వీలునామా

ఒకవేళ
నేను దేహంగా వెళ్ళిపోయిన ఎన్నాళ్ళకో
నువ్వీ అక్షరాలను చదువుతూ వున్నట్లయితే..
దేన్నయితే బ్రతికించుకోవాలని నా జీవనేచ్ఛనంతా దారపోసానో
అది సాధించుకున్నట్లే...

కొన్ని గ్రాముల మాంసపుచుక్కని
కిలోలుగా చేసి నిటారుగా నిలబెట్టేందుకే కాదు
పదార్ధాలను సాధించి సొరంగం గుండా మెలికల గొట్టాల్లోకి పంపింది.
నిన్నూ నీ చుట్టూ వున్నదాన్ని
చూస్తున్నజ్ఞాపకాలను దాచే ఒక వ్యవస్థను కాపాడలనేదే తాపత్రయం.
నా దేహంతా పాటు సమాంతరంగా బ్రతికే వుంది
నేననే ఆలోచన కూడా
చిగురించినప్పటినుంచీ అది పండుటాకు దిశగా పరుగు తీసింది.
ఐదు కిటికీలతో నాకు చూపిస్తూ మరింత మరింత పెంచిపోషించింది.
వయసులేని, గాయంతగలని, బంధాలు ముడిపడని నేననే ఒక నన్ను.

శక్తినిత్యత్వ నియమం నిజమేఅయితే
పదార్ధంతో సంభందం లేకున్నా నేనందుకే ఇందాకా వున్నాను.
పాఠకుడా నేను నీకు ఇద్దమనుకున్నది చూడగలిగితే
అది నీకే చెందాలని రాస్తున్నది ఇదే.
నేనే కాదు నాలాగే నీకోసం నాకోసం ముందునుంచి చాలా దాచివుంచి
తీసుకోమంటూ ఇచ్చిన వీలునామాలను చదువుకున్నామా?
వీలు చూసుకో, వీలు చేసుకో...

26-July-2015

కామెంట్‌లు