అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని జీవితాన్ని గెలుచుకున్న బేబి హాల్దార్

రచయిత్రిగా మారిన పనిమనిషి జీవితం

మనసంటూ వుండాలి కానీ

టైం వుండకపోవడం, నైపుణ్యమూ, ప్రతిభ లేవనుకోవడం సరికాదు.
అవకాశాలు అవే రావు మనమే వాటిని వెతుక్కోవాలి లేదా సృష్టించుకోవాలని చెప్తున్న బేబీహల్దార్ జీవితం నేటి తరానికి తప్పకుంటా ఆదర్శం.

పుస్తకమంటే ఇష్టానిదేముంది హస్తభూషణంగానైనా అందరం కావాలనే కోరుకోవచ్చు.
పుస్తకాన్ని మనసుకు ఎక్కించుకోవడమే కాదు, మనసులోని ప్రయాణాన్ని పుస్తకంగా మార్చి ఎందరికో చేరువైనా ఒక మామూలు పనిమనిషి గురించి బహుశా చాలమంది ఇప్పటికే తెలుసుకునే వుంటారు. కానీ పుస్తకదినోత్సవం అనగానే తప్పకుండా గుర్తొచ్చే బేబీ హల్దర్ గురించి మరోసారి ఇలా చెప్పుకోవడం బావుంటుంది అనిపించింది. పైగా ఇప్పుడు ఆమె రచనలు తెలుగులో కూడా అనువాదం అయ్యి దొరుకుతున్నాయి.

బేబి హల్దార్ తల్లి ఆమెను చిన్నప్పుడే వదిలేసింది. అదికూడా భర్తబాధలను భరించలేక తండ్రి తాగుడుకు విపరీతంగా బానిసయ్యాడు. పైగా వేరే పెళ్ళి చేసుకున్నడు ఇక వచ్చిన సవతి తల్లి బేబిని పనిమనిషికంటే దారుణంగా చూసేది.  అయినా సరే మలాలా, సల్మా లాంటి వారి తపనకు ఏమాత్రం తక్కువ కాని పట్టుదలతో దగ్గరలోని ముర్షిదాబాద్ పాఠశాలకు వెళ్ళి బెంగాలీలో రాయడం చదవటం వరకూ నైతే నేర్చుకుంది. చేతికందిన చిన్న చితక పుస్తకాలను పేపర్లలో సమాచారాన్ని ఖాళీ సమయాల్లో ఇష్టంగా చదువుకునేది.

రచయిత్రిగా జన్మనిచ్చిన తండ్రి తాతూష్ తో బేబీ హల్దార్
కానీ పనిపిల్లగా ఇంట్లో మోయటం కూడా భారమని భావించారో ఏమో బేబి కి పట్టుమని పన్నెండేళ్ళు కూడా నిండకముందే పెళ్ళిసంభదాలను తీసుకొచ్చారు. బేబిని వదిలించుకోవడమే ప్రధాన ఉద్దేశ్యంగా దొరికిన సంభందమే చాలనుకుని సవతితల్లి ఇరవై ఆరేళ్ళ వయస్సున్న అబ్బాయికిచ్చి పెళ్ళిచేసేసింది. అతనిది చాలా చిన్న ఉద్యోగం, సంపాదన తక్కువైనా సాధింపులు ఎక్కువయ్యాయి. ఇక్కడ కూడా ఇంటిపని వంటపనులతో పనిమనిషి జీవితమే కొనసాగింది. తిట్లు సవతితల్లికంటే సాధింపులతో కలిపి అత్తారింట్లోనే ఎక్కువయ్యాయి. పైగా భర్తకు చేయాల్సిన అదనపు చాకిరీ కూడా, దాంతో చాలా చిన్న వయసులోనే బేబీ గర్భం దాల్చింది. ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. చావుఅంచులను చాలా సార్లు చూసొచ్చి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండేళ్ళలో మరో ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్త కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పిల్లలను పోషించుకోవడం కోసం తమ ఇంట్లోనే పనులే కాకుండా చుట్టు పక్కల ఇళ్ళలో కూడా పాచిపని చేయాల్సి వచ్చింది.

ఏళ్ళు గడుస్తునే వున్నాయి. బేబీహల్దార్ కష్టాలూ పెరుగుతూనే వున్నాయి. అదే సమయంలో పిడుగులాంటి వార్త తన చెల్లెల్ని మరిది చంపేశాడని తెలిసింది. ఆ సంఘటనతో తన పిల్లలగురించి కూడా ఆలోచించుకోవడం ప్రారంభించింది. తనకీ అలాంటి పరిస్థితే వస్తే తన పిల్లలెలా బ్రతుకుతారనే బెంగపట్టుకుంది. తల్లిలేకపోవడంతో తను అనుభవించిన కష్టాలు తన పిల్లలకు రాకూడదని భావించింది. ఇలాంటి ఆలోచనలో ఉక్కిరిబిక్కిరవుతుండగానే ఒకరోజు అలాంటి గొడవ భార్యభర్తల మధ్య రానే వచ్చింది. చిలికి చిలికి చాలా పెద్దిగానూ మారింది అప్పటికే విసిగిపోయిన బేబీ తన పిల్లలతో కలిసి ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. కనిపించిన బస్సు ఎక్కేసింది. ఢిల్లీకి దగ్గర్లోని గుర్ గావ్ కు చేరుకుంది. తనకు తెలిసిన పనిమనిషి ఉద్యోగం కోసమే అక్కడా ఇక్కడా వెతుక్కుంటూ ఉండగా ఆమె ఇన్నాళ్ళ కష్టాలకు ప్రతిగా మంచిరోజులను ఇచ్చేందుకా అన్నట్లు తండ్రిలాంటి ప్రొఫెసర్ ప్రభోద్ కుమార్ గారి ఇంట్లోపని దొరికింది. అప్పటినుంచి ఆవిడకు కొత్త జీవితం మొదలయ్యింది. పూట గడిస్తే చాలనుకున్న జీవితానికి వెలుతురు ఎలా వుంటుందో తెలిసింది. పనిమనిషి ఉద్యోగం కాదు అచ్చంగా తనదనుకునే కుటుంబం దొరికింది. అందులో ఆమెకు ఒక చోటు కూడా దొరికింది.


గొప్ప మనసున్న మనిషి  ప్రొఫెసర్ ప్రమోధ్ కుమార్ ప్రేమ్ చంద్ గారి కూతురు కొడుకు, కష్టాలలో తన దగ్గర చేసిన హల్దార్ ని తన స్వంత బిడ్డలా చూసుకున్నాడాయన, పిలుపు కూడా పోలిష్ భాషలో నాన్న అని అర్ధం వచ్చే తాతూష్ అనే పిలిపించుకునేవారాయన. మొదట్లో ఆమె పనిచేయగా మిగిలిన సమయంలో ప్రొఫెసర్ ప్రమోద్ గారింట్లో గుట్టలుగా వున్న పుస్తకాలనుంచి కావలిసిన వాటిని స్వేచ్ఛగా తీసుకుని చదువుకునేది. అంతేకాదు తాతూష్ కూడా తన పని ఇంట్లో పనులను చక్కబెట్టుకోవడం ఒక్కటే కాదు. పుస్తకాలను చదవటం దానితో పాటు చదివిన పుస్తకంలోని మంచిచెడులను తనతో మాట్లాడటం అనే నిభందన కూడా పెట్టారు. ఏదైనా పుస్తకం పూర్తవ్వగానే అందులోని విషయాలను తండ్రీకూతుళ్ళు చర్చించుకునే వారు.  ఇలా ఆమెకు పుస్తకమనే మరోవిశాల ప్రపంచపు కిటికీ తెరిచి వెలుతురు రేఖలను ఆమె మనసుదాకా విస్తరించుకునేలా పరిచారాయన. 



బెంగాలీ భాషలో వున్న తస్లీమా నస్రీన్ ఆత్మకథ ఆమెను భలేగా మంత్రముగ్ధురాలిని చేసింది. ఆ తర్వాత ఒక్కొక జీవిత కథలనూ, ప్రాపంచిక విషయాలనూ తెలుసుకుంటూ ఆశ్చర్యపోతుండేది. కొన్నాళ్ళు గడిచాక ప్రొఫెసర్ గారూ కొన్ని కాగితాలను ఇచ్చి ఆమె చదివిన పుస్తకాలలో ఏది బాగా నచ్చింది ఎందుకు నచ్చింది అనే విషయాలను రాసి ఇవ్వమని అడిగారు. బేబికి బాగా నచ్చిన పుస్తకం తస్లీమా ఆత్మకథ అదే పుస్తకం గురించి తనకు తెలిసినంత భాషతో, కుదిరినంత వాక్యాలలో రాసిచ్చింది. చాలా మామూలు వాడుక భాషతో సాధారణ వాక్యాలలో రాసినప్పటికీ ఆమె రాసిన తీరుకి, విషయాన్ని మనసుతో అర్ధం చేసుకున్న ఆర్ధ్రమైన తీరులో పేర్చబడిన వాక్యాల గాఢతకీ ప్రొఫెసర్ అబ్బురపడ్డారు. ఈసారి ప్రొఫెసర్ కాగితాల కట్టనే ఇచ్చారు. ఈసారి కొత్తగా ఏదన్నా కధ రాసుకురారా తల్లీ అనిపురామయించారు. తాతూష్ చెప్పారంటే తప్పదుగా ఇక రాసేందుకు కూర్చుంది. ఏం కథ రాయాలి తస్లీమానే మళ్ళీ గుర్తొచ్చింది. తస్లీమా లాగా తన కథనే రాస్తే పోలా చిన్నప్పుడు అమ్మవదిలేస్తే గుండెలోపల ఒరుసుకుంటూ సాగిన రంపపుకోత దానిపై సవతి తల్లి చల్లిన ఉప్పూకారం, దానిపై తండ్రి తాగొచ్చిన ఉదాసిన గాలివాటపు విసురు, భర్త సుడిగుండపు గండాలు తనను విడిడి తనే పారిపోయేలా చేసిన జీవిత కష్టాలూ ఇలా ఒక్కో అంశాన్ని ఒక వరుసలో పేర్చుకుంటూ కథలా రాసుకొచ్చింది బేబి. అదికూడా పగటి సమయం ఇంటిపనులుచేస్తూ అలసిపోయిన దేహంతో రాత్రి తనకు దొరికిన వేళ్ళల్లో అదేమిటో ప్రేమగా అవి ఒన్ ఫోర్ త్రీ (143) పేజిలయ్యి కూర్చున్నాయి. మరోసారి చదివిచూసుకుంటే కథ తయారయినట్లే అనిపించింది. మొత్తం పొత్తాన్ని తాతూష్ ముందుంచింది.


మొదటి ప్రయత్నంలో ఆమె రాసిన కథను చదువుతుంటే అప్రయత్నంగా తాతూష్ కళ్ళలోంచి నీళ్ళుబికాయి. పెద్దగా ఏమీ పొగడలేదు. ఆయనే స్వయంగా ఆ బెంగాలీ రచనను ప్రచురిస్తానని త్వరలోనే హిందీలోకి కూడా తనే తర్జుమా చేస్తానని చెప్పారు. తండ్రికి నచ్చిందనైతే అప్పటికి అర్ధం అయ్యింది కానీ ప్రపంచమే ఈ పుస్తకం చదవిన తర్వాత బేబిని తమ బిడ్డలా మనసులకు హత్తకుంటుందని ఆమెకు అప్పటికి తెలియలేదు. 


పుస్తకం ‘అలో ఆంధరీ’ పేరుతో ప్రచురితం అయ్యింది. అచ్చయిన కొన్నిరోజుల్లోనే మొత్తం కాపీలు అమ్ముడయ్యాయి. పనిమనిషి జీవిత కథగా జాతీయ మీడియాలో సైతం ఒక సంచలనాత్మక విషయంగా ప్రసారం అయ్యియి. అనేక వరుస కథనాలు సమీక్షలు వెల్లువెత్తాయి. బెంగాలీ మలయాలంతో సహా సుమారు ఇరవై భాషల్లోకి తర్జుమా అయ్యంది. ఆర్దికంగా సమాజికంగా బేబీ హాల్దార్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్సాహంగా ‘ఇషత్ రూపాంతర్ ’ పేరుతో మరో పుస్తకం రాసింది అది కూడా ఆదరణ పొందింది. రచయిత్రిగా ఎంత ఆదరణ పొందినా తను తతూష్ ఇంట్లో పనిచేస్తూనే వుండటం ఇష్టం అని చెప్తుంది. సుడిగాలిలో కొట్టుకు పోవలసిన నన్ను, చేరదీసి ఇంత ప్రాముఖ్యత కల్పించిన నా తండ్రి ఇంట్లో నేను పనిచేయడమే నాకు ఎప్పటికైనా ఇష్టం అని చెప్తుంది బేబి. 
ఈ పుస్తకాన్ని బేబీ హాల్‌దార్‌ చీకటి వెలుగులు, పేరుతో తెలుగులోకి ఆర్‌.శాంతసుందరి గారు అనువాదం చేసారు.

( వెల: ర.50. ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ,దిశ పుస్తకకేంద్రాలలో దొరుకుతుంది)
1973 లో జన్మించిన బేబీ కొడుకు సుబోధ్ బిడ్డ ప్రియ ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. కొడుకైతే 2012 నుంచి తల్లిపై ఆధారపడకుండా స్వంతంగా బ్రతకటం ప్రారంభించాడు. తాతూష్ ఇంట్లో పనిచేస్తూనే ఒకవైపు తన మూడవ పుస్తకాన్ని (A Life Less Ordinary) సిద్ధం చేసుకుంటూ తన రెండు పుస్తకాలపై వచ్చిన మొత్తంతో కోల్ కతాలో ఆమె స్వంత ఇంటి నిర్మాణం పనులు కూడా చూసుకుంటున్నారు.  

పుస్తకాన్నే కాదు జీవితాన్ని మనసుతో చదవటం వస్తే రాయడం రావటం అనేది నైపుణ్యం కాదు ప్రతిభ అంతకంటే కాదు వ్యక్తీకరణకోసం భాష మాట్లాడటమంత సహజమైన అవసరం అవుతుంది. 

నీళ్ళలో ముంచిన తలను పైకెత్తుకోవడం కోసం చేసూ సహజపోరాటమంత ఆవశ్యకత అవుతుంది.


ఆర్‌. శాంతసుందరి భూమికకోసం బేబీతో చేసిన ఇంటర్వ్య క్రింది లింకులో చూడొచ్చు

http://www.bhumika.org/archives/782



( గత అనుభవాల దృష్ట్యా మరోసారి అభ్యర్ధన : దయచేసి ఈ మేటర్ ను తిరిగి ఉపయోగించుకోవాలనుకునే వారు ఆర్టికల్ రచయితగా పేరును ప్రస్తావించడం, ఆ విషయాన్ని నాకు తెలియజేయటం కనీస ధర్మంగా గుర్తిస్తారని కోరుకుంటున్నాను.)

కామెంట్‌లు