వర్షానికి మొలకెత్తిన విత్తనం ( నిజంగా జరిగిన ఒక చిన్న సంఘటన)

3560 లక్షల యువజనాభాతో దేశంలో 28 శాతం మంది 10 నుంచి 24 సంవత్సరాల యువతతో ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా వున్న దేశంగా భారత్ ప్రధమస్థానానికి వచ్చిందని ఈ మధ్యనే యునైటెడ్ నేషన్స్ రిపోర్టు చెప్పింది. యువశక్తి, భారత్ లోని సహజ వనరులను పరసువేది స్పర్శతో బంగారంలా మర్చాలనే కలలు ఒకవైపు, యువతంటే పెడధోరణులేననే నిర్వీర్యత ఒకవైపు ఊగిసలాడిస్తున్నతరుణం. నిజమేనా యువతంటే స్మార్ట్ ఫోన్లు, మత్తుపదార్దాలు, పిచ్చి గాసిప్సు, లెక్కలేనితనం, షోకులు షికార్లూ ఇంతేనా ఇంకేం లేదంటారా? అనుకునే బీడువారిన నిరాశలోపటికి ఇప్పుడు పడుతున్న వర్షంలో ఓ సంఘటన కొన్ని బ్రమలను కడిగేస్తూ కొత్త ఆశల విత్తనాలను నాటుకుంటూ వీచింది. అందుకే దాన్ని మీతో పంచుకుందాం అనిపించింది.

సత్తుపల్లి బస్టాండ్ ఆవరణ నిన్న మధ్యాహ్నం వర్షం జోరుగా కురిసి కురిసి అలసట తీరటం కోసమన్నట్లు చెదురుమదురుగా చీరాకు పెడుతుంటే తల తడిచినా పర్లేదు సెల్ ఫోన్లు మాత్రం తడవొద్దనుకుంటూ బస్టాండులో ఆలస్యంగా నడుస్తున్న బస్సుకోసం విసుగ్గా ఎదురు చూస్తున్నాం. ముందువరుస బెంచీలో ఇంజనీరింగ్ కాలేజీ చిన్నారి బుట్టబొమ్మలు శుభ్రంగా యూనిఫాంలు వేసుకుని కల్మషాలంటని కబుర్లని నిర్లిప్తతను బద్దలు కొడుతున్నట్లు హుషారుగా చెప్పుకుంటున్నారు. చిత్తడి చిత్తడిగా మారిన నేలలాగానే వాతావరణంమంతా తడితో తొక్కిడికి లోనయినట్లేవుంది. ఎలాగోలా బస్సు రానియ్యరా బాబు వెచ్చగా మన గమ్యానికి వెళ్ళిపోదామనే ఆతృతలోనే వున్నట్లున్నారందరూ.

ఇంత చిరాకులో తన డ్యూటీ అదేనన్నట్లు కాలికి పుండయిన ముసలాయన ఒకతను చెయ్యిజాపి అడుక్కుంటున్నాడు. అలా అడుక్కోవడం నచ్చలేదో, వర్షంలో తడిసినా వదలని తన వంటి దుర్వాసన నచ్చలేదో, ఈగలు వాలుతున్న అతని పుండుకాలు నచ్చలేదో అతను దగ్గరికొస్తేనే ఓహ్యంగా చూసేవాళ్ళు కొందరయితే, ఏదో ఒకటి విసిరేసి త్వరగా పంపేద్దామనుకుంటున్న వాళ్ళు మరికొందరు. ఏదో బస్సు అటు పక్కనుంచి వెళుతుంటే ఈ ముసలాయన అడుక్కోవడం మానేసి ఆపండాపండి అంటూ చెయ్యూపాడు. అప్పటికే ప్లాట్ ఫాం కంటే పక్కనుంచి వెళుతున్న బస్సు అక్కడే ఆగింది. అసలే కాలవుడు అపైన చేతిలో ఏదో సంచి ఈడవ లేక ఈడ్చుకుంటూ నడవాలనుకుంటున్నాడు. ఇంతలో అప్పటివరకూ మాటలు చెప్పుకుంటున్న అమ్మాయిల్లో ఇద్దరు అతనికి సాయంగా లేచారు. ఇది మేమెవ్వరం ఊహించని సంఘటన. ఈ పిల్లలు ఇలా సాయం కూడా చేస్తారా? ఒక పాపాయి అతన్ని చేయి పట్టుకుని నడిపిస్తూ గొడుగు పట్టుకుంటే మరో పాపాయి అతని బ్యాగును చేత్తో మోసుకుంటూ బస్సువరకూ తీసుకెళుతోంది. బస్సులోపటికి ఎక్కేవరకూ చాలా జాగ్రత్తగా తము తడుస్తున్నా సరే అతనికి ఇబ్బంది కలగకండా చూసుకున్నారు. ఆ తర్వాత అదేం పెద్ద విషయం కాదన్నట్లు మళ్ళీ వచ్చి మిత్రుల మధ్యలో కూర్చుని తమ ముచ్చట్లని కొనాసాగించాయి ఆ సీతాకోకచిలుకలు. ఇందంతా చూస్తుంటే కొంచెం గిల్టీ బోల్డంత సంతోషం వేసింది. నిజమే మా కన్నా కొన్ని విషయాల్లో ఇప్పటి తరం మరింత ముందుంది అనే సంతోషం భరోసాలా గుండెను చెమ్మగిల్లజేస్తుంటే వర్షపు చలికూడా తెలియడం లేదు. ఈ సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశ్యంతో దగ్గర్లోని షాపునుంచి రెండు చాక్లెట్లు తీసుకొచ్చి ఇందాక ఆ ముసలాయనను బస్సెక్కించింది ఎవరమ్మా అని అడిగితే ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకరి వైపుకు మరోకరు వేలుతో చూపించారు. థాంక్స్ రా తల్లీ అంటూ షేక్ హ్యాండ్ తో పాటు చాక్లెట్ ఇస్తే ఇందులో మేం చేసిందేముంది అంకుల్ అంటూ చిర్నవ్వు నవ్వారు. అదేమిటో నిన్నటి రోజుకు సంవత్సరంలో అచ్చంగా సగం రోజులు అయిపోయినట్లే ఒకానొక సందిగ్దావస్థ మధ్యలో నిలబడ్డ నాకు మీరు తులాదండానికి మధ్యలో ఆధారంలా పట్టుచూపించారు అని చెప్పాలనిపించింది. అక్కర్లేదు వాళ్లు ఇవ్వన్నీ కోరుకోవడంలేదు. దాన్ని వాళ్ళ జీవితంలో భాగంగా మార్చుకున్నారు. అదిచాలు అనిపించింది. ఆ తర్వాత సరిగ్గా గుర్తుతెచ్చుకుంటుంటే చాలా గుర్తోచ్చాయి. సెల్ ఫోన్ లో మునిగి పోయినట్లున్న ఒక సరైనోడు హెయిర్ స్టైయిల్ అబ్బాయి ఒక పెద్దావిడ రాగానే సైలెంట్ గా లేచి కూర్చొండి ఆంటీ అంటూ అదేంమంత గొప్పవిషయంకాదన్నంత సాధారణంగా కడ్డీకి ఆనుకుని తనగేం కంటిన్యూ చేయడం. ఒకానొక సూపర్ బైక్ యువహీరో లాంటి కాలేజీ కుర్రాడు రోడ్డు పక్కన గుంతకు రాళ్ళు అడ్డం పెట్టిన తర్వాతే వెళ్ళడం. నిజమే వ్యవస్థలో మార్పు సహజమే. మరీ మన బుజాలపైనే మొస్తున్నట్లు బెంబేలు పడాల్సిన పనేంలేదు. అబ్బే వీళ్లేం మారారోయ్ అంటూ నిరాశతోనో శాపనార్దాలతోనో సమయాన్ని చంపేయాల్సిన అవసరమూ లేదు.

యువతరం ఆలోచిస్తోంది మనకంటే కొన్నిట్లో మెరుగ్గా కూడా...

కామెంట్‌లు