మొహర్రం వేడుకల ఉత్సవం కాదు, వర్ధంతి విషాద జ్ఞాపకాలు,ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సర ప్రారంభం.
పీర్లు, నిప్పులగుండాలు, మాతమ్ ఏడ్పులు షియాల సాంప్రదక సంతాప పద్దతులు.
క్రీ.శ. 622 లో మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కానుండి మదీనా కు వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు. "హిజ్రీ శకా"నికి మూలం ఇదే అంటే ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా(తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు మరియు క్రైస్తవులతో సహా) ఈ కేలండర్ ను వాడేవారు.
ఇస్లాంను కాపాడుకోవడం కోసం జరిగిన పవిత్ర యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ మోహర్రం నెలలో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందుతాడు. అప్పటి నుంచీ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూమ పది రోజుల పాటు సంతాప దినాలు నిర్వహిస్తారు. ప్రతిమా మూర్తులుగా పీర్లు ఊరేగింపు, న్యాయపోరాటానికి శరీర కష్టాన్ని లెక్కజేయమన్న నిప్పుల గుండాలు తొక్కటం, రక్తాన్ని చిందించటం "షహీద్ " (అమరవీరుల ) నెల సందర్భంగా షియాలు గుండెలు బాదుకుంటూ మాతమ్ (శోక ప్రకటన) జరుపటం, నల్లటి వస్త్రాలను ధరించడం లాంటివి చేస్తారు. కానీ ముస్లిం సంప్రదాయాలకు హిందుత్వాన్ని పోలి వుండే ఈ పద్దతులు వ్యతిరేకం, ఈ విధానాలకు వ్యతిరేఖంగా పత్వాలను సైతం చేసారు. అయినప్పటికీ ప్రాధమికంగా మొహర్రం ముస్లింలకు సంబంధించింది అయినా కాలక్రమంలో భారతీయ సంస్కృతిలో భాగమైంది. తెలంగాణలో పీర్ల పండగగా ప్రాచుర్యం పొందింది.
మొహర్రం వెనకున్న కథ
క్రీ.శ. 632లో మహమ్మద్ ప్రవక్త (స) పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమామ్ హసన్, ఇమామ్ హుసైన్- ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్ (స) మనవలు. హజ్రత్ అలీ తనయులు. హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమామ్ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకొన్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా. అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమామ్ హసన్‌ను గద్దెదించాలనుకొన్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమామ్ హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్‌ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ననుసరించి సంప్రతింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చలకోసం ఇమామ్ హుసైన్ రాజధాని కుఫాకు బయల్దేరారు. యజీద్‌కు విషయం తెలిసింది. పాషాణ హృదయుడైన అతడు ఇమామ్ హుసైన్‌ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమామ్ పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్‌ను రాజుగా అంగీకరించమని 4000 సైన్యంతో వచ్చిన సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలసి మొత్తం 108 మంది లోపు జనాలు ఇమామ్ హుసైన్ వెంట ఉన్నారు. పది రోజులు యుద్ధం జరిగింది. ఇమామ్ హుసైన్ పరివారం స్వల్పమైనా వీరోచితంగా పోరాడి అశువులు బాసింది. యూఫ్రటీస్ నదీ తీరాన కర్బలా మైదానంలో జరిగిన ఈ యుద్ధాన్నే కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు, ఒక్క జైనుల్ ఆబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ధ ఖైదీలుగా 'షామ్' (సిరియా) కు, యజీద్ వద్దకు తీసుకెళ్ళారు. పదోరోజు హుసైన్ ఒక్కరే మిగిలారు. 'యజీద్ సైన్యం దాడి చేసి ఈయనను కూడా పట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువునడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై ఇమామ్ హుసైన్‌ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహర్రం పది రోజులు విషాద దినాలు.అప్పటి నుంచీ…ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మొహర్రం చేసుకుంటారు.
మొహర్రం నెలలో ఇమామ్ హుస్సేన్ ఆత్మ శాంతి కోసం ఉపవాసాలు ఉంటారు. నమాజ్ చేస్తారు,ఫాతెహా ఇస్తారు.షియా ముస్లింలైతే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రక్తం చిందిస్తారు. దీన్నే మాతం అంటారు.
పీర్ల పండుగ
మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన అయిదవ అరోజు రాత్రి పంజోఁ కా పిఠారా లేదా తాబూత్ అనే పంజాల నుంచిన పెట్టెను, ముజావిరు అనే అర్చకుని ఇంటి నుండి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ పంజాలకు విగ్రహాలకు పది రోజులు ఫాతిహాలు జరుగుతాయి. పీరులంటే వీరుల యొక్క హస్తాకృతిలో మరియు పంజాల రూపంలో కొలుస్తారు. ఊరేగింపు అయిన తరువాత రాత్రికి ఊరు మధ్యలో నున్న నిప్పుల గుండం దగ్గరకు వస్తారు. ఆఖరు రోజున బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి అందులో పెద్ద పెద్ద కట్టెలు పేర్చి నిప్పు ముట్టిస్తారు. అది బాగా మండి కణకణ మండే బొగ్గులుగా తయారౌతాయి. ఈ సమయానికి ఊరేగింపు ముగుస్తుంది.
హసన్, హుస్సేన్ పేరులతో పాటు, వారితో పాటు ప్రాణా లర్పించిన వీరుల పీర్లను కూడా పట్టుకుని హసన్, హుస్సేన్ .... హైసాయి, జూలోయ్ అంటూ ఆవేశపు కేకలతో పీర్లను చేత బట్టి వుదృతంగా మారు మోగే సన్నాయి , డప్పు వాయిద్యాల మధ్య పరుగు పరుగున ఆవేశంతో పరుగెత్తుతూ నిప్పుల గుండం మధ్య నుంచి నడచి పోతారు. ఈ దృశ్యం ప్రేక్షకుల్ని చికితుల్ని చేస్తుంది. నిప్పుల గుండంలో దూకే వారికి ప్రజలు కూడ కేకలతో మద్దతు నిస్తారు. ఆ విధంగా మృత వీరులైన హసన్, హుస్సేన్ లకూ తదితర అమర వీరులకూ జోహార్లు ఆర్పిస్తారు. ఇలా నిప్పుల గుండంలో నడచి వెళ్ళడం పీర్ల మహాత్యంగా కీర్తిస్తారు. ఇలా పీర్ల పండుగ ముగుస్తుంది. ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పలావు మొదలైన మాంసాహాన్ని భుజిస్తారు. అలా ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి ఆత్మీయులైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు. ఆలా హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతీక. పేటికలో వుంచి మరుసటి మొహరం నెల వరకు ముజావర్ వద్ద భద్ర పరచటం జరుగుతూ వుంటుంది. ఆంధ్ర దేశంలో వున్న ముస్లిములు అన్ని ప్రాంతాల లోనూ ఈ పండగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్బంలోనే మొహరం గీతాలను అలాపిస్తారు
పీరుల్ని పీర్ల చావడి లో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు. కాని ముస్లింలలో ఒక తెగ వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. ఇస్లాంలో ఇలాంటి సంప్రదాయాలను కొనసాగించే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు వున్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించే ముస్లిముల సంఖ్య తగ్గుతోంది. "ఊదు వేయందే పీరు లేవదు". ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.
పీరు
మొహరం నెలలో పదవ రోజు షహాదత్ ను సంతాప దినంగా పాటించ వలసిందిగా హుసేన్ అనుచర వర్గం నిర్వచింది. ఆ రోజున పీర్లు అనే హస్త్గాకృతులను ఊరేగించి, ఊరి యందు గల బావి దగ్గరో, నదుల దగ్గరో వాటిని శుభ్ర పరచి నిర్ణీత పేటికలో వుంచి మరుసటి మొహరం నెల వరకు ముజావర్ వద్ద భద్ర పరచటం జరుగుతూ వుంటుంది. ముస్లిములు ఈ పండగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్బంలోనే మొహరం గీతాలను అలాపిస్తారు. మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు. కాని ముస్లింలలో ఒక తెగ వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు.
పీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడని, డా: టి. దోణప్ప గారు కూడ తమ జానపద కళా సంపద గ్రంథంలో ఉదహరించారు. పీరు అనే పదం సూఫీతత్వాని కి సంబంధించినది. పీరు అనగా గురువు, "ఆధ్యాత్మిక గురువు". కానీ కొద్ది మంది ఈ "పంజా" లేదా "నిషాన్" లేదా "అలం" (జెండా) ను "పీరు" అనే పేరు పెట్టేసారు. అది అదే పేరుతొ చాలా కాలం కొనసాగింది. ఈ పంజా (పీరు) మొహర్రం నెలలోని మొదటి 'అష్రా' (పదిరోజులు) లో జరిపుకొను ఉత్సవాలలో ఉపయోగించే, 'పంజా' లేదా 'అలమ్' (జెండా). ఒక రాతిపై వున్న ఇటువంటి పంజా గుర్తు మేరకే హైదరాబాదులోని ఒక ప్రాంతానికి పంజాగుట్ట అనే పేరు వచ్చింది. ఇత్తడి పళ్ళాల్లాంటివి కర్ర లకు తొడిగి పీర్ల పండుగ లో ఊరేగిస్తారు. కర్బలా యుద్ధంలో, ఇమామ్ హుసేన్ మరియు వారి కుటుంబీకులు ఉపయోగించిన, కరవాలాలు, డాలులు, జెండాలకు చెందిన నమూనాలు, ఈ రోజుల్లో, వారి అమరత్వాన్ని గుర్తించుకొంటూ, స్మరించుకొంటూ ఊరేగిస్తారు.
నిప్పుల గుండం
ఉపవాసాలు
ఇస్లాం మతం కోసం ప్రాణత్యాగం చేసిన ఇమామె హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తారు. మొహర్రం 6,7,8,9న, 10న షహదత్ రోజు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. శోకమాసమని ముస్లింలు ఈ మాసంలో శుభకార్యాలు చేయరు. కొత్తదుస్తులు వస్తువులు ఖరీదు చేయరు.
షర్బత్, రోటీలు
కర్బాలా మైదానంలో ఇమామె హుస్సేన్, అయన అనుచరులు పిల్లలు, మహిళలకు యజీద్ సైన్యం కనీసం మంచినీరు కూడా ఇవ్వరు. ఆ పరిస్థితి నేడు ఎవరికీ రావొద్దంటూ ముస్లింలు నీళ్లు, లేక పాలలో బెల్లం తీపి, సోంపు కలిపి షర్బత్ తయారు చేసి తాపుతారు. ఆకలితో ఎవరూ మరణించరాదని చక్కర, ఎండు ఫలాలలతో రొట్టెలను తయారు చేసి దానం చేస్తుంటారు. ఆ కాలంలో హుస్సేన్ పెరుగు అన్నం సద్ది కట్టుకొని వెళ్లారంటూ నేటికీ పెరుగన్నం (బుత్తి) తయారు చేసి పంచుతారు.
పులివేషాలు
పీర్లను పంజాలొ నెలకొల్పిన తరువాత ఆవేశ పరులైన ముస్లిం సోదరులు పులి వేషాలను ధరించి డప్పు ల వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పెద్ద పులి నృత్యం చేస్తూ, పులి చేష్టలను అనుకరిస్తూ, హుంకరిస్తూ పిల్లలను భయ పెడుతూ హంగామాగా వీధులన్నీ తిరుగుతూ పెద్ద పులి ఠీవిలో హుందాగా నడక నడుస్తూ పల్టీలు కొడుతూ ప్రతి ఇంటికీ వెళ్ళి వ్వాచిస్తారు. ఈ ప్రదర్శనాన్ని అందరూ ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. పారితోషికాల నిస్తారు. ఇలా సంపాదించిన డబ్బును అఖరు రోజున ఆనందం కోసం ఖర్చు పెడతారు.
ధులా
ధులా అనే కళా రూపం, సర్కారు ఆంధ్ర దేశం లో కానీ, రాయలసీమ ప్రాంతం లో కాని ఎక్కడా కనిపించక పోయినా, తెలంగాణా ప్రాంతంలో మాత్రం అధిక ప్రచారంలో వుంది. ఇది ముఖ్యంగా శ్రమ జీవుల కళా రూపమనీ, అంత కంటే ముఖ్యంగా ముస్లింలు జరుపుకునే పీర్ల పండగకు సంబంధించిందనీ, జయధీర్ తిరుమల రావు గారు ప్రజా కళారూపాలు అనే తమ గ్రంధంలో వివరించారు. ఇది శ్రమ జీవుల కళారూపమైనా శ్రమ జీవులందరూ ఈ కళా రూపంలో పాల్గొన్నట్లు మనకు పెద్ద అధారాలు లేవు. ఇది అందరూ కలిసి సామూహిక నృత్యం చేస్తారు. పాటకు, పాటకు సంబంధించిన ఆటకూ సంబంధించిన జానపద కళారూపం. ధులా కళా రూపానికి సంబంధించిన పాటల్లో గానీ, పదాల్లో గానీ అవి అతి చిన్నవిగానూ, అంత కంటే కథా వస్తువు అతి చిన్నది గానూ వుంటుంది. ముఖ్యంగా మొహరం పండుగల్లోజరిగే పీర్ల పండుగల్లో ధులా ఎక్కువ ప్రచారమైనా, ఆ కళారూపాన్ని తెలంగాణా పోరాట సమయంలో సాయుద దళాల్లో వున్న ముస్లిం సహోదరులూ, ఇతర శ్రమ జీవులూ కూడా ఈ కళారూపాన్ని బాగా ఉపయోగించు కున్నారు. దళాలకు సంబంధించిన క్యాంపులలో వున్న వారందరూ వలయాకారంగా నిలబడి, ఒకరు పాటను ప్రారంభించి, ఆ పాటను సామూహికంగా అందరూ అందుకుని ఆ పాటకు తగిన అడుగులను అందరూ ఒకే రీతిగా క్రమశిక్షణతో లయ బద్ధంగా ధులా పాటను పాడుకునే వారు
మొహర్రం గురించి చారిత్రక ఉటంకింపులు
తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య జూన్ 29, 1830న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహర్రం పండుగను తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహర్రం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు: షహరు(హైదరాబాదు)కు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో నెక్కువగా ప్రకాశించుటచేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆ తొమ్మిదో దినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు
హైదరాబాద్ పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌస్, మీరాలం మండీ, దారుల్ షిఫాల మీదుగా కొనసాగి చాదర్ ఘాట్ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ వూరేగింపు సాగుతుంది.
4వ నిజాం మీర్ అఫ్జలుదౌల్హా హయాంలో నిజాం పరిపాలన ప్రదేశంలో వర్షాలు పడక తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో ఆయన మతగురువులను, ప్రజలను ప్రత్యేక ఆరాధనలు చేయాలని, వర్షాలు పడాలని దేవుడిని వేడుకోవాలని కోరారు. ఆయన ఆదేశానుసారం మతగురువులు, ప్రజలు ప్రత్యేక ఆరాధనలు చేశారు. దీనితో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. కరువు పోయింది.
దీనితో ఆయన తన సంస్థానంలోని అన్ని వర్గాల ప్రజల కోసం మసీదులు, దేవాలయాలు, ఆషూర్‌ఖానాలను నిర్మించాడు. అదే క్రమంలో డబీర్‌పూరలోని బీబీకా అలావా నిర్మించారు. అప్పట్లో గోల్కొండ ఖిల్లాలో ప్రతిష్ఠిస్తున్న ఆలంను డబీర్‌పుర బీబీకా అలావాకు మార్చారు. దీనితో షియా ముస్లింలు ఏటా 1వ మొహర్రం నుంచి 10వ మొహర్రం వరకు ఆలంను ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలావాను 1928లో 7వ నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ ఈ ఆషూర్‌ఖానాకు తుది మెరుగులుదిద్దారు.
హిందూ ముస్లింలను ఏకం చేసే పండుగ
ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర్వచనమే తౌహీద్ ("లాయిలాహ ఇల్లల్లాహు") అనగా సర్వేశ్వరుడైన అల్లాహ్ ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు. అరబ్బీ పదమైన 'అహద్' లేదా 'వహద్' అనగా "ఏక", 'వాహిద్' అనగా 'ఏక' లేదా ఏకవచనము, దేవుడి విషయంలో 'ఏక + ఈశ్వరుడి' విశ్వాసం ఈ "తౌహీద్".
తౌహీద్ కు వ్యతిరేకపదము షిర్క్, అనగా ఏకేశ్వరునికి భాగస్వాములుగా ఇతరులను చేర్చడం లేదా బహుదైవారాధన . షర్క్, షిర్క్, షరీక్, షిర్కత్, ఇష్తెరాక్, ఇష్తెరాకియ, ఇష్తెరాకియత్ మొదలగు పదాలకు మూలం ష-ర-క. దీని అర్థం భాగస్వామ్యం, మిళితం, కలపడం, కలవడం, ఈ "షిర్క్". షిర్క్ ను ఆచరించేవారిని 'ముష్రిక్'లు అని వ్యవహరిస్తారు. ఉదాహరణకు దర్గాలను సందర్శించి ఔలియాలతో నోములు, శరణుకోరటాలు, విద్యాబుద్ధులు, ఉపాధి, సంతానం, వివాహం మొదలగు విషయాల పట్ల తమ కోరికలు ప్రకటించి వాటిని పూర్తి చేయండని ప్రార్థనలు చేయడం మరియు వేడుకోలు చేసుకోవడం. అలాగే, పంజాకు (పీర్లకు), జెండాలకు, జెండామానులకు, జిన్నులకు, పాములకు (జిన్నులుగా భావించి), పాముల పుట్టలకు, ఔలియా నషానులకు ఫాతెహాలు చదువుతారు, నోములు నోచుతారు, ప్రార్థనలు చేస్తారు. ఇస్లాం విశ్వాసాల ప్రకారం ఇది బిద్ అత్ మరియు షిర్క్ లు. ఈ విషయాలన్నీ అంధవిశ్వాసాలు, అంధ-శ్రద్ధల కోవలోకి వస్తాయి.
షియా నవాబుల కాలంలో ఈ సంప్రదాయం అన్నిచోట్లా ప్రాకింది. ఒకానొక కాలంలో ఈ పీర్లపండుగ ముస్లింల ముఖ్యమైన పండుగగా భావింపబడినది. కొన్ని ప్రాంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడ పీర్ల పండగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. ముస్లిములలో ముఖ్యంగా దూదేకులా' వారు ఆటలమ్మ, మారెమ్మ మొదలైన హిందువుల దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎఱ్ఱెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, నారసింహులు, బాలన్న అనే పేర్లు పెట్టుకోవటమూ, అలాగే హిందువులలో కుల్లాయమ్మ, దస్తగిరి రెడ్డి, నబీగౌడు ఫక్కీరప్ప, మస్తాన్ రావు, లాలెమ్మ, సేకణ్ణ, సైదల్లీ, హుసేన్ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ, పరసలలోనూ పాల్గొనటం, దర్గాలకు, మసీదులకూ వెళ్ళటం, పీర్లను కొలవటం సర్వసామాన్యంగా జరిగే విషయాలు.
అరబ్బీ క్యాలెండర్ లోని నెలలు ఇవి
1. మొహర్రం :محرّم (ముహర్రముల్ హరామ్)
2. సఫర్ : صفر (సఫరుల్-ముజఫ్ఫర్)
3. రబీఉల్-అవ్వల్ : ربيع الأول
4. రబీఉల్-ఆఖిర్ (రబీఉస్-సాని): ربيع الآخر أو ربيع الثاني
5. జమాదిఉల్-అవ్వల్: جمادى الأول
6. జమాదిఉస్-సాని: جمادى الآخر أو جمادى الثاني
7. రజబ్ : رجب (రజబ్-ఉల్-మురజ్జబ్)
8. షాబాన్ : شعبان (షాబానుల్-ముఅజ్జమ్)
9. రంజాన్ : رمضان (రంజానుల్-ముబారక్)
10. షవ్వాల్: شوّال (షవ్వాలుల్-ముకర్రమ్)
11. జుల్-ఖాదా: ذو القعدة
12. జుల్-హిజ్జా: ذو الحجة
హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.
ధన్యవాదాలు : ఈ సమాచారం అంతర్జాలంలోనూ, పత్రికలలోనూ ప్రచురితమైన వేర్వేరు ప్రదేశాలనుంచీ సేకరించినదే. మొత్తంగా ఒక క్రమంలో పెట్టడం మాత్రమే నేను చేసిన పని ఆయా సోర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు
ధన్యవాదాలు : ఈ సమాచారం అంతర్జాలంలోనూ, పత్రికలలోనూ ప్రచురితమైన వేర్వేరు ప్రదేశాలనుంచీ సేకరించినదే. మొత్తంగా ఒక క్రమంలో పెట్టడం మాత్రమే నేను చేసిన పని ఆయా సోర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి