తధాగతుడి తలపులు నిండిన నేలకొండపల్లిలో బుద్దుని జాడలన్నీ భూగర్భంలో కలిసిపోవలసిందేనా?

భక్తరామదాసుగా పేరుపొందిన కంచర్లగోపన్నకు కన్నతల్లిగా పేరుపొందిన ప్రాంతం నేలకొండపల్లి అంతమాత్రమే కాదు. ఖమ్మం ఖిల్లాకంటే ముందునుంచే రాజకీయ, వ్యాపార కేంద్రంగా విలసిల్లిన జాడలున్నాయి. అత్యంత పెద్ద బౌధ్ధనగరం జాడలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా వాటిని గుర్తించకుండా నిర్లక్ష్యం కాటు కు తరాలచరిత్రజాడల్ని బలిచేసేస్తున్నామా?. భారతదేశం మొత్తంలోనూ అనేక చోట్లలో బౌద్ధ మత ప్రచారంలో భాగంగా బౌద్దులు అనేక ఆరామాలు కట్టించారు. అమరావతి, నాగార్జున కొండ, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, గుంటుపల్లి, ఆదుర్రు, బొజ్జన కొండ ( శంకరం) , బావికొండ, తొట్లకొండ, శాలిహుండం, కోటిలింగాల, నేలకొండపల్లి, పణిగిరి, గాజులబండ, చందవరం మొదలైనవి. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, సాలంకాయనులు, మూల రాజవంశంవారు బౌద్ధాన్ని అవలంబించారు. బౌద్ధమత ప్రభావం తూర్పు కోస్తా, ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లా మొదలు ప్రకాశం జిల్లా వరకు, తెలంగాణాలో ఖమ్మం, వరంగల్లు కరీంనగర్, నల్గొండ జిల్లాలలో, రాయలసీమలో కర్నూలు, కడప జిల్లాలలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. 

ఖమ్మంజిల్లా నేలకొండపల్లిలో ఇప్పటికే నేలకొండపల్లి మజ్జుగూడెం గ్రామాల నడుమ ఎర్రదిబ్బ, విరాటరాజు గద్దెగా స్థానికులు పిలిచే ప్రాంతంలో మట్టితో నిర్మితమైన పెద్ద బౌద్ధస్థూపం బయటపడింది. ఈ స్థూపానికి దగ్గరలోని భూముల్లో కూడా ఆనాటి ఆనవాళ్ళు అనేక అప్పుడప్పుడూ బయటపడుతున్నాయి. అందులో కోట్లాదిరూపాయిల విలువచేసే లోహ విగ్రహాలు కూడా ఇప్పటికే దొరికాయి. 

ప్రాచీన చరిత్రకు అనేక ఆనవాళ్ళు

నేలకొండపల్లి తదితర ప్రాంతాల్లో జరిపిన అనేక తవ్వకాల్లో చారిత్రక తొలియుగపు ఆనవాళ్ళను శోధించి, వాటికి నిర్ధి ష్టమైన రూపాన్నిచ్చి ప్రపంచంలోని అనేక భాషల కన్నా, నాగరికతల కన్నా దక్కన్‌ సంస్కృతి ఎంతో ప్రాచీనమైనదని అనేక సదస్సుల్లో, చర్చల్లో అరుదై న చరిత్ర పరిశోధకుడు,పురావస్తుశాఖ మాజీ సంచాలకుడు దివంగత ఆచార్య డాక్టర్‌ వేలూరి వెంకట కృష్ణశాస్త్రి సైతం చాటి చెప్పారు. తూర్పున శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం నుండి విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు, పడమర కరీం నగర్ జిల్లా ధూళికట్ట నుండి వైఎస్ఆర్ జిల్లా ఆదాపూర్ వరకు ఆంధ్రదేశం నలుమూలలలో అనేక బౌద్ధ క్షేత్రాలు వెలిశాయి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు ప్రస్తుతం 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 వరకు, 600 సంవత్సరాలు ఆంధ్రావనిలో జీవితం ప్రగాఢంగా బౌద్ధం ప్రభావంలో ఉంది. మహాయానానికి ఆంధ్రదేశం జన్మస్థలం అనవచ్చును. ఇక్కడినుండి "మాధ్యమిక వాదం" లేదా "శూన్యవాదం" సిద్ధాంతకారుడు నాగార్జునుడు మహాయానానికి ఊపిరి పోశాడు. సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు,అత్యున్నత మేధోసంపత్తిగల శాస్త్రవేత్త అయిన నాగార్జునుడు ఈ ప్రాంతానికి చాలా దగ్గరలోనే నివసించిన ఆధారాలున్నాయి గనుక నాగార్జున కొండకు చుట్టుపక్కల వున్న బౌధ్ధ సంస్కృతి విస్తృతంగా విలసిల్లేందుకు ఇతని కృషితప్పకుండా వుండి వుంటుంది. అందుకే దేశంలోనే ప్రాముఖ్యత గల బౌద్ధ క్షేత్రాలుగా వీటిని తీర్చిదిద్దగలిగి వుంటాడు. 

బౌద్ధస్థూపం 

బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివశిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్థూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్థూపాలలో మూడు రకాలున్నాయి.

  • ధాతుగర్భ స్థూపాలు: బుద్ధునివి గాని, ప్రముఖ ఆచార్యులవి గాని అయిన అవశేషాలపై నిర్మించినవి.
  • పారిభోజిక స్థూపాలు: భిక్షాపాత్ర వంటి వస్తువులపై నిర్మించినవి.
  • ఉద్దేశిక స్థూపాలు: ధాతువులు లేకుండా స్మారకచిహ్నంగా నిర్మించినవి.

బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి అశోకుడు అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్థూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. ఈ ప్రతీతిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు. కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్థూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి.

క్రీ.పూ. 3వ శతాబ్ది నుండి క్రీ.శ. 14వ శతాబ్దం వరకు బౌద్ధమతారాధనలో వివిధ దశలను సూచించే 140 కి పైగా బౌద్ధక్షేత్ర స్థలాలను ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించారు. వీటిలో లభించే లిఖిత ఆధారాలు మొత్తం 501 (360 శిలా శాసనాలు, 7 రాగి రేకులు, 134 కుండలు, శంఖాలవంటి వస్తువులపై వ్రాసినవి). ఈ కాలంలో ఆంధ్రదేశంలో జీవనం, కళ, సంస్కృతి బౌద్ధంవల్ల బలంగా ప్రభావితమయ్యాయి. అంతకు ముందు జాతులు, తెగల మధ్యనున్న అగాధాలు పూడుకుపోయి సంస్కృతిలో క్రొత్త బాటలు నెలకొన్నాయి. ముఖ్యంగా అమరావతి, నాగార్జునకొండ వంటి చోట్ల శిల్పకళ, విద్యాధ్యయనం ప్రభవించాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో 14 ధాతుపేటికలు లభించాయి. ఇవి ఏ ఇతర రాష్ట్రంలో లభించిన వాటికంటే ఎక్కువ. 

ఖమ్మం జిల్లా లోని దమ్మపేట, నేలకొండపల్లి, అశ్వారావుపేట, వైరా ప్రాంతాలలో బౌద్ధమతపు శిధిలాలు లేదా చిహ్నాలు ఉన్న స్థలాలుగా గుర్తించారు. మండల కేంద్రమైన దమ్మపేట పేరు రావడం వెనుక బౌధ్ధానికి అనుసంధానమైన ధమ్మపధం అనేది రూపాతంరం చెందివుంటుందని భావిస్తున్నారు. దానిలో ప్రధానంగా నేలకొండపల్లిలో బయటపడిన నిర్మాణం ప్రముఖంగా పేరుపొందింది. 


నేలకొండపల్లిలో ఇప్పటికే బయటపడిన మట్టినిర్మాణం దాదాపుగా వందఎకరాల (0.40 చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణాన్ని కలిగి వుంది. ఇది దక్షిణ భారతదేశం లో రెండవ అతిపెద్ద స్థూపం. దీని ఆసరాగా రాష్ట్రప్రబుత్వం పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్న సరిగా దీనివిలువను బయటి ప్రపంచానికి ఇప్పటి వరకూ తెలిసేందుకు కావలసిన జాగ్రత్తలు తీసుకోలేదనే చెప్పాలి. దీని పరిసరాలలో అప్పటి నాణేలు,టెర్రకోట ప్రతిమలు, పంచలోహ విగ్రహాలు, బుద్ధుని కాంస్య విగ్రహాలు, ఇటుకలూ కొన్ని దొరికాయి మరెన్నో వుండేందుకు అవకాశం వుంది. ఈ చారిత్రక సంపద అంతా క్రీ.పూ 3వ లేదా 4వ శతాబ్దాల నాటిదని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అధికారిక ప్రకటనలప్రకారం 3వ శతాబ్దానికి చెందిన ఇక్ష్వాక వంశం వారి నిర్మాణంగా నేలకొండపల్లి బౌధ్ధస్థూపాన్ని భావిస్తున్నారు. నిర్మించినప్పుడు 100 అడుగులు వుండివుంటుంది అని భావిస్తున్న ఈ స్తూపం అనేక శైధిల్యాలను నిర్లక్షాలనూ దాడులనూ ప్రకృతి వైపరీత్యాలనూ తట్టుకుంటూ వేలసంవత్సరాల తర్వాత నేటికీ 35 అడుగుల ఎత్తు మాత్రం మిగిలింది. స్థూపపు ఆకారం కూడా శైధిల్యం చెందటంతో ఆర్కియాలజీ శాఖ గతంలో 50 లక్షల రూపాయిల వ్యయంతో దానిని కొంత మేరకు సౌష్టవరూపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నంచేసారు. 

ఇదికాక భూగర్భంలో మరో మహా బౌధ్ధనగరం దాగివుందా?

ఇప్పటికి బయటపడిన బౌద్ధస్థూపం కాక దాని చుట్టుపక్కలే మరో మహా స్థూపంతో పాటు విహారాలూ, చైత్యాలూ, బావులూ మొదలైనవాటితో కలిసి విరాజిల్లిన ఒక మహా బౌద్ధనగరమే వుండేందుకు అవకాశాలున్నాయని, అది దగ్గరలో భూగర్భస్తంగా వుండివుంటుందని భావిస్తున్నారు. భౌద్ధస్థూపం ఇంత పెద్ద నిర్మాణాన్ని కేవలం ఒక అలంకార ప్రాయంగా కట్టి వదిలివేసే అవకాశం లేదు. గతంలో దానిలో నిరంతరం ప్రార్ధనలూ, ధ్యానాలూ చేసుకునేందుకే వాడేవారు కావట్టి దీని అనుభంద నిర్మాణాలన్ని వున్నాయేమో అని భావించేందుకు వూతం అవుతోంది. ప్రధానంగా ముజ్జుగూడెం గ్రామ సమీపంలో వున్న 500 ఎకరాల విస్తీర్ణంలో గల బాల సముద్రం చెరువులో అప్పట్లో బౌద్ధంతో విలసిల్లిన ఒక మహా బౌధ్ధనగరమే దాగి వున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి అదే చెరువులో ఇటీవల కాలంలో బయట పడిన బౌద్ధంకాలం నాటి ఇటుకలు ఈ వాదనను బలపరస్తున్నాయి. మరో వైపు అంతకంటే బలంగా గౌతమ బుద్ధుని అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. 1978 లో గార్ల గడ్డ గ్రామంలో ఏడు బుద్ద విగ్రహాలు ఈ విషయాన్ని నిర్ధారించే నిలువెత్తు సాక్షాలుగా బయటబడ్డాయి. నేలకొండ పల్లి ప్రాంతంలోని ప్రాచీన వెంకటేశ్వరస్వామి ఆలయం మరియు శివాలయానికీ మధ్యలో ప్రవహించే వాగులో ఒక జాలరికి బుద్ధుడి పంచలోహ విగ్రహం దొరకింది. దాన్ని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని హైదరాబాదు మ్యూజియంకు తరలించారు. ఆ విగ్రహం విలువ ఇప్పటి లెక్కల ప్రకారం 5 కోట్లకు పైమాటేనని పురవస్తుశాఖ తన అంచనాలలో వెల్లడించింది.

అదే విధంగా నేలకొండపల్లి ప్రాంతంలోనే నల్లరాతితో తయారైన బుద్ధుని సింహాసనం కూడా తవ్వకాలలో బయటపడింది. ఆ సింహాసనాన్ని కూడా మ్యూజియంలో వుంచారు. అటు తర్వాత మరో ఆరు బుద్ధ విగ్రహాలు కూడా హైదరాబాద్ లోని మ్యూజియంకు తరలి వెళ్ళయి. నాటి నుంచి నేటి వరకు నేలకొండపల్లి, ముజ్జుగూడెం గ్రామాల నడుమ ఎక్కడ తవ్వకాలు జరిపినా బౌద్ధ చరిత్ర వెలుగు చూడటమేకాక , టెర్రకోట ప్రతిమలు, పంచలోహ విగ్రహాలు, బుద్ధిని కాంశ్య విగ్రహాలు, నల్ల రాతి విగ్రహాలు బయట పడుతూనే ఉన్నాయి. అయితే బాల సముద్రం చెరువులో బౌద్ధ నగరం దాగి ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని పురావస్తు శాఖ పట్టించుకోనప్పటికీ నేలకొండపల్లి సమీపంలో ఉన్న ఒక ఎకరం భూమిలో మాత్రం బౌద్ధకాలం నాటి నేలమాళిగలు ఉండవచ్చునని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ ఎకరం భూమిలో ఎటువంటి తవ్వకాలు జరపకుండా నిషేధాజ్ఞలు సైతం విధించారు. ఆ ప్రదేశం అభివృద్ధి కోసం నిధులు కూడా అధికారికంగా మంజూరు చేసారు, ఇలా నిదులు విడుదల చేసి రక్షణ కల్పించడం ఆ భూమిలో విలువైన సంపద దాగి ఉన్నదనటానికి ఆధారంగా చెప్పవచ్చు. అయితే ఆ భూమి వద్దే మూడేళ్ల క్రితం వరకు ముగ్గురు సెక్యురిటి సిబ్బందిని నియమించిన పురావస్తు శాఖ అధికారులు, ఆ తరువాత రక్షణ చర్యలను పూర్తిగా విస్మరించారు. 1800 సంవత్సరాల క్రితం బౌద్ధ సన్యాసులు స్నానఘటికలు, సత్రాలు ఏర్పరుచుకున్నట్లుగా భావిస్తున్న ఆ ఎకరం భూమిలో బౌద్ధ కాలం నాటి నిక్షేపాలు ఉన్నాయని భావిస్తున్న పురావస్తు శాఖ అక్కడ తవ్వకాలు జరపక పోవటం, రక్షణ చర్యలు కూడా పట్టించుకోక పోవటంతో గత చరిత్రగా భూగర్భానికి పరిమితమై పోతుంది. మరోవైపు నేలకొండపల్లి ప్రాంతంలో లభించిన గౌతమ బుద్ధుని విగ్రహాలను హైదరాబాద్‌ మ్యూజియంకో లేదా అమరావతి, విజయవాడలాంటి చోట్లకు తరలిస్తున్నారు. నిజానికి ఖమ్మంజిల్లా మొత్తంలో ఇంత చారిత్రక సంపద వున్నా మ్యూజియం లేక పోవడం చాలా పెద్ద లోటు. స్థానికంగా మ్యూజియం ఏర్పాటు చేయాలన్న జిల్లా వాసుల కోరిక కలగానే మిగిలి పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీని వేసి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బౌద్ధరామంపై అధ్యయనం చేయించటం ద్వారా తవ్వకాలు జరిపి స్థానికంగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది.

మహాభారతంతో ముడిపడ్డ కధనాలు

మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో మారువేషాల్లో సంవత్సరకాలం పాటు గడుపుతారు. ఆ విరాట రాజు కొలువు వున్న ప్రదేశం ఇదే నని అక్కడి బౌగోళిక ఆధారలకు పేర్లు పెట్టుకుని మరీ తరతరాలుగా స్థానికులు ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అవి

  • మంచి విస్తీర్ణంలో విరాటరాజు దిబ్బ, కీచకుడి పీచమణచిన ప్రదేశంగా కీచక గుండం

సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి వున్న మట్టిదిబ్బ ఇప్పుడు పురావస్తు శాఖవారి ఆదీనంలో వుంది. కొన్నాళ్ళక్రిందట ఈ గడ్డను తవ్వి చూడగా పురాతన కాలం నాటి నాణేలు దొరికాయని చెప్పుకుంటారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంద్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా వలలుడి వేషంలో వున్న భీముడు కీచకుణ్ణి చంపేశాడు. 

  • భైరాగి గుట్ట పైన భీముడు వేసిన రాయి

అజ్ఞత వాసంలో వలలుడి పేరుతో వున్న భీముడు ఒకసారి శత్రువులపైకి ఒక పెద్దరాయి విసిరాడట అది ఈ భైరాగి గుట్ట రాయే నని చెపుతుంటారు. భీముడి రాయిగా పిలువబడే బండరాయి ఒకటి భైరాగి గుట్టపై అలాగే వుంది. ఇది ఒక కథ కాగా భౌద్దులు ఈ ప్రాంతంలో నివసించిన కాలంలో తయారు చేసిన ప్రధాన విగ్రహాలు, బుద్ధుని సింహాసనం తయారు చేసేందుకు వాడిన రాయి ఈ గుట్టనుండి తీసుకున్నదే అని చెపుతారు. నిజానికి ఇక్కడి నల్లరాయి కూడా చాలా శ్రేష్టమైనది ప్రపంచస్థాయి ఎగుమతులకు అనువైన స్థాయిలో నాణ్యత వున్న గ్రానైట్ వుండటం వల్లనే ఇటీవల ప్రైవేటు గ్రానైట్ గుత్తేదారులు అడ్డదారుల్లో వీటిని క్వారీలుగా కరిగించేసే అనుమతులను పొంది భైరాగిగుట్టను మైనింగ్ పేరుతో ధ్వంసం చేసేస్తున్నారు. వేల సంవత్సరాల చరిత్రవున్న గుట్టను లక్షలకోట్ల రూపాయిలు గా మార్చేసే పనిలో చరిత్రను పూర్తిగా ధ్వంసం చేసేసే పనిలో బిజీగావున్నారు. మరో ప్రమాదం ఈ గుట్ట ప్రాంతంలో విలువైన శిల్పాలు, నాణేలు, నిధి నిక్షేపాలు వున్నయనే ప్రచారాలు ముమ్మరంగా వుండటంతో క్వారీల పేరుతో జరిపే తవ్వకాలతో పాటు నిధుల వేట రూపంలో చేసే విద్వంసం కూడా జతకూడి భైరాగి గుట్ట మనుగడకే ప్రమాదంగా మారిపోయింది. ఒకప్పుడు బౌద్ధవిగ్రహాల తయారీ కేంద్రం నేలకొండపల్లిలో నిర్వహించినట్లు సమాచారం. బైరాగిగుట్ట సమీపంలో గల వాగులో ఓ జాలరికి రూ. 2కోట్ల విలువ చేసే కంచు బుద్ధవిగ్రహం దొరికింది. దానిని ప్రస్తుతం సాలార్జంగ్ మ్యూజియంలో ఉంచారు. బౌద్ధస్తూపం తవ్వకాలలో ఆరు పాలరాతి బుద్ధవిగ్రహాలు లభించాయని, వాటిని విజయవాడ మ్యూజియంకు తరలించారు.

ఖనిజాల గని కూడా కావడం మరో బెంగ

ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అపారమైన ఇనుప ఖనిజం విస్తరించి ఉంది. ఒక్క ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోనే 1,41,691 ఎకరాల (56,690హెక్టార్లు) భూమిలో ఇనుప ఖనిజం ఉంది. ఇక్కడ తవ్వితే 12వేల కోట్ల టన్నుల ముడి ఇనుము లభిస్తుందని సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీని విలువ రూ.700 లక్షల కోట్లు పైమా అంచనా వేసింది. దేశంలో లభ్యమవుతున్న ఇనుప ఖనిజంలో 12శాతం మేర ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, వరంగల్ జిల్లాలోని గూడురు మండలాల్లోనే ఉన్నాయని చెప్పింది. 2004 నుంచి వివిధ ప్రాంతాలలో మైనింగ్ ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. బయ్యారంలోని 2500 హెక్టార్లు, వరంగల్ జిల్లా గూడూరు పరిధిలోని 2500 హెక్టార్లు, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలోని 342 హెక్టార్లు.. మొత్తం 5342 హెక్టార్లలో (13,200 ఎకరాలు) ఇనుప ఖనిజం గనులను ఉక్కు పరిశ్రమలకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే క్రమంలో నేలకొండపల్లి ప్రాంతంలో ఈ గనుల తవ్వకాల పేరుతో పనులు ప్రారంభం అయితే చరిత్రపూర్తిగా దుమ్ముతో పాటు కొట్టుకు పోవడం మాత్రం ఖాయం అవుతుంది. 

వెంకటేశ్వరాలయం గురించి వాడుకలో వున్న కథ

సుమారు 400 సంవత్సరాల క్రితం ‘దిగంతి’ అనే సాధువు తన కుష్టు రోగ నివారణ కోసం వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోరి అత్యతం నిష్టాగరిష్టుడై తపస్సు చేసాడట. ఆ తదేక తపస్సుకు సంతోష పడిన వెంకటేశ్వరుడు ఆనాధ రక్షకుడై దిగంతుని కలలో దేవి సహితంగా సాక్షాత్కరించాడట. దిగంతుడిని వ్యాధినుంచి విముక్తుడిగా చేస్తున్నట్లు చెప్పి, అతని నిష్టకు మెచ్చి అక్కడనే కొలువుంటాననికూడా చెప్పాడట. నిద్ర మేల్కొన్న దిగంతుడు తనకు వ్యాధి తగ్గిన విషయాన్ని గమనించి ఆ వింతను, స్వామి అదే చోటులో తిరునామాలతో వెలుస్తానని చెప్పిన సంగతీ అక్కడ అందరికీ చెప్పాడట. వెంటనే గ్రామస్తులందరూ తలో వైపుకూ వెళ్ళి తిరునామాలతో వున్న స్వామివారి రూపం కోసం వెతకటం ప్రారంభించారట. ఒక చోట గుహలోని రాతిపై ఆ నామాలను చూడటంతో పాటు అక్కడ సుగంధ ద్రవ్యాల సువాసనలు వెదజల్లటం కూడా గమనించారట. ఆ ప్రదేశాన్నే స్వామివారు ఉద్భవించిన చోటుగా భావించి వెంకటేశ్వరాలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు. ప్రారంభంలో వేంకట నరసింహాచార్యులు ధూపదీప నైవేధ్యాలతో వేంకటేశ్వర స్వామి వారిని పూజించటం ప్రారంభించారు. ఆలయ ముఖమండపం అంతా అప్పటి పాత రాతి కట్టడాలతోనే ఇప్పటికీ నిలబడి వున్నాయి. వెలమ రాజుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారట. అయితే బౌధ్ధ ప్రార్ధనా స్థలంగా వున్న ప్రాంతాన్ని హిందూ దేవాలయంగా మార్చివుంటారా అన్న చాలా చారిత్రకంగా వున్న దేవాలయాల విషయంలో వున్న సందేహమే ఈ దేవాలయం విషయంలోనూ చరిత్ర కారులు వ్యక్తంచేస్తున్నారు. జైనం బౌద్దం తర్వాత విలసిల్లిన హిందూసంస్కృతిలో తయారైన చాలా దేవాలయాల వెనుక పూర్వపు ఆనవాళ్ళను, అప్పటి శిల్పనమూనాలనూ కనుగొంటున్నారు. రాజగోపాలస్వామి ఆలయం:- రామదాసు నేలకొండపల్లిలోని రాజగోపాలస్వామి అనుగ్రహంతోనే జన్మించాడని ప్రతీతి. రామదాసు తల్లిదండ్రులు, రామదాసు ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించుకున్న దైవం శ్రీ రాజగోపాలస్వామి. భీమేశ్వరాలయం , వేణుగోపాలస్వామి మరియు ఉత్తరేశ్వర ఆలయములు కూడా నేలకొండపల్లిలో వున్నవి

ప్రపంచస్థాయి వారసత్వ అర్హతలున్న శిల్పసంపద ఈ ప్రాంతపు ఆస్తి

శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలంలో నిర్మించిన బౌద్ధ స్తూప చైత్య ఆరామాలలో శిల్పకళ, అత్యున్నత స్థాయికి చెందినది. ఆమరావతి శిల్పశైలి తూర్పు ఆసియా దేశాలన్నిటిలో విస్తరించడమేకాక దక్షిణ భారతదేశంలో తరువాతి అన్ని శైలులకు మాతృక ఈ శైలే అని చెప్పాలి. అమరావతి, నాగార్జునకొండ లతో పాటు నేలకొండపల్లి ప్రాంతాలలో చెక్కిన బుద్ధ విగ్రహాలు ఇండోనేషియా, జావా, సుమిత్ర మొదలైన దేశాలకు ఎగుమతి అవుతుండేవి. 

నేలకొండపల్లి కి ఎలా చేరుకోవాలి ?

భౌగోళిక గుర్తింపు : 17°6'40"ఉత్తరం 80°4'6"తూర్పు

జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి కేవలం 21 కిలోమీటర్ల దూరం(నేలకొండపల్లి ఖమ్మం నుండి కోదాడ (నల్లగొండ జిల్లా)రహదారిపై ఉన్నది.) లోనూ, హైదరాబాదుకు 257 కిలో మీటర్ల దూరంలోనూ నేలకొండపల్లివుంది. ఖమ్మంనుంచి నేలకొండపల్లి ఊరివరకూ సరాసరి ఆర్టీసి బస్సుల సదుపాయం వుంది. ప్రైవేటు వాహనాల ద్వారాకూడా సులభంగా చేరుకోవచ్చు. ఖమ్మం నుండి కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాదు వెళ్ళాలంటే ఖమ్మం లేదా కోదాడ నుండి ఎక్స్ ప్రెస్స్ బస్సులు దొరకుతాయి. ఖమ్మం నుండి దేశం లోని అన్ని ముఖ్య ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉన్నది. అతి దగ్గర విమానాశ్రయం హైదరాబాదు విజయవాడ లో ఉన్నవి.

మరికొన్ని జాగ్రత్తలు తీసుకోలేమా?

1. బుద్ధస్థూపాన్ని మరింత పునరుద్ధరించడంతోపాటు హైదరాబాద్ నుంచి సూర్యాపేటలోని ఫణిగిరి, నేలకొండపల్లి, జగ్గయ్యపేట, అమరావతి, నాగార్జున కొండలనుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళేలా ఒక బౌద్ధవలయం (Buddhist circuit) ప్రణాళికలు వేసారు. ఇప్పుడు రెండురాష్ట్రాలుగా విడివడిన నేపద్యంలో దీన్నివాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అనువైన పర్యాటక ప్యాకేజిని తయారుచేయడంద్వారా ఆదాయం సంపాదించడంతో పాటు పర్యాటకులకు ఒక సమగ్రమైన అవగాహన కల్పించుకునేందుకు అవకాశం కల్పించిన వారమవుతాము. 

2. శాస్త్రీయ పద్దతిలో త్రవ్వకాలను జరిపి విలువైన సంపదను వెలికితీయాలి. దానిద్వారా మరెన్నో చారిత్రక వివరాలను ప్రపంచానికి అందించే అవకాశంవుంటుంది. 

3. నేలకొండపల్లి లేదా ఖమ్మం ప్రాంతంలో ఒక పురావస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేసి జిల్లాకుచెందిన చారిత్రక సంపదను ఒక దగ్గర భద్రపరచటంతో పాటు, ఆయా చారిత్రక ప్రాంతాలలో ఏ వస్తువులను తీసీకుని వస్తుప్రదర్శన శాలకు తీసుకువచ్చారో వాటి నమూనాలులేదా చిత్రాలు వంటి రెప్లికాలను అదే ప్రదేశంలో వుంచటం ద్వారా చారిత్రక విలువను తెలుసుకునేందుకు వచ్చిన వారికి వాటి నిజమైన వస్తుసంపద ఎక్కడుంది అనే సమాచారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడీ సమాచారం కనుక్కోవాలంటే సమాచారహక్కు చట్టానికి కూడా సాధ్యపడేలా లేదు. దీన్ని సులభతరం చేయటం కనీస భాద్యత అవసరం అనే విషయాన్ని గుర్తించాలి. చారిత్రక పరిశోదనలు, ఆసక్తి సన్నగిల్లడానికి ప్రధాన కారణం ఈ ‘ఆచార్య ముష్టి’ సమాచారాన్ని పిడికిట్లో బిగించి బయటకు త్వరగా తెలియనివ్వని గుణమే వ్యాధిరూపమనే విషయం గుర్తించాలి. 

4. గ్రానైట్ గనుల పేరుతో అక్రమంగా జరుగుతున్న త్రవ్వకాలను వెంటనే ఆపేసి చారిత్రక సంపదకు రక్షణ కల్పించాలి. భైరాగుల గుట్ట లాంటి చోట రక్షిత కట్టడంగా బోర్డుని పెట్టడంతో పాటు చుట్టూ రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయాలి. స్థానికులను కమిటీగా కూడా వేసి ఈ రక్షణ భాద్యతలను అప్పగించాలి.

5. భద్రతాసిబ్బందికి సరిగా భాద్యతలను నిర్దేశించి, వారి సంఖ్యను పెంచాల్సిన అవసరం కూడా వుంది. కేవలం కాపలా సిబ్బందిగా కాకుండా ప్రస్తుతం స్థూపం వున్న ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు ఉద్యాన వనాన్ని సరిగా సంరక్షించడం, ఫోటోలు దిగే స్థలాలు (Photo point) సరిగా ఏర్పాటు చేయటం ద్వారా సోషల్ నెట్ వంటి చోట్ల నుంచి విస్తారమైన ఆకర్షన పొందవచ్చు. 

6. చారిత్రక స్థలాలకు అడ్డంగా దిష్టిబొమ్మల్లా పెట్టేస్తున్న ఇప్పటి విద్యుత్ స్థంభాలు, కేబుల్ వైర్లు లాంటివి చారిత్ర స్థలం తాలూకు నోష్టాల్జిక్ దృష్టిని చెడగొడుతున్నాయి. వీలయినంతవరకూ వీటికి ఆటంకం కలిగించని రీతిలో ఆదునిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అవసరం. 




ఆధార సూచికలు
  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - బౌద్ధము-ఆంధ్రము
  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర 
  • పి.వి.కె. ప్రసాదరావు - ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర
  • http://www.aponline.gov.in/quick%20links/hist-cult/history.html
  • వివిధ తెలుగు, ఆంగ్లం ఆన్ లైన్ సమాచారం













కామెంట్‌లు