు. ఈ మట్టిదిబ్బ ఇటుకలతో నిర్మించింది కాావడంతో ఎర్రగా కనిపిస్తుంది. మహాభారత కథలతో ముడిపెట్టి ఇది విరాట మహారాజు కూర్చున్న దిబ్బ కావడం వల్ల విరాట్రాజు దిబ్బ అని పిలుస్తున్నాం అని చెపుతున్నారు. మిత్రులు బైక్స్ తేవడంతో ఆటో లబదులుగా వాటిపైనే మా ప్రయాణం కొనసాగించాం గ్రామంలోని వేర్వేరు పురాతన గుడులూ, రామదాసు జన్మస్థలం చూసుకుంటూ వెళ్ళా ఆ వివరాలను మరోసారి ముచ్చటించుకుందాం.

నేలకొండపల్లికి చుట్టుపక్కల మజ్జుగూడెం, అనాసాగరం, గువ్వలగూడెం, బైరాగిగట్టు, కీచకగూడెం, బానాపురం, గోపదానిగూడెం అనే గ్రామాలలో కూడా అనేక బౌధ్దసంభంద ఆధారాలు లభించాయట. ధమ్మాయిగూడెం, కోరుకొండ ప్రాంతాలలో స్థూపాలు గుహాలయాల ఆధారాలు కనిపించాయని చెపుతున్నారు.

1976లో కానీ ఈ స్థూపం ఉనికి వెలుగులోకి రాలేదు. అప్పటివరకూ స్థానికులకు కేవలం ఎర్రమట్టి దిబ్బగా గోడలు అలికే మట్టితీసుకెళ్ళేందుకు ఉపయోగపడే ప్రదేశంగా మాత్రమే వుండేది. ఆ తర్వాత 1984-95 సంవత్సరాల మధ్య కాలంలో జరిపిన తవ్వకాలలో ఈ స్థూపం విలువ మరింతగా బయట పడింది. అమరావతి స్థూపం తర్వాత పరిమాణంలో ఇదే పెద్దదా లేక చుట్టు పక్కమొత్తం నిర్మాణాల విస్తీర్ణంతో కలుపుకుంటే ఇదే అత్యంత పెద్దదా అనే విలువను ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు.  దీని చుట్టూ వున్న చైత్యాలు, భిక్షుక నివాసాలతో కలుపుకుంటే దాదాపు 100 ఎకరాల స్థలాన్ని ఈ చారిత్రక ప్రదేశం కలిగివుంది. ఇది గాక తవ్వకాలలో ఈ ప్రాంతంలో హరప్పా,మొహంజోదారో లాగా  ఒక మహానగరమే బయటపడే అవకాశాలున్నాయని చారిత్రపరిశోదకులు భావిస్తున్నారు.

ప్రధానస్థూపం రెండెకరాలస్థలంలో నిర్మించినట్లున్నారు. దీని చుట్టుకొలత 180 మీటర్లు, ఎత్తు 16 మీటర్లు వుంటుంది. 6 అడుగుల చక్రాకార పునాదిపై అయిదడుగుల మేధిని నిర్మించారు. మేధినికి నాలుగువైపులా 8 అడుగుల వెడల్పు గల ఆయక వేదికలున్నాయి. మేధిపై అండాన్ని అశోకచక్రం (ధర్మచక్రం) ఆకారంలో నిర్మించి క్రిందినుండి పైకి వరుసగా 24, 18, 12 ఆకులనుంచారు.

మహా స్థూపం చుట్టూ రెండు ప్రదక్షిణా పథాలు ఒక్కొక్కటి అయదడుగుల వెడల్పున నిర్మించారు. ఆయక వేదికకు ఎదురుగా నాలుగు వైపులా ప్రవేశ మార్గాలుండేలాంటి నిర్మాణమిది. ఈ స్థూపం నిర్మాణానికి వాడిన ఇటుకలు మొత్తం కూడా దీర్ఘఘనాకారంలో 20 X 10  X 3 పరిమాణంలో వున్నాయి. ఇప్పుడు నూతనంగా ఈ స్థూపానికి మరమత్తులు చేసేందుకు తయారుచేసిన ఇటుకలను కూడా అదేపరిమాణంలో తయారుచేసి ఆదునికరిస్తున్నారు.

ఇక్కడ లభించిన కొన్ని ఇటుకలపై తొలి బ్రహ్మిలిపిలో  ‘ స మన’ అని వ్రాయబడివున్నట్లు పేర్కొన్నారు.  అంటే బౌద్ధ బిక్షువు అని అర్ధం. ఎవరో ఒక భిక్షువు ఒక కట్టడాన్ని నిర్మించినట్లు వుంది. అలాగే క్రీ. శ 3-4 శతాబ్దాలకు చెందిన ఒక స్థూపంపైన బ్రాహ్మీ శాసనం లభించిందట.  దానిపై వున్న ‘కంద బరస’ అనే పదాల ఆధారంగా బహుశా స్కంద బద్ర అనే బౌద్ధ బిక్షువు దీనిని దానంగా ఇచ్చివుండవచ్చునని భావిస్తున్నారు.

ఈ మహాస్తూపానికి ఎదురుగా తూర్పు దిశలో 100 ఎకరాల స్థలంలో మజ్జుగూడెం గ్రామం వరకూ బిక్షునివాస గృహాలున్నాయి. ఇప్పటికే పురావస్తు తవ్వకాలలో 77 గృహాలు వెలుగు చూసాయి. అదేవిధంగా నల్లదిబ్బ వద్ద జరిపిన తవ్వకాలలో 45 x 15 అడుగుల పరిమాణంలో నిర్మించిన గుర్రపు నాడా ఆకారంలోని చైత్యాలు ( సమావేశ మందిరాలు ) బయట పడ్డాయి.
మహా స్తూపం ఊహాచిత్రం
పర్యాటకులకు అర్ధం కావడం కోసం ఏర్పాటు చేసిన బోర్డు

మహాస్థూపం నమూనా

మేధినిపై వున్న ఆయక వేధికలు 
ఇవి గాక సున్నపురాతి శిలా ఫలకాలను శుద్ధి చేయడానికి వివిధ పరిమాణాలలో ఇటుకలతో కట్టిన నీటి తొట్టెలు మట్టిబొమ్మలు, పూసలు, పాత్రలు వంటి ఎంతో చారిత్రక సామగ్రి లభించిందని పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడి బైరాగి గుట్ట ప్రాంతంలోని శ్రేష్టమైన రాతినే అనేక శిలావిగ్రహాలు చేసేందుకు వాడివుంటారని భావిస్తున్నారు. ఈ రాతిని ఉపయోగించి మలచిన అమూల్యమైన విగ్రహాలనే అప్పట్లో విదేశాలకు ఎగుమతి చేసివుందేవారేమో అనుకోవడంలో సందేహపడాల్సిన పనిలేదు.
ఇప్పుడు బాల సముద్రం పేరుతో పిలవబడుతున్న మంచినీటి సరస్సు అప్పటి బిక్షుక గ్రామం మంచినీటి అవసరాలు తీర్చేందుకు గానూ నిర్మించిందేనని భావిస్తున్నారు. దీనిలో వేసవి కాలం నీటి నిల్వలు తగ్గిన సమయంలో ఇప్పటికీ వివిధ రకాలైన పూసలు, బొమ్మల, మట్టిపాత్రలూ లాంటి విలువైన వస్తువులు బయట పడుతుంటాయట. ఇదే పద్దతిలోనే ఒక జాలరికి కోట్లాది రూపాయిలు ఖరీదు చేసే అమూల్యమైన బుద్దుని పంచలోహ విగ్రహం దొరికింది.

నిర్మాణ కాలగణన విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 2-1 శతాబ్దాల కాలంలో శాతవాహనులు ఈ మహాస్తూపాన్ని నిర్మించి వుండొచ్చని భావిస్తున్నారు. శాతవాహనుల ఇక్ష్వకుల రాగినాణెములు, విష్ణుకుండినుల కాలంనాటి నాణెలు ఇక్కడ లభించాయి. అంటే క్రీస్తు శకం 6 శతాబ్ది వరకూ కూడా వీరి కాలాలలో బౌద్ధం మంచి స్థితిలో వుండి వుంటుందని భావించవచ్చు.

మహా చైత్యం ఇప్పుడు శిధిల స్థితిలో ఒక దిబ్బలాగా మాత్రమే వున్నందును అసలు రూపం ఎలావుంటుందో చూపించే నమూనాను ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసారు. కానీ అదికూడా పూర్తిగా తుప్పపట్టిపోయివుంది.
విలువైన నల్లరాళ్ళ నిలయమే కాక
ఆదిమ మానవుడు సంచరించిన ఆధారాలున్న భైరాగి గుట్ట


మరికొన్ని వివరాలు ఇక్కడ చూడండి.

మిత్రులతో కలిసి చేసిన నేలకొండపల్లి పర్యటనలోని ఫోటోలు


కామెంట్‌లు