ఈమధ్య మా మిత్రుడొకరు అడసర్లపాడుకి బదిలీపై వెళ్ళిన తర్వాత ఇంతకీ ఈ ఊరిపేరువెనుక కథఏమైవుంటుందా అనుకున్నాం. సాధారణంగా వాడుకలో తెలిసిన అడుసు పదంతో సమన్వయం చేసిచూస్తే గ్రామంలో చెప్పుకునే బురదనేల కథ కరెక్టుగానే సరిపోతున్నట్లుగా వుంది. మరోరకంగా శబ్దార్ధాని పరిశీలించి చూస్తే తెలంగాణా మాండలీకం లోని ‘అడసాల’ అంటే అంటే వంటిల్లు అని అర్ధం. అట్ట అంటే అన్నం అనే అర్ధం వుంది. తమిళంలో అడుగలం అన్నా, కన్నడ భాషలో అడిగెమనే అంటే కూడా వంటయిల్లు అనే అర్దంలోనే వున్నాయి. కాకతీయుల సామ్రాజ్యంలో రాజమౌళిసినిమాలోని మగధీర, బాహుబలి లాంటి క్యారెక్టర్ చౌండసేనాని పేరుమీదుగా ఏర్పడిన గ్రామం చౌండవరం లేదా చౌడవరానికి ఈ అడసర్లపాడు(అడసాలపాడు ) దగ్గరలోనే వుంటుంది. కాకతీయ సామ్రాజ్యానికి చివరి అంచులాంటి ఈ ప్రాంతంలో సరిహద్దురక్షక దళాలకూ,లేదా మరెవరైనా పురప్రజలందరికీ ప్రత్యేక అవసరాలు తీర్చే విధంగా ఏదైనా వంటశాల గానీ నిర్మించివుంటారా? అది కాల క్రమంలో శిధిలం గానీ అయ్యుంటుందా? దానమీదుగానే ఈ పేరుగాని ఏర్పడిందా? అనేది మరొక హైపోథీసిస్(పరికల్పన) చేసే అవకాశం ఏర్పడింది.
అడ్డశాల అనే ఉజ్జాయింపు కానీ మరేదైనా కానీ కారణం అవుతుందనా అనేవిషయాన్ని కేవలం నైఘంటిక అర్దంతోనే కాకుండా ఆధారాలేమైనా దొరుకుతాయేమో నని పరిశీలించాలని ఒక సెలవురోజుని ఊరంతా జాగ్రత్తగా వెతికేందుకు కేటాయించుకున్నాను. మన చరిత్రకు ఆనవాళ్ళుగా మిగిలినవి ప్రాచీనఆలయాలే. అందుకే చిన్నవైనా పెద్దవైనా గుడులను చూస్తూ వచ్చాను. కానీ దాదాపు అన్నీ పునర్నిర్మించినవే. కాంక్రీటు స్థంభాలూ, రంగుల పెయింటింగులూ వేసేసారు. మరికొన్ని మరికాస్త ఆధునిక హంగులు అద్దుతూ వస్తున్నారు. ఇంకేమీ ఆధారాలు దొరకవులే అనుకుంటూ ఉస్సూరని వెనక్కి తిరిగే సమయంలో ఊరిబయట పొలాల్లో వున్న ఒంటిరాతి బొమ్మ బంగారక్క తల్లి కొలుపు గురించి సమాచారం చెప్పారు.
ఎక్కడో వెలిగిన చిన్న ఆశతో అలవాటు లేని పొలంగట్టు నడకతో అడసర్లపాడులో అడుసు తొక్కుకుంటూ సముద్రంలాంటి పొలాలమధ్య ఐలండ్ లా కనిపించే ఓ చెట్టుక్రింద ఈ బంగారక్క విగ్రహం కనిపించింది. చూడగానే అదివీరగల్లు (hero stone ) అని స్పష్టంగా అర్ధం అవుతోంది.
దానిలోని వివరాలు
... మనం ఎదురుగా నిలబడి చూస్తే కుడివైపుకు తిరిగి వున్న గుర్రం దానిపై రౌతు స్థానంలో కళ్లెపట్టుకుని కూర్చున్న ఒక మీసాల పురుషుడు అతని వెనక ఒక స్త్రీ విగ్రహం వున్నాయి. గుర్రం ముందువైపు ఎడమకాలు ఎత్తివుంచింది.
..పురుషుడు ఎడమచేత కత్తి,కుడి చేతితో కళ్ళెంపట్టుకుని వున్నాడు. పంచెకట్టు, ఆభరణాలూ, శిరస్త్రాణం వంటివి ఇతడు యోధుడని రాజకుటుంబీకుడో, రాజో, లేదా వీరసైనికుడో అయ్యివుండవచ్చు అనేలా వున్నాయి.
..స్త్రీ విగ్రహం కుడిచేత్తో కత్తి(చురకత్తి వంటిది) పట్టుకుని వుంది. ఎడమచేతిలో ఒక బరిణెవంటి దేదో వుంది. తలకొప్పు ఎత్తుగా ముడివేసి ఎడమ పక్క మరికొంత ముద్దముడి గా పడివుంది. లేదా బహుశా కిరీటం వంటిదేదో వున్నట్లు కూడా అనిపిస్తోంది.
..ఈమె గుర్రంపై ఒకవైపుకు తిరిగే కూర్చుంది. ముందున్న పురుషవిగ్రహానికి తగలకుండా కొంత ఎడంగానూ వుంది.
.. ఈమె రెండు కాళ్ళూ ఒకదగ్గరకు చేర్చివున్నాయి బహుశా శిల్పకారుడి ఉద్దేశ్యం పాదాబివందనాలకు అనుకూలంగా వుంచడం కోసం కూడా అయివుండవచ్చు. కాలి వేళ్ళకు మెట్టెల వంటి ఆభరణాలేవో చూచాయగా కనిపిస్తున్నాయి.
..దండలు వేసేందుకు చేసినట్లుగా రెండు విగ్రహాల మెడలకు రెండువైపులా, వస్త్రాలను కట్టేందుకు అనువుగా చేసినట్లు నడుముకు రెండువైపులా ఈ రాతి శిలపై రంద్రాలు చేసివున్నాయి.
ఎవరీ బంగారక్క?
బంగారక్క పాత్ర తోలుబొమ్మలాటలో కేవలం ఒకహాస్య పాత్రగా ఊరుమ్మడి ఒదినగారుగా(వాడవదిన) ఎకసక్కాలాడేందుకు ఉపయోగపడే పాత్రగానే ఎక్కువగా వినిపిస్తుంది. కేతిగాడు అనే మరో పురుష పాత్రకూడా తోలుబొమ్మలాటలోదే జుట్టువుంటే జుట్టుపోలిగాడని, బుడ్డకేతిగాడని వుంటే పాత్రల మధ్య ఈ బంగారక్క పాత్ర హాస్యాన్ని పండిస్తూ వుంటుంది. సత్తుపల్లి దగ్గరలోని వేశ్యకాంతల చెరువు చరిత్ర లాగానే ఈ బంగారక్క కూడా ఊరివారి పసుపు కుంకుమలు కాపాడేందుకు ఏదో ప్రత్యేకమైన త్యాగాన్నో, మహత్కార్యాన్నో చేసివుండటం వల్లనే ఊరందరి పూజలనూ అందుకునే అమ్మవారిగా వారిమనసుల్లో మిగిలిందని అర్ధం చేసుకోవచ్చు.
మొత్తానికి ఊరు ప్రాచీనమైనదే..
ఈ ఒక్క వీరగల్లు అయినా మిగుల్చుకున్నందుకు ఈ ఊరు ప్రాచీనమైనదే అనదగ్గ ఒక కనీస ఆధారం దొరికినట్లయినది. చూడాలి మరేమైనా సాహిత్య ఉటంకింపులు కానీ మరేఇతర ఆధారాలు గానీ దొరుకుతుతాయేమో..
ఖమ్మంజిల్లాలోనిదే మరో వీరగల్లు గురించి
ఖమ్మంజిల్లాలోనిదే మరో వీరగల్లు గురించి
ఖమ్మంజిల్లా అడసర్లపాడులో ప్రాచీన బంగారక్క వీరగల్లు ఈమధ్య మా మిత్రుడొకరు అడసర్లపాడుకి బదిలీపై వెళ్ళిన తర్వాత ఇంతకీ ఈ ఊర...
Posted by Katta Srinivas on Sunday, September 27, 2015
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి