ఉప్పుటేర్లు

కన్నీటి చుక్క
నీకోసం కారితే బలహీనతకు గుర్తు
పరులకోసం బయటకుబికితే
అదే గుండెబలానికి సంజ్ఞ.
అందుకే నాకు హృదయంలోంచి కారే కన్నీరంటేనే ఇష్టం
మెదడు కొలతల్లోంచి కాదు.

కంటిగనిలో తవ్వబడని ముడిసరుకుని.
అలాగే వదిలెయ్యోద్దు
అడ్డంగా తవ్వి వృధానూ చెయ్యోద్దు
అవసరమైన చోట వాడేందుకు వెనకాడొద్దు.
అడ్డమైన చోటల్లా వాడిపారెయ్యోద్దు.

ఏడుపొక స్వచ్ఛభారత్ కార్యక్రమం
బయటకళ్ళపొరలకే కాదు
లోపటి గుండెపొరల్ని కూడా  కడిగేస్తుంది.
అద్దాలనలా అప్పుడప్పుడూ తుడుస్తుంటేనే
జీవితపు దారి మరింత స్పష్టమౌతుంటుంది.

పుట్టగానే అస్తిత్వపు గుర్తు
పెరుగుతుండగా ఒక పోరాట మార్గం
భార్యగానో, భర్తగానో, పనివాడిగానో, యజమానిగానో
అది ఒక్కోసారి నిరసన రూపం
నేనున్నాననే ఒక భరోసా
మొలకెత్తించుకునేంత తడివుందనే గుర్తు.
ఏడుపొక్కోసారి ఐడెంటిటీ కార్డు

అదేమిటో ఈ ఆటుపోట్ల ఉప్పుటేరు
చీకట్ల అమాసకైనా
సంతోషపు పున్నానికైనా
మరింత ఎగిరెగిరి పడుతుంటుంది.

26-01-2015

కవిసంగమంలో ప్రచురితం


కామెంట్‌లు