రుద్రమదేవి ఎక్కడ స్నానం చేసేది? వరంగల్ నగరం నడిబొడ్డున శిధిలం అవుతున్న పురాతన అంతస్థుల బావి

పొద్గాల పొద్గాల ఇందే పిచ్చి ప్రశ్న అని క్వశ్చన్ మార్క్ ఫేసుతో నన్ను తిట్టుకుంటున్నర? ఆగండాగండి మీక్కొన్ని ముచ్చట్లు జెప్పాలె. ఔ గదా రాణీ వాసం స్నానం జెయ్యాల్నంటెనే శానా పరేశానుంటదీ, మరి రుద్రదేవునిగా పెరుగుతున్న ఆడపిల్ల ఆ రహస్యం బయటపడకుండా మేనేజ్ చెయ్యాల్నంటే మరెంత పఠిష్టమైన ఏర్పాట్లు వుండివుండాలి.

మరా సంగతులు చెప్పేందుకు ఇప్పుడు గణపతి దేవుడూ లేడు. శివదేవయ్య మంత్రిగారూ లేరు ఆ విషయాలు రాసిన పుస్తకాలో శాసనాలో దొరికే అవకాశమూ లేదు. ఆదిత్య 369 టైం మిషన్ లోనో, ఈమధ్య కాలపు సూర్య 24 సినిమాలోని చేతి గడియారంతోనో మనమా కాలానికి వెళ్లి విషయాలను అర్ధం చేసుకునే టెక్నాలజీ సైతం పెరగలేదు. ఇదుగో ఈ ఫోటోల్లో చూస్తున్న కొన్ని నిర్మాణాలు మాత్రం ఇంక మనకోసం మిగిలేవున్నాయి. అవి ఎందుకు నిర్మించి వుంటారు వాటి నిర్మాణ పద్దతుల వెనకున్న విశేషాలు దేనికి అనుకూలంగా వున్నాయి అనే అంశాలను కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే శిధిల నిర్మాణం మౌనంగా తనమనసు లోతుల్లో దాచుకున్న ఎన్నో విశేషాలు మనకు వినిపిస్తాయి.

నీళ్ళకోసం జల వున్న చోటు డ్రౌజింగ్ పద్దతుల్లో చూసిమరీ బావులు తవ్వటం మనకు తెలుసు, వాటిని మెట్ల బావులుగానో, మోటబావులుగానో మార్చడమూ తెలుసు. స్నానాలకూ, జలకాలాటలకూ కొలనులూ, సరస్సులూ నిర్మించారన్న సంగతులూ తెలుసు. మరి ఇదేమిటి ఇది బావి మాత్రమే కాదు కొలనో, సరస్సో మాత్రమే అంతకన్నా కాదు. అ అ అ అంతకు మించి.... 

ఏంటా బావి ఏమా సంగతులు?
వరంగల్ కోటకు రెండు కిలోమీటర్ల లోపుదూరంలో, చౌరాస్తాకు దగ్గర్లో ప్రస్తుతం శివనగర్ ప్రాంతంలోని పాతఇనుపసామాను కొట్టుకు వెనక పిచ్చిముళ్ళపొదల మధ్యలో ఒక అపూర్వ నిర్మాణం దాక్కుని వుంది. పైన చుట్టూ కట్టిన గొడలున్నాయి వాటికి దగ్గరగా వెళితేనే అక్కడ నలుపలకలుగా ఒక బావిలాంటి నిర్మాణం వున్నట్లు తెలుస్తుంది. లోపట మొట్లూ స్తంభాలూ కనిపిస్తున్న వాటిదగ్గరకు దిగి ఎలా వెళ్లాలో వెంటనే ఒక పట్టాన తెలియదు. కొంచెం ఈ నిర్మాణానికి తూర్పువైపుగా వచ్చి చూస్తే నేలమాళిగలోనికి దిగటానికి వున్నట్లు క్రిందుగా మూడ్నాలుగడుగుల వెడల్పుతో భూమిలోపటికి మొట్లు కనిపిస్తాయి. అలా అరడుగు ఎత్తున్న ఒక ఇరవయ్యేడు మెట్లు దిగగానే చక్కటి వరండా వంటి నిర్మాణం దానికి స్థంభాలూ, స్లాబూ వగైరా ఒక భవంతేనేమో అనిపించేట్లుగా వుంది. అందే కాదు ఆ వరండా ఆధారంగా క్రింద నున్న కొలనుకి చుట్టూ తిరిగి వచ్చే అవకాశమూ వుంది. గోడలపై కప్పులపై అక్కడక్కడా కొన్ని శిల్పాలున్నాయి. హటాత్తుగానో, క్యాజువల్ గానో చూస్తే అవే మరేదో నిర్మాణంనుంచి తొలగించి తీసుకురావడం వల్ల ఇక్కడ శిల్పాల లాగా కనిపిస్తున్నాయిలే అన్నంత మామూలుగా వుంటాయి. స్తంభాలు సైతం అనీక్వల్ డెకరేషన్ తో వున్నాయి. ఒక స్తంభం సుందరంగా చెక్కినట్లువుంటే మరికొన్ని స్తంభాలు కేవలం రాతి నిర్మాణాలుగా మాత్రమే వున్నాయి. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బొమ్మల వెనుక ఒక శ్రేణీ విధానమేదో వున్నట్లు కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఉదాహరణకు మెట్లు దిగగానే ఎడమవైపున రెండు చతుర్దళ పద్మపట్టికలు వున్నాయి అంటే నాలుగు రేకులున్న తామర పూల రాతి ఫోటో ప్రేమ్ లాంటిది వుంది. దానికి ఖచ్చితంగా ఎదురుగా ఒక అంతస్థు దిగువలో క్రిందకు వెళుతున్న మెట్లకు కుడివైపున అష్టదళ పద్మపట్టికలు నాలుగున్నాయి. అంటే ఎనిమిది ఆకులున్న తామరపూల రాతి ఫోటో ప్రేములు నాలుగున్నాయి అంటే ఏం జరిగింది. ఇక్కడున్న రేకుల సంఖ్యతో పాటు పూల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. అది కూడా ఒక అంతస్థు దిగువలో ఖచ్చితంగా దీనికి ఎదురుగా వచ్చేలా. నా అంచనా నిజం అయితే దానికి మరో అంతస్థు దిగువలో మరో సమాధాన చిత్రం వుంటుంది. అది కూడా కొంత సమాచారాన్ని తెలియజేసేది అయ్యివుండవచ్చు. కానీ ఈ రెండు బేస్ మెంట్ గదులకు క్రిందున్న దంతా నీళ్ళతో నిండిపోయివుంది. ఆ ఏరియాలో ఇళ్ళు కడుతున్న వారు 300 అడుగులకు బోరుదింపినా నీళ్ళు పడక ఇబ్బందులు పడుతుంటే ముప్ఫై అడుగుల లోతులోనే ఇప్పటికీ నీళ్ళు వుండేందుకు ఈ నిర్మాణంలో వున్న రహస్యం ఏమిటో అర్ధం చేసుకోవాలి. భూగర్భ జల ఖచ్చితంగా వున్న చోటుని చూసి ఈ నిర్మాణం చేయడం వల్ల ఇది సాధ్యమయ్యిందా లేక దగ్గరలోని మరేదైనా జలవనరుకి దీనిని జతచేయడం వల్ల నీళ్ళు నిరంతరం ఇలా ఊరుతూ వున్నాయా అనే విషయాన్ని అర్ధం చేసుకోవలసి వుంది. నీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే లోపటినుంచి నిరంతరం గాలిబుడగలు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలనుంచీ బయటికి వస్తున్నాయి. అంటే ఇక్కడి నీరు ప్రవాహంగా ఎటువైపో వెళుతోంది మరెక్కడినుంచో గాలి నీటిలోపటికి ప్రవేశిస్తూ వుంది. దాని ఆనుపానులను అర్ధం చేసుకోవాలి. ఏదేమయినప్పటికీ మిషన్ కాకతీయ లాంటి పనులకు బోలెడంత వెచ్చిస్తున్న ప్రభుత్వం అదే స్పూర్తితో ఈ బావిలో ప్రస్తుతం వున్న మురికి నీటినీ పూడికనూ తొలగించి తదనంతర అధ్యయనాల కోసం 3డి మ్యాపింగ్ పద్దతిలో నమోదుచేసుకుని ఆ తర్వాత నీటిబావిని అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. 

రక్షణిచ్చే నాధుడే కరువాయె

కానీ కనీసం ఇంత అపురూప నిర్మాణాన్ని ఇంకా రక్షిత కట్టడంగా గుర్తించేందుకు ప్రతిపాదనలైనా పంపినట్లు లేరు. ఇక పునరుద్ధరణ తదనంతర అధ్యయనం కూడానా? అసలు ఈ బావివున్న ప్రదేశమే ప్రయివేటు ప్రాపర్టీలో రిజిస్టరు అయ్యివున్నదట.
సరే మొదటి బేస్ మెంట్ అంతస్థులో వున్నవిశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. అది మరీ ఖచ్చితంగా ఆరడుగుల ఎత్తుమాత్రమే కట్టినట్లున్నారు. విశాలంగా అందరూ తిరిగేందుకు అన్నట్లు కాకుండా అవసరం నిమిత్తం ఇబ్బంది పడకుండా వాడుకోవాలి అన్నట్లు వుంది ఆ అంతస్థు ఎత్తు, అంతే కాదు దాని పై కప్పుగా రాతి దూలాలను వేసినప్పటికీ వాటిపైన మల్లీ మామూలు మట్టి కప్పి మొత్తంగా అంతవరకూ నేలలో భాగంగా కలిసిపోయేలా చేసినట్లున్నారు. మధ్యలో వున్న భాగంపైన సైతం ఏనుగుల ట్రాప్ పై మూత పెట్టినట్లు పెడితే క్రింద బావి వున్నదనే విషయం ఏమాత్రం అర్ధం కాదు. ఈరోజు మనం టెస్టుకోసం ప్రయత్నించినా సరే. అలా మూసే అవకాశం వుంది సరే మరి అటువంటి అవకాశాన్ని ఎందుకోసం ఉపయోగించుకుని వుంటారు? ఒకటి క్రింద ఆంతరంగిక లేదా రహస్య కార్యకలాపాలు బహిరంగపడకుండా దాచివుంచేందుకు రెండు దానిపైనుంచి మాత్రమే పయనించేలా అవకాశం ఏర్పాటు చేసిన అత్యవసర ద్వారంలో తప్పించుకునే శత్రువులు కోటచుట్టూ వున్న కందకాల ట్రాప్ లో పడినట్లు పడిపోయేందుకు గానూ లేదా రెండు అవసరాలూ కలిసి వచ్చేలాగానూ కావచ్చు. అదే పద్దతిలో ప్రతి అంతస్తునూ మూసుకుంటూ వెళ్ళవచ్చు. మొత్తంగా మూయోద్దు అనుకుంటే అప్పటి దేవాలయాల కప్పులను మూసేందుకు వాడిన కార్నర్ కవరింగ్ పద్దతిలో పేర్పిడుల పద్దతిలో సైతం వాటిని మూసే అవకాశం వుందని చెపుతూ మొదటి అంతస్థు అంచుల్లో వున్న మూల రాళ్ళు చెపుతున్నాయి. మొట్లనుంచి వెళ్ళిన తర్వాత ఎడమ వైపు కు తిరిగితే దానినుంచి పడమటి దిశగా చూస్తున్న పదిమంది మదనికలు లేదా సాలభంజికలు వారి వ్యాళాలున్న రాతి కుడ్య చిత్ర ఫలకం వుంది.ఈ పటం ఐదు గదులుగా విభజింపబడివుంది ఒక్కో గదిలో ఇద్దరు సాలభంజికలున్నారు. వారి భంగిమలు వేర్వేరుగా వున్నాయి మరి వాటిని నాట్యశాస్త్రపరంగా లేదా ప్రత్యేకార్ధ పరంగా వివరణను పరిశోధకులు ప్రత్యేకంగా విశ్లేషణ చేయవలసిన అవసరం వుంది. ఈ ఐదు గదులు మొదటి అంతస్థులో కనిపిస్తున్న గదులకు రెప్లికాలు అనుకున్నట్లయితే ఈ నీటి కొలను దగ్గరకు అంతఃపుర స్త్రీలు వచ్చేవారనే విషయం ఈ చిత్రం వివరిస్తున్నట్లవుతుంది. వారి తలలపై వున్న కప్పు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నట్లంది.కేవలం స్తాన పానాదులే కాక వినోదించే వారనే దానికి సూచనగా వారి చేతుల్లోని మద్దెల వంటి సంగీత వస్తువులు నాట్య భంగిమలూ సూచిస్తున్నాయి. అంటే రాచకేళీ ప్రదేశమనికానీ, అంతఃపురకాంతావిహారిత క్షేత్రమని కానీ అర్ధం చేసుకోవచ్చు. 

శాసనం ఏమైనా విశేషాలు చెప్పనుందా?

అదే విధంగా మొట్లనుంచి కుడివైపు కు వున్న రాతిస్తంభాలను పరిశీలిస్తే ఒకదగ్గర సూర్యచంద్రుల చిత్రం కనిపించింది ఇది కాకతీయులు ప్రతిశాసనంలోనూ ఆచంద్రార్కం అనే అర్ధంలో వాడిన శిల్పనిర్మాణం అయితే దానిక్రింద అక్షరాలు వుండే అవకాశం వుంటుంది కదా అని మరికొంత జాగ్రత్తగా పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా నిజంగానే అక్కడ కొన్ని అక్షరాలు కనపిస్తున్నాయి. కాలక్రమంలో జరిగిన నీళ్ళ ఒరిపిడి వల్ల కావచ్చు లేదా కాకతీయుల తదనంత కాలంలో ఈ నిర్మాణాన్ని వాడుకున్న ముస్లింరాజులు చెరిపివేయడం వల్ల కావచ్చు మట్టి సున్న పేరుకున్న అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు. జాగ్రత్తగా పైనున్న రస్ట్ ని తొలగించి జాగ్రత్తగా వాటిని శాస్త్రీయ పద్దతిలో పరిశీలిస్తే కొంత సమాచారం దొరకవచ్చు. ఆ తర్వాతి అంతస్థులోకి దిగే మెట్లకు ఎడమ వైపున కూడా శాసన ఫలకం లా ఏర్పాటు చేసిన రాయి అయితే వుంది కానీ దానిలో అక్షరాల జాడలు సైతం అర్ధం కావడం లేదు. మరి నీళ్ళలోపలున్న నిర్మాణంలో మరింకేమైనా వున్నాయేమో చూడాలి. మొట్లకు ఎదురుగా పడమటి దిశలో వున్న స్తంభాలలో ఖచ్చితంగా మధ్యలో వున్న స్తంభం ఎందుకో ప్రత్యేకంగా అందంగా నగిషీ పనితనాన్ని కలిగివుంది. అటువంటి స్తంభనిర్మాణమే మనం ఇంతకు ముందు చెప్పుకున్న రాతిఫలకాలలోని మినియేచర్ స్తంభాలలోనూ స్పష్టంగా చెక్కబడివుంది. అప్పట్లో మొత్తం గుడివంటి నిర్మాణాల కోసం శిల్పశాస్త్రం వున్నట్లే స్తంభాలు ఎలావుండాలి? పద్దతిలో చెక్కాలి అనే విషయంలోనూ ప్రత్యేక అధ్యాయాలున్నాయి. దానిలో కాకతీయులతి ప్రత్యేక శైలి. కానీ కుడ్య చిత్రాలలోని స్తంభాలలో సైతం అచ్చంగా అటువంటి రూపునే తేడాలేకుండా ప్రతిఫలింపజేయటం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ స్తంభానికి పైన మోటకోసం వాడిన రాళ్ళ పేర్పిడి లాంటిది కనిపిస్తోంది. బహుశా దానికి వాడిన సున్నపు అతుకులను చూస్తే అది ప్రారంభం నుంచి వున్నట్లుగా కాక నిజాంల కాలంలో కానీ నీటి సరఫరాకోసం వాటివుంటారేమో అని అంచనా వేసేందుకు అనువుగా వుంది. 

స్తంభాలు మూడు ముక్కలమీద తేలుతున్నాయి
 స్తంభ నిర్మాణానికి సంభందించే మరోక ఆశక్తి కరమైన అంశం పైరాళ్ళుస్తంభాలపై సరాసరి ఆధారపడటం కాక వాటిపై వుంచిన మూడు లేదా నాలుగు చిన్న ఇనుప ముక్కలపై ఆధారపడివున్నాయి. ఇనుప ముక్కలు కాక మిగిలిన ప్రదేశం అంతా ఖాళీగా వుంది. స్థంభం పై భాగంలోనే కాక స్థంభం అడుగుభాగంలో సైతం ఇదే పద్దతిని గమనించవచ్చు. మరి రీఇన్ ఫోర్సుడు కాంక్రీటులాగా ఈ ఇనుపముక్కలకు మధ్య మరేదైనా సున్నం, మైనం లాంటి జిగిరు పదార్ధం నింపితే కరిగిపోయిందా లేక అసలు మొదటినుంచే ఇలా నిర్మించారా. లేక స్థంబాల ఎత్తుని క్రింద ఒక అంగుళం పైన ఒక అంగుళం పెంచడం కోసమే వీటిని వాడాల్సి అవసరం వచ్చిందా? మరి అట్లాకూడా కాక నీటిలోపల వుండే ఈ స్తంభాలు అదే పద్దతిలో నిర్మించడం వల్ల ఏదైనా ప్రత్యేక ప్రయోజనం వుందా అనే అంశాలను పరిశీలన చేయవలసి వుంది. 

పలకల గరాటు ఆకారంలో

ఇక దాని తర్వాత లోతులో వున్న నిర్మాణంలోకి దిగితే అది మొదటి దానికంటే సహజంగానే తక్కువ వైశాల్యాన్ని కలిగివుంది. స్తంభాల సంఖ్యతో పోల్చుకుని చూస్తే అలా తగ్గటంకూడా ఒక జామెట్రికల్ లెక్కకు సరిపోయేలా వుంది. మొదటి విజిట్ లో టేపులూ కొలతలూ లేకుండా వెళ్ళడంతో ఆ వివరాలను ఇప్పుడు ఇవ్వలేక పోతున్నాను. మరోసారి సందర్శన వీలయితే ఈ కొలతల జామెట్రికల్ వివరణను ఎలివేషన్ ఆధారంగా లెక్కవేసి అందజేసే ప్రయత్నం కూడా చేస్తాను. నీళ్లవరకూ ఏర్పాటు చేసిన దీనిలోని మెట్లు మనం ఇప్పటి వరకూ దిగివచ్చిన మామూలు మెట్లకంటే ఎక్కువ ఎత్తువున్నాయి. కానీ దృఢంగా వున్నాయి. మొదటి అంతస్థులో మూలనున్న స్థంభాలతో కలిపి వరుసలో పది స్తంభాలుంటే అందే పద్దతిలో లెక్కిస్తే మూలనున్న స్తంబాలతో కలిపి ఆతర్వాతి అంతస్థులో ఐదు స్థంబాలకు సంఖ్య తగ్గింది. లేదా నాలుగు మూలల్లో వున్న స్థంబాలు రెండు వరుసలకూ కామన్ కాబట్టి వాటిని వదిలేసి రెండు మూలల మధ్య నున్న స్థంభాలను మాత్రం లెక్కిస్తే మొదటి నేలమాళిగ లో 8 ఆ తర్వాతి లోతులోని మాళిగకు 4 స్థంభాలు లెక్కన వున్నట్లు. మరి అదే పద్దతిలో చూస్తే ఆ తర్వత మరికొంచెం ఇరుకుగా వున్న మరో నేలమాళిగ అంతస్థు వుండవచ్చని ఈ జామెట్రికల్ లెక్క ప్రకారం దానిలో రెండు స్థంభాలుండే అవకాశం వుందనీ అంచనా వేయవచ్చు. ఇలా లోతు పెరుగుతున్న కొద్దీ వైశాల్యం తగ్గటంతో ఈ నేలమాళిగ కట్టడం ఆకారం ఒక చతురస్రాకారపు గరాటా(ఫన్నెల్) ను పోలి వుంది. మొదటి అంతస్థులోపటికి తూర్పువైపునుంచి క్రిందకు దిగేలా మెట్లు వున్నట్లే ఆతర్వాతి అంతస్థులోపటికి మరింత అవతలి నుంచి సొరంగ మార్గపు మొట్లు వుండే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ పోర్టు కూడా దీనికి దగ్గరలోనే వుంది ఆ వైపునుంచి ఈ సొరంగగాని వస్తోందని గమనించ గలిగితే పరిశోధనలోని పరికల్పనకు మరికొంత ఆధారం దొరికినట్లవుతుంది. మరి అంతశ్రద్ధగా ఈ పురాతన కట్టడంపై పెట్టుబడులు పెట్టి అధ్యయనం చేయగల శ్రద్ధ వున్నవారెవరు? ఎవరికి పట్టిన నొప్పికనుక ఇదంతా కాపాడుకునేందుకు? 

విద్యార్ధుల శ్రద్ధతో వెలుగులోకి
అసలు విషయం మర్చిపోయాను ఇది ఎలా వెలుగులోకి వచ్చింది అనుకుంటున్నారు. @Aravind Arya Padike అనే చరిత్రపై అపారమైన ప్రేమ వున్న ఒక డిగ్రీ విద్యార్ధి అతని మిత్రులూ దీని గురించి ఎక్కడో విని ఒక వారం రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా అక్కడికి వచ్చి చుట్టూ వున్న చెట్టూ చేమ ముళ్ళమొక్కలూ తొలగించి పేరుకున్న మట్టినీ, వ్యర్ధాలనూ పారలతో గీరేసి ఒక రూపానికి వాలంటరీగా తీసుకురావడం వల్ల మీరునేను ఇప్పుడిలా చూడగలుగుతున్నాం. కానీ మొట్ల దారికి ఒక గేటులాంటిదేమీ బిగించేందుకు ఫండ్స్ ఏమీ లేకపోవడంతో ఆ దారిగుండా లోపటికొస్తున్న ఆకతాయిలకు ఇది అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మారింది. ఈ అంతస్థులు నేలమాళిగ కొలనును నేను అరవింద్ తో కలిసి సందర్శించే సమయంలో కూడా ఆప్రాంతంలో చుట్టుపక్కల జనం టాయిలెట్ గా వాడి అసహ్యంగా మార్చిన ప్రాంతాలను, వాడిపారేసిన మధ్యం బాటిళ్ళనూ దాటుకుంటూనే పరిశీలించాల్సి వచ్చింది. టివి సీరియళ్ళు, సినిమా షూటింగుల కోసం అధ్బుతంగా ఉపయోగపడే ఈ పర్యటక ప్రాంతాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే విజిటర్స్ ద్వారా వచ్చే ఆదాయమే కాక దాని ప్రత్యేకతల ద్వారా వచ్చే గొప్పపేరు నాలుగు కాలాల పాటు నిలచి వుంటుంది. అపురూప మైన ఇటువంటి నేలమాళిగ బావులు మరేవైనా అసంపూర్తిగా దొరికితే వాటిని సరిగా అధ్యయనం చేసేందుకు ఇది ఒక చక్కటి నమూనాగా మిగులుతుంది. 

చారిత్రక ఆధారాలు అసలేం లేనివాడు లేక ఏడుస్తుంటే 
అడుగడుగునా అబ్బురపరచే చారిత్రక సాక్ష్యాధారాలు దొరుకుతుంటే వళ్లొంగనివాడు
 నిర్లక్ష్యంగా కళ్ళుమూసుకుంటున్నాడు..

తక్షణ కర్తవ్యాలు
1) ఈ అపూర్వ నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే తన ఆధీనంలోకి తీసుకోవాలి అది చేతకాకపోతే కనీసం ఏదైనా ప్రయవేటు ట్రస్టుకు నిభందనలమేరకు దారాదత్తం చేసినా మంచిదే.

2) చుట్టూ గోడ ఎత్తును పెంచి ముందువైపు గేటును బిగించి తాళం వేయించాలి.
3) లోపట వున్న మురుగు నీటినీ పూడికనూ తొలగింపజేసి నిర్మాణాన్ని శాస్త్రీయంగా అద్యయనం చేయాలి.
4) 3డి ఇమేజింగ్ త్ పాటు వివరాల బ్రోచర్ ను విడుదల చేసి పరిశోదకులకుదుబాటులోకి తీసుకురావాలి. మరిన్ని ఇంటర్ప్రిటేషన్లకు తలుపులు తెరవాలి.



కామెంట్‌లు