ఖమ్మంజిల్లాలో అశ్వారావుపేట ఒక మండలం,
ఆల్ఫాబెటికల్ గా ముందుంటుంది కాబట్టి ఎక్కడరాసినా మొదట్లోనే కనిపిస్తుంది కూడా,
అయితే అశ్వారావుపేటకు ఆ పేరెందుకు వచ్చింది? అశ్వారావు అనే ఆయన ఒకరున్నారా? ఎవరాయన
ఏమాకథ అనుకుంటూ కొంచెం పరిశీలిస్తూ తీగలాగితే డొంకలన్నీ కదులుతూ కాకతీయుల పరిపాలన
దాకా వచ్చింది.
1324 ప్రాంతంలో పాల్వంచ సంస్థానాధీశుడు అప్పన్న అశ్వారావు రాజావారి పేరు మీదుగానే
ఈ ప్రాంతానికి అశ్వారావుపేట అనే పేరు వచ్చిందట. వారి ఎనిమిదవ తరం వారసులు మహీపాల్
గారిని ఈ మధ్య కలిసి మరికొన్ని వివరాలు తెలుసుకుందామని వెళ్ళినప్పటి చిత్రాలివి.
ఆయన చాలా ఆదరంగా నన్ను Prabhakara Charyulu గారినీ
రిసీవ్ చేసుకున్నారు. వారి పైన మూడు తరాల ముచ్చట్లు మాత్రం చాలా విపులంగా
చెప్పారు. అంతకు ముందు చరిత్ర తనదగ్గరలేదని చెప్తూ దానిపై ఇంత సమాచారం
సేకరించినందుకు అభినందనగా తనవంతు సహాయంకూడా చేస్తానని మాటిచ్చారు.
పాల్వంచ సంస్థానం కథ
నిజాం రాష్ట్రంలో అప్పట్లో 14 సంస్థానాలుండేవి
అందులో కేవలం 5 మాత్రమే పాలనా అధికారాలను కలిగివున్న పెద్ద సంస్థానాలుగా
నిలబడ్డాయి అందులో పాల్వంచ ఒకటి. ఒకప్పుడు పాత వరంగల్లు పరిధిలో వున్న ఈ సంస్ధానం 1953
లో ఖమ్మంజిల్లా ఏర్పడిన తర్వాత ఖమ్మంజిల్లాలో చేరింది. 800 చదరపు మైళ్ళ వైశాల్యం
వున్న ఈ సంస్థానంలో 1927 లెక్కల ప్రకారం కేవలం 40 వేల జనాభా వుండేది. ఈ సంస్థానంలో
చాలా ప్రాంతం దట్టమైన అడవులతో నిండివుంది. గోదావరి నది వాయువ్యంగా మొదలై ఆగ్నేయ
దిశగా పారుతూ ఈ సంస్థానాన్ని రెండుగా విభజిస్తుంది. గోదావరి(తెలివాహ) కుడి వైపు
ప్రాంతం నిజాం రాష్ట్రంలో బాగంగానూ, ఎడమవైపు ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో
భాగంగానూ వుండేది. ఈ మద్రాసు ప్రెసిడెన్సీలోని భాగంకూడా తర్వాత తెలంగాణా ప్రాంతంలో
భాగంగా మారింది. అశ్వారాయలకు చెందిన
పద్మనాయక వంశస్థులు సేనానులుగా, అశ్వసైన్యాధ్యక్షులుగా పనిచేసేవారు.
అశ్వశిక్షకులుగా ఆసక్తికరమైన కథనం
కాకతీయ ప్రభువుల్లో 2వ ప్రతాప రుద్రుని దగ్గర అప్పన్న అశ్వారావు పనిచేస్తున్న కాలంలో ప్రతాప రుద్రుడు తన అశ్విక దళాలను మరింతగా పెంచేపనిని ముమ్మరంగా చేస్తున్న సమయమది. కొత్త అశ్వాలు, మదించిన బలమైన గుర్రాలనూ లొంగదీయటం శిక్షకులకు చాలా కష్టమైన పనిగా వుండేది. చాలా గుర్రాలు తమ నీడలలోని కదలికలను చూసి బెదిరిపోతుండేవి. ఈ సమస్యలు అధిగమించేందుకు ఎవరికీ తోచని సమయంలో అప్పన్న అశ్వారావు గారు ముందుకు వచ్చి గుర్రాలు తమనీడలను తాము చూడకుండా వుండేలాంటి చిన్న ఏర్పాటు చేసి వాటిని చాకచక్యంగా లొంగదీసుకుని శిక్షణనిచ్చే పద్దతిని సూచించారట. ఈ ప్రక్రియ అశ్వికదళాలను విస్త్రృతంగా పెంచుకునేందుకు బాగా తోడ్పడిందట. దాంతో సంతోష పడిన రెండవ ప్రతాప రుద్రుడు అప్పన్న గారికి అశ్వారావు అనే బిరుదును ప్రదానం చేసాడట. అప్పటి నుండీ ఆ వంశస్తులు అశ్వారావు బిరుద నామాన్ని గౌరవ సూచకంగా ధరిస్తూ వచ్చారట.
అశ్వారావుల వంశ పాలన
1769 లో జాఫరుద్ధౌలా ఒక యుధ్దంలో నరసింహ అశ్వారావును సంహరించి తామ్రఫలకాల మీద
రాసిన సదు పత్రాలను స్వాధీనం చేసుకున్నాడు. 1798 లో నిజామలీఖాన్ వెంకట్రామ
అశ్వారావుకు రాజబహద్ధూర్ సవై అనే బిరుదు లిచ్చి సనదు ఇచ్చాడట. అయితే ఈ బిరుదుతో
పాటు ఒక గౌరవ ప్రదమైన భాద్యతను కూడా వీరికి అప్పగించారట. 2000 అశ్విక దళాలను, 3000
పదాతి దళాన్ని నిర్వహించాలనేది ఆ షరతు. అన్నివేళ అశ్విక దళాలు ఇబ్బంది పడకుండా నీరు
త్రాగేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఇప్పటికీ ఇక్కడ గుర్రాల చెరువు అనే
పేరుతోనే పిలుస్తున్నారు. అయితే ఈ షరతు ప్రకారం వాటిని నిర్వహించడం ఎక్కువ కాలం
సాగలేదు. ఈ వంశంలోని రెండు కుటుంబాల మధ్య వారసత్వ కలహాలు వచ్చాయి. అయితే
1858లో సాలార్ జంగ్ రాజా సీతారామ చంద్రకు
కొత్త సనదు ఇచ్చి ఈ వారసత్వ కలహాలకు ముగింపు పలికాడు. అదే సమయంలో భద్రాచలం,
రేకపల్లిలను బ్రిటీష్ ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసేసుకుంది. రాజా సీతారామ చంద్ర
సంస్థానానికైన భారీ అప్పులతో సతమతమయ్యి దుర్భరమైన పరిస్థితుల్లో తన సంస్థానం
మొత్తాన్నీ ఒక వడ్డీ వ్యాపారి దగ్గర కుదువపెట్టి మరణించాడు. ఆ వడ్డీ వ్యాపారి 12
సంవత్సరాల పాటు సంస్థానం రెవిన్యూ వసూళ్ళ మొత్తాన్ని తన బాకీ జమక్రింద
పిండుకున్నాడు. వేర్వేరు పద్దతుల్లో వచ్చే ఆదాయవనరులను తన అప్పుకు జమచేసుకునే
నెపంతో తన ఆదీనంలోకి తీసుకుంటూ వచ్చాడు. అంతటితో ఆగక ఇంకా తనకు బకాయి వున్నారంటూ 6
లక్షల రూపాయిలకు డిక్రీ తెచ్చుకున్నాడు. సంస్థానాధిపతి తల్లి లక్ష్మీ
నరసయ్యమ్మారావు 1875లో చనిపోయారు. చనిపోవడానికి పూర్వమే తన మనవడు (కూతురు కొడుకు)
అయిన పార్ధసారధి అప్పారావు గారిని రాజాగా దత్తత తీసుకున్నారు. కొన్ని విచారణలూ,
మరికొన్ని ఒప్పందాలూ తర్జన భర్జనల తర్వాత పార్ధసారధి అప్పారావుగారికి సంస్థానం
స్వాధీనం అయ్యింది. ఈయన నిజాం నుంచి సవై బిరుదును పొందారు. తన పరిపాలనను 1932 కాలం
వరకూ సాగించారు. ప్రతిష్టాత్మకమైన శ్రీకృష్ణ దేవరాయాంద్ర భాషా నిలయ స్థాపకుల్లో
వీరుకూడా ఒకరు. ఈయన గారి తర్వాత వీరి పెద్దకొడుకు రాజా నారయప్పారావు పరిపాలనా
భాద్యతలు తీసుకున్నారు. అటు తర్వాత విజయ అప్పారావు సంస్థానాన్ని పాలించారు. నిజాం నవాబు పై జరిపిన
చారిత్రక సైనిక చర్య అనంతరం పాల్వంచ సంస్థానం కూడా హైదరాబాదు రాష్ట్రంలో విలీనం
అయ్యింది. అప్పటినుంచి భారత ప్రభుత్వ పరిపాలనా విధానంలోకి వచ్చింది. 1324 కాలం
నుంచి దాదాపు 28 మంది రాజులు వేర్వేరు సందర్బాలలో పరిపాలించారు.
రాజధాని పోలవరపు పాడు ప్రస్తుతం పాడుపడ్డ
స్థితిలో వుంది
ఈ
సంస్థానానికి మొదటి రాజధాని పాల్వంచ అయివుంటుందనేది ఒక అంచనా కానీ అశ్వారావుపేట,
దమ్మపేట మధ్యలో వున్న ఇప్పటి సాధారణ కుగ్రామం అయిన పోలవరపు పాడు అనే ఊరు అప్పటి
మొదటి రాజధాని అయివుండవచ్చనేది మరోవాదన. పొలవాస ప్రాంతానికి సమానమైన పేరుగా
పోలవరపు పాడు లేదా పాల్వంచ ఏర్పడటానికి ప్రధాన కారణమైన ఊరు ఇదే నని చెపుతారు.
దానికి ఆధారంగా ఈ ప్రాంతంలో దొరికిని అనేక బంగారు ఆభరణాలు, నాణేలూ సాక్ష్యం. అంతే
కాకుండా ఇక్కడి పూసల వాగులో ఇప్పటికీ వర్షంపడినప్పుడల్లా చిన్న పుల్లతో ఒడ్డుక
చిన్నగా పెల్లగించి చూసునప్పటికీ అనేక పూసలు దొరుకుతుంటాయి. బహుశా వైధవ్యానికి
గురయిన సైనికుల భార్యల నల్లపూసలు ఇవి అయ్యివుండొచ్చని భావిస్తున్నారు. అటుతర్వాత
అశ్వారావుపేట, చివర్లో భద్రాచలం రాజు నివాస స్థానంగా పరిపాలనా కేంద్రాలుగా
వుండేవి.
కనుమరుగైన సాహిత్య ఆధారం
గోలుకొండ కవుల చరిత్రలో పుస్తకం ప్రస్తావన వున్న పేజీ ఇది |
ఈ సంస్థానం హయాంలో జరిగిన సాహిత్య సేవకు
సంభందించిన ఆధారాలేవీ మిగుల్చుకోలేకపోవడం దురదృష్టకరం. కానీ క్రీ.శ 1700 ప్రాంతంలో
పాల్యంచ సంస్థానంలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శ్రీనాధుని వెంకటరామయ్య అనే
కవి, రచయిత ఈ సంస్థాన చరిత్రను అశ్వారాయ చరిత్రము లేదా శ్రీరామ పట్టాభిషేకం అనే
పేరుతో రాసారని సూరవరం వారు సేకరించి ప్రచురించిన గోల్కొండ కవుల చరిత్ర లో
పేర్కొన్నారు. కానీ ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కావడం లేదు. అశ్వారాయ చరిత్ర
పుస్తకంలో భద్రచలం పై జరిగిన థంసా దాడి వివరాలు, దాడికి బయపడి సీతారాముల విగ్రహాలను
పోలవరంలో భద్రపరచడం. ఐదు సంవత్సరాల తర్వాత థంసా మరణానంతరం ఆ విగ్రహాలను తిరిగి
భద్రాచలం చేర్చేందుకు అశ్వారాయలు చేసిన కృషి తదనంతరం శ్రీరాముడి పట్టాభిషేకం జరగటం
తదితర వివరాలు ఈ పుస్తకంలో పేర్కొన్నారట. పాల్వంచ సంస్థానం చరిత్రను
తెలుసుకునేందుకు కానీ భద్రాచలం చరిత్రలో ఒక ముఖ్య ఘట్టాన్ని అర్ధంచేసుకునేందుకు
కానీ లేదా అశ్వారాయల పరిపాలన సంభందిత వివరాలను తెలుసుకునేందుకు ఇది ఒక కీలకమైన
ఆధారం అవుతుంది. ఇటువంటి ప్రాముఖ్యత గల పుస్తకం ఆచూకీ ఎవరికి దొరికినా సరే
దానిలోని సమాచారాన్ని ఎలక్ట్రానిక్ పద్దతిలో అందరికీ అందుబాటులోకి వచ్చే (ఈ
పబ్లిష్) ఏర్పాట్లు చేయాల్సిన అవసరం వుంది.
కోట రాళ్ళతో దివాణం పునాదులు
ఈ గోడల్లో అప్పటి కోటరాళ్ళు |
స్థంభాల ఆధారాలు |
గజలక్ష్మిదేవి చెక్కడం |
ఈ ప్రాజెక్టులో సహాయపడిన నా సన్నిహిత మిత్రులు ప్రభాకరాచార్యులు గారు |
పద్మపట్టికలు |
రాజరికాల తదనంతర కాలంలో దివాణం నిర్మాణం కోసం ప్రస్తుతం పూచిక పాడు అడవులున్న ప్రాంతంలోని ఒక కాకతీయ వనదుర్గం నిర్మాణం కోసం వాడిన రాళ్ళను పెళ్ళగించి వాడుకున్నారట. అటువంటి పెద్దపెద్ద రాళ్ళను ఎడ్లబండ్లపై తరలిస్తున్నప్పుడు చిలకలగండి ముత్యాలమ్మ గుడి దగ్గర ఒక బండిలోని రాయి డొర్లి పడిపోయిందట. తర్వాత ఎంతమంది కలిసి ప్రయత్నించినప్పటికి తిరిగి ఆ రాతిని కదిపి తీసుకు రాలేక పోయారట. ఇప్పటికీ వినాయకపురం గ్రామానికంటే ముందున్న చిలకల గండి వద్ద ఆ అతిపెద్ద రాయి అలాగే వుంది. పాత దివాణం గోడలను పరిశీలిస్తే వాటిపై పద్మపట్టికలూ, గజపట్టికలతో పాటు ముందువైపు ప్రధాన ద్వారానికి కాకతీయులు తప్పనిసరిగా వాడే గజలక్ష్మీదేవి చిత్రాన్ని కూడా గమనించవచ్చు.
దివాణం దగ్గరలో మైసమ్మ గుడి.
అశ్వారావుపేటలో పాత దివాణం పక్కనే వున్న మైసమ్మ
గుడి కూడా ప్రత్యేకమైనదే. గ్రామస్థులు ప్రతిష్టించిన సాధారణ రాతిమైసమ్మలా కాక
ఇక్కడ చెక్కిన అమ్మవారి విగ్రహం వుంది. అంతే కాకుండా థంసాకు గురయ్యి విగ్రహం
శిధిలం అయ్యివుంటుందనేందుకు గుర్తుగా విగ్రహం ముక్కూ ముఖభాగాలు చెక్కేసి వున్నాయి.
గుడికి కుడిపక్కన దేవాలయాలలోని ద్వారపాలక విగ్రహాన్ని వుంచారు. మరో విచిత్రం
గుడిలో ప్రదక్షిణాపథం వెనకమూలల్లో ఏర్పాటు చేసే కామశాస్త్ర సంభందిత భంగిమలున్న
శిల్పాలలో ఒకటి మిగిలిన రాళ్ళతో పాటే ఇక్కడికి చేరినట్లుంది. ఒక పురుషుడు మంచంపై
పరుండి ఒకే సమయంలో ఒక స్త్రీతోనూ, ఒక పురుషుడితోనూ రతిక్రీడ జరుపుతున్న
విపరీతపోకడలున్న శిలను సరాసరి అమ్మవారి విగ్రహం ముందు వుంచారు. అంతే కాకుండా ఆ విగ్రహం పై కుంకుమను పోసి
బొట్టు పెట్టుకునేందకు కూడా వాడుతున్నారు. బహుశా చిత్రంగా కనిపిస్తున్న ఈ శిల్పంలో
అర్ధాలను వెతుక్కునే పనేమీ చేయకుండా ప్రాచీన శిల్పానికి విలువనిస్తూ అమ్మవారి
సన్నిధిలో వుంచిన అమాయకత్వంకూడా నిజంగా చాలా విలువైనదే. దీనికి కొంచెం దూరంలోనే ఒక
కొయ్య ధ్వజస్తంభం కూడా కనిపిస్తోంది. అది ఏ దేవాలయానికి సంభందించిందో అర్ధం కావడం
లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి