బంగారు తెమ్మెరల బాబు (ఎలిజీ)

ష్
తెర దిగిపోయింది.
ష్ ష్
పైడి తెమ్మెర గుసగుసలేవో ఇంకా చెపుతోంది.
అన్నా
నువ్వొకరకంగా అదృష్టవంతుడివి,
నాటకం ముగింపుని ముందుగానే దర్శించావు.
మేమే
పర్జన్యశంఖారావాన్ని గర్జించేలోగానే పోగొట్టుకున్నాం
తటపటాయించని తర్జనిని నిర్ధిశలోనే చేజార్చుకున్నాం.

అన్నా 
గీతాశ్లోకాలని దు:ఖ తీరపు ఒడ్డున వదుల్తుంటే
కారకులప్పటికే తీరాన్ని దాటిపోతుండేవారు.
అదేమిటో నువ్వు
ముందుగానే వాటిని నవ్వుతూ నమిలేసావు.

అన్నా
నీ నవ్వు వెలుతుర్ల దారిని మా నడకకోసం దాచుకుంటాం
నీ పలకరింపుల పచ్చదనాన్ని మా మదిలోనూ నాటుకుంటాం
మరీ మరీ ముఖ్యంగా
కోటలోకి సూదిజొరబడితే
గునపమై లేచే నీ ఆవేశపు కెరటాన్ని ఆవహింపజేసుకుంటా.
నీ కళ్లమెరుపు జెండాని మా అక్షరాలకద్ది ఎగరేస్తుంటాం.

అన్నా 
కుదిర్తే మళ్ళీరా
ఈ సారి నిండా వుండేట్లురా
నీ పరిమళంపై బెంగతీరకముందే
ఇలా
అర్ధాంతరంగా అంతర్ధానమైపోయేలా మాత్రం రాకు.

కామెంట్‌లు