జియో జీవించు కానీ కబళించకు

Live and Let Live (or) Survival of the Fittest ?

నీళ్ళలో హాయిగా ఈదుకుంటూ ఆడుకుంటున్న చేపలమధ్యలోకి దారలతో కట్టిన ఆహారం ఉచితంగా దిగివచ్చింది. ఫ్రీయే కదా తినేద్దామని కొన్ని చేపలు, ఆగాగు ఎరవెనక ప్రాణాలను సైతం పట్టేసే కొక్కెం వుంటుంది చూడమని మరికొన్ని చేపలు వాదనల్లో బిజీగా వుంటే, విష్ణుశర్మకధలో వేటగాడు చల్లిన గింజలన్నీ కడుపునిండా తిన్న తర్వాత పావురాలన్నీ వలని ఆసాంతం ఎత్తుకు పోయి ఎలుక మిత్రుడి పళ్లసాయంతో కట్లు విడిపించుకున్నట్లు, గాలపు కొక్కేనికి అందకుండా ఎరని నంజుకు తినడం యాలాగో అప్పుడే ప్రణాళికను సిద్దం చేసాయి మరికొన్ని. ఇవేమీ తెలియకుండా గుడ్డిగా గుర్రపుదౌడుతీసుకుంటూ ఉరికేవే దవడలదాకా ఇరుక్కుపోయి గిలగిలలాడినా బయటికి రాలేక ఒడ్డుకు విసిరేయబడతాయి. సర్లేండి ఏదో ఆదివారం నాన్ వెజ్ కర్రీ మాటలదేముంది కానీ మీరూ జియో సిమ్ము క్లబ్బులో చేరారా అయితే కొన్ని ముఖ్యమైన సంగతులు మీతోనే చెప్దామని ఇదంతా మొదలేసాను. 

మూడ్నాలుగు నెలలు మాంచ్ఛీ ఇస్పీడుతో రెండూజీ, మూడూజీ కాకుండా నాల్గూజీతో డేటా కనెక్షను, మాటలు, ఎస్సెమ్మెస్ లు మీకు ఫ్రీ అవి అందించే సిమ్ము కూడా మొత్తం ఫ్రీ ఆ తర్వాత అసలు మీకు టెన్షన్ ఫ్రీ, అంటూ కవర్ పేజీ కథనాలు, పైగా ఏరా ఇంకా నీ సిమ్ము యాక్టివేట్ కాలేదా? అంటూ మిత్రులో, బంధువులో చేసే జాలిగా జాలీ కాల్సులు. హయ్యో హతవిధీ ఈ లైనెందుకు ఇంత బారుండవలే ఉండెను ఫో, నేనెందుకు లేటుగా రావలె.. వచ్చితిని ఫో ఆడవారి లైను కోసం మా హోమ్మిస్టరును తేక నేనే హెంద్హుకు ర్రావలె... అనుకుంటూ మనమూ ఓ సిమ్ముకు అప్లై చేయడం ప్రీ అయినా వెంటనే ఇచ్చేస్తే అంత మజారాదేమో కదా యాక్టివేషన్ కోసం రోజు ఎస్సెమ్మెస్ బాక్సు చూసుకుంటూ మైజియో అప్లికేషన్ ను ఇన్సల్ట్ చేసుకుని నాలుగైదు (ఇప్పుడు వారం లేద పదిరోజులట) గడిపాక ఒకనొక ముహుర్తాన మీరు నోబుల్ ప్రైయిజ్ సాధించారహో అన్నట్లు మీ సిమ్ము యాక్టివేట్ అయినట్లు మెసేజ్. అక్కడితో మీరు ఫోర్జీ అయిపోరండోయ్ ఆతర్వాత ఎపియన్ సెట్ చేసుకోవడం, 1977 కు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి దీనంగా వాళ్ళడిగిన మన ఐడీ ప్రూఫును సమర్పించుకోవడం చేస్తే మన టెలీ సిగ్నల్ మీద 4G బొమ్మ పడటం మొదలవుతుంది. సరే ఇలా జియో బుట్టలో మీరు పడటమో లేదా మీ లిస్టులో జియో పడటమో జరుగుతున్న నేపద్యంలో ఈ మాస్ మానియా విషయంలో జాగ్రత్త పడాల్సిన అంశాలేమి వున్నాయో ఒకసారి కొంచెం మిత్రలతో ముచ్చటిస్తే బావుంటుందని పించింది. 

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అందరికీ అంతర్జాలం అందుబాటులోకి రావడం ప్రగతికి సూచన, డేటా పై వసూళ్ళు చేస్తున్న మొత్తం కూడా వేరే దేశాలతో పోల్చుకుంటూ చాలా చాలా తక్కువ, దేశవ్యాప్తంగా రోమింగ్ లేకుండా వుండటం, పండగలకు పంపుకునే మెసేజ్ లపై ప్రత్యేక బ్లాక్ డేస్ లేకపోవడం ఈ అంశాలను మంచివే అని ఒప్పుకుంటూనే ఇటువంటి కిల్లర్ పంచ్ పోటీ మిగిలిన కంపేనీల బిజినెస్ పద్దతులని పునరాలోచించుకునేలా చేస్తాయి పొరపాటున బ్రతికే వుంటే. మరికొన్ని విషయాలు వీటి సరసనే జాగ్రత్తగా పట్టించుకోవలసినవి కొన్ని వున్నాయి.


1) అక్కరకు రాని చుట్టం : మొన్నీమధ్య ఈ సిమ్ము లైను మధ్యలో ఒక్కొక్కరినీ పలకరిస్తుంటే 4జి సపోర్టు చేసే మొబైల్ లేని వాళ్ళు, డేటాని వాడుకోవలసిన అవసరం తెలియని వాళ్ళు చాలా మంది కనిపించారు. ఇప్పుడు నాడా ఉచితంగా దొరికింది కదా అని గుర్రాన్ని కొనేందుకు పర్సుని లెక్కేసుకుంటున్నారు. ఆ తర్వాత డేటాను పక్కన పెట్టి మళ్ళీ కొన్న ఫోనుకు వడ్డీ రేటంత కాల్స్ మాత్రమే మాట్లాడకుంటారో, ఉచితమే కదా అని వీళ్ళ టైం వినే వాళ్ళ టైం ను కూడ అదనంగా ఖర్చే చేస్తారో, డేటాని అడ్డంగా వాడటం అర్దమే చేసుకుంటారో అదిగో అలా జీవించు అన్నోడికే ఎరుక. 

2) 4జి గొయ్యి : ఈ జియో అచ్చంగా నూటికి నూరుశాతం 4G మీద మాత్రమే నడుస్తుంది మనం గతంలో 3జి వేసుకుంటే అది రాని దగ్గర 2జి కి సవరించుకున్నట్లు సరిపెట్టుకోదు. అయితే ఇప్పటికి 18000 నగరాలు, రెండు లక్షల పల్లెలలోముందుస్తు విస్తరణను చేసేసాం అని రిలయన్స్ చెపుతోంది. 4జి లో VoLTE (వాయస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవాల్యూయేషన్) సపోర్టు చేసే ఆధునిక ఫీచర్ కలిగివున్న ఫోన్లలో మాత్రమే ఇది పనిచేస్తుంది. పైగా మీరు ఏ ఫోన్ లో ఈ సిమ్ యాక్టివేట్ చేసారో ఆ తర్వాత నెట్ వర్క్ ఆ ఫోన్ కి బౌండ్ అయి మాత్రమే పనిచేస్తుంది. మీ ఫోన్ మోడల్ ను ఆన్ లైన్ లో చెక్ చేసుకుంటే అది జియే డేటాకు మాత్రమే పనిచేస్తుందా? వోల్టే కాల్స్ కు కూడా పనిచేస్తుందా? లేదా నెట్ కాల్స్ మాత్రమే చేసుకునే అవకాశం వుందా అని ముందుగానే గమనించుకోవచ్చు. జియోఫై అనే పోర్టబుల్ వైఫై హాట్ స్పాట్ ఒకటి 2000 రూపాయిలలో మార్కెట్లో అందుబాటులో వుంది. దానికి అనుసంధానం చేసుకుని డేటాను వాడుకునే అవకాశం వుంది.


3) మొత్తం ఫ్రీ 2017 వచ్చేదాకానే : ఈ ఫ్రీ ఆఫర్ లు భారీగా వున్న భారతీయ కస్టమర్లు మొత్తం జియో ముగ్గులోకి వచ్చేందుకు మూడు లేదా నాలుగు నెలల ఫ్రీ ఆఫర్ లు పూర్తి చేసుకోవడానికి ఈ 2016 డిసెంబరుతో పూర్తయితే అప్పటిదాకా అదే నంబరుతో కాల్స్, మెసేజులూ పంపుకున్నాక, మిత్రులకు మీ నంబరంటే అదే నని మిత్రుల నంబర్లంటే కేవలం జియో మాత్రమే ననీ ఫిక్సయినాక, ఫుల్లు స్పీడుతో పగలో, మిడ్ నైట్ లోనో డేటాను బాగా బ్హాగా వాడటం అలవాటయినాక బిల్లు కత్తెర మీ జేబుదాక రావడం మొదలవుతుంది. బహుశా మొదట్లో కొంచెం కొంచెం గానే కావచ్చు. ఆ తర్వాత ఎటుపోతార్లెండి. పెరట్లో కట్టేసిన పాడియావుని కావలసినప్పుడు పితుక్కోమా ఏమిటి? మన అస్తిత్వం అంటే మన ఫోన్ నంబరు, మన అస్థిత్వం అంటే మన ఆన్ లైన్ ఐడి గా మారిపోయిన రోజుల్లో తోలుబొమ్మకు దారం కట్టినట్లుగానో దూరంగా వున్న చేతులు తెరమీద ఆడిస్తున్నట్లుగానో మారకూడదంటే కొంచెం పారాహుషార్ అనే వారుండాలేమో. కేంద్రీకృత నియంత్రణ లోకి ఒక్కో వ్యవస్థ చేరుతూ రావడం జియో విషయంలోనే కాదు దేనివిషయంలోనూ జరగకూడదు.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ పద్దతిలో కూడా మీరు ప్రస్తుతం వాడుతున్న నంబరునే జియో నెట్ వర్క్ లోకి మార్చుకోవచ్చు. దానికోసం PORT <your TEN digit number> send to 1900 ఆ తర్వాత MiJio అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని, మీ ఐడి ప్రూఫులను దగ్గరలోని రిలయన్స్ డిజిటల్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

4) కస్టమర్లకు సపోర్టు ఇంత ఘోరమా: జియో కస్టమర్ సపోర్టు ఇప్పటికయితే ఏమాత్రం చాలినంత లేదు. సిమ్ కార్డు కోసం ఆధార్ కార్డు కలర్ జిరాక్సు కావలసిందే అంటే కలరే ఎందుకు? eKYC పద్దతి సమయాన్ని ఆదాచేసేందుకు ప్రవేశపెట్టారు కదా, ఆధార్ ఒక నంబరే కార్డు కాదు అన్న మాటల్ని చెప్పే టైం లేదు వినే నాధుడూ లేడు. ఏ కస్టమర్ కి ఆ కస్టమర్ సిమ్ తెచ్చుకోవడం దగ్గరనుంచి యాక్టివేట్ చేసుకోవడం వాడుకోవడం లాంటి విషయాల్లో అనేక సందేహాలు, ఆందోళను, లక్షల్లో పడిన ప్లోటింగ్ తట్టుకోలేక సపోర్టు సరిగా ఇవ్వలేకపోతున్నారేమో అని ఇప్పటికి అనుకున్నా అది రేపు మెరుగుపడుతుందా? ఇప్పుడు హాడావిడిలో పోస్టు పెయిడ్ తీసుకునే వాళ్ళమీద హిడెన్ ఛార్జీలు పడితే తప్పించుకోగలుగుతారా? అప్పుడెప్పుడో రిలయన్స్ CDMA ల విషయంలో కోర్టుకేసులు ఇంకా నోటీసులు పంపుతూనే వున్నట్లున్నాయి కదా. ఇప్పుడు హడావిడిగా డజన్ల కొద్ది అప్లికేషన్లను ప్రీ ముసుగులో ఇన్ స్టాల్ చేసేసాక రేట్లు పడటం మొదలయితే ఏది ఎందుకు బిల్లుగా వస్తోందో, ప్రీ పెయిడ్ డబ్బులు ఎందుకు తరిగిపోతున్నాయో అర్ధం కాకపోతే ఐఆర్ డియ్యే కి సైతం అందకుండా కొట్టిన యాక్సెప్టెన్సీలు కంపెనీకి షీల్డులు అయితే ఎలా విడిపించుకుంటారు? 

5) ప్రతిదీ జియో అప్లికేషనేనా? ఫోనూ కాల్సు, మెసేజులూ, డేటాతోనే ఆగలేదు, మీరు ఇప్పటికే మైజియో అప్లికేషన్ లింకులో చూసుకుంటూ వెళితే డజన్ల కొద్దీ వివిధ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. సందులో సడేమియా లాగా జియో మానియా లోకి గుంపులో గోవిందయ్యల్లాగా హ్యాకర్లు జియో పేరుతో మరేవో అప్లికేషన్లను పెట్టొచ్చుకూడా. మీ ఫోన్ లోకి ఈ అప్లికేషన్లు జొరబడే ముందు అవసరమో కాదో ఒకసారి చూడండి. ఖర్చులేకపోవడం కంటే మీ బ్యాంకు లావాదేవీల వివరాలు, మీ ఆన్ లైన్ అకౌంట్ల వివరాలూ భద్రంగా వుంచుకోవడం ముఖ్యమని మర్చిపోకండి. మొన్నీ మధ్య వాట్సప్ ఒక్క క్లిక్ తో ఫేస్ బుక్ యాక్సెప్టెన్సీ తీసుకున్న విషయం గుర్తుండే వుంటుంది. దాన్నుంచి బయటపడేందుకు మళ్ళీ నానా హంగామా పడటమూ మర్చిపోయివుండరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవ్వాల్టి పరిస్థితుల్లో మన ఫోన్ హ్యాక్ అయ్యింది అంటే పూర్తిగా మన జీవితమే హ్యాక్ అయినట్లు. నిజం ప్రెండ్స్ మీరెక్కడి ఎంత వేగంతో వెళుతున్నారు, మీరెక్కడెక్కడ ఎంతసేపు గడుపుతున్నారు, మీ నంబర్లు, ఫోటోలూ, సీక్రెట్సు , కాల్స్ అండ్ మెసేజెస్ వీటన్నింటి విలువ లెక్కకట్టేంత చిన్న మొత్తం కాదు. మరీ ఛాదస్తం కానీ టెక్నాలజీ తెల్సిన నాకేమవుతుందని కొందరు మిత్రుల అనుకోవచ్చు. కానీ మొన్నీ మధ్యనే గమనించి వుంటారు. ఫేస్ బుక్ లాంటి అతిపెద్ద సామాజిక మాధ్యమాన్ని నిర్వహిస్తున్న జుకెర్ బర్గ్ లాంటి వాడే తన లాప్ టాప్ ప్రంట్ కెమెరాకు, మైక్రోఫోన్ కు కవర్లు తొడిగేసారు. ఎంత నిపుణులైనా జాగ్రత్తగా వుండటంలోనూ, హెల్మెట్ పెట్టుకోవడం లోనూ తప్పులేదు కదా.

సర్లేండి మొత్తానికి మేక మంచిదా పులిమంచిదా అని అడిగితే ఏదైనా మంచిదే కానీ మేక మేకప్ లో పులివస్తేనే ప్రమాదం. మేకయితే మచ్చిక చేసుకుంటాం, పులని తెలిస్తే దూరంగా వుంటాం, కానీ ఈ మేకప్ లు ముసుగులూ వుంటే మాత్రం ప్రమాదం మన మధ్యలోకే వచ్చినా సరే ఆదమరచే వుంటాం. అయినా టవరెక్కే వాడుంటే వాడి తలదన్నే ధ్రోణ్ పంపేవాడు మరొకరున్న రోజుల్లో ఓటర్లు అమాయకులు కానట్లే, కస్టమర్లూ అంతవీజీగా బుట్టలో పడిపోయేవాళ్ళు కాదు. పులితో సెల్పీలు దిగటమే కాదు సర్కస్ ఫీట్లు కూడా చేయించగలరు. ఏదేమైతేనేం మరెందరో మిత్రులు మరింత వేగవంతమైన నెట్ వర్క్(వల) లోకి వచ్చేస్తున్నారు. వెల్ కమ్ టూ ఆల్. చీకటిగా వుంది కొంచెం చూసుకుంటూ నడవండి చాలు.

కామెంట్‌లు