బ్రహ్మోత్సవం నాకెందుకు నచ్చిందంటే

చాలా దారుణమైన నెగిటివ్ టాక్ సిరియల్ లాగా వుందని, సాగదీసారని, పెద్దనటులంతా కలిసి ఇంట్రవెల్ కు ముందు సగమంతా వడియాలూ, అప్పడాలూ పెట్టుకుని నెక్ట్స్ హాప్ లో అవి తినుకుంటూ కబుర్లాడుకున్నారు సింపుల్గా ఇదే ఇస్టోరీ అనీ అభిప్రాయాలను నెట్టంతా వెదజల్లటంవల్ల నాలాగానే సినిమా చూడాల్సిన అవసరం లేదనుకునే మిత్రులతో సినిమా చూసిన తర్వాత మారిన నా పాయింట్ ఆఫ్ వ్యూ పంచుకుందామనిపించి ఇంతకుముందే సెకండ్ షో నుంచి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ కూర్చుని ఇది రాస్తున్నాను. సినిమాలో మెలోడ్రామాలకు మాకళ్ళెప్పుడూ తడవనే లేదు అది జస్ట్ సినిమా అంతే అనుకునే వాళ్ళు సినిమానే కాదు, ఈ పోస్టు కూడా చదవటం వల్ల ప్రయోజనం వుండదు. సినిమా చూడదలచుకున్నా మహేశ్ బాబు ఇమేజ్ లో ఇంతమంది స్టార్ యాక్టర్లవల్ల మరేదో మలుపులనో ఊహించేట్లయితే కూడా సినిమా అనవసరం. అది కేవలం సినిమా అందులో కథే హీరో, నిజానికి మీరు మనసులోకి అప్పుడప్పుడన్న తొంగిచూసుకునేవారయితే అచ్చంగా అది మీ కథే దానిలో ఎవరో ఒకరు నటించాలి కాబట్టి వాళ్లు నటించారు. వాళ్ళు కూడా వాళ్ల గత కిరీటాలనూ రంగులనూ చూపించాలని తాపత్రయ పడకుండా పాత్రనే నెత్తిన మోయటం, దర్శకుడు మోయించగలగటం నిజంగానే గొప్పవిషయాలు.




మనం కొన్ని మూసలకూ, మషాలాలకూ అలవాటు పడ్డాం అనిపించింది

సినిమా అంటే విలనుండాలి సమస్య రావాలి దానిని హీరో తన గొప్పలను రకరకాలుగా ప్రదర్శిస్తూ చివర్లో మొత్తం సమస్యను చటుక్కున పరిష్కరించేయాలి. హమ్మయ్య అప్పటివరకూ నరాలూ, కండరాలూ బిగబట్టుకుని చూసి చివర్లో ఒక్కసారి పర్సానిఫై కాకపోయినా రిలీఫై వచ్చేయాలి, కనీసం మెదడులోనో, మనసులోనో కథతాలూకు ముడి ఎప్పుడు విడిపోతుందా అనే ఉత్కంఠత ముందుకు నడిపించాలి అనేది సగటు ప్రేక్షకుడికి సహజంగా అలవాటు పడ్డలక్షణం అయిపోయింది. ఏదో జరగాలని ఎదురుచూడకుండా గుడికెళ్లిన తర్వాత కొద్దిసేపు మామూలుగా కుర్చుందాం అన్నంత సాధారణంగా సినిమాను చూసుకుంటూ వెళ్ళగలిగితే ఒకదగ్గర కళ్ళముందు తెర మనసులోపటి తెరమీద ప్రతిఫలించడం మొదలవుతుంది. అది పర్సానిఫికేషన్ కాదు, ఇమాజినేషనో హల్లూసినేషనో కాదు బహుశా చాలా విషయాల రియలైజేషన్ కావచ్చు. 


సమూహంలో ఒంటరివాళ్ళకోసమే
ఎన్నోవస్తువులూ, అధికారాలూ, దర్పాలూ వున్నా చుట్టూ వెలుగులు వున్నా ఏదో కోల్పోయిన వెలితి ఎందుకో సమాధానం వెతుక్కునే సమూహంలో ఒంటరివాళ్లకు ఒక సమాధానం ఇందులో వుంది. అదికూడా వాచ్యంగా ఎవరి డైలాగులతోనూ చెప్పించలేదు. అది చెవులకు తట్టేది కాదు కూడా, విలన్ రావురమేశ్ కాదు ఒక వేళ మనలోనే వున్న గుణాలతో మనమేనేమో ఒకసారి తడుముకుని చూసుకుంటే గెలవాల్సింది బయటకాదు లోపటే అనేదీ తెలుస్తుంది కావచ్చు. మన గుణం గురించి సరిచేసుకోమంటూ మనకే మంచిమాట ఎవరన్నా చెప్పాలంటే దానిని లోపటికి చేయనీయకుండా ద్వారం బయటే ఈగో కుక్కలా కాపలా కాస్తూ వుంటుంది. దానిని రెచ్చగొట్టకుండా మనసులోకి చల్లగా చేసుకోవాలంటే పరవళ్ళుతొక్కుతూ కాకుండా ప్రవహిస్తూ రాగలగాలి. ఈ సినిమా ఆ పనిచేయగలిగింది. 


విజయం అంటే ఏమిటి?సినిమా చిరాకు పుట్టిస్తోందా?

400 రూపాయిలను 400 కోట్లుగా మార్చుకోగలగటం కంటే జీవితంలో పెద్ద విజయం మరొకటి వుంది అది మనచుట్టూ ఒక నమ్మకాన్ని అల్లుకుని వుంచుకోగలగటం అంటూ చంటబ్బాయ్(సత్యరాజ్) పాత్ర ద్వారా చెప్పినా, రావు రమేష్ ఏంటీ పాటలూ, ఆటలూ మీరేనా మంచోళ్ళు అంటూ ఇంటర్వెల్ కి ముందు బరస్ట్ అవ్వడమో, వెన్నెల కిశోష్ బ్లడీ ఎమోషన్స్ అన్నప్పుడు నిజమేనని మనకూ అనిపిస్తే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. బుగ్గకు చుక్క, గళ్ళలుంగీ, బొడ్లోకత్తితో పాతతరం విలనీదొంగల్లా ఇప్పుడు నిర్వచనాల్లేవు. దర్శకుడు కథనంతో డీల్ చేయాల్సింది మనలోవున్న ఆ అసహనంతోనే అయినప్పుడు రివ్వూలు సైతం రావురమేశ్ లా విసుక్కోవడంలో తప్పేముంది. తింటూ, నిద్రపోతూ, కూడబెడుతూ, చెప్పుకుంటూ చచ్చేంతవరకూ బతకటమే విజయమా? తెలివితేటలుండటం వల్ల సమస్యరాకముందే వందరకాల మర్గాలను ఆలోచించి గందరగోళపడటం విజయమా? అదేం లేకుండా అమాయకతతో హాయిగా బ్రతికేయడం విజయమా? ప్రశ్నలు అర్ధమయినా సమాధానం పదాలలో కాకుండా సంఘటనల్లో చెపితే ఎంతబావుంటుందో చూపిడంలోశ్రీకాంత్ అడ్డాల సక్సెస్ అయ్యారనే అనుకుంటాను.


పరిణితినిండిన రెండు మూడు ప్రేమకథలున్నాయి కూడా

కాజల్ ఐసోలేటెడ్ ప్రయివసీ కోరుకునే తరానికి ప్రతినిధిగా కనిపిస్తుంది. ఒక నేటి తరం స్థాయిలో మెచ్యూర్డ్ స్నేహం ఏ స్థాయిలో వుంటుందో చూపిస్తూనే ఈ నలుగురి తనానికి ఇమడలేనంటూ హుందాగా హీరోనుంచి వేరవుతుంది. వేరవుదాం అనుకునే విషయంలో స్పష్టత ఏర్పరచుకోవడంలో పడ్డ మధనం, ఆ విషయాన్ని ఎక్స్ ప్రెస్ చేసిన విధానం సందర్భం చాలా గొప్ప దర్శకుడు సృష్టించారు. ఇక సమంతా తనుకూడా సమాజంలోఆత్మప్రతిఫలనాన్ని వెతుక్కునే పాత్రను పోషించింది. కానీ అంతకు మించిన ఉదాత్త కారణంతో హీరోను వదులుకునేందుకు సైతం సిద్దమై చివర్లో కలుస్తుంది. ప్రణీత రావురమేశ్ కూతురిగా నటించింది. పరిస్థితులను మనం నిర్ణయించలేం అనుకున్నప్పుడు కనీసం ప్రేక్షకులుగా వుండటం నేర్చుకోవడంలో ఎలా సుఖం వుంటుందో వివరించేప్రాత్ర ఇది. నువ్వలా చూస్తే చెప్పలేనంటూనే మనసుల్లోతుల్లోకి చూసిన మాటలు చెప్పగలిగిన పాత్ర ఇది. ఈ ముగ్గురితో హీరో ప్రయాణం నిజంగా ఒక సున్నితమైన ఆధునిక జ్ఞాపకం ఈ సినిమా. నాన్నతో వున్న అనుభందం, అత్తలు, అమ్మలు మధ్య ఆత్మీయతలూ సైతం ప్రత్యేకంగా పేర్కోనదగినంత ప్లేవర్ వున్నవే.




సక్సెస్ ఫార్ములాల కాపీకాట్ కాదు

అదేదో పోస్టరు, సీన్ లేదా బిట్ మరేదో భాషలో భీబత్సంగా క్లిక్ అయ్యిందని ఏదో రకంగా తమసినిమాల్లో అచ్చంగా దాన్నో దానిని పోలిన దానినో వాడగలగటం విజయానికి ఫార్ములా అనుకుంటున్న రోజుల్లో, కధకి ఏమేమి కావాలో ఆలోచించుకుని వాటిని వాస్తవసమాజాన్ని చూసుకుంటూ ఆయా పరిణితుల నేపద్యంలో ఒక క్రమంలో పేర్చుకున్నట్లు కనిపించింది. అంటే నలిగిన దారిలో మనల్ని సునాయాసంగా నడపకుండా లక్ష్యం దిశగా దగ్గరదారిలో కొత్తగా నడిపించడం వుంది ఇందులో.


ఒక ఫైటింగ్ 

తన బంధువుల కోసం వెతుక్కుంటూ వెళ్లిన క్రమంలో పేదరికంలోవున్న అత్తయ్యను సేట్ నుంచి కాపాడటం కోసం ఒక సీన్ లో హీర్ ఫైటింగ్ వుంటుంది. దానిలో సైతం దర్శకుడు కథ లైన్ ను చూపించే ప్రయత్నం చేసాడు. శత్రువుని దెబ్బతీసే యుద్దం మధ్యలో తల్లితో పాటు వస్తున్న ఒక కోడిపిల్ల నీళ్లలో పడిపోతే హీరో జాగ్రత్తగా దానిని తీసి బయట పెడతాడు. 


చివరిగా టూకీగా

సినిమాను ఏదో లోపటి స్క్రీన్ ప్లే వేసుకుంటూనో, ఫార్ములా స్కేళ్ళతో కొలుచుకుంటూనో కాకుండా కేవలం జరిగేది గమనిస్తూ ఊరికే అలా చూడటం సాధ్యమయితే అలా చూస్తూ చూసినది కేవలం చూసినంతవరకూ అర్ధం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా నచ్చుతుంది. బహుశా మీ మెదడు ఈ మాటను ఒప్పుకోకపోతే సినిమా చూస్తూ మ మనసేమి అన్నదో చూసుకోండి ఏ ఒక్కసీన్లోనూ కళ్ళలో ఒక్క చుక్కకూడా గిర్రున తిరగకపోతే మీ మెదడు చెప్పినట్లే ఈ సినిమా ఫెయిల్ అయినట్లే అ లా కాకపోతే మనం ఫెయిల్ అవుతున్న ఏదో కోణాన్ని ఇలాంటి సినిమా సరిచేయాలని చూస్తున్నట్లన్న మాట. నా వరకు నాకయితే ఇలాంటి కథను సినిమాగా తీస్తారా అనిపించింది. మంచి సినిమాలు రావట్లేదు అంటాం కానీ నేటి సమాజానికి అవసరమైన పరిష్కారం చూపడమే మంచి అనుకుంటే అటువంటి అత్యుత్తమైన తాత్త్వికభూమికలోంచి పరిష్కారం చూపేందుకు సినిమా మాధ్యమాన్ని సమర్ధవంతంగా వాడుకుంటూ ముందుకు వచ్చిన సినిమాను ఎందుకు హత్తుకోలేకపోతున్నాం. అన్నీ నువ్వే చెపుతానంటే ఇక నాదేముంది అంటూ రావు రమేశ్ గారిలా ఎందుకు చిరాకు పడుతున్నాం. లోపటి తెరను, రంగస్థలాన్ని అప్పుడప్పుడన్న పరిశీలించేందు సమయం లేదంటూ ఎందుకు పరిగెడుతున్నాం. ఇంతాచేసి కథేమీ చెప్పలేదు కదా లేదు అవసరం లేదండీ అసలు కథనమే కథ, ఆ కథనానిక సమాంతరంగా సమానవేగంతో మనం ప్రయాణించగలగటమే ఈ సినిమా చూడటంలో వాడాల్సిన డీకోడర్ కీ పాయింట్. ఏదేమైనా ఎన్నిచెప్పినా ఏమో నాబోటి వాళ్ళకే నచ్చుతుందేమో తెలియదు కానీ నాలాంటి మిత్రులెవరన్న ఒక్కరున్న వారికీ పోస్టు ఉపయోగపడుతుందని ఇదంతా చెప్పాల్సి వచ్చింది. బ్రహ్మోత్సవం, బ్రహ్మాండం లాంటి పదాలలోనే బ్రహ్మని విశేషణంగా వాడటంలోనే పెద్దవీ అనటంకంటే మించిన తాత్త్విక అర్ధం వుంది. కథలో మెయిన్ లైన్ ను సమంతాతో చెప్పించిన డైరెక్టరు అదిగో దేవుడొచ్చేశాడు అనే వాక్యంతోనే కథ ముగిస్తారు. నిజానికి చివర్లో దేవుడు వచ్చేది తెరమీదకు ఉత్సవమూర్తిగా ఊరేగింపుకు మాత్రమే కాదు రియలైజేషన్ ఏదన్నకలిగితే మనసు పొరమీదకు కూడా. 

నోట్ : ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే



కామెంట్‌లు