అరుణాస్తమయం

 ఉదయాలెరుగకనే అస్తమించిన 
ఓ వెలుగురేఖ రాలుతూ ఈ రోజు జాలిగా చూసింది.
ఉరకలెత్తే ఓ యవ్వనపు సాయంత్రంపై
జరిగిన పిచ్చికుక్కలదాడిలో
కుక్కగొలుసుల బోనులో
చైతన్యం పూర్తిగా చచ్చుబడిపోయినప్పటినుంచి.
కాపుకాయలేని ముళ్ళకంచెపై ఛీత్కారాన్నైనా ఉమ్మేయకపోతుందా అనుకుంటూ
చేసిన సహచరుల సేవంతా చీకట్లోకీ పాక్కుంటూ పోయింది.
నీ మనసు మాళిగ ఏదో ఒకరోజు తాళం భళ్ళునతెరుచుకోకపోతుందా అనే ఎదురు చూపులు మూగగానే మిగిలిపోయాయి.

నిన్నుచూసి నిర్భయలు సైతం మేమింకా నయమేననుకునేట్లు వళ్లుజలదరింపుకు గురయ్యారు.
నిన్నుచూసి యుథనేషియా నాయినా నయమేననుకుంటూ కళ్ళింతగా చేసుకుని అడిగింది.
ఇంకేముంది సమాజం ఎప్పట్లానే సుధీర్ఘ కోమాను రికార్డు చేసుకున్న సంబరాలకు సిద్దం అవుతుంది.
ఏళ్ళకు ఏళ్ళు నీ యాతనకు కారణమైన వాళ్ళకో ఏడేళ్ళుశిక్షతో సరిపెట్టడం రైటేనంటుంది.
ఇంకేముంది రంగునోట్లు లెక్కబెట్టుకునే హడావిడిలో మతిమరుపులకు గురవుతూనే వుంటుంది.
వీధుల్నిండా కుక్కల సంతతి విచ్చలవిడిగా పెరుగుతూనే వుంటుంది.
ఇవ్వాల్టి హెడ్ లైన్స్ ఇంతటితో సమాప్తమంటూ హెడ్డూ, లైట్సూ, లెన్సూ మరోవైపు ఫోకస్ తిప్పుకుంటూనే వుంటాయి.
బహుశా వెళ్తూ వెళ్తూ నువ్వు చూసిన జాలిచూపు వేరెవ్వరి కంటబడకుండానే ఈ చక్రం తిరుగుతూనే వుంటుంది.



 (నలభై రెండేళ్ళ సుధీర్ఘ కోమా అనంతరం గతించిన అరుణా షాన్ బాగ్ మృతికి సంతాపంగా, ఆమెపై కుక్కగొలుసులతో అత్యాచారానికి పాల్పడిన వారిచర్యలకు నిరసనగా .....)

కవిసంగమంలో

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి