No thyself Know thyself

1
పుస్తకాల తలగడలమీంచి లేస్తూ
నన్నోసారి తడుముకున్నాను.
అయినా...
నేనంటే కనుక్కునేందుకేముంది?
నేనంటే అనుకోవడమేగా...!
మసకగా పరచుకున్న గుడ్డి వెలుతురు
గుసగుసలాడింది.

2
నాగురించి నేను
నాగురించి మీరు
ఏవైనా
ఎన్నైనా
ఏదైనా
అంతా అ. ను.కో. వ. డ. మే. గా?

3
ఒక్కోసారి
నేను అనుకుంటున్నట్లే రూపవిక్రియకు లోనవుతూ
మీక్కూడా ఓరోజలా ఫోజిచ్చేస్తాను

చాలాసార్లు
మీరు ఒడుపుగానో, వడంబం కూడా లేకుండానో
కూర్చిపారేసిన చట్రంలో కూర్చుకునేందుకు
ఒదిగించుకుంటూనో, ఉబ్బించుకుంటూనో
ఓనాటికి సరిపోయేననిపించే ప్రయత్నాలూ చేస్తుంటాను

4
అందుకే
కనుక్కునేందుకేముంది.. అనుకోవడమే.

5.
వాడెవడు
నాలా నాలో వున్న నాకంటే
‘మనం’ అనే వాడు బలుపెక్కడం చూసాను కానీ...
నాదికానిదేదీ లేదంటూ
‘మొత్తం నాదే’ లో అచ్చుతప్పు సరిచేస్తూ
‘మొత్తం నేనే’ నంటూ వ్యాపిస్తున్న వాడెవడు, వాడెవడు.

6
బహుశా నేనింకా అదే కనుక్కోవాలేమో
అనుకునే అగాధాల్లోంచీ లేవాలేమో?

7
కళ్ళు నులుముకుని పక్కమీంచి దిగితే
పుస్తకాల బయటి అక్షరాలనూ కూడబలుక్కోవాలేమో

కవిసంగమంలో

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి