బ్లాకుబలి : పెద్దనోట్లను రద్దు చేస్తే ప్రజలు నిజంగానే బాగుపడతారా?

పెద్దనోట్ల రద్దు బాహుబలిలో ఒక సీన్ ని గుర్తుకు తెస్తోంది. యుధ్దంలో కాలకేయుడు అమాయకులైన ప్రజల్ని రక్షణ కవచాల్లాగా ముందు వరుసలో నిలబెడతాడు. భల్లాలదేవుడు శత్రువులను శిక్షించడం కోసం అమాయకులైన ప్రజలను కూడా చంపుకుంటూ వెళతాడు. బాహుబలిమాత్రం వారి కాళ్లమీదకు బరువులతో చుట్టుకునే తాళ్ళను విసిరి వాళ్ళకు ఇబ్బంది లేకుండా వెనకున్న శత్రుసేనలమీదకు లంఘించే వ్యూహరచన చేస్తారు.
అనిల్ బోకిల్ ‘‘అర్ధక్రాంతి’’ (http://www.arthakranti.org/proposal) లాంటి అమూల్య పరిశోధనల్లో తేలిన అంశాన్ని అమల్లో పెట్టడం. అసలు బడాబాబులకు నష్టం కలిగించే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే నేతలు రేపెప్పుడో కమ్యునిష్టు పార్టీల వంటివి పరిపాలనలోకి వస్తేనో, జెపి లాంటివారు పగ్గాలు తీసుకుంటేనో జరుగొచ్చేమో అని ఎదురుచూసాం. మన్మోహన్ లాంటి ఆర్ధికవేత్త మౌనంగా తన పబ్బం గడిపేసుకుని రబ్బరు స్టాంపులోదిగిపోయాడు. మనం సోషట్ నెట్ వర్క్ లలోనూ, సినిమల్లోనూ నల్లధనం అవినీతి అంటూ వాపోతూనే వున్నాం. మరిప్పుడు ఒక అడుగు ముందుకు పడింది. అవును నాక్కూడా ఎప్పటిలా పోల్చుకుంటూ రద్దు తర్వాత కొంత ఇబ్బందిగానే వుంది. కానీ మొత్తం దేశానికి ఉపయోగపడే ఒక పెద్ద ప్రయోజనం కోసం చిన్న చిన్న కష్టాలకు సైతం బావురుమనేట్లయితే, ఇక ఎవరో వచ్చి మార్చాలని ఏదో దేశం మారిపోవాలనీ కోరుకోవడం ఎందుకు? నత్తగుల్లలా మొత్తం డొల్ల అయ్యేంత వరకూ ఎప్పటికప్పుడూ సౌకర్యపు కన్నాల్లో దాక్కుంటూ వుంటే సరిపోతుంది.

ఇప్పటివరకూ చూసిన దానివల్ల ఆయన మోడీ కావచ్చూ మరేదయినా కావచ్చు మనకు మాత్రం రాజకీయనాయకులు స్వార్ధ ప్రయోజనాలు తప్ప అందరికోసం మంచి చేస్తారనే ఊహకూడా లేదు. వాళ్లంటే విలన్లు అంతే. ఇందులోనూ ముందు రంద్రాలే వెతకటం ప్రారంభిస్తున్నాం. కానివ్వండి ఒకరో ఇద్దరో ముందే తెలుసుకున్నారా? ఎక్కడో ఒకటో రెండో చోట్ల ఈయన గారి స్వంతి పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు దారి ఏర్పడిందా? పోనీ ప్రతిపక్షం బొరియల్లో పాపంలో పేరుకుపోయిన నల్లకొవ్వును కరిగించాలనే ఇదంతా చేసాడా? ఏదయినా దాని ఫలితం ఎవరికందుతోందో చూడరా?
దేశం మీద యుద్దం చేయడమంటే ఆయుధాలు వెయ్యడం కాదు. ఆర్ధికంగా నిర్వీర్యం చేయాలన్న కుట్రతో నిపుణులు సైతం పట్టుకోలేనంత పకడ్భందీగా చేసిన దొంగనోట్లను కుప్పలు కుప్పలుగా పంపుతున్నారు. లక్షకి ముప్ఫై వేలు, అరవై వేలంటూ వ్యాపారంగా మొదలేసేంత ముదిరిపోయిన జబ్బుని చూసి తిట్టుకుంటూనే వున్నాంకదా. ఎన్నికలంటే కంటెయినర్ల నిండా పెద్దనోట్లు అర్ధాంతరంగా గుమ్మరించడం మామూలు విషయమని చప్పరించేస్తూనే వున్నాం కదా. ఎలక్ట్రానిక్ మనీ అంటూ, ప్లాస్టిక్ కరెన్సీ అంటూ తెల్లవారు ఝూమున వేకువ కలలను పలవరిస్తూనే వున్నాం కదా. ఆయనెందుకు చేసాడో, ఏ పార్టీ, ఏరంగూ నాకనవసరం కానీ చేసిన పని నిజంగా చాలా చాలా చాలా గొప్పదని లైన్లలో నిల్చున్న ఇప్పుడు అర్ధం కాకపోయినా, లైను గా జరిగే మార్పులను గమనించే ఓపిక వుంటే తప్పకుండా తెలుస్తుంది. మనకే ఇంత ఒత్తిడి వుంటే అన్ని రకాలుగా శక్తివంతుల మెడలు వంచేందుకు న్యాయాన్ని భుజాన వేసుకుని నిలబడ్డ ఆ ఒంటరికి మరెంత ఒత్తిడి ఉండి వుండాలి. అవసరమైతే నేను నిలువునా కాలిపోడానికి సిద్దం అన్న మాటలో ఆర్ద్రత కంటే నాటకమే కనిపిస్తుందంటే అది మన తప్పకాదు మనల్నిలా తయారుచేసిన వాతావరణానిదే ఆ తప్పు. దేన్నీ నమ్మలేని తనంతో నిలువునా నింపేసింది. అద్దంలో మీ బొమ్మే అచ్చంగా మంచి పనులు చేయడం మొదలేసినా అర్రర్రే ఇదేదో టెక్నిక్ లా వుందే అనుకునే అనుమాన బలహీనతలోనికి మనసు దిగజారిపోయింద. మిగిలున్న ఆశలను బ్రతికించాలంటే దేశానికి కొంచెం నమ్మకమిద్దాం. కనీసం నిలబడటానికి సిద్దమవుతున్న ఒక్క వెన్నెముక కనిపిస్తే అర్ధాంతరపు అక్షేపణలూ, ఆధారం లేని అనుమానాలతో పడదోయకుండా కొంచెం భరోసా నిద్దాం. ఏమో గుర్రం ఎగరా వచ్చు. ప్రపంచంలో పనిచేసే సామర్ధ్యం అధికంగా వున్న యువత ఎక్కువగా వున్న దశలో ముందింది భారతదేశం. ఈ సమయంలో నల్లడబ్బు, అవినీతి లాంటి ప్రధాన మైన రోగాలు దగ్గరికి రాకపోతే, అమెరికానూ, చైనాను మనం ఉదాహరణగా చూడాల్సిన అవసరం లేదు. సహజవనరులూ, అనుకూల వాతావరణంతో అన్నిరంగాల్లోనూ మనమే ప్రపంచం మొత్తానికీ ఒక ఉదాహరణగా ముందువరుసలో వుండే రోజే రావచ్చు. దానికి వేలమైళ్ళ ప్రయాణం వుందని మళ్ళీ పెదవి విరిసినా పర్లేదు కానీ దానికోసం పడే ఒక్క అడుగునూ మాటల తూటాలతో గాయం చేయకండి చాలు.
భల్లాల దేవుడికి సాధ్యం కానట్లు అనిపిస్తే అది అసాద్యమైపోదు. మరికొంచెం ఆలోచించి అడుగేస్తే అటు ప్రజలను కాపాడుకుంటూనే శత్రువుపై దెబ్బతీసే అవకాశం దొరుకుతుంది.



కామెంట్‌లు