చత్తీస్ గడ్ లో పాదులు వేసుకున్న కాకతీయ సామ్రాజ్యవృక్షం వివరాలు మీకెన్ని తెలుసు?

ఆ రక్తం పారిపోతుందా? ఆ నెత్తురు ఊరకే చచ్చుబడినట్లు దాక్కుని బ్రతుకుతుందా?
నదుల నీరు చాలకపోతే గొలుసుకట్టు చెరువులను యజ్ఞంలా తవ్వించి అది కూడా అవకాశం లేకపోతే అనేక బావులను తవ్వించి తిండిపెట్టే రైతుకు సింహాసనం వేసిన పరవళ్ళు తొక్కే వేడి నెత్తురు. రాళ్ళలో జవరాళ్ళ అందాలనే కాదు సంగీత స్వరాలను సైతం పలికించి మైమరపింపజేసిన రసహృదయం. పేరీణీ ప్రేరణ నాట్యాలతో విజయమో వీరస్వర్గమో అంటూ ఉవ్వెత్తున ఎగిసిపడిన వీరావేశపు పునాదిరాళ్ళు. ప్రతాపరుద్రుడు ఓడిపోగానే తలలొంచుకుని తిరిగెళ్ళినంత మాత్రాన కట్టెలు కొట్టుకుంటూ, కొట్టుపెట్టుకుంటూ బ్రతికేస్తారా? లేక తమ రాచరికాన్ని నిలబెట్టుకుని చూపిస్తారా? రెండోదే నిజమంటూ కాకతీయుల చరిత్ర సెకండాఫ్ సినిమా చెపుతోంది. బాహుబలి 2 సినిమా లాగానే ఇది కాకతీయ చరిత్ర 2 అన్నమాట. మనం ప్రతాప రుద్రునివరకూ చదువుకుని ఆపేసిన చరిత్ర ఖచ్చితంగా అక్కడే ప్రారంభం అయ్యి నిజంగా మీరు ఈ పాఠం చదువుతున్న ఈ రోజు వరకూ ఏమయ్యిందో చెప్పేదే ఈ కథ.


1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. ఆ తర్వాత దక్షిణ భారత రాజ్యాలు తమకు తాము స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. అదే క్రమంలో దేవగిరి రాజ్యంలో రామచంద్రదేవుని అల్లుడు హరిపాల దేవుడు కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అదే పద్దతిలో అప్పుడు ప్రతాప రుద్రుడు ఓరుగల్లు ప్రాంతం నుంచి కూడా కప్పం కట్టడాన్ని నిలిపేశాడు. అల్లావుద్దీన్ తర్వాత ముబారక్ ఖిల్జీ డిల్లీ సుల్తాన్ గా భాద్యతలు స్వీకరించాడు. ఆయన పరిపాలనలోకి రాగానే ఇలా కప్పం కట్టకుండా వున్న రాజ్యాలను తన ఆధిపత్యంలోకి తెచ్చుకునేందుకు దండయాత్రలకు సిద్దమయ్యాడు. తానే స్వయంగా దండెత్తివచ్చి హరిపాల దేవుడిని యుద్దంలో చంపి దేవగిరి రాజ్యాన్ని మళ్ళీ డిల్లీ సుల్తానేట్ లో కలిపేసాడు. వరంగల్ పై మూడవ దండయాత్ర చేసాడు. అతని కనుసన్నలలో పనిచేసే ఖుస్రూ అనే సైన్యాధిపతిని ఓరుగల్లుపై దండెత్తేందుకు పంపించాడు. 


1316 లో ప్రతాపరుద్రునిపై  ముబారక్ ఖిల్జీ  దాడిచేసాడు
ఖుస్రూఖాన్ కాకతీయ సరిహద్దుకు చేరగానే ప్రతాపరుద్రునికి కప్పం చెల్లించమని కబురు చేశాడని కప్పం చెల్లించటానికి అభ్యంతరం లేదని, ఢిల్లీ మార్గంలో దొంగల బెడద ఎక్కువగా ఉన్నందున తాను కప్పం పంపలేదని, అంతేగాని వేరే ఉద్దేశం లేదని, కప్పంతోపాటు ఖుస్రూఖాన్‌కు బహుమతులుకూడా పంపగలమని సందేశం పంపి, వెంటనే కప్పం, ఇతర బహుమతులు పంపాడని, అందుకు సంతోషించిన ఖుస్రూఖాన్ సుల్తాన్ ఆజ్ఞ ప్రకారం ఒక ఛత్రాన్ని, వజ్రాలు పొదిగిన కత్తిని ప్రతాపరుద్రునికి పంపాడని ఇస్సామి రాశాడు. వారు ఇద్దరూ పరస్పర విరుద్ధంగా రాసినప్పటికీ ఖుస్రూఖాన్ ప్రతాపరుద్రున్ని లొంగదీసి కప్పం వసూలు చేశాడని, కాకతీయరాజ్యంపై తిరిగి ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని నెలకొల్పాడని భావించవచ్చు.


ఢిల్లీలో తుగ్లక్ పాలన
-ప్రతాపరుద్రుడు కంపిలి రాజ్యంపై పోరాడుతున్న సమయంలో ఢిల్లీ రాజకీయాలు మారడంతో ఖిల్జీ వంశం పతనమై ఘియాజొద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. (ముబారక్ ఖిల్జీ సేనాని ఖుస్రూఖాన్ సుల్తాన్‌ను హత్యచేసి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇది సహించని ఢిల్లీ సర్దారులు అతన్ని వధించి ఘియాజోద్దీన్ తుగ్లక్ ఆధ్వర్యంలో తుగ్లక్ వంశం అధికారంలోకి వచ్చింది)

- ఈ అధికార మార్పిడితో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్‌కు కప్పం కట్టడం మానివేశాడు. ప్రతాపరుద్రున్ని లొంగదీసుకోవడానికి, కప్పం తిరిగి వసూలు చేసుకో వడానికి తన కుమారుడైన ఉల్గుఖాన్‌ను ఘియాజొద్దిన్ తుగ్లక్ ఓరుగల్లుపైకి పంపించాడు. (కప్పం కట్టడం మానివేసినందునే ఈ దాడి జరిగిందని పెరిస్టా అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు). ఉల్గుఖాన్‌తోపాటు అబురీజా అనే మరొక సేనాని నాయకత్వంలో కోటగిరిపై దాడి చేశాడు. ప్రతాపరుద్రుడు ఈ దాడులను ఎదుర్కొని ముస్లిం సైన్యాలను ఓడించి తరిమివేశాడు.

-ఉల్గుఖాన్ తొలి దండయాత్ర విఫలమవడంపై ముస్లిం చరిత్రకారులు అనేక కారణాలు పేర్కొన్నారు. ఉల్గుఖాన్ ఓరుగల్లులో ఓడిపోయి దేవగిరి పారిపోయాడని బరౌని రాశాడు. కొటగిరిని ముట్టడించే సమయంలో ముస్లిం సేనాధిపతి అబూరిజాఖాన్ ఉల్గుని రక్షించి ఢిల్లీ పారిపోయారని ఇస్సామి వర్ణించాడు. మొదటిసారి ప్రతాపరుద్రుని చేతిలో ఓడిపోయిన ఉల్గూఖాన్ ఢిల్లీకి పోయి అదనపు సైన్యంతో తిరిగి రెండోసారి ఓరుగల్లును ముట్టడించాడు. ప్రతాపరుద్రున్ని ఓడించి బంధీగా చేసి ఖాదర్‌ఖాన్, ఖ్యాజహజి అను అమీరుల ఆధిపత్యంలో ఢిల్లీకి పంపగా ప్రతాపరుద్రుడు అవమానభారంతో మార్గమధ్యలోనే నర్మదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా క్రీ.శ 1323లో ప్రతాపరుద్రుని మరణంతో ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యం పూర్తిగా అస్తమించిపోయింది. కానీ ఓరుగల్లులో అస్తమించిన కాకతీయ సామ్రాజ్యం బస్తర్‌లో వెలుగొందిన వైనాన్ని చరిత్ర విస్మరించింది.
దంతెవాడ జిల్లాలోని భైలడిల్లా అడవుల్లో ఢోల్‌కాల్ గుట్టలపై కొలువు తీరిన ఈ వినాయకుడిని చేరుకోవడం చాలా కష్టం. నిటారుగా ఉండే కొండలు, వాటిని ఎక్కిన తర్వాత వచ్చే జలపాతాలు, అవికూడా దాటి ముందుకు వెళ్తే వచ్చే మరో కొండ, ఆ కొండ చిట్టచివరి ప్రాంతంలో కొలువు తీరిన ఈ వినాయకుడిని రోడ్డు మార్గం నుంచి దాదాపు 16 కి.మీలు గుట్టలపై ప్రయాణిస్తే కాని చేరుకోలేం. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నది పక్కన ఉన్న ఢోల్‌కాల్ కొండలపై కొలువుతీరిన వినాయకుడు ప్రపంచంలోనే ఎతె్తైన ప్రదేశంలో కొలువు తీరిన వినాయకుడని ఛత్తీస్‌గఢ్ వాసుల నమ్మకం. సాక్షాత్తు మునులు, రుషులు, ఈ వినాయకుడిని పూజించారని ఇక్కడి ఆదివాసీల విశ్వాసం. సముద్రమట్టానికి 13000 అడుగుల ఎత్తు నిటారుగా వుండే ఈ కొండలపైకి మామూలుగా చేరుకోవడమే కష్టం ఇంత పెద్ద వినాయకుడు ఎలా చేరాడనేది ఈ ప్రాంతవాసులకు ఇప్పటికీ ఆశ్చర్యమే, ఈ గణేష్ అసలు ఇక్కడ ఎలా వెలిశాడు? ఎవరైనా చెక్కారా? తీసుకొచ్చి ప్రతిష్ఠించారా? అన్నది నేటికీ అంతుపట్టని రహస్యం. అసలు అక్కడికి వెళ్లడమే కష్టం. దాదాపు కొన్ని వందల కిలోల బరువుండే ఈ విగ్రహం అక్కడికి ఎలా చేరింది? చెక్కడం కూడా సాధ్యం కాని ఈ ప్రదేశంలో ఎలా ఉందనేది పెద్ద మిస్టరీ. ఆజ్ఞాత వాసంలో వున్నప్పుడు అన్నమదేవుడు లేదా అతని వారసులు తమకు విజయం సిద్దింపజేయమని పూజించేందుకు ఇటువంటి విగ్రహ ప్రతిష్టకానీ చేసి పనులు ప్రారంభించి వుండరు కదా అనేది ఒక అనుమానం. దాదాపు వేల సంవత్సరాల కిందట నాగవంశస్థులు ఈ ప్రాంతంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉంటారని ఇక్కడ నివసించే ప్రజల మరోక విశ్వాసం

.1323 తర్వాత కాకతీయ సామ్రాజ్యం ఛిన్నాభిన్నమైం ది. బహమనీలు వచ్చి ఓరుగల్లును తమ రాజ్యంలో కలుపుకున్నారని, అనంతరం రెడ్డిరాజులు, పద్మనాయకులు వంటి సామంతరాజుల ఏలుబడిలో కాకతీయ సామ్రాజ్యం ముక్కలైందనీ.. అనంతరం కుతుబ్‌షాహీల చరిత్ర తదుపరి నిజాంల హయాం చివరికి ఆపరేషన్ పోలో, స్వతంత్ర తెలంగాణ.

కాకతీయుల వీరత్వం, రుద్రమ్మ ధీయుక్తి ఎక్కడికీ పోలేదు. ప్రతాపరుద్రుడి మరణం తదుపరి ఏడాదే కాకతీయుల పరిపాలనా కౌశలం కొత్త చివుళ్లు పోసుకున్నది.
చత్తీస్ ఘడ్ సాంప్రదాయక నృత్యప్రదర్శన ఇది

1940లో నాటి బ్రిటిష్ -ఇండియా ప్రభుత్వం మెమోరాండం ఆన్ ది ఇండియన్ స్టేట్స్ 1940 అనే పుస్తకంలో కాకతీయ చివరిరాజు ప్రతాపరుద్రుడి మరణం తర్వాత అతని వారసులు బస్తర్ జిల్లాలోని దంతేవాడలో రెండో కాకతీయ మహా సామ్రాజ్యం అన్నమ దేవుడు (ప్రతాపరుద్రుని సోదరుని కుమారుడు) 13 వేల చ.కి.మీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసి ఆరువందల సంవత్సరాల పాటు 20 మంది కాకతీయ రాజులు పరిపాలించినట్లు వివరించబడినది. నాటి ప్రభుత్వం ప్రకటించిన ఆ పుస్తకంలోని వివరాలు యథాతథంగా .....

BASTAR: THE RULING FAMILY OF BASTAR STATE CLAIM DESCENT FROM ANNAM DEO, BROTHER OF PRATAP RUDRA, THE MOST BRILLIANT RULER OF THE KAKATIYA DYNASTY.

WHO LOST HIS LIFE AND KINGDOM IN A BATTLE WITH THE MOGHULS EARLY IN THE 14TH CENTURY. ANNAM DEO WHO CAME FROM WARANGAL IN THE DECCAN, ESTABLISHED HIMSELF IN THE VILLAGE OF BASTAR. IN THE EIGHTEENTH CENTURY THE CAPITAL WAS REMOVED TO JAGDALPUR. AFTER YEARS OF HOSTILITES BETWEEN BASTAR AND JEYPORE, THE STATE CAME UNDER THE INFLUENCE OF THE BHONSLAS AND IT PASSED TO THE BRITISH GOVER-NMENT IN 1853.

-ఇది మొదటి సాక్ష్యం .. ఇక రెండవది. రెండో కాకతీయ సామ్రాజ్యంలోని మహారాజ ప్రవీర్‌చంద్రభంజ్‌దేవ్ (మధ్యప్రదేశ్) కాకతీయ అని పేర్కొం టూ సుప్రీంకోర్టు విడుదల చేసి పత్రం (ఇది 1960, నవంబర్ 18న సుప్రీంకోర్టు ధ్రువీకరించింది)

ఎక్కడి ఓరుగల్లు. ఎక్కడి బస్తర్(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం) మన కాకతీయ రాజులకు చివర దేవుడు అని ఉంటుంది. ఇక్కడి రాజులకు భంజ్ ఉంటుంది. 1940లో బ్రిటీష్ వారు ప్రకటించిన ది ఇండియన్ స్టేట్స్ పుస్తకంలో కాకతీయులే ఈ గంజ్ రాజ్య వంశీయులు అని చెప్పింది. ఆచార్య ఎన్‌జీ రంగా రాసిన కాకతీయనాయక్స్ అనే పుస్తకంలో కూడా కాకతీయ రెండో రాజ్యం బస్తర్‌లో తిరిగి మొదలైందనే ధ్రువీకరణ కన్పిస్తుంది. ప్రతాపరుద్రుని మరణానంతరం బస్తర్ జయపూర్ పరిసరాల్లోని దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లిపోయిన అన్నమదేవుడు ఆయన అనుచరులు అక్కడ చిత్రకూట్ రాజధానిగా బలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని రంగా పుస్తకంలో కన్పిస్తుంది. తూర్పు కనుమల్లోని ఎత్తయిన పర్వత సానువుల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ రాజ్యం ఉండటం వల్ల బ్రిటిష్ పాలకులు జయించలేకపోయారు. దాంతో బస్తర్ పాలకులు పాక్షిక స్వయం ప్రతిపత్తి హోదా కల్పించారు. దీంతో 600 సంవత్సరాల పాటు బస్తర్‌లో కాకతీయలు రెండో సామ్రాజ్యం కొనసాగించారని ఆచార్య రంగా తన పుస్తకంలో పేర్కొనడం గమనార్హం.

-1940 నాటికి బస్తర్ సామ్రాజ్యం 13.62 చ.కి. మైళ్లు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతేవాడ బస్తర్ కాంకేర్ నారాయణపూర్ జిల్లాలను.. బస్తర్‌జోన్‌గా చెప్తారు


బస్తర్ రాజులు వీరే

బస్తర్ రాజవంశీకుల అధికారిక జెండా ఇదే

దీనిలో ఆచంద్రార్కం అంటూ ప్రతికాకతీయ శాసనంలోనూ కనిపించే చంద్రుడినీ,
 శైవానికి చిహ్నంగా త్రిశూలాన్నీ గమనించవచ్చు

15వ శతాబ్దంలో పునఃస్థాపించబడిన సామ్రజ్యం ఇది. 11వ అతిపెద్ద రాజరిక వ్యవస్థగా నిలబడింది. దానిని అప్పటినుంచీ పరిపాలించుకుంటూ వస్తున్న బస్తర్ రాజులు వరుస క్రమం వారిగురించి సంక్షిప్త వివరణలనూ చూడండి.



రాజా అన్నమ దేవ్ఈయన బస్తర్ మొదటి రాజు, 1324 నుంచి 1369 వరకూ పరిపాలించాడు. నాగవంశ రాజులను జయించి తన సామ్రాజ్యాన్ని స్థాపించింది ఈయనే. కాకతీయ ప్రతాపరుద్రుని సోదరుడు. ముదొట దగ్గర తన రాజధానిని నిర్మించాడు. తల్లి దంతేశ్వరీ దేవి ఆశిస్తులు తనకు కలగాలని కాకతీయులు పద్మాక్షిదేవికి గుడి కట్టించినట్లే ఈయన దంతేశ్వరీ దేవికి గుడి కట్టించాడు.ఇప్పటికీ వారికి వంశపారంపర్య దేవత దంతేశ్వరీ దేవియే. సుమారు లక్షల హెక్టార్లలో కాకులు దూరని కారడవులు, అబూజ్‌మాడ్ దండకారణ్యంలో ఉన్న కొండగావ్ జిల్లా బడేడోంగాల్ ప్రాంతం ఇది. ఆలయం సమీపం లో శంకిని ,లంకిణి అనే రెండు నదులు రెండు రకాల రంగున్న జలాలతో ప్రవహిస్తాయి .విశాల మైన ప్రాంగణం ,ప్రకృతి అందాలు ప్రవహించే నదుల సోయగాలు బస్తర్ ప్రజల సంస్కృతీ ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసిన అంశాలు .నల్ల రాతి తో చెక్క బడిన అమ్మ వారి మూర్తి చాలా అందంగా వుంటుంది.  .ఆలయం లో గర్భ గృహం ,మహా మండపం ,ముఖ్య మండపం సభా మండపం ఉన్నాయి ..అంతా రాతి కట్టడమే .ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గరుడ స్తంభం ఉండటం ఇక్కడి ప్రత్యేకత .విశాల మైన ప్రకారం తో చూడ ముచ్చటైన ఎత్తైన శిఖరం తో ఆలయం శిఖరాయ మానం గా కని పిస్తుంది

శక్తిపీఠం దంతేశ్వరీదేవి ఆలయం

దంతేశ్వరీ దేవి






  • రాజా హమిర్ దేవ్, ఈయన బస్తర్ రెండవ రాజు కీ.శ 1360 నుంచి 1410 వరకూ పరిపాలించాడు. 

  • రాజా బైతైయ్ దేవ్, బస్తర్ మూడవ రాజు, 1410 నుంచి 1468 వరకూ పరిపాలన సాగించాడు. 

  • రాజా పురుషోత్తమ దేవ్, బస్తర్ పరిపాలకునిగా నాల్గవ రాజు. ఈయన 1468 నుంచి 1534 వరకూ పరిపాలించాడు. ఈయన కాలంలోనే రాజధాని పాత బస్తర్ కు మార్చబడింది. 

  • రాజా ప్రతాప్ రాజ్ దేవ్, 1602 నుంచి 1665 వరకూ పరిపాలించిన బస్తర్ రాజు,   married and had issue, extinct in the 3rd generation,
  • రాజా దిక్పాల్ దేవ్, ఈయన బస్తర్ రాజధానిగా 1680 నుంచి 1709 వరకూ పరిపాలన సాగించాడు. 
  • రాజా రాజ్ పాల్ దేవ్, బస్తర్ రాజుగా 1709 నుంచి 1721 వరకూ పరిపాలించాడు. రాజా ప్రతాప్ రాజ్ దేవ్ తమ్ముడి వారసత్వంగా పరిపాలనలోకి వచ్చాడు. భగేలా యువరాణిని మొదటి భార్యగానూ, ఛండేలా యువరాణిని రెండవ భార్యగానూ వివాహమాడారు. వారి సంతానం వివరాలివి. 
  • రాజ్ కుమార్ దక్షిణ్ సింగ్ (మొదటి భార్య సంతానం)
  • రాజా దళపతి దేవ్  (రెండవ భార్య సంతానం) 
  • రాజ్ కుమార్ ప్రతాప్ సింగ్ (రెండవ భార్య సంతానం)

  • రాజా మామ, బస్తర్ మహారాజుగా ఈయన 1721 నుంచి 1731 వరకూ పరిపాలన సాగించాడు.
  • రాజా దళపతి దేవ్, దళపతి దేవుడు ఈ పేరు కూడా తెలుగు దనానికి దగ్గరగా శౌర్య సూచకంగా వుంది కదా. ఈయన 1731 నుంచి 1774 వరకూ పరిపాలించాడు అంతే కాదు రాజధానిని బస్తర్ నుంచి జగదల్ పూర్ కు మార్చాడు.ఈయన ఏడు వివాహాలు చేసుకున్నాడు. మొదటి భార్యగా కాంకెర్ రాజా రాజా గోర్ సాయిదేవ్ గారి కుమార్తెను చేసుకున్నాడు.
  • రాజ్ కుమార్ అజ్మర్ సింగ్ (మొదటి భార్య సంతతి), usurped the gaddi for a short time.
  • రాజా ధర్యారావు దేవ్ (రెండవ భార్య సంతతి) 
  • రాజా ధర్యారావు దేవ్, బస్తర్ మహారాజుగా (రాజధాని మార్చినప్పటికీ వీరి పేరు అదే పద్దతిలో బస్తరు రాజవంశంగానే కొనసాగింది) 1774 నుంచి 1777bef 1819 వరకూ పరిపాలన చేసాడు.  వివాహం జరిగింది ఒక వారసుడు జన్మించాడు.
  • రాజా మహీపాల్ దేవ్ 
  • రాజా మహీపాల్ దేవ్, ఈయన బస్తర్ ను కేవలం 1819 లో పరిపాలించాడు. 
  • రాజా భోపాల్ దేవ్ 
  • Lal Dalganjan Singh, Dewan of Bastar 1846/1863, married and had issue. He died 1863.
    • Lal Kalendra Singh, Dewan of Bastar 1882/-; deported to Illichpur for his part in the Bastar rebellion of 1910, where he died. He died 1916 at Illichpur.
    • Kunwar Chakar Singh
  • రాజా భోపాల్ దేవ్, బస్తర్ ప్రభువుగా 1830 నుంచి 1853 వరకూ పరిపాలించాడు. 
  • రాజా భైరామ్ దేవ్ 
  • కున్వర్ దుర్జన్ సింగ్ (by a secondary union), దివాన్ ఆఫ్ బస్తర్ గా 1881లో పదవిలోకి వచ్చాడు అదే సంవత్సరం ఫిబ్రవరి 1881 న మరణించాడు.  

  • రాజా భైరామ్ దేవ్,ఈయన బస్తర్ ప్రభువుగా 1853 నుంచి 1891 వరకూ పరిపాలన సాగించాడు. 1839 మే 21న జన్మించిన భైరామ్ దేవ్ 27 అగస్టు 1853న పరిపాలనా పగ్గాలను ధరించాడు. 1865 లో Feudatory Chief గా బ్రిటీష్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందాడు. సీనియర్ రాణీ సుబ్ర కన్వర్ ను వివాహమాడారు ఈవిడ రాయ్ పూర్ లో అక్టోబర్ 1910 లో మరణించింది. ఈయనకు నవాభాయ్ అనే ఉంపుడు గత్తె ద్వారా ఒక సంతానం కలిగింది. 28 జూలై 1891లో ఈయన మరణించాడు.  
  • రాజా రుద్ర ప్రతాపదేవ్ 
  • మహారాణీధిరాణి పద్మాలయా దేవి గారికి కాంకర్ కు చెందిన మహారాజాధిరాజ నహర్ దేవ్ తో వివాహం జరిగింది. 
  • కున్వర్ బహదూర్ సింగ్ (రెండవ)
  • కున్వర్ అర్జున్ సింగ్ (రెండవ)

  • రాజా రుద్ర ప్రతాప్ దేవ్,ఈయన బస్తర్ రాజుగా 1891 నుంచి 1921 వరకూ పరిపాలించాడు. 5 మార్చి 1885న జన్మించిన ప్రతాప్ దేవ్ 20 జూలై 1891న పరిపాలనా పగ్గాలను చేపట్టాడు. రాయ్ పూర్ లోని రాజ్ కుమార్ కళాశాలలో చదువుకున్నాడు. బర్మాకు చెందిన రాజా సర్ బాసుదేవ్ సుధాల్ దేవ్ గారి కుమార్తె రాణీ కుసుమ లతా దేవిని ప్రధమ వివాహంగా చేసుకున్నాడు. ఆవిడ 18 అగస్టు 1911 న మరణించడంతో రాణీ చంద్రకుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె. రుద్రప్రతాప్ దేవ్ 1921లో మరణించాడు. 
  • యువరాజు (పేరుతెలియదు కుసుమలతా దేవి గారి కుమారుడుi), కేవలం 8 నెలల చిన్నారి వయసులో చనిపోయాడు..
  • రాణి ప్రఫుల్ల కుమారీ దేవి (కుసుమలతా దేవి కుమార్తె) 

  • హర్ ఎక్సలెన్సీ మమారాణి సాహెబ్ ప్రఫుల్ల కుమారి దేవి: ఈమె బస్తరు మహారాణిగా 1921 నుంచి 1936 వరకూ పరిపాలన చేసారు. 1910 ఫిబ్రవరి 10 న జన్మించిన ఈవిడ తన 17 ఏళ్ళ వయసులో అంటే 1927లో మయూర్ భంజ్ కు చెందిన లాల్ సాహెబ్ ప్రఫుల్ల చంద్ర భంజ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు. ఆయన 23 మే 1909 లో జన్మించాడు. రాజ్యసభ యం.పి గా రెండుసార్లు ఎన్నికయ్యాడు. 1952 నుంచి 1954 ఇంకా 1954 నుంచి 1960 వరకూ వున్నారు. పార్లమెంటు స్థాయి అధికార భాషా సంఘ సభ్యునిగా 1957 లో పనిచేసారు. ఈయన 5 మార్చి 1959లో మరణించారు. వీరికి ఒక కుమార్తె కలిగింది కానీ ఆమె 28 ఫిబ్రవరి 1936లో లండన్ లో మరణించింది.   
  • రాజకుమారి కమలా దేవి (రాణీ ప్రఫుల్ల కుమారి దేవి పుత్రిక),2 పిబ్రవరి 1928 లో జన్మించారు 1 జనవరి 1954 వరకూ జీవించారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్వాలో వివాహం చేసుకున్నారు.  
  • మహారాజ ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ 
  • రాజ కుమారి గీతా కుమారి దేవి, ఈమె 1930 అక్టోబర్ 29 న జన్మించారు. బొనాయ్ కి చెందిన రాజా సాహెబ్ కదంబ కేసరి చంద్రదేవ్ ను వివాహం చేసుకున్నారు. 2002 డిసెంబర్ 17న మరణించారు.  
  • మహారాజా విజయ్ చంద్ర భంజ్ దేవ్ 

  • పేదల దేవుడు మహారాజా సాహెబ్ ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ (కాకతీయ) 
  బస్తర్
పేదలదేవుడు రాజా ప్రవీర్ చంద్ర్ భంజ్ దేవ్ (కాకతీయ)
రాజ్య ప్రభువుగా ఈయన 1936 నుంచి 1966 వరకూ చేసారు. 1929 మార్చి 12 ( లేదా 25 జూన్ 1929) న జన్మించారు. రాయ్ పూర్ లోని రాజ్ కుమార్ కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు. తన మైనారిటీ తీరిన తర్వాత 28 అక్టోబర్ 1936న పట్టాభిషిక్తుడయినాడు. మధ్య ప్రదేశ్ నుంచి MLA గా కూడా ఎన్నిక అయినాడు. ఈయన వివాహం 4 జూలై 1961 లో జరిగింది. 1930లో జన్మించిన మహారాణి పఠాన్ రాజవంశపు రావు సాహెబ్ ఉదయ సింగ్ గారి కుమార్తె అయిన శుభరాజ కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమె 11 సెప్టెంబర్ 1996లో మరణించారు. అత్యంత విచార కరమైన సన్నివేశంలో ప్రజలకోసం పోరాడుతూ ప్రభుత్వం జరిపిన కాల్పులలో రాజా ప్రవీర్ చంద్ర 25 మార్చి 1966 లో మరణించారు.

ప్రవీర్ జీవితం చాలా చిత్రంగా గడిచింది. పేరుకు రాజవంశపు ప్రభువు అయినా ఆయన పోరాటమంతా ప్రజల తరపునే సాగింది. ఈయన చిన్నవయసులో వుండగానే తల్లి మహారాణి ప్రపుల్లకుమారీ దేవి 1936లో ఇంగ్లాండులో వుండగానే అపెండిసైటిస్ కడుపు నొప్పితో మరణించింది. ఆమెకు ఇంగ్లాండు ప్రభుత్వం సరైన సమయంలో వైద్యం చేయించక కుట్రపూరితంగా వ్యవహరించడం వల్లనే ఈ మరణం సంభవించిందనే విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఆమె మృతి ద్వారా బలంగా వున్న సంస్ధానాన్ని డీలా పడేలా చేసి తమ ఆధీనంలోకి మార్చుకోవాలనేదే వారి కుట్ర సారాంశం. అప్పటికి ప్రవీర్ కు కేవలం 7 సంవత్సరాలు అతడి తమ్ముడు చెల్లెలు ఇంకా చిన్నవారు ఇదే అదనుగా బ్రిటీష్ ప్రభుత్వం గిబ్బన్ అనే వానిని వీరి రాజకీయ ప్రతినిధిగా నియమించి పేరుకు సంస్థానాధీశునిగా పిల్లవాడు ప్రవీర్ కు పట్టాభిషేకమయితే చేసారు. భూంకాల్ వంటి ఉద్యమాన్ని నిర్వహించిన ప్రపుల్ల కుమార్ ఈ పిల్లల తండ్రి బ్రతికే ఉన్నప్పటికీ అతనికి పిల్లలను పెంచే అవకాశం లేదంటూ ఆంక్షలు విధించారు. సంస్కృతి ఆధునీకరణ అంటూ ఏవేవో మాయమాటలు చెప్పి స్థానిక ప్రజలనుంచి వ్యతిరేఖత రాకుండా చూసుకున్నారు. కానీ గిబ్బన్ మహా కృరుడు పిల్లల పెంపకంలో అనేక ఆంక్షలు విధించాడు. వారిని కేవలం అనాధల్లా పెంచాడు. వారి తెలివి తేటలను కాలరాచేందుకు నిరంతరం ప్రయత్నించేవాడు. తరచూ కొట్టేవాడు, ఆడపిల్లను మరీ పిరికి పిల్లలా ప్రతిదానికీ భయపడేదానిగా పెంచాడు. ఆమె పెళ్ళికూడా రాచకుటుంబంతో కాక మామూలు జమిందారీ కుటుంబంతో అది కూడా ఆమెకు పూర్తిగా యుక్తవయస్సు రాకముందే జరిపించాడు. అక్కడ ఇమడలేక ఆమె పిచ్చిదైపోయింది. నాలుగు సంవత్సరాలుకూడా తిరగకముందే చనిపోయింది. అందుకే ప్రవీర్ చంద్ర చిన్నప్పటినుంచే గిబ్బన్ దాష్టికాన్నీ, బ్రిటీష్ వారి పద్దతులనూ వ్యతిరేఖిస్తూ పెరిగాడు.  వాస్తవానికి ప్రవీర్ చంద్ర్ దేవ్ చాలా సున్నిత హృదయుడు తన ఇంటపెరిగే కుక్క చనిపోయినందుకే చాలా బాధపడి దానికి రాచమర్యాదలతో ఊరేగింపు చేసి అంత్యక్రియలను నిర్వర్తింపజేసాడు.


ప్రవీర్ కు పాగల్ పత్రం ఇప్పించిన గిబ్బన్
ఒకసారి గిబ్బన్ సెలవుల్లో వెళ్లవలసి వచ్చింది. అందుకే తన భాద్యతయిన పిల్లల పెంపకాన్ని తాత్కాలికంగా జోషి అనే మరో అధికారికి అప్పగించి వెళ్ళాడు. ఆయన గిబ్బన్ లా కాక దయామయుడు తమ స్వంత ఇంటికి తీసుకు వెళ్లి పిల్లలకు మంచి ఆహారాన్ని, ఆత్మీయతనూ రుచిచూపించాడు. కానీ ఈ విషయాన్ని రాగానే పసిగట్టిన గిబ్బన్ జోషిపై మండిపడ్డాడు. దాంతో తట్టుకోలేక ప్రవీర్ గిబ్బన్ చెంప చెళ్ళుమనిపించాడు. ఈ విషయంలో కోపించిన గిబ్బన్ కమల కుమారి లాగానే ప్రవీర్ కు కూడా పిచ్చి లేచిందని మానసిక వైద్యులచేత పాగల్ సర్టిఫికేట్ ఇప్పించి బలవంతంగా వైద్యం పేరుతో శిక్షలకు కూడా గురిచేసారు.
1947 జూలై నెలలో ప్రవీర్ కు 18 సంవత్సరాలు నిండి మైనారిటీ పూర్తవడం తో నిజమైన అధికారాలను అతనికి అప్పగించక తప్పలేదు. కానీ అది జరిగిన ఒక్కనెలలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కాంగ్రెసు అధికారంలోకి రాగానే 1948లో బస్తర్ సంస్థానాన్ని ఇతర సంస్థానాల మాదిరిగానే ఇండియన్ యూనియన్ లో విలీనం చేసేసుకున్నారు. ప్రవీర్ చంద్రకు కేవలం రాజా అన్న బిరుదుతో పాటు రాజాభరణాన్ని మాత్రం ప్రకటించారు. అక్కడితో ఆగకుండా 1953లో ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేసుకున్నారు.  సంస్తానపు ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం అన్యాయమంటూ రాయపూర్ యూనివర్శిటీ నుంచీ ఎం.ఏ పూర్తి చేసిన ఆ తర్వాత ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదివిన ప్రవీర్ చంద్ర పోరాటం చేయాల్సివచ్చింది. ఇలా తనకోసమే కాక 1955లొ ఆదివాసీ కిసాన్ మజ్దార్ సేవాసంఘ్ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల ఆర్ధిక సామాజిక దోపిడీపై కూడా పోరాడే పంధాను ప్రవీర్ ఎంచుకున్నారు. 1957లో బస్తర్ నుంచి పోటీచేసి ఎంయల్యేగా కూడా ఎన్నికయ్యారు. కానీ రెండేళ్ళతర్వాత పదవి నచ్చక రాజీనామా చేసారు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఆయనపై కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంది. 1961లో ఆర్ధిక నేరాల ఆరోపణపై అరెస్టు చేసింది. రాజా అన్న బిరుదును తొలగించింది. విభజించి పాలించు అన్న సూత్రాన్ని వంటబట్టించుకున్నట్లు అతని తమ్ముడు విజయ చంద్ర భంజ్ దేవ్ ను దగ్గరకు తీసుకుని ఆయనకు రాజా అన్న బిరుదునిచ్చి అన్నదమ్ముల మధ్య వైషమ్య బీజాలను నాటింది. విజయ మహల్ అన్న పేరుతో విజయచంద్ర భంజ్ దేవ్ కు ఒక భవంతి కట్టివ్వడంతో ఆయన అక్కడకు మారి అన్నకు మరింత దూరం అయ్యాడు. తరతరాలుగా వస్తున్న రాజమహల్ లో ప్రవీర్ చంద్ర ఒక్కడే మిగిలారు. కానీ ఆయనకు నిరంతరం ప్రజలు అండగా వుంటూనే వచ్చారు. ఆయన తన శక్తియుక్తుల్నీ వారికోసమే ఖర్చుచేయడం ఒక విధిగా భావిస్తూ వచ్చారు. ఆసంవత్సరమే 1961లో రాజస్థాన్ రాజపుత్రికతో వివాహం జరిగినప్పటికీ ఈయన పేదల పద్దతులు నచ్చక ఆమె సంవత్సరంకూడా కాపురం చేయకుండానే పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ గిరిజనం మాత్రం ఈయనను దేవుడిగా కొలవటం ప్రారంభించారు.
పేదల దేవుడు ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ
లోహండి వాడా గిరిజన సంత కేసు
 ఆరోజు 1961 మార్చినెల 31వ తారీఖు: బస్తర్ జిల్లాలోని చిత్రకూట్ కు దగ్గరలో వున్న లోహండీ గూడ అనే గ్రామంలో ప్రతివారం గిరిజనుల సంత జరుగతుంది. సరుకుల కొనుగోళ్ళు అమ్మకం కోసం అనేక గ్రామాలనుంచి ఆదివాసీలు అక్కడికి వస్తారు. ఆ సంతరోజు ప్రవీర్ చంద్రపై ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేఖంగా జమకావాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ప్రభుత్వం అకారణంగా 144 హెచ్చరికలు జారీచేసి సుమారు పదివేలకు పైగా వున్న గిరిజనులను చెల్లాచెదురూపోవలినదిగా హుంకరించారు. ఆ సమయంలో ఒక సామాన్యుడైన గిరిజనుడు లేచి గొప్ప వాదన చేస్తాడు. ఇదిగో ఇలా చూడండి ఇది నా అరచేయి దీనిలో ఒక వేలిని తీసేసి మరో వేలు ఇక్కడ అతుకుతానంటే కుదురుతుందా? 1948 లోనే సంస్థానాలూ రాజరికాలూ లేవని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రాజా బిరుదును ఒకరినుంచి తీసి మరోకరికి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? అంటూ వేసిన ప్రశ్నలకు సమాధానాలు లేక లాఠీచార్జి ప్రారంభిస్తారు. గిరిజనుల చేతుల్లో స్వతహాగా వున్న విల్లంబులూ, గొడ్డళ్లను ప్రయోగించలేదు. అయినా తోపులాట కాల్పుల వరకూ వెళ్లింది. పదిమంది వరకూ చనిపోయారు. 59 మంది అరెస్టు అయ్యారు. అయినా ప్రభుత్వం వారిపై ఎటువంటి కేసునూ నిరూపించలేక వారందరినీ చివరకు భేషరతుగా విడిచిపెట్టాల్సివచ్చింది. అయినా సరే గిరిజనులపైన వీళ్ల వెనక ఉక్కుస్థంభంలా నిలబడ్డ ప్రవీర్ చంద్రపైన ప్రభుత్వానికి కోపం చావలేదు. మరో సందర్భం కోసం ఎదురు చూస్తూ వున్నారు. అది దసరా రూపంలో వచ్చింది ఆది వాసీలకు దసరా చాలా పెద్ద పండుగ రాజా వారి సంప్రదాయం ప్రకారం ఏనుగు అంబారీపై ఊరేగింపుగా గుడికి వెళ్ళటం ఆచారం కానీ ప్రభుత్వం ఈసారి ఏనుగు అంబారీపై విజయచంద్ర కూర్చోవాలని కోరుతూ నిధులు కూడా మంజూరీ చేసింది. కానీ ఈ ఆలోచనను వ్యతిరేఖించిన గిరిజనం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఊరేగింపును బహిష్కరించి తమ స్వంతఖర్చులతో లక్షలాదిమంది ఆనందోత్సాహాలతో ప్రవీర్ చంద్రకు గజారోహణం చేస్తారు. అంతే కాదు ఆనాటి నుంచి ఆయనను ‘‘ జనతాకి రాజా’’ గా పిలవటం ప్రారంభించారు. అంతేకాదు ప్రవీర్ పుట్టిన రోజు కానుకలాగా ప్రభుత్వంపై తను వేసిన కేసు కూడా గెలిచాడు. తన ఆస్తులన్నీ ప్రభుత్వం నుంచి ఆయనకే 1963 జూలై నెలలో సంక్రమించాయి. ప్రజలకు కావలసిన అవసరాలను ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా తనే ఏర్పాటు చేస్తూ నువ్వేమన్నా దేవుడివా అని అడిగే వారికి ‘‘Yes I am the God of Adivasis’’ అని స్వయంగా చెప్పుకునేవారు. కానీ ఇలా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రజల మనిషిగా ప్రవీర్ ఎదగటం కాంగ్రెస్ కు అస్సలు నచ్చలేదు. ఆయనను రాజకీయప్రత్యర్ధిగానే చూసేవారు. ఉదాహరణకు 1965లో బస్తర్ గిరిజన సమస్యలపై ఢిల్లీకి వెళ్ళి అప్పటి హోం మినిస్టర్ గుల్జారీలాల్ నందాను కలిసేందుకు ఒక మాజీ ఎంయల్ ఏ ప్రజలనాయకుడూ, సంస్థానపు అధికార ప్రతినిధి అపాయింట్ మెంట్ అడిగితే ససేమిరా కుదరదన్నారు. దాంతో అక్కడ నిరాహారదీక్షకు కూడా ప్రవీర్ కూర్చోవలసి వచ్చింది. అప్పటికి గానీ దిగొచ్చిన ప్రభుత్వం ఈయనతో చర్చలకు సిద్ధపడలేదు. ఆ సంఘటన తర్వాత ప్రవీర్ ఆదివాసీ సమస్యలపై మరింత దృష్టి సారించారు. ఆఖరుకు తను వుంటున్న రాజమహల్ నుసైతం ప్రజావేదికగా మార్చారు. 1965 నవంబరులో రాజమహలు ముందున్న విశాలమైన మైదానంలో ఆదివాసీ స్త్రీల ఊరేగింపు బహిరంగ సభ జరిగింది. దీంతో మహిళలు సైతం ఒక సంఘటిత శక్తిగా రూపొందారు. దాని ఫలితంగా తమ డిమాండ్ల కోసం కొద్దిరోజుల తర్వాత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సైతం ముట్టడించగలిగారు. రాంత్రింబవళ్ళు ధర్నాను నిర్వహించారు. కానీ చిర్రెత్తుకొచ్చిన ప్రభుత్వం అర్ధరాత్రి పూట మగపోలీసులు వారి ధర్నాస్థలాన్ని ముట్టడించి ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దౌర్జన్యానికి నిరసనగా 1965 డిసెంబర్ 12 న విజయ భవన్ ముంగిట స్వయంగా ప్రవీర్ చంద్ర నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఆదీవాసీ సమస్యలతో మమేకమైన రాజా ఒక పూర్తిస్థాయి ఉద్యమకారుడిగా మారిపోయాడు. బహుశా భారతదేశంలో ఏ సంస్థానపు రాజు కూడా ఇట్లా ప్రజలతో వారి సమస్యలతో మమేకం కావడం, వారికోసం ఇలా దిగివచ్చి దీక్షలకు సైతం కూర్చోవడం చరిత్రలో ఈయనొక్కడే కావచ్చు. అందుకే ఆయనను ‘పేదల రాజు’ అనడం ఏమాత్రం తప్పులేదు. జల్ జంగల్ జమీన్ పై ఆదివాసీలకు హక్కును కలిగించేందుకు ఈయన చేసిన పోరాటం సైతం వృధాపోలేదు.
విజయ్ భవన్ ముంది నిరాహారదీక్ష ముగించిన రెండు నెలల్లోనే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. రైతుల దగ్గర లెవీ పన్నుల వసూళ్ల విషయంలో ప్రభుత్వాధికారులు చాలా దురుసుగా వ్యవహరించేవారు. ఒక పేదరైతు బాకీపడిన లెవీ కోసం అధికారులు దర్పంతో బలవంతంగా చొరబడి ఆ కుటుంబం దాచుకున్న పదిబస్తాల బియ్యం మొత్తాన్నీ జప్తు రూపంలో ఒకరోజు తరలించుకుపోవడంతో మనస్తాపం చెందిన ఆరైతు వెంటనే అదే ఇంటి దూలానికి ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన గిరిజనుల గుండెల్లో చితిమంటలు రగిల్చింది. అన్నాళ్ళూ భరిస్తూ వచ్చిన పన్నుల దురాగతాలపై పోరాడాలనే కోపం పెరిగింది. గిరిజనుల భూములను చవకగా కొట్టేసే దళారీలూ, కలపను అక్రమంగా తరలించే గత్తేదారులు, ప్రకృతి సంపదను చౌకగా కొట్టేసి కోట్లకు పడగలెత్తినా గిరిజన జనాలపై తమ అహంకారపూరిత మనస్తత్వాలను ప్రదర్శించే పెద్దల మీద తిరగబడాలనుకున్నారు. ఈ నేపద్యంలోనే ప్రవీర్ చంద్ర ఆద్వర్యంలో ‘‘ ఆదివాసీ సేవాదళ్ ’’ ను ప్రారంభించారు. జరుగుతున్న అక్రమాలపై సవివరంగా ప్రభుత్వానికి వినతులూ, అభ్యర్ధనలూ ఇవ్వడం ప్రారంభించారు. ప్రజా ప్రతినిధుల దృష్టికి ఈ విషయాలను తీసుకొచ్చారు. అయినా పెద్దగా పరిష్కారం దొరకక పోవడంతో 1966 ఫిబ్రవరి 8 న మళ్లీ విజయ భవన్ ఎదుట నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అప్పటికి దిగొచ్చిన ప్రభుత్వం లెవీ వసూళ్ళ విషయంలో తప్పకుండా కొత్త చట్టం తీసుకొస్తామని వాగ్ధానం చేయడంతో అప్పటికి దీక్ష విరమించారు. అంతే కాక బస్తర్ లో విషమిస్తున్న పరిస్థితులపై మాట్లాడేందుకు ప్రతినిధుల సభకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రాజాను భోపాల్ కు పిలిపించుకున్నారు. అంతే కాకుండా శాంతిభద్రతలకోసమంటూ ఆయనను కొన్నాళ్ళు బస్తర్ కు దూరంగా వుండమని అడిగారు.తన తండ్రి ప్రఫుల్ల కుమార్ భంజ్ దేవ్ ను కూడా ప్రభుత్వం ఇలాగే ఒరిస్సాకు పంపిన విషయం రాజా కు గుర్తుంది.తెల్లప్రభుత్వానికీ, నల్ల ప్రభుత్వానికీ పరిపాలనలో పెద్దగా తేడాలేదని ఈ విషయంతో ఆయనకు మరింత స్పష్ట అయ్యింది. తనను ప్రేమించి కొలిచే తన ఆదివాసీలకు దూరంగా వెళ్లే ప్రసక్తే లేదు. మీరు ఏం చేసకోగలిగితే అదే చేసుకోండి అంటూ ముఖం బద్దలు కొట్టే సమాధానం చెప్పి ఆయన తిరిగొచ్చారు. కానీ ప్రజలు మరింత గొప్పగా ఈ విషయంలో ఆయనను హృదయాలకు హత్తుకున్నాసరే ప్రభుత్వం తమ కోపానికీ పగకూ మరింత పదును పెట్టుకుంటూ వేటువేసే అదను కోసం చూస్తుంటుందన్న విషయాన్ని గమనించలేదు రాజా ప్రవీర్. అదే ఆయన కు జీవితానికి అదిపెద్ద గండం అయిపోయింది.

ఆఖరిరోజులు రానే వచ్చాయి. బస్తర్ చరిత్రలో ఒక చీకటి రోజుగా 1966 మార్చి 25 మిగిలిపోయే క్షణం వచ్చేసింది.
ఆదివాసీ దేవత ఊరేగింపులో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆఖరుకు పూర్ణకుంభం, ధ్వజం సైతం క్రింద పడ్డాయి. తమ ఒంటిపై లాఠీలు విరిగినా సహించడం రాజావారి వల్ల నేర్చుకున్న గిరిజనులు దేవుడి విషయంలో తప్పుజరిగితే జీర్ణించుకోలేకపోయారు. అసలు అది తమ మనుగడకే అపశకునమని పెద్ద ఉపద్రవం జరుగుతుందనీ భయపడ్డారు. అవును అసలు వారి దేవుడే దూరమయ్యేంత ఉపద్రవమే సంభవించబోతోందని వారికి అప్పటికి తెలియదు. ఆ కోపంతో వారు తట్టుకోలేక పోలీసులమీద తిరగబడ్డారు. ఇంకేముంది ఇదే అదను తోపులాటనుంచి లాఠీఛార్జి అక్కడినుంచి కాల్పులు వరుస క్రమం మొదలయ్యింది. ఈ ఆందోళనకు భయపడ్డ మహిళలు పిల్లలు వగైరా రాజమహలులోకి పరిగెత్తుకుంటూ వచ్చి దాక్కున్నారు. ఇలా ప్రతి విషయానికీ రాజమహల్ రక్షణగా మారటం వారికి సుతరామూ ఇష్టం లేదాయే.  ఆరోజు కు ఆగి ఆమర్నాడు మళ్లీ పోలీసు పటాలాలు పై అనుమతులతో దిగాయి. అక్కడ రక్షణ పొందుతున్న ప్రజలందరినీ తక్షణమే తమకు అప్పగించమని ప్రవీర్ ను అడిగారు. 1199 నంబరుతో వచ్చిన నల్లరంగు మృత్యుశకటం లాంటి పోలీసు వ్యానులో వచ్చిన ఆయుధధారులు. అసలు రాజా ప్రవీర్ చంద్ర వచ్చి తమకు లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేసారు. ఇలాంటి ధర్నాలు జరగటం వాటికి సమాధానం చెప్పటం కోర్టు మెట్లు ఎక్కడం చాలా సాధారణమే అన్నట్లు రాజా ప్రవీర్ ఎటువంటి అనుచర గణం లేకుండా చాలా మామూలుగా వీరితో మాట్లాడేందుకు వచ్చారు. మాటామాటా పెరిగింది వాగ్వాదం అయ్యింది. వీళ్లతో లాభంలేదని రాజా వెనక్కి తిరిగి మహల్లోకి వెళ్ళబోతుంటే ఆయనపై కాల్పులు ప్రారంభించారు మొదట కాళ్లపై మొదలేసారు. రాజాను రక్షించేందుకు అడ్డుగా వచ్చిన గిరిజనుడిని కాల్చేశారు. కుంటుతున్న రాజావారిని చేతులపై ఎత్తుకుని పడకగదివరకూ మోసుకెళ్లారు మరికొందరు గిరిజనులు కానీ పోలీసుదళం పడక గది వరకూ దూసుకు వెళ్ళారు. అక్కడా కాల్పులు జరిపారు. రాజా వారితో పాటు ఆయన చుట్టూ వున్న జనాలు సైతం గుళ్ళకు బలయ్యారు. దీనిపై కోపించి ఎదరించిన మరెందరో కూడ ా ఆనాటి తుపాకుల గర్జింపుకు బలైపోయారు. అలా ఒక ప్రజల దేవుడు ప్రజలకోసం జరిపిన పోరాటంలో ప్రజల హక్కుల కోసం కాల్చబడిన బుల్లెట్టుకే తన ప్రాణాల్ని అర్పించాడు. అంతేనేమో కాకతీయ వంశంలోని రాజులందరూ యుద్దాలలోనే మరణించారు. బహుశా ఈయన మరణం మరింత ఉదాత్తమైనది గాడ్చేచేతుల్లో మరణించిన గాడ్చే తూటాలకన్నా, ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ గుండెముందు పేలకుండా పిరికి చెమట్లు పోసుకున్న బుల్లెట్లకన్నా, ఇందిరా గాంధీని తాకిన బుల్లెట్లకన్నా ఈయన గుండెల్లో దిగిన బుల్లెట్టుకు ప్రజల పక్షపు శాతం ఎక్కువ. ఎంత ఉదాత్తంగా బ్రతికామో కాదు సోదరా ఎంత ఉదాత్తంగా పోయామో కూడా చూడాలంటే ఈయన మరణం నిజంగానే ఒక పాఠం. వీరమరణం అనేందుకు ఆధునిక కాలంలో గొప్ప ఉదాహరణ కూడా. 26 వ తేదీకి కానీ ఆయన మరణ వార్తను బయటి ప్రపంచానికి చెప్పేసాహసం చేయలేకపోయింది ప్రభుత్వం, ఆ ప్రకటనకు మర్నాడు  అంటే 27వ తారీఖున జగదల్ పూర్ పట్టణమంతా ఎవ్వరూ చెప్పకుండానే బందు పాటించింది. తమ గుండెల్లో మరింత పటిష్టంగా ఆయనకు గుడి కడుతూ మౌనంగా రోదించింది. ఇప్పటికీ  ప్రవీర్ చంద్ర పేరును తలచుకుంటే వచ్చే ఊహే గూడేల గుండెల్లోంచి ఉవ్వెత్తున ఉద్యమాలుగా ఎగసిపడుతుంటాయి. ఎవరన్నారు మనిషి దేహంతోపాటే చనిపోతాడని కొందరు దేహం చాలించాక మరింత స్థూలకాయులై, సూక్ష్మప్రపంచంలో విహరిస్తూ బ్రతికేస్తుంటారు. అటువంటి స్పూర్తిజీవుల్లో ఒకడిగా ఈయన సైతం నిలచిపోయారు. 

దేవుడిగా ఇప్పటికీ ప్రజలతో పూజలందుకుంటున్న ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ పటం

  • మహారాజా విజయ్ చంద్ర భంజ్ దేవ్ , ఈయన బస్తర్ ప్రబువుగా 1966 నుంచి 1970 వరకూ పరిపాలన సాగించారు. 1934 మార్చి 4వ తేదీన జన్మించిన విజయ్ చంద్ర సేల్యాకి చెందిన ఠాకూర్ సాహెబ్ సురేంద్ర సిన్హ్ జీ కరణ్ సింగ్ గారి కుమార్తె మహారాణి హితేంద్ర కుమారిని వివాహం చేసుకున్నారు. 1970 ఏప్రిల్ 12 వ తేదీన రాజావారు తనువుచాలించారు. 
  • మహారాజా భరత్ చంద్ర భంజ్ దేవ్ 
  • మమారాజకుమార్ శ్రీ దేవేష్ చంద్ర భంజ్ దేవ్ వీరికి వివాహం అయినది పిల్లలున్నారు వారు 
    • కుమార్ మోహిత్ చంద్ర భంజ్ దేవ్ 
    • కుమారి జుహికా దేవి భంజ్ దేవ్ 
  • మహా రాజ్ కుమార్ శ్రీ హరిహర్ చంద్ర భంజ్ దేవ్ రాజ్ కోట లోని రాజ్ కుమార్ కళాశాలలో 1974లో డిగ్రీ పట్టాను పొందారు. ఈయన జగదల్ పూర్ లో లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. వివాహం జరిగింది పిల్లలున్నారు. 
    • కుమార్ సూర్యవీర్ చంద్ర భంజ్ దేవ్ 
  • రాణి సాహెబ్ పుష్పాదేవి గారు తాల్చార్ కి 25వ ప్రభువైన రాజా రాజేంద్ర చంద్రదేవ్ వీరవర హరిచందన్ మహాపాత్ర తో వివాహం జరిగింది ఇద్దరు కొడుకులు కలిగారు.

  •  మహరాజా సాహెబ్ భరత్ చంద్ర భంజ్ దేవ్ ,ఈయన బస్తర్ ప్రబువుగా 1970 నుంచి 1996 వరకూ పనిచేసారు. 1954 లో జన్మించిన భరత్ చంద్ర కూడా రాజ్ కోట లోని రాజ్ కుమార్ కళాశాలలోనే విద్యనభ్యసించారు(1972) థారాడ్ మహారాణిని వివాహం చేసుకున్నారు. 1996లో భరత్ చంద్ర తనువు చాలించారు. . 
  • మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్
  •  రాజకుమారి గాయత్రీదేవి భంజ్ దేవ్ 

సందర్శనకు వచ్చిన స్థానిక ప్రజలను దీవిస్తున్న రాణి హితేంద్ర కుమారి ఆవిడ కుమారుడు భరత్ వెనక పటంలో ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్ 

మహారాజా సాహెబ్ కమల్ చంద్ర భంజ్ దేవ్ 
ప్రస్తుత బస్తర్ పాలకుడు కమల్ చంద్ర భంజ్ దేవ్
బస్తర్ రాజవంశంలో ఈయన 22వ పరిపాలకుడు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నది ఈయనే. 1984  మార్చి 13 వ తారీఖున జన్మించిన కమల్ చంద్ర కూడా వారి పూర్వికుల మాదిరిగానే రాజ్ కుమార్ కళాశాలలో విద్యనభ్యసించారు(2003). అంతర్జాతీయ వాణిజ్యంలో మాస్టర్ సైన్సు డిగ్రీని సాధించారు. మాస్టర్ ఆఫ్ పొలిటికల్ సైన్సు డిగ్రీని బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ కామర్సు నుండి పొందారు.  
కమల్‌చంద్రభంజ్‌దేవ్ ప్రస్తుతం మహారాజు హోదా లో ఉన్నారు. లండన్‌లో విద్యాభ్యాసం చేసిన కమల్‌భంజ్ ప్యాలెస్‌లోనే ఉంటూ.. ఈమధ్య రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం జగదేవ్‌పూర్‌లోని రాజప్రసాదం చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది.



కమల్ చంద్ర భంజ్ దేవ్ చాలా చిన్న వయస్సులోనే పదవీ భాద్యతల్లోకి రావలసి వచ్చింది.

పట్టాభిషిక్తుడిగా కమల్ చంద్ర


విజయోత్సాహాపు ర్యాలీలో కమల్ చంద్ర

ఎలాగో వెలగాల్సిన ప్యాలెస్ ఇంకెలాగో మిగిలిందిప్పుడు

Bastar Palace during the Danteshwari Festival. The palace is 70 years old and also houses a medical college alongside the royal family.






ఒకప్పడు రాజమహల్ ప్రజలకోసం నేనున్నానంటూ నిలబడిన రోజుల్లో ఇది బహిరంగ వేదికగా నిలచింది.
బస్తర్ ప్యాలెస్ ఒక వెలుగు వెలిగినప్పటి సుందరమైన పాత ఫోటో ఇది
దేవాలయ నిర్మాణంపై కాకతీయుల ఆశక్తి, దేవతార్చనపై వారి భక్తి సన్నగిల్లలేదు.

ఛత్తిస్ ఘడ్ లోని ధనేవాడ జిల్లకు చెందిన బార్ సూర్ లోని జంట గణేష విగ్రహాలు
బార్ సూర్ లోని జంట గణేష విగ్రహాలకు పౌరాణిక కథనాలున్నాయి. భాణాసురుడనే రాక్షసుని పేరు మీదుగా ఈ ప్రాంతానికి బార్ సూర్ అనే పేరు వచ్చిందట, అతడు రాక్షసుడే అయినప్పటికీ గొప్పశివ భక్తుడట, అతని కుమార్తె ఉష, ఆయన మంత్రిగారి కుమార్తె చిత్రలేఖ మంచి మిత్రులట, వారిద్దరూ వినాయకుడికి ప్రియమైన భక్తురాళ్ళట వారి కోరికమీదనే ఇద్దరి మిత్రురాళ్ళకు ఈ జంట విగ్రహాలను ఏర్పాటు చేయించి ఇచ్చాడటని కథనంగా చెప్పనుకుంటారు.

పురాతన చరిత్ర కలిగిన భోరాందేవ్ దేవాలయం, కవర్ధా, చత్తీస్ ఘర్


బోరాందేవ్ ఆలయం పైన అత్యద్భుతమైన పనితనాన్ని చూపే శిల్పకళా చాతుర్యము

ఖజురహోని తలపించే బోరాందేవ్ ఆలయ శిల్ప సంపద

బోరాందేవ్ ఆలయం ప్రత్యేక నిర్మాణ శైలి







మరికొంచెం శ్రమపడగలితే మరికొంచెం మనసు పెట్టగలిగితే మరిన్ని విషయాలను తెలుసుకోగలుగుతాం
కాకతీయ సామ్రాజ్యం అంటే కేవలం తెలుగునేలపై వున్నదే కాదు. మరింత విస్తారంగా వుంది ఆ వివరాలను వదిలేయకుండా పరిశీలించాలి. బస్తర్ రాజ మహల్ లో మరికొన్ని విలువైన విషయాలను మ్యూజియం లో భద్రపరిచారు. వాటిలోని విషయాలను సేకరించాలి. అగష్టు, సెప్టెంబరు నెలలలో భంజ్ కాకతీయ వారసులు వరంగల్లుకు రావడం వంశాచారం లాంటి ఆనవాయితీగా చేస్తున్నారు. ప్రభుత్వం తరపున వారిని సగౌరవంగా ఆహ్వానించాలి. మీడియా వారినుంచి సమగ్ర కథనాలను సేకరించాలి. ఈ విషయమై హిందిలోనూ బ్రిటీష్ కాలంలో ఇంగ్లీషులోనూ వెలువడిన సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి అందుబాటులోవుంచాలి. 


రిఫరెన్స్
1) ఛత్తీస్ ఘడ్ స్కూటరు యాత్ర -పరవస్తు లోకేశ్వర్
2) నమస్తే తెలంగాణ దినపత్రికలోని విశ్లేషణాత్మక వ్యాసం
3) భంజ్ కాకతీయుల అధికారిక వెబ్ సైటు
4) ఇంకా మరెన్నో ఆన్ లైన్ ఆఫ్ లైన్ ఆధారాలకు ధన్యవాదాలతో..





కామెంట్‌లు

  1. Dear Srinivas ji, you have marvelously brought into light one of the most heroic stalwarts of the Kakatiya Dynasty... Really laudable attempt... Kudos

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేణూ సర్ ధన్యవాదాలండీ మరింత సమాచారం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామండీ

      తొలగించండి
  2. అద్భుతమైన సమాచారం శ్రీనివాస్ గారూ...

    రిప్లయితొలగించండి
  3. అద్భుతమైన చరిత్ర పునరావృతం...
    ఊహకు అందని ఆధారాలు...మరుగునపడిన అనేక ఆధారాలు... అందించిన... సేకరించిన కర్తలకు... ఎంతైనా కృతజ్ఞతలు... ఎంత చెప్పినా తక్కువే...
    చరిత్ర జిజ్ఞాసులకు కావలసినంత విందు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి