నిజాం పరిపాలనాకాలం నాటి గడీలు ఇప్పుడెలా వున్నాయి?

గడీ అంటే అప్పట్లో దడ, పటేల్ పట్వారీ దోరల దాష్ట్యికానికి నీ బాంచన్ దొర కాల్మక్తా అంటూ గడగడలాడుతూ తలొంచుకున్న పాతజ్ఞాపకల చేదుకలలను చివరిగా పలవరిస్తున్నతరం ముగిసిపోబోతున్న తరుణం. ఈ నెగెటివ్ కోణం ఒక పక్క అయితే అప్పట్లో ఏ సర్వే నెంబర్ ఎవరిపేరుతో ఉందో, ఎంత విస్తీర్ణంలో ఉందో, ఏ సీజన్‌లో ఏ పంట వేసేవారో, ప్రభుత్వ భూమి, ఇనాంభూమి, మిగులుభూమి, గ్రామకంఠం తదితర భూములకు సంబంధించి పటిష్టమైన సమాచారం అందుబాటులో ఉండేది. ఒక మండలంలోని అన్ని గ్రామాలనుండి సమాచారం తెప్పించుకోవాలని తహశీల్‌దార్లు భావిస్తే సాయంత్రానికల్లా సమాచారం అందేది. ఇప్పట్లా ఫైలు కదలాలంటే తెలియని తెల్లకాలర్లేసుకున్న వంద ఉంగరాల చేతులగుండా మార్పించుకోవాలసిన అడ్డగోలు కష్టాలేం లేకుండా ఊరిలో ఊరివాళ్ళతో వుండే అధికారికి మొరపెట్టుకుంటే పనులు కొంతైనా పూర్తయ్యేయి. అదే కొంచెం మనిషిలాంటి పాలకుడైతే అచ్చంగా మంచికుటుంబమంత గొప్పగా ఊరుతీర్చిదిద్దబడేది.
విశాళమైన ఆవరణలో దొరలు నిర్మించుకున్న బ్రహ్మాండమైన ఆవాసాలనే ‘‘గడీలు’’ అనేవాళ్ళు. గడీలోనే దొర కొలువుదీరేవాడు. రాజులకు కోటలు ఎలాగో దొరల వైభవానికి, రక్షణకు గడీలు ఆసరాగా నిలిచాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉద్యమించిన ప్రజలు గడీలపై విరుచుకుపడ్డారు. కొన్నింటిని ధ్వంసం చేశారు. ప్రజావెల్లువకు జడిసి దొరలు గడీలు విడిచి పట్నంలో తలదాచుకున్నారు. వారు అక్కడే స్థిరపడటంతో చూసే దిక్కులేక గడీలన్నీ పాడుబడిపోయాయి. కొన్ని విద్యాలయాలుగా, మరికొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపుమార్చుకున్నాయి.
గడిచిన కాలపు భూస్వామ్య అవశేషాలుగా మిగిలిపోయాయి.
కె.వి నరేందర్, సంగెవేని రవీంద్ర గార్లు తెలంగాణ గడీల గురించి పరిశోదించి 190 పేజీలతో ఒక పుస్తకాన్ని విడుదల చేసారు. తెలంగాణా లో దేశ్ ముఖ్ లు, దేశాయి లు, దేశ్ పాండ్య లు, దొరలు అంటే ఎవరనేది చర్చించారు. దొరలంటే వెలమలే అనేది నిజం కాదు. తెలంగాణా లో 80% రెడ్డి దొరలే, మిగతా 20% లో వెలమలు బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణుల గడి, లంబడొల్ల గడీలు వున్నాయని వెలుగులోకి వచ్చాయి.( దేశ్ పాండ్యా లు గా కరణపు బ్రాహ్మణ దొరలను,
దేశ్ ముఖ్ లు గా రెడ్డి దొరలు) కరిం నగర్ లో న్యాలకొండ దేశాయి లు, వీరు "రావు" అని పెట్టుకుంటారు ఎందుకంటే నిజాం వీరికి రావు అనే బిరుదు ఇచ్చింది, అదే విధంగా రాం చరణ్ భార్య కుటుంబం కూడా కామినేని రెడ్డి దొరలే..
కరిమ్నగర్ జిల్లా, వరంగల్ లో, నల్గొండ లో అక్కడక్కడా వెలమ దొరలు ఉంటారు.రంగా రెడ్డి మొత్తం.. మల్కాజ్గిరి నుండి మొదలు పెడితే రాయగిరి వరకు సరికొండ దొరలు, నల్గొండ జిల్లాలో మేరెడ్డి, యెడవల్లి, కేతిరెడ్డి వంశీయులు, రాజా బహదూర్ గా బిరుదు పొందిన హైదరాబాద్ కొత్వాల్ వెంకట రామి రెడ్డి కూడా దొరలే, మహబూబ్నగర్ లో వనపర్తి దొరలు, అమరచింత సంస్థానం దొరలూ వున్నారు. తెలంగాణా గడీలలో వీరి పరిశోధన ద్వారా వరంగల్‌జిల్లాలో అత్యధికంగా 65, నల్గొండజిల్లాలో 33, మెదక్‌లో 31, మహబూబ్‌నగర్‌లో 14, ఖమ్మంజిల్లాలో 4, రంగారెడ్డిలో 4, ఆదిలాబాద్‌జిల్లాలో 6, కరీంనగర్ జిల్లాలో 41గడీల ఆనుపానులను అర్ధం చేసుకున్నారు. పైగా వీటిలో 70శాతం ఇప్పటికే శిధిలమై పోయాయి. మరయితే ఖమ్మంజిల్లాలో కేవలం 4 గడీలే వున్నాయా? పాల్వంచ, రేకపల్లి, లాంటి సంస్థానాలు, జాగీరులు, చాళుక్యులకు ఆవాసమైన ముదిగొండ, కృష్ణదేవరాయలు కన్నుబడిన కోటలు ఖమ్మం జల్లేపల్లిలు, విష్ణుకుండినుల కాలం నుంచి పరిపాలనా కేంద్రమే కాక విదేశీ వాణిజ్యం జరిగిన నేలకొండపల్లి, అత్యంత ధనవంతమై అనేకసార్లు ముష్కరుల దాడికి గురయిన కనకగిరి కోట, లాంటి ఎన్నో ప్రత్యేకతలున్న స్థానాల ఖమ్మంలో మరింకేమైనా గడీలుండవా? అనుకుంటూ జిల్లా పర్యాటక అధికారి శ్రీ సుమన్ చక్రవర్తి, యస్సార్ అండ్ బిజియన్నార్ కళాశాల అద్యాపకులు, మెగాలిధికల్ సంస్కృతిపై విస్తృతమైన పరిశోధనలు చేస్తున్న జాన్ మిల్టన్, చారిత్రక పరిశోదకులు శ్రీధర్ గార్లతో కలిసి నేను ఈరోజు గడీల వేటకు వెళ్ళొచ్చాం. అదేంటో తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత మహదేవ అన్నట్లు వెతుకుతున్నాకొద్దీ చారిత్రక ఆనవాళ్ళు అడ్డంగా వచ్చి నిలబడిమరీ మేమున్నామంటూ తమ కధను వినిపించాయి. మిత్రులతో గతంలో నాగులవంచలోని మట్టిగోడలు నాలుగు వైపుల మొట్లబురుజులున్న గడీ గురించి, అశ్వారావుపేటలోని అశ్వారాయ వంశపు రాజావార్ళ ఆధీనంలోని దివాణం గురించి పంచుకున్న ముచ్చట్లు గుర్తుండే వుంటాయి. ఇప్పుడు మరికొన్ని కొత్త విశేషాలు.
దానికంటే ముందు అప్పటి పరిపాలనలోని విభాగాలూ, పరిపాలకుల పేర్ల టెర్మినాలజీ ఎలావుండేవో సంక్షిప్తంగా చూస్తే జిల్లా పునర్విభజన లేదా డిస్ట్రిక్ట్ రీ ఆర్గనైజేషన్ ను జిల్లాభందీ అనేవాళ్ళు. నిజాం రాష్ట్రంలో 15 జిల్లాలు, 9 సబ్ డివిజన్లు, 4 సుబాలూ వుండేది. నాలుగు సుభాలకూ అధికారిగా వుండే వారు సుబేదార్ అంటే ఇప్పటి కమీషనర్ అన్నమాట. జిల్లా కలెక్టర్లుగా వుండే వాల్లు ఫస్ట్ తాలూక్ దార్ అంటారు. వారిక్రింద తాలూక్ దార్లు, పేష్కార్లు, గిర్ద్వార్లు వుంటే వారు వారిక్రింద గ్రామంలో పోలీస్ మాలీ పటేల్ వుంటారు, పోలీస్ పటేల్ పరిపాలకుడు మాత్రమే కాదు, గ్రామం లేదా జాగీరు రక్షణ భాద్యతలను చూసుకుంటాడు. లెక్కలు, శిస్తులు వసూళ్ళూ చూసుకునే అధికారిని పట్వారీ అంటారు. తెలంగాణాలో పటేల్ పట్వారీ లాగానే ఆంధ్రా ప్రాంతంలో భ్రిటీష్ వారి ఆధ్వర్యంలో మునసబు, కరణం వ్యవస్థలుండేవి. భూమి శిస్తు ద్వారా ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయం చాలా తక్కువే అయినా, రైతులకు మాత్రం వారి వారి భూములపై హక్కు ఉండేది. ‘పహణి’ లో ఏటా వారి పేరు నమోదయ్యేది. భూమి శిస్తు కేవలం నామమాత్రంగా ఉండటంతో దాన్ని చెల్లించేందుకు రైతులు విముఖత చూపేవారు కాదు. గతంలో ఖుష్కీ (డ్రై) భూములకు ఎకరాకు రెండు, మూడు రూపాయలు, తరి (వెట్) భూములకు 10 రూపాయల నుండి పాతిక రూపాయల వరకు శిస్తు ఉండేది. దీనినే రకం కట్టడం అనేవాళ్ళు, ఈ శిస్తు చెల్లిస్తే, ఏటా సదరు భూమి ఎవరు సాగు చేస్తున్నారో, ఏ పంట వేశారో సర్కారుకు సమాచారం ఉండేది. మహ్మదీయుల సంవత్సరం పేరైన ఫసలీ నే పంటసంవత్సరంగా పిలిచేవారు. ఆజ్ఞాపత్రాలు లేదా జివోలుగా సనద్ లేదా సన్నదులను విడుదల చేసేవారు. విలేజ్ ప్యూన్ లేదా విఆర్ ఏ స్థానంలో తలారీలుండేవారు. పొలాలకు నీళ్ళు వదిలేవిషయంలో ఎవరివాటాలెంతో ఇబ్బందులు రాకుండానూ, చెరువు కట్టలు తెగిపోకుండా చూడంటం, అలుగులు పడకుండా, పూడికలు పేరుకోకుండా పరిశీలించి మరమత్తులు చేయించే భాద్యతలలో నీరడి వుండేవారు. ఇంకా సేట్సింధిలు కావలీ దార్లు లేదా కావలీ కార్లుగా సుంకరిలూ వుండేవాళ్ళు. అంటే జాగీర్లు, పటేల్ గార్లున్న ఊళ్ళలో గడీలుండే అవకాశం వుందన్నమాట ఈ క్లూ కూడా గడీ ట్రెజర్ హంట్ లో బాగానే పనిచేస్తుందనిపించింది.
గార్లమండలం పుల్లూరు గడీ ( 17.391966, 80.170240)
బొంతునూళ్ళగోత్రం, వైష్ణవ సాంప్రదాయకులు, రావుల వంశపు రెడ్డిదొరల ఆదీనంలోని గడీ ఇది. ప్రస్తుతం ఈ ఆవరణలో అదేవంశానికి చెందిన రావుల వెంకటరెడ్డి గారి ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నాం. గడి ఆనవాళ్ళు దాదాపు చెరిగిపోయాయి. సాధారణ సిమ్మెంటు స్లాబు నిర్మాణం నిర్మాణంలో నివాసం వుంటున్నారు. ఊళ్ళో మాత్రం గడీ అనే పిలుపు మాసిపోలేదు. ఎకరం విస్తీర్ణం వున్న ఈ ఆవరణకు వెనక 10 అడుగుల ఎత్తున్న పాతకాలపు రాతిగోడవుంది. దాని వెనక ద్వారం నరసింహస్వామి ఆలయానికి దొరలు దర్శనానికై ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది వుంది. ఇప్పుడు ఆ దారీ మూసేసారు. ఆలయం వున్న చోటునీ మార్చేశారు. గడీబావులు రెండూ పూడ్చేశారు. వెంకటరెడ్డిగారికి ముగ్గురూ ఆడపిల్లలే వాళ్ళు సిటీలో మంచి చదవులు చదువుకుంటున్నారు. వందల ఎకరాలు పోగా మిగిలిన 20 ఎకరాలనూ ఈయన సాగుచేసుకుంటున్నారు. ఈయన తండ్రిగారు రావుల శ్రీనివాస రెడ్డి, తాతగారు రావుల వెంకట నరసింహారెడ్డి పోలీసు మాలీ పటేల్ గా చేసేవారట తాత తండ్రి రావుల బుచ్చిరెడ్డి ఆయన తండ్రి రావుల రాంచంద్రారెడ్డి గార్లు కూడా తరతరాలుగా ఇదే గడీలో నివశించేవారనీ ఆయా కాలాల్లో గ్రామాధికారులుగా పనిచేశారని చెప్పుకొచ్చారు. తనకు గుర్తులేని కొన్ని వివరాల కోసం ప్రస్తుతం హైదరాబాదులో వున్న ఆయన తల్లిగారికి ఫోన్ చేసి మరీ వివరాలు తెలుసుకుని చెప్పారు.



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి