మిత్రమా బావున్నావా...
నేను కృష్ణుడిని, నల్లనయ్య అని పిలుస్తారు కదా భారతంలోనే కాదు మీ సినిమాలలో కూడా చాలా సార్లు చూపించారు నీకు తెలుసని నాకు తెలుసులే,
నీతోనే మాట్లాడదామనిపించి ఇది రాస్తున్నాను. నేనేమిటి నీకిలా ఉత్తరం రాయడం ఏమిటి అని చూస్తున్నావా? నన్ను అర్ధంచేసుకోవలసిన రీతిలో కాకుండా కేవలం అద్భుతాలను, ఆశ్చర్యాలనూ మాత్రమే గుర్తుంచుకునే జనం మధ్య నీవెందుకో నాకు ప్రత్యేకంగా కనిపించావు. నా బాల్యమిత్రుడు కుచేలుడంత హాయిగా ఇప్పుడు నువ్వు నవ్విన ఆ చిర్నవ్వు నాకిష్టం, మరో ఇష్టసఖుడు ఉద్ధవుడంత సూటిగా వుండే నీ ప్రశ్నలిష్టం, రాధా మీరాబాయిల మాదిరిగా ప్రేమగా చూసే నీ ప్రశాంతమైన చూపు నాకిష్టం. అందుకే నీక్కొన్ని విషయాలూ విశేషాలూ చెప్దామనుకుంటున్నాను. ఇది మరెవరికో చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో వైరల్ గా షేర్ చేయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవసరమనుకునే మిత్రులతో పంచుకున్నా సంతోషమే కానీ మొత్తంగా చివరకు నీ మనసుకు రెండు ముక్కలు ఆచరణంత దగ్గరగా అర్ధమయితే అంతేచాలు.
బాల్యమెంత బరువైనదో తెలుసా?
ఏమిటి కృష్ణుడు విలాసపురుషుడా? స్త్రీలోలుడా, నా ప్రీక్వెల్ రాముడంత ఆదర్శమూర్తిని కానా? ఇంకొంచెం ముందుకెళ్ళి జిత్తులమారినని కూడా అంటారా హవ్వ హేమిటయ్యా హిది? నా జీవితకాలమంతా పళ్ళబిగువున మోసిన దారుణమైన కష్టాలను నా మందహాసపు తెరను తీసి మీరెవరూ చూడలేదు. నిజానికి మీరు చూడాల్సిన అవసరం లేదనే అనుకున్నాను. నేను పుట్టకముందే నా సోదరులంతా కంసమామ చేతిలో చంపబడ్డారు. నా అమ్మనాన్న తాతగారు కూడా చెరసాలలో మగ్గిపోయారు. అసలు పుట్టడమే ఒక ఖైదిగా పుట్టాను. పుట్టిన మరుక్షణమే అమ్మప్రేమగా గుండెలకు హత్తుకునే లోగానే ఆ ప్రేమకు దూరంగా పోవాల్సి వచ్చింది. పైగా అప్పుడు కుంభవృష్టి, ఈదురు గాలులు నదిలో గుండా నాన్న నడుస్తూ వెళుతుంటే ఆ హోరుమధ్య జోరువానలో రేపల్లెకు చేరుకున్నాను.
యుక్తవయస్సునూ యుక్తిగా బతకాల్సి వచ్చింది.
పూతన సంహారం |
పెంచిన తల్లిదండ్రులనూ, అమాయకులైన ఆ పల్లెటూరి యాదవ ప్రజలనూ సంతోషపరచేందుకు నేను చేసిన చిలిపిచేష్టలే గుర్తుంచుకుని వుంటారు. పొత్తిళ్ళలో వెచ్చగా పడుకున్నప్పటినుంచి తప్పటగులువేసే దశనుంచి మా మామను అంతంచేసే దాకా చిన్న పిల్లాడిపై జరిగిన రాక్షసుల దాడులెన్నో తెలుసా? నిజానికి బ్రతకడమంటే దినదిన గండంగా గడిచింది. పూతన అనే రాక్షసి విషపు పాలుతాగించి చంపుదామనుకుంది. బండిలా వచ్చి తొక్కుద్దామని శకటాసురుడు దూసుకొచ్చాడు. వీరుకాక తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులు ట్రై చేసారు. ఏదో ఇప్పటి మీ తెలుగుసినిమాల్లో హీరోలా షర్టునలగకుండా గెలిచానులే అనుకుంటారు కానీ దానివెనకున్న కష్టమేమీ మీకు తెలియదు. ప్రయత్నమెంతటిదో అది పిల్లాడికెలా సాధ్యం అయ్యిందో మీరు ఊహించలేరు. చంపడం నాకు సరదా కాదు నా అవసరమూ కాదు. సామాజిక సమతుల్యతకు బరువుగా మారిన కొన్ని దోరణులను అంతచేయాల్సిన అవసరమున్నప్పుడే నేనా మార్గాన్ని ఎన్నుకున్నాను.
కాళీయ మర్ధనం |
రమణక ద్వీపం నుంచి వచ్చిన కద్రువ పుత్రుడు విషం కక్కే కాళీయుడనే సర్పరాజు కాళింది మడుగును విషతుల్యం చేసాడు. అంతటి విషసర్పాన్నీ చంపకుండా పడగలపై తాండవమాడి గర్వమణచి ఊరు దగ్గరున్న మడుగును ఖాళీచేయించి వేరే ప్రాంతానికి పంపించాను. దీనికి బలంతో పాటు క్షమవుండటం ఒక్కటే కారణం కాదు పర్యావరణ సమతుల్యానికి పామలు సైతం అవసరమే అనేది నాకు తెలుసు. రాక్షసులనూ, దుష్టులనూ మాత్రమే ఎదిరించాల్సి వచ్చిందనుకున్నారా? దేవతలతో సైతం నేను పోరాడాల్సిన పరిస్థితులు వచ్చాయి. తప్పదు నిలబడాలంటే కలబడాలని నాకు తెలుసు, కొన్ని ఉదాహరణలు చూడు మిత్రమా నేను కూడా అందరిలాగానే సాందీపని మహర్షి దగ్గర చదువుకున్నాను కదా. గురుదక్షిణగా ప్రభాస తీర్థంలో తప్పిపోయిన తన పుత్రుడిని తెచ్చివ్వమని ఆయన అడిగారు. శరీరంనుంచి వేరైన జీవం వెళ్ళిన చోటు దాన్ని నరకం అనే పేరుతో అనుకోండి పోనీ అక్కడకు వెళ్ళి దాని అధిపతి యముడితో తలపడి సాధించిన ప్రాణాన్ని గురుదక్షిణగా ఇచ్చానని కొందరు కథలలో అనుకుంటారు కానీ ఆ అబ్బాయిని పాంచజన్యుడనే రాక్షసుడు కిడ్నాప్ చేసాడు అతడితో పోరాడి విడిపించి గురుదక్షిణ చెల్లించుకున్నాను. బ్రహ్మదేవుడు గర్వపడిన సందర్భంలో గోవులుగా గోపాలుడిగా ఒక సంవత్సరంపాటు నేనే కనిపించి ఆయన గర్వభంగం చేయాల్సి వచ్చింది. అంతెందుకు నేను ఉండే ప్రాంతంపై తీవ్రమైన తుఫాను హడావిడితోనూ పిడుగుపాట్లతోనూ అతలాకుతలం చేయాలని వాతావరణంపై ఆధిపత్యం వున్న ఇంద్రుడు భావిస్తే మా ఊరుపక్కనే వున్న కొండ గోవర్ధనగిరిని పెకలించి ఏడురోజుల పాటు దాన్ని మోస్తూ మా వారందరికీ రక్షణ ఇచ్చాను. వాళ్ళు నేను కష్టపడుతున్నానని ఆందోళన పడకుండా నా చిరునవ్వును సైతం ఆ సందర్భంలో చెరగనీయలేదు. అందుకే నేను చిటికెన వేలితో మోయగలిగానని ఈనాటికీ మీరు బొమ్మలుగా గీసుకుంటున్నారు కదా.
అమ్మకోసం ఆలికోసం అన్నీ పోరాటాలే కదా.
రుక్మిణీ పరిణయ సందర్భం |
కొంచెం వయసొచ్చింది. కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి. జన్మభూమిపైనున్న ప్రజలకు కూడా మేలుచేయాలి. పెద్ద రాజును గెలవాలి. కానీ నాతో పాటు సైన్యంలేదు. సైన్యాధ్యక్షలు లేరు. నేనే నాయకుడిని, నేనే సైనికుడిని, నేనే వ్యూహకర్తగా మామ కంసరాక్షసుడిమీదకు అదే మందహాసంతో మధురానగరానికి కదిలాను. కువలయాపీడం అనే మదపుటేనుగును పంపారు. చాణూరుడనే మల్లయుద్దయోధుడిని ఉసిగొల్పారు. వాళ్ళను దాటుకుంటూ వెళ్ళాను. ఎట్టకేలకు కంసవధ చేసాను. ఇదంతా పదహారేళ్లనాటికే జరిగిన కథ. ఆ తర్వాత జరాసంధుడితో పదిహేడుసార్లు భీకర యుధ్దం చేస్తూ నన్ను నమ్ముకున్న రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాను.
చాణూర వధ |
అంతలోనే కాలయవనుడనే గర్విష్టిని అంతంచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ కలగొద్దని మొత్తం నగరాన్నే మధురనుంచి ద్వారకకు మార్చాను. ఆ తర్వాత నన్ను ఇష్టపడ్డ రుక్మిణితో నా పెళ్ళి దానికోసం వాళ్ళ అన్నయ్య రుక్మితో యుద్ధం. సత్రాజిత్తు దగ్గరున్న రోజుకు ఎనిమిది బారువుల బంగారం తయారుచేసే యంత్రం శమంతక మణిని దొంగిలించానన్న అపవాదును తొలగించుకోవడానికి ఎలుగుబంటి నాయకుడు జాంబవంతునితో పోరాడి శమంతకమణితో పాటు ఆయన బిడ్డ జాంబవతిని వివాహం చేసుకున్నాను. మరోసందర్భంలో మదించిన ఆబోతుతో పోరాడి అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకున్నాను. ఇదంతా కేవలం నా సంసారాన్ని పెంచుకునేందుకే కాదు. నా రాజ్యానికి అదనపు రక్షణ అదనపు బంధుత్వం, దానివెంటనే వారికీ నా సంరక్షణ దీనితో చెడుపై పోరాడేవారి సంఖ్యను పెంచుకుంటూ రావడమనే రాజతంత్రం పనిచేస్తూనే వుంటుంది. జీవితం ఒక పోరాటమే నిజానికి నా భార్యలమధ్య కూడా ఎన్నెన్ని వైషమ్యాలు అయినా సరే వాటిని జాగ్రత్తగా సరిచేసుకుంటూ రాలేదా? సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రుడితో యుద్దం చేయాల్సివచ్చింది. చెల్లెలు సుభద్ర పెళ్ళి విషయంలో అన్న బలరాముడితో నానామాటలూ పడాల్సి వచ్చింది. మహిళలకు సమానమైన గౌరవం ఇవ్వడంలో నేనెప్పుడు వెనకంజవేయలేదు. ప్రజాకంటకుడైన నరకాసురుడిని వధించేసందర్భంలో సత్యభామను యుద్ధరంగంలోకి నాతోపాటు వచ్చిన సందర్భం మీకు కథల ద్వారా బాగానే గుర్తుంటుంది కదా. ఇలాంటి సందర్భాలు మీ దృష్టికి రానివి మరెన్నో జరిగాయి. జరాసంధుడనే వాడిని బావమరిది బలాఢ్యుడూ అయిన భీమునితో సంహరింపజేసాను. వందతప్పుల వరకూ ఓపికపట్టి ఆ తర్వాత తప్పక శిశుపాల వధ చేయాల్సి వచ్చింది. నా కుమారుడు సాంబుని వివాహ సమయంలో కౌరవులతో వైరం తప్పలేదు. మనవడైన అనిరుద్ధుని కళ్యాణ సమయంలో బాణాసురుడుతోనూ సాక్షాత్తూ శివునితోనూ యుద్దం చేయాల్సి వచ్చింది.
ఆవేశమే కాదు ఆలోచన వుండాలన్నదే సూత్రం.
అమిగ్డాలా కాధు, దలామస్ ని పనిచేయించు మిత్రమా |
కురుక్షేత్రంలో రక్తధారలు కార్చాల్సి వచ్చినా నా అత్యాధునిక ఆయుధాన్ని అనవసరంగా ప్రయోగించలేదు. అణుశక్తిలాంటి పెద్ద శక్తులను అత్యవసరాల్లోమాత్రమే వాడాలనే పద్దతులను నేను పట్టించుకున్నాను. కురుక్షేత్ర యుద్దంలో పాండవులకు వ్యూహకర్తగా, సైకాలజీ కన్సల్టెంటుగా వుంటూ వారిని గెలిపించినా సరే యుద్దానంతరం గాంధారీ శాపానికి గురికావలసివచ్చింది. పాండవులను వారికి జరిగిన అవమానాలను గుర్తుచేస్తూ ఆవేశంతో రెచ్చగొట్టవచ్చు కానీ ఏ పోరాటమైనా ద్వేషంతో మాత్రమే చేస్తే తర్వాత రాజ్య స్థాపనలో అంతగా మేలుచేయదు. అందుకే వారి అమిగ్డాల(మెదడులో ఉద్రేకాల భాగం)ను రెచ్చగొట్టి మీ సినిమాల్లో లాగా క్లైమాక్స్ ఫైటింగ్ లు హడావిడిగా చేయించలేదు. మీరిప్పటికీ మానసక అభ్యున్నతికి పర్సనాలిటీ డెవలప్ మెంటుకు ఉపయోగించుకునే గీతాభోదను యుద్దం మధ్యలోనే అర్జునుడికి చెప్పి ఆయన ధలామస్(మెదడులో ఆలోచనల భాగం) పనిచేయడం ద్వారా స్థిరంగా యుద్ధం గెలిచేలా చేసాను. ఇంతకీ నన్ను మీరు ఇప్పుడు నివసిస్తున్న కాలానికి అత్యంత పురాతన కాలంలో ఈ భూమిపై జీవించిన మనిషిగా గుర్తిస్తే ఇంటిలిజెన్స్ కోషెన్సీ తో పాటు ఎమోషనల్ కోషెన్సీని, కెరీర్, టైం అండ్ రిలేషనల్ మేనేజ్ మెంట్ లను చేసే విధానం అర్ధం చేసుకుని చూడండి. లేదూ ఏలియన్ జెనిటిక్స్ ని సాధించిన వాడిగా అంటే మీ క్రిష్ సినిమాలో లాగా అనే విషయాన్ని గమనిస్తే చెప్పిన భూమిని కాపాడుకునేందుకు చెప్పిన జాగ్రత్తలను సైతం అర్ధం చేసుకోండి.
యుద్ధం మధ్యలోనైనా ఒక్కోసారి పాఠం చెప్పక తప్పదు |
ఏలియన్ గుర్తుల గురించి మరికొన్ని మాటలు
సాల్వుడి యుద్దవిమానాలు ద్వారకపై మోహరించినపుడు |
కురుక్షేత్రం తర్వాత నా పోరాటాల గురించి మీ దృష్టికి వచ్చిందో లేదో సముద్రం మధ్యలో అనేక ద్వారాలతో విశ్వకర్మచేత నిర్మింపజేసిన ద్వారక పట్టణం మీద సాల్వుడి యుధ్దం ఆకాశంలో ఎగిరే పళ్లేలవంటి వ్యోమనౌకలతో ఒకేసారి అనేకచోట్ల దాడిచేస్తూ మాయం అవుతూ తిరిగాడు. నాక్కూడా ఆ యుధ్దంలో బాగా గాయాలయ్యాయి. అయినా నా దగ్గరున్న అత్యంత ప్రమాదకరమైన వినాశనకరమైన ఆయుధాన్ని వాడకుండానే గెలవాలని నిశ్చయించుకున్నాను. ఎలాగో అతడిని వధించాను కానీ అతడు వాడిన ఆయుధాలు సముద్రం పొంగేలా చేస్తాయని నాకు తెలుసు, అందుకే అప్పట్లోనే పదివేలకు పైగా జనాభా వున్న మొత్తం నగరాన్ని 19 కిలోమీటర్ల అవతలకు సంకోదర అనే ప్రాంతానికి మార్చాను. దంతవక్త్రుడు, విదూరథుడు వంటి దుష్టశక్తులతో నా పోరు విషయం మీరు భాగవత కథగా మీదాకా వచ్చిన సాహిత్యంలో చదువుకునే వుంటారు కదా. ఈ మధ్యనే గుజరాత్ తీరంలో నా పాత నగరపు ఉనికిని మీ శాస్త్రవేత్తల బృందం డాక్టర్ యస్ ఆర్ రావు అనే ఆయన నేతృత్వంలో కనుగొన్నారట కదా. నేను ఉన్నానో లేనో అనే సందేహం ఇంకా వుంటే భాషల ప్రాచీనతలను లెక్కేసినట్లు భారతభాగవతాల అత్యంత ప్రాచీనతలను కనీసం లెక్కేసి చూడండి, అంతే కాదు కనిపిస్తున్న ఆధారాలను కొంచెం మీకందిన ఆధునిక శాస్త్రీయ అవగాహతో కలిపి విశ్లేషించి చూడండి. చివర్లో కళ్ళముందే అన్నగారు బలరాముడు శరీరాన్ని విడిచాడు. యాదవకుల నాశనానికి ముసలం పుట్టింది. కళ్ళముందే బంధువులూ, మిత్రులూ, కుమారులూ, మనవళ్ళూ యావన్మండీ కొట్టుకుచస్తున్నారు. తప్పదు కొన్నిపరిణామాలను ఆపలేనప్పుడు తప్పనిసరి అయినప్పుడు ఆందోళన పడటం కంటే చూస్తూ ఉండటం తప్ప మరేం చేయలేం అని అర్జునికి చెపుతున్నట్లు మీ అందరికీ చెప్పిన సూత్రాన్నే నేనూ అనుసరించాల్సి వచ్చింది. వృద్దాప్యంలో ఒంటరిగా అడవిలో కందమూలాలు వెతుక్కుంటూ జీవించానని మీకు తెలుసా? ఆ వయసులో చెట్లక్రింద రక్షణకూడా లేని కటిక నేలపై పడుకోవాల్సి వచ్చింది. ఎవడో అయినా కులాసాగా కాలు మీద కాలేసుకుని ప్రశాంతంగానే వున్నాను. అలా కదులుతున్న నా కాలివేళ్ళను ఎవరో ఆటవిక వేటగాడు కుందేలు చెవులనుకుని బాణం కూడా వేసాడు. తగిలింది ప్రాణం పోతుంది తెలుసు. అయినా కంగారు పడటానికి ఏముంది. మనం చేయాల్సిన పనులను మనం పూర్తిచేసాక, మన తర్వాత జీవరాశి ఆలోచనలకూ మనుగడకూ చోటిచ్చి మన పాత్రను తెరవెనక్కు తీసుకువెళ్ళాల్సిందే. తను చేసింది తప్పని ఏడుస్తున్న వేటగాడిని ఓదార్చడం నా చివరి పని అనిపించింది. అయినా ఈ విశేషాలన్నీ తరం నుంచి తరానికి లిపి లేకపోయినా ప్రవహించే జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకున్నాను. అందుకేనేమో జ్ఞానం అవిరయిపోకుండా వందల ఏళ్ళు ఇళా మీదాకా ప్రవహిస్తూ వచ్చింది. మరింత నమ్మకంగా నా ఉనికిని దొరకబుచ్చుకోలేక పోయినా సరే నేనో నా పేరుతో రచయితో చెప్దామనుకున్న విషయాలు మీ దాకా వచ్చాయి కదా వాటిని జాగ్రత్తగా పట్టించుకోండి. ఎందుకంటే ఆచరణ కాళ్ళలా నడిపించేది అయితే జ్ఞానమే కళ్ళుగా చూపించేది అవుతుంది. జ్ఞానంలేని ఆచరణ గుడ్డి ప్రయాణమే. ఇప్పుడు చెప్పండి కృష్ణుడు భోగలాలసుడా? భాద్యతలేనివాడా? లేక ఆధునిక పద్దతిలో ఆచరణను చూపినవాడా అన్న సంగతులను.
నా నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఇంత ఓపికగా మొత్తం నా ఉత్తరాన్ని చదివిన నీ సహృదయానికి సంతోషపు దీవెనలతో.... నీ కృష్ణయ్య.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి