ఇదో జువెనైల్ డెలిక్వెన్సీ

 బాల్యం చేజారిపోవడం అంటే?
సంవత్సరాలు గడిచాక నిద్రలోంచి లేవడమేనా ?
పచ్చదనం తొడగాల్సిన చిగురులని చితిపేయడం.

బాల్యాన్ని చంపేయడమంటే?
దేహాన్ని తుంచేయడమేనా?
ప్రవహించే సమయాన్ని ప్రొగ్రెస్ గడుల్లో కుక్కేయడం

సంతోషపు జెండాలను చెడ్డీలుకుట్టించుకున్న
ఓరినా ప్రయోజన వాదుల్లారా
ఎందుకా చీకటి కార్ఖానాలో గలగలల్ని కలగంటారు?

బిడాయించిన తలపుల్నోసారి సడలించిచూడు,
గుండెల్నిండా గాలి, కళ్ళపంటగా రంగులూ
చెవుల్లో ఆనందపు హోరులా తాకుతూ సందర్బం వీస్తుంది.

నువ్వు నీలా నీతో వుండటం వస్తే
రెండుచేతుల్తో పొదవకుండానే
అడుగు అదే ముందుకు పడుతుంది.

నీతో నీకు నవ్వుకోవడం తెలిస్తే
నవ్వుకండరాల కదలికలకు పుస్తకాలు కొలతలేయకుండా
వెన్నెలదే విచ్చుకుంటుంది.

అలాగని
ఇనప్పెట్టెలో దాచిన పతంగాన్ని
అదాటున వాటానికి విసిరేసేముందు
సుతారంగా ఓ దారాన్ని కదపటం మర్చిపోకు.

25-10-2014

కవిసంగమంలో 

కామెంట్‌లు