కూనపులి కొనవూపిరితో కొట్టుమిట్టాడుతోంది. కూనపులి కళాకారుడు ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. అతడికి వంత పాడటానికి, సహవాయిద్యాలు వాయించడానికి మరో నలుగురు కావాలి. కానీ ఎవరూ కథ పాడగలిగినవారు లేరు. అలాగే కథ చెప్పటానికి పటం కావాలి. నకాశి కళాకారులకు డబ్బిచ్చి పటం తయారు చేసుకునే సత్తా ఒంటరిగా మిగిలిన ఆ కళాకారునికి లేదు. అంటే ఇక మన ప్రాచీన కళారూపం కూనపులి అంతరించి పోవలసిందేనా?
పద్మశాలీలను ఆశ్రయించి వారి వృత్తి పురాణాన్ని చెప్పేవారు కూనపులివారు. వారు గానం చేసే కళారూపాన్నీ వారి కులం పేరుతోనే పిలుస్తారు. వరప్రసాదులు, సమయంలు, పడగరాజులు, పులిజెండావాళ్లు అనికూడా ఈ కళాకారులకు పేర్లున్నాయి. పటం ద్వారా వీరు చెప్పే పురాణాన్ని పద్మపురాణం, భావనాఋషి పురాణం, మార్కండేయ పురాణం అని పిలుస్తారు.మార్కండేయ పురాణం
సృష్టి పుట్టుకతో కూనపులివారి పురాణం మొదలవుతుంది. బ్రహ్మకు నవబ్రహ్మలు జన్మిస్తారు. ఆ నవబ్రహ్మలలో ఒకరైన భృగుమహర్షి కుమారుడు మృకుండ మహర్షి సంతానం లేని కారణంగా తన భార్య మరుద్వతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తాడు. అందుకు సంతసించిన శివుడు అల్పాయుష్కుడైన మార్కండేయున్ని సంతానంగా ప్రసాదిస్తాడు. మార్కండేయుడు సకల విద్యలు నేర్చుకొని ఆకాశవాణి ద్వారా తన అల్పాయుష్షు గురించి తెలుసుకొని తపస్సు చేసి శివుని నుంచి చిరంజీవిగా వరం పొందుతాడు. అదే సమయంలో దేవతలు, మునీశ్వరులు వస్త్రాలు లేక తమ దీన స్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. మార్కండేయుని సంతతియే వారి దీన స్థితిని తొలగిస్తారని విష్ణువు అభయమిచ్చి పంపుతాడు. దేవతల కోరిక మేర మార్కండేయుడు తన ఆయుష్షంత ఆయుష్షుకల్గిన దూమ్రావతిని పెళ్లి చేసుకొని పుత్ర కామేష్టి యాగం చేయగా భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వీరు పెరిగి పెద్దవారై ఏమి పనిచేయాలని తండ్రిని అడుగుతారు. శివుని ఆజ్ఞమేర విష్ణువు దగ్గరకు వెళ్లమని చెపుతాడు మార్కండేయుడు. శ్రీమహావిష్ణువు భావనాఋషి జన్మ కర్తవ్యం తెలియజేసి తన నాభినుండి తంతువులను ఇచ్చి వస్త్రనిర్మాణం చేయమంటాడు. తంతువులను తీసుకొని వస్తున్న భావనాఋషిని రాక్షసులు అడ్డగించి తంతువులన్నింటిని మింగేస్తారు. భావనాఋషి వారితో యుద్దం చేసి వారందరిని సంహరిస్తాడు. అప్పుడు శ్వేతవర్ణంలో ఉన్న తంతువులన్ని రకరకాల రంగుల్లోకి మారిపోతాయి. ఆతర్వాత వస్త్రాలను తయారుచేసి దేవతలందరికి ఇచ్చి చివరకు కాళభైరవునికిస్తాడు భావనాఋషి. అందుకు కోపించిన కాళభైరవుడు ''నాకు చివరగా వస్త్రమిస్తావా, నువ్వు నిర్మించిన వస్త్రాలు మూడునెలలు కొత్త, మూడు నెలలు పాత... ఆరు నెలలకే చినిగిపోతాయని శాపమిస్తాడు. అందుకు ప్రతీకారంగా భావనాఋషి ఊరిబయట దిగంభరుడవై ఉంటావని కాళభైరవుని శపిస్తాడు. శివునికి పట్టు వస్త్రం ఇవ్వబోగా రాక్షసులు తంతువులు మింగటంతో ఎంగిలి అయిపోయాయని, నాకు పులి చర్మం కావాలని భావనాఋషిని శివుడు కోరుతాడు. ఇదంతా దైవకార్యమేనని తెలుసుకొని పులిచర్మం కోసం భావనాఋషి భద్రావతి దగ్గరకు వెళ్లి పులులను తెస్తుండగా, నారదుడు ప్రేరేపించగా కాలువాసురుడనే రాక్షసుడు ఎదురు వచ్చి భావనాఋషితో యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో భావనాఋషి అలిసిపోగా అతని చెమట నుంచి కూనపులి జన్మించి భావనాఋషికి యుద్ధంలో సహాయం చేస్తాడు. కాలువాసురున్ని యుద్ధంలో సంహరించి అతని దేహ భాగాలతో మగ్గం నిర్మించి వస్త్రం నిర్మిస్తాడు. ఆ తర్వాత దేవతల కోరిక మేరకు భావనాఋషి భద్రావతిని పెళ్లి చేసుకొని నూట ఒక్క మంది సంతానానికి జన్మనిస్తాడు. వీరంతా పద్మశాలీలుగా పిలువబడుతూ నూటొక్క గోత్రాలుగా వర్ధిల్లుతున్నారు. ఈపురాణాన్ని తర తరాలుగా కూనపులివారు నకాశి కళాకారులతో పటంమీద చిత్రించుకొని మౌఖికంగా కథాగానం చేస్తున్నారు. ఈపురాణానికి సంబంధించిన వ్రాత ప్రతులుగాని తాళ పత్ర ప్రతులుగాని లేవని చెబుతారు.
కూనపులివారు కేవలం పద్మశాలీలకు మాత్రమే చెప్పే మార్కండేయ పురాణానికి శిష్టసాహిత్యంలోని అష్టాదశ మహాపురాణాల్లోని మార్కండేయ పురాణానికి ఎక్కడా సాదృశ్యం లేదనే చెప్పవచ్చు. ఇది కేవలం మహాపురాణాల్లోని మార్కండేయున్ని పద్మశాలీకులానికి మూలపురుషున్ని చేసుకొని సమాంతరంగా సృష్టించుకున్న పురాణమనే చెప్పవచ్చు. అయితే కూనపులివారు కథాగానం చేసే మార్కండేయ పురాణానికి శిష్టసాహిత్యంలో క్రీ.శ. 1511-1568 మధ్య కాలానికి చెందినట్లుగా భావిస్తున్న ఎల్లకర నృసింహ కవి రచించిన మార్కండేయ పురాణానికి భేదసాదృశ్యాలు ఉన్నాయి. ఆశ్రిత కులాల ప్రస్తావన 12వ శతాబ్దం నుంచి కనిపించినట్లు పాల్కురికి సోమనాధుని రచన వల్ల తెలుస్తున్నది. అట్లాగే కూనపులివారు కథాగానం చేసే మార్కండేయ పురాణం ఎల్లకర నృసింహ కవి పురాణం కాలాన్ని బట్టి చూస్తే అప్పటికే మౌఖికంగా ప్రచారంలో ఉందని చెప్పటానికి అవకాశం ఉంది. అంతటి ప్రాచీనత కల్గిన మౌఖికసాహిత్య సంపద నేడు కనుమరుగయ్యే స్థితిలో ఉంది. మౌఖికంగా సంక్రమించిన పురాణ కథాంశాన్ని కూనపులి కళాకారులు కట్టడిగల గ్రామాలకు వెళ్లి కథపట్ల నిరాసక్తి లేకుండా చేసేందుకు వృత్తిని ప్రతిబింభించే సామెతలు, పొడుపుకథలు ప్రయోగిస్తూ రసవత్తరంగా పురాణాన్ని రెండు రోజులు చెబుతారు. చివరి రోజు బలి కార్యక్రమం నిర్వహించి పద్మశాలీ ఇండ్ల మీద బలి చల్లి దీవిస్తారు.
ప్రదర్శన నిమిత్తం గ్రామాలకు వెళ్లినప్పడు పులిజెండా పట్టుకొని వెళ్లటం వీరి ప్రత్యేకత. అంతేకాక వీరు ప్రదర్శనలో ప్రత్యేకమైన 'ఢంకా' వాద్యాన్ని వాయిస్తారు. దీన్నే రణభేరి అనికూడా పిలుస్తారు. పటం ద్వారా కథ చెప్పడానికి ఐదుగురు కళాకారులు ఉంటారు. ఇందులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతను నిలువునామాలు పెట్టుకొని కాళ్లకు గజ్జెలు, నడుంకు కండువా కట్టుకుంటాడు. కుడి చేతిలో బెత్తం బరిగె ఎడమ చేతిలో చిరుతలు పట్టుకొని కథాగానం చేస్తాడు. కథ ఆసక్తికరంగా సాగడానికి ప్రధాన కథకుడు కథలోని పాత్రలను పోషిస్తూ... వినోదం, విషాదం, యుద్దం వంటి సన్నివేశాల్లో తగిన హావభావాలను ప్రదర్శిస్తాడు. మధ్యలో హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు వంతలు ఉంటారు. వీరు ప్రధాన కథకున్ని అనుసరిస్తూ వంతపాడుతూ తాళాలు వేస్తారు. మరో ఇద్దరిలో ఒకరు తబలా, మరొకరు హార్మోనియం వాయిస్తారు. కొన్ని సందర్బాల్లో ప్రధాన కథకుడు విశ్రాంతి తీసుకుంటే కథకు అంతరాయం కలుగకుండా వంతగాళ్లు పిట్టకథలు, హాస్యపు పాటలు పాడుతూ కథను రక్తికట్టిస్తారు. అయితే కూనపులి కళాకారులు పూర్వం నుంచి ఇప్పటి వరకు మిగతా పటం కథల కళారూపాలైన కాకిపడగల, డక్కలి, గౌడ జెట్టి కళాకారుల మాదిరిగా కథలోని పాత్రల వేషం ధరించి పటం ముందు కథచెప్పినట్లుగా కాకుండా మూల సంప్రదాయాన్ని ఆచరిస్తూ ప్రదర్శించటం విశేషంగా చెప్పుకోవచ్చు.
పద్మశాలీ కులపురాణాన్ని మౌఖికంగా కీర్తిస్తూ , వారి సంస్కృతిని పరిరక్షిస్తూ వస్తున్న కూనపులి వారిని దాతృకులమైన పద్మశాలీలు 'వారి వీపుచూసి కొత్త బట్టలియ్యాలని, కడుపుచూసి అన్నంపెట్టాలని, ఆర్ధిబిడ్డ ఆడబిడ్డతో సమానంగా చూడాలని ఆనాడు భావనాఋషి ఒప్పందం కుదిర్చినాడు. కానీ నేడు వారిని ఆదరించక పోవడంతో కూనపులివారి మనుగడ ప్రమాదంలో పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూనపులి వారు చాలా తక్కువమందిఉన్నారు. అందులో పురాణాన్ని కథాగానం చేసే కళాకారులు మాత్రం కేవలం వరంగల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో పురాణం ఎర్రగట్టు, అతని కొడుకు రమేష్ మాత్రమే ఉన్నారు. ఇప్పటికే తండ్రి ఆరోగ్యం క్షీణించి అవసాన దశలో ఉండగా రమేష్ కూనపులి కళారూపాన్ని బ్రతికించుకోవాలనే తపనతో తండ్రి దగ్గర పురాణాన్ని నేర్చుకున్నాడు. కానీ పురాణాన్ని ప్రదర్శించడానికి పటం, వాద్యాలు, వంతలు అందుబాటులో లేక పోవడం బాధాకరం. ప్రభుత్వ రంగ సంస్థలు అతనికి అవకాశాలు కల్పించినప్పటికి అతనికి పటం, వాద్యాలు లేని కారణంగా ప్రదర్శించడానికి వెళ్లలేని స్థితిలో ఉన్నాడు. ప్రాచీన తెలుగు జానపద కళారూపం కూనపులి ఇక అంతరించి పోవలసిందేనా?
ఆశ్రిత కులాల ప్రస్తావన 12వ శతాబ్దం నుంచి కనిపించినట్లు పాల్కురికి సోమనాధుని రచన వల్ల తెలుస్తున్నది. అట్లాగే కూనపులివారు కథాగానం చేసే మార్కండేయ పురాణం ఎల్లకర నృసింహ కవి పురాణం కాలాన్ని బట్టి చూస్తే అప్పటికే మౌఖికంగా ప్రచారంలో ఉందని చెప్పటానికి అవకాశం ఉంది. అంతటి ప్రాచీనత కల్గిన మౌఖికసాహిత్య సంపద నేడు కనుమరుగయ్యే స్థితిలో ఉంది.
-డా|| బసాని సురేష్
తెలుగు విశ్వవిద్యాలయం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి