రవీంద్రభారతి “పైడి జయరాజ్ మినీ హాల్ లో ఈ రోజు(04-10-2016 Tue) బతుకమ్మ పండుగ నేపధ్యంలో జరుపుతున్న సాంస్కృతిక ప్రధర్శనలలో ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో సినిమాకు స్థానం ఇవ్వడమే ప్రత్యేకమైతే అందులో తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబిచే అంశాలకు స్థానం ఉండటం మరీ సంతోషం. కులలను ఆశ్రయించుకున్న కళలు కళాకారులు అంతరించిపోకముందే వారి కళారూపాలను వెతికిపట్టుకోవడం వారి జీవనాన్ని తరచిచూడడం రెండూ అవసరమే, ఇవ్వల్టి కార్యక్రమంలో ఆ పనిచేసారు.
ఒకటి సాధనా శూరులు వారి మాజికల్ ప్రదర్శనను రెండు కెమేరాలూ ఒక థ్రోణ్ ఉపయోగించి చక్కగా షూట్ చేసారు అంతే గొప్పగా ప్రజెంట్ చేసారు. పద్మ శాలీలను మాత్రమే అర్చించే వారిని సాధనా శూరులు అని పిలుస్తూ వుంటారు. వీరి ప్రదర్శనాలను అందరికీ ప్రదర్శిస్తారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సంచారం చేస్తూ ప్రతి గ్రామం లోని పద్మశాలీల అనుమతితో వీరు ప్రదర్శనలు ప్రారంభిస్తారు. వీరి ప్రదర్శన ఇంద్ర జాలానికి సంబంధించింది. వీరి ప్రదర్శనం పగటి వేళే జరుగుతుంది.వీరి కళారూపాల సాధనకు నిష్ట అవసరమంటారు. వీరి పనులు కనికట్టు గారడీగా వుంటాయి. క్రీస్తు శకం 234 నాటికాలం నుంచే ఈ ప్రక్రియ వుందని చారిత్రక ఆధారాలు చెపుతున్నాయట. ప్రస్తుతం అంతరించే దశలోవున్న ఈ కళను కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చేసిన సాధనా శూరుల ప్రదర్శనను శివ.జి చాలా చక్కగా తెరకెక్కించారు. ఫ్రదర్శన సందర్శంగా చూపిన వారి విద్యలను ఒక్కటొక్కటిగా వివరిస్తూ ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఉదాహరణకు రెండు చేతులతో చేసే కర్రసాము, గుండెలపై రాళ్ళను పగలగొట్టించుకోవడం, కట్లను విడిపించుకోవడం, నీళ్ళలో వేసిన ఇసుక పసుపు లాంటివాటిని మళ్ళీ పొడిపొడిగా రప్పించడం వంటివి డీటైల్ గా చూపారు. దానికి అధనంగా వారి జీవన స్థితిగతులపై భాష్యం ఆలోచింపచేసేదిగా వుంది.
==>>రెండవది కాకిపడిగెల వారి నేపద్యంపై డాక్యుమెంటరీ...
కాకిపడిగెలు ముతరాశి లేదా ముదిరాజ్ కులానికి ఆశ్రితకులంగా వుంటూ వారి కులోత్పత్తి(జీనియాలజీ) పారంపర్యత, సాంస్కృతిక నేపద్యం తరాలు గడిచిన మరిచిపోకుండా అందించేందుకు కృషిచేస్తున్న వారు. మిరాశీ వున్న గ్రామాలలోకి వెళ్ళి త్యాగం(తాగెం)ను ప్రతిఫలంగా తెచ్చుకుంటారు. నిజానికి బెగ్గింగ్ కాదు. వీరు అడుక్కునే వారు కాదు.
కాకిపడిగెలవారు మూడు రకాలుగా కథలు చెప్తారు. మొదటివి త్యాగం కథలు, రెండోవి చావుకథలు, మూడోవి ఉల్ఫా కథలు. పూర్వం ఐదు లేదా తొమ్మిది రోజులు కథలను ప్రదర్శించేవారు. ప్రస్తుతం తగ్గించారు. ప్రధానంగా వీరు చెప్పే కథల్లో ముదిరాజ్‌ల వృత్తాంతం, పాండవుల పుట్టుక, ధర్మరాజు జూదం, పాండవుల వనవాసం, విరాటకొలువు, ద్రౌపది స్వయంవరం, బకాసురవధ, కీచకవధ, గారములకోట, సుభద్రాపరిణయం, కర్ణునిపెళ్ళి, సహదేవకళ్యాణం, గోవులచెర, శశరేఖ పరిణయం, నవలోకసుందరి, రంభారంపాల, మాయాబజార్, గదాయుద్ధం, భీష్మమరణం, భీమ విషమన్నం, అభిమన్యు మరణం, దుర్యోధన మరణం, కురుక్షేత్రం, అల్లిరాణి, లక్షాగృహం, రాజసూయ యాగం, భీమాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణరాయభారం మొదలగునవి ముఖ్యమైనవి.
=> .. కాకిపడిగెల వారికి ఈ పేరు రావడం వెనకకూడా ఒక కథవుంది.
పూర్వం ముదిరాజ్ వాళ్ళలో ఐదుగురు అన్నదమ్ములు కల్సి పెందోట వనం చేసి ఆ వనానికి కావలి ఉండేవారు. అయితే ఒకరోజు అవుసలి బ్రహ్మ పండ్లు పెట్టమని వీరితోటకు వచ్చాడు. అతనికి పండ్లు పెట్టలేదు. ఎంత గట్టిగా పెట్టమని మాట్లాడినా కూడా వీళ్లు పెట్టక అతన్ని పెందోట వనం నుండి వెళ్ళగొట్టినారు. దీనితో అవుసలి బ్రహ్మకు కోపం వచ్చి ఒక బంగారు కాకిని చేసి ప్రాణం పోసినాడు. ఆ కాకి పెందోట వనంలోని పండ్లన్ని పాడుచేస్తుంటే ఈ ఐదుగురు ముదిరాజ్‌లకు కోపం వచ్చింది. అందులో చిన్నోడు ఒక బాణం తీసి ఆ కాకికి వేస్తే అది రెక్కలు విరిగి పడిపోతుంది. దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చి ''అమ్మా! నేను కాకిని పట్టుకొని వచ్చిన'' అంటాడు'' అందుకా తల్లి ''మనం ముదిరాజ్ వాళ్ళం. మనం మాంసం తినేవాళ్ళం కాదు. సూర్యున్ని చూసి చుక్కబొట్టు పెట్టం. చంద్రున్ని చూసి చంద్రవంక పెట్టం, వరాహావతారం ఎదురొచ్చినదంటే ఏడు నూతలల్ల స్నానం చేసి వచ్చేవాళ్ళం. అట్లాంటిది నీవు కాకిని చంపి కాకిని పట్టుకొని వచ్చినావు కాబట్టి కాకిపడిగెల వానివై పక్కనుండాలి'' అని శపించింది. దానితో ''అమ్మా! నీవు శపించినావు కాబట్టి నేను పక్కకే ఉంటాను'' అని అన్నం తినకుండా పక్కకుంటాడు.కొడుకు అన్నం తింటలేదని బాధపడి ఆ తల్లి ''కొడుకా! ఎన్ని రోజులు ఇట్ల అన్నం తినకుండా పక్కకుంటావు బిడ్డా'' అని అన్నం తీసుకపోయి పెడుతుంది.
అప్పుడు ''అమ్మా! నీవు పక్కకు కూర్చోని అన్నం పెట్టినావు కాబట్టి నీ ఇంటోల్లకు నాకు అన్నం పొత్తు ఉంటుంది. నీవు తెచ్చి పెడితేనే తినాలి కాని నేను నీ ఇంట్లోకొచ్చి తినను'' అంటాడు. అప్పుడు ఆ తల్లి ''మన ఇండ్లల్ల ఎవరైనా పుడితే పురుడు కట్నం, పెడితే పెండ్లి కట్నం, సమర్త అయితే కట్నం, చస్తే చావు కట్నం నీకు ఇస్త అని కట్టుచేసి, మనకు పాండవులంటే మనకిష్టము కదా! వాళ్ళకు సంబంధించిన
వృత్తాంతము చెబుతూ ముదిరాజులను అడుక్కొని బ్రతుకు బిడ్డా'' అని చెప్పింది. అప్పటి నుండి కాకిపడిగెల వాడై పాండవుల కథ చెపుతూ జీవనం గడుపుతున్నాడు. ఇట్లా కొంతకాలానికి ఊరికే నోటితో చెప్పితే సరిగా అర్ధమయితలేదని గుడ్డమీద మహాభారతం సంబంధించి బొమ్మలు వేయించి బొమ్మలు చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదేవిధంగా కథ చెపుతూ ముదిరాజ్ వాళ్ళను త్యాగం అడుక్కొని జీవిస్తున్నారు.
త్యాగం కథలు అయిపోయిన తరువాత పాళ్ళ ప్రకారం ముదిరాజ్ వాళ్ళకు ఎన్ని డబ్బులు పడతాయో అన్ని ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసుకొని మొత్తం వసూలు అయిన తర్వాత వేరొక ఊరికి వెళ్ళిపోతారు.కానీ ఇప్పటి రోజుల్లో కథచెప్పించుకునే వూర్లు లేవు. కనికరించే నాధుడూ లేదు. కనీసం కాస్టు సర్టిఫికెట్లో సైతం స్వంతం కులం పేరుకి అవకాశం లేక బిసి డిలోనే రాసుకుంటున్నారు.
కాకిపడిగెల వారి జీవనస్థితి గమనిస్తే ఆర్థిక విషయంలో ఇతర ఆదార మార్గాలను వెతుక్కోవడంతో పూర్వానికి ఇప్పటికి కొంత మెరుగైనట్లు అనిపిస్తుంది. కాని ఆదరణ విషయంలో చాలా తగ్గింది. వారి అభిప్రాయం ప్రకారం ఈ తరం పోతే తమను చూసే వారు ఆదరించే వారు ఉండరేమో అని అంటున్నారు. సామాజికంగా వారి పరిస్థితి దయనీయంగానే ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి