తెలంగాణలో బౌద్ధం ఆనవాళ్లు, కొత్తగూడెం జిల్లాలో గుహాలయం జాడలు
కారుకొండ ధ్యానబుద్ధ శిల్పం ఈశాన్య దిశలోని చిత్రం |
ఖమ్మంజిల్లా నేలకొండపల్లిలో బౌద్ధస్థూపం వుంది,పైగా ఇది చాలా పెద్దది కూడా, బౌద్ధం ఈ ప్రాంతంలో ఒక వెలుగు వెలిగింది అనడానికి గొప్పఆధారం. మరి అక్కడొక్కచోటనే వుండి చుట్టుపక్కల లేదా మనకు ఆధారాలు దొరకటం లేదా అని చూస్తే తుడిచిపెట్టబడిన ఆధారాలు ఫినిక్స్ లా అదే చారిత్రక బూదిలోంచి రెక్కలు విప్పార్చుకుంటూ బయటకు వస్తున్నాయి. మొన్నీమద్య నాగులవంచ దగ్గర రామసముద్రంలో దొరికిన నాలుగు పాలరాతి బుద్దప్రతిమలు, ధమ్మ పదానికి గుర్తుగా నిలచిన ధమ్మపేటలోని నాగుపల్లిలో దొరికిన బుద్ధ విగ్రహాలూ ఇదే విషయాని రూఢి పరుస్తున్నాయి.
తెలంగాణలో భౌద్ధం
బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రస్థానాన్ని పొందినవాడు. ఆరాధనీయుడు. అటువంటి బుద్ధుని ధర్మప్రభోదాలు జీవన మార్గదర్శకాలుగా దేశ విదేశాల్లో విస్త్రుతంగా వ్యాపించాయి. జనులకు నైతిక జీవనాన్ని ధర్మాచరణను ప్రభోధించటంలో ప్రముఖ పాత్రవహించింది బౌద్ధం. నియమబద్దమైన వ్యాప్తికోసం గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని పరిఢవిల్లజేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తను పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956నుంచి మరోకసారి పునర్వికాస దశ పొందింది.
బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యమైనప్పటికీ, ఆ ఆధారాలను మిగుల్చుకోవడంలో వెతుక్కోవడంలో తగినంత శ్రద్ధ ఇప్పటివరకూ చూపలేదనేది ఒప్పుకోవలసిన నిజం.
ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ- నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- నేలకొండపల్లి, అశ్వారావుపేట(?), కాపవరం. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. ఇటువంటి కొండలున్నా గుహా విహారాలు ఆధారాలను దొరకలేదు. కానీ కొత్తగూడెంలో వున్న ఈ భౌద్ధ ఆనవాలు గుహాలయమనేందుకు సరిపోయేలా వుంది. దీనివివరాలను చూద్దాం.
ఎక్కడుంది ఈ భౌద్ద గుహాలయం?
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళ్ళే బైపాస్ రహదారిలో 5 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడినుంచి కేవలం ఒక్కకిలోమీటరు ఎడమపక్కగా వున్న కచ్చా రోడ్ లో వెళితే క్వారీగా తొలుచుకుంటూ వచ్చిన కారుకొండ పర్వతం కనిపిస్తుంది. దానికి పడమటి దిక్కున కారుకొండ చెరువు కనిపిస్తుంది. కొండను బలమైన రాళ్ళుదొరుకుతున్నాయని చుట్టూతా పండుని కొరుక్కుంటూ వచ్చినట్లు తొలుచుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతానికి కూడా ముప్పు పొంచి వున్నప్పుడు, స్థానికుల నిరసన వెల్లువెత్తింది. తమ ఆరాధ్య దైవం సడాలమ్మ గుడిని, ఆనాదిగా వస్తున్న బుద్దుని రాతిగుండు, దెబోగా గుహలను కూల్చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ కొంచెం ప్రాంతం వరకూ క్వారీ పనులు నిలిపివేసారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుహల అభివృద్దికి స్వల్పంగా నిధులు కేటాయించడంతో వాటికి రక్షణగా చుట్టూతా ఇనుపవల వేసారు. రక్షిత కట్టడంగా ప్రకటిస్తూ ఆర్కియాలజీ వారు బోర్డును కూడా ఏర్పాటు చేసారు.
ఏమున్నాయక్కడ ?
చతుర్ధిశ బుద్ధప్రతిమలతో ఏకశిలా నిర్మిత గోళాకార గుహదేవళం
కారుకొండ గుట్టకు పడమట దిక్కున ఈశాన్య దిశగా పది అడుగుల పైబడిన ఎత్తులో పాతిక అడుగుల పైగా చుట్టుకొలత వున్న ఇసుకరాతిగుండు ఒకటుంది. దానికి నాలుగు దిశల్లోనూ ధ్యానముద్రలో వున్న రూపం వుంది. రాతి గుండులో నాలుగు ముఖాలుగా ఎంచిన దిశల్లో అడుగులోతు గుంటలుగా తొలిచి దానిలోపట ఈ రూపాన్ని మలచారు. బహుదళ పద్మాన్ని ఆసనంగా తీసుకుని ధ్యానస్థితిలో నిర్మలంగా కూర్చుని వున్న ఒకేరకమైన రూపాలు నాలుగువైపులా వున్నాయి. మూర్తి కుడిభుజం వైపున్న దిశలో దీపం వెలిగించే గూడును ఏర్పాటు చేసారు. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాలకు అత్యంత పురాతనమైన సహజరంగులను వేసారన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మహాయాన బౌద్ధానికి చెందిన శిల్పాలయివుండొచ్చనిపిస్తున్నాయి.
Borobudur_ Buddha Statue Dhyana Mudra, Amitabha is similar to karukonda buddha silpam |
ధ్యానముద్రలో ఎడమ చేతిపై కుడిచేయి ఎడమ కాలుపై కుడికాలు వేసి వుండటాన్ని గమనించవచ్చు |
ధ్యానభంగిమ ప్రత్యేకతలు : భౌద్ధ ప్రతిమాశాస్త్రాన్ని (Buddhist iconography) పరిశీలిస్తే ప్రతిభంగిమకూ ప్రత్యేకమైన అర్ధం వుంది. నిలబడే, కూర్చునే భంగిమలకే కాక చేతివేళ్ళను వుంచే విధానికి కూడా దీనిలో ప్రత్యేకమైన వివరణలు వున్నాయి. ధ్యాన స్థితిలో వున్న బుద్దుడి విగ్రహాల్లో ఎక్కువగా భూస్పర్శాముద్ర కనిపిస్తూ వుంటుంది కానీ ఇక్కడి విగ్రహలలో మాత్రం ధ్యాన సమహిత ముద్ర కనిపిస్తుంది. ఒడిలోకి చేర్చుకున్న ఎడమ చేతిని వెల్లకిలాతిప్పివుంచి దానిపై కుడిచేతిని వెల్లకిలా తిప్పిసున్నితంగా ఆనించివుంచిన ముద్రలో గమనించ వచ్చు. ధ్యానసమాధిస్థితికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ముడుచుకున్న కాళ్ళుకూడా పద్మాసన స్థితిలో కాక ఎడమముంగాలిపై కుడముంగాలు చేర్చిన స్థితిలో వున్నది. తిన్నగా వుంచిన వెన్నెముక, పైకెత్తిన తల, ప్రశాంతమైన ముఖం నిటారైన మెడతో తలెత్తికనిపిస్తోంది. ఇటువంటి ఆసన స్థితి ప్రశాంత ధ్యానానికి అత్యంత అనుకూలమైనదిగా చెపుతారు. రావిచెట్టుక్రింద జ్ఞానోదయం అయినప్పుడు సైతం బుద్ధుడు అవలంభించిన ధ్యానపద్దతి ఇదే స్థితిలోనే అని యోగసాధకులు చెపుతారు. ఇటువంటి స్థితి జ్ఞానేంద్రయాలపై వత్తిడిపడకుండా శరీరాన్ని సమస్థితిలో వుంచేందుకు దోహదం చేస్తుంది. చైనాలో చియాంగ్ సేన్ పిరియడ్ లో తయారుచేయించిన బుద్ధప్రతిమలు బ్యాంకాక్ దగ్గర వాట్ బెంచంభోఫిట్ ప్రాంతలో ఇదే ఆసనస్థితిలో వుండటాన్ని గమనించవచ్చు. భారతదేశంలో సైతం అనేక చోట్ల ఇదే రకమైన ధ్యానస్థితిలో వున్న బుద్దప్రతిమలున్నాయి. ఒడిలో భిక్షాపాత్రనుంచుకున్న విగ్రహాలుసైతం భిక్షాపాత్రమినహా మిగిలిన రూపమంతా ఇలానే వుంటుంద.
కొంత పొడవుగా సాగిన చెవులు, ఉంగరాలు తిరిగిన జుట్టు, బుద్దుని భారతీయ రూపానికి అచ్చమైన ప్రతీకలుగా వున్నాయి. మెడలో ఏదో కంఠాభరణం ఆనవాలు అస్పష్టంగా కనిపిస్తోంది. ఎడమభుజం వైపుకు వేసిన వస్త్రపుజాడలు కనిపిస్తున్నాయి. అయితే ఇసుకరాయికావడం వల్ల అనేక శతాబ్దాల కోరివేతతో నష్టపోయిన భాగం కొంత అయితే ప్రధానమైన రూపాన్ని మాత్రం ప్రత్యేకకారణాలతో మనుషసంభంధమైన ధ్వంసీకరణ జరిగివుండొచ్చన్నట్లే కనిపిస్తున్నాయివి. బుద్ధ విగ్రహం వున్న తొలచిన గూడుకు తోరణం మాదిరిగా ప్రత్యేకంగా గాడులను కొట్టి అలంకరించారు. అంతేకాకుండా గూడుకు అడుగు క్రిందనుంచి చుట్టూతా తిరిగొచ్చేలా రెండంగుళాల లోతుతో ఒకగాడిని కొట్టారు. రాతిగుండుకు పై భాగంలో ఖచ్చితంగా మధ్య భాగంలో అడుగు లేదా పద్నాలుగు అంగుళాల భుజం కొలతతో ఒక చతురస్రాకారపు గాడి, దానికి మధ్యభాగంలో మరికొంత లోతుగా వృత్తాకారపు గాడి కనిపిస్తున్నాయి. ఎత్తుగావున్న ఈ భాగంలో రాత్రిపూట దీపం వెలిగించే వారో లేదా. ధ్యానసాధనలో భాగంగా గుడ్రని ఆకారంలో వున్న ఈ రాతిని మొత్తంగా భుద్దుని శిరస్సుగా భావిస్తే ఆ మధ్యలో వున్న భాగాన్ని సహస్రారంగా పరిగణించేవారో, లేక ధాతుగర్భంగా మలచేందుకు ఇదేమైనా సూచనవుతుందో ఇతిమిధ్దంగా ఇప్పటికి దొరికిన ఆధారాలతో తేల్చలేము. ఈశాన్య దిశవైపు చూస్తున్న బుద్ధప్రతిమకు ముందువైపున వున్న రాతిబండకుమధ్యలో ఒక చెట్టుమొలవడం వల్ల నిలవుగా చీలి ఆ వైపు ఒక ప్రత్యేక ద్వారతోరణంటా కనిపిస్తోంది. ఆ మొక్క మొదలు ఇంకా పచ్చిగానే వుంది మళ్లీ మొలకెత్తితే అది ఈ బండలను మరింత చీల్చివేసే ప్రమాదంలేకపోలేదు. గొడ్డలితో నరకటం, పలుగుతో పొడిచిమొదలు తీయటం కంటే యాసిడ్ లాంటి రసాయనాలను వాడి చెట్టుని తొలగిస్తే రాతిగుండుకు నష్టం కలకుండా వాటిని తీసేయడం సాధ్యం అవుతుంది.
బుద్దుడేనా లేక జైన పార్శనాధుడా?
బహుదళ పద్మాన్ని ఆసనంగా, నాగపడగలను ఛత్రంగా వేసుకుని అచ్చంగా ఇటువంటి ధ్యానముద్రలో కంఠాభరణంతో సహాకనిపించే వారిలో జైనానికి సంభందించి పార్శనాధుడు పోలికలున్నాయి. జైనబసదుల్లోనూ ఇటువంటి పూజలు జరిగేవిధానం వుంది. అయితే జైనంలో దిగంబరత్వం వుంటుంది. బౌద్ధంలో వస్త్రధారణ కనిపిస్తుంది కానీ ఈ బొమ్మలలో వస్త్రదారణ వున్నది లేనిదీ స్పష్టంగా తెలియటం లేదు.
దెబోగా [Dagobah] గుహలు :
రాతిగుండు నుంచి మరికొంత పడమటి దిశగా వెళ్ళి చూస్తే గుట్టపై కొంచెం ఎత్తులో ఈ రెండు గుహలూ కనిపిస్తాయి. దెబోగా గుహలు అంటే అదృశ్యశక్తులున్న మాంత్రికగుహలని నిజానికి అర్ధం స్టార్ వార్స్ సినిమాలో కూడా మాంత్రిక గుహలకు ఈ పేరే వాడటంతో ప్రాచుర్యంలోకి వచ్చిందీపేరు. ఇసుకరాతికొండలో తొలచిన ఈ గుహల్లో ఒకదానిపై 1986 లో గుట్టమీదనుంచి ఒక పెద్దరాయి దొర్లుకుంటూ వచ్చిపడటంతో ఒక గుహ పాక్షికంగా ధ్వంసం అయ్యింది.
ఎనిమిదడుగుల ఎత్తుతో పన్నెండడుగుల వెడల్పు ఆరడుగుల వెడల్పుతో గుహలు చక్కటి గదిలా వున్నాయి. ఆరడుగుల ఎత్తులో మూడున్నర అడుగుల వెడల్పున్న రాతి ద్వారాలున్నాయి. ద్వారాలు మూసేందుకు కూడా ఏదో ఇరుసులు లాంటివి తిప్పారనేందుకు గుర్తుగా రెండు పెద్ద గుంటలవంటివి కూడా వున్నాయి. ద్వారాలకు ఎదురుగా ప్రధాన విగ్రహరూపాలు ధ్వంసం తర్వాత కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే రూపం పోల్చుకునేలా తెలుస్తున్నాయి. వైష్టవ సంప్రదాయంలా కనిపిస్తున్న విగ్రహాలలో మధ్యలో పురుషదేవుడు ఆయనకు రెండువైపులా దేవేరుల విగ్రహాల్లాగా వున్నాయి. ఆభరాలు దండిగా వేయబడివున్నాయి. పైగా కుడిఎడమల వున్న గోడల్లో ద్వారపాలక విగ్రహాల్లాగా రెండు నిలువెత్తు విగ్రహాలున్నాయి. కానీ అవి తర్జని చూపిస్తూ ద్వారపాలన చేస్తున్నట్లుగా కాక ముకుళిత హస్తాలతో భక్తభంగిమలో కనిపిస్తున్నాయి. ఎక్కువగా జనసంచారమేమీ లేకపోవడం వల్ల పురుగులూ, పాములూ దీన్ని ఆవాసంగా చేసుకున్నట్లున్నాయి. నేను సందర్శనకు వెళ్ళినప్పడు విడియో తీస్తుండగా ఒక సన్నని పొడవాటి పాము కాప్ మీదనుంచి చేతిమీదకు జారి ప్రాణభయంతో హడావిడిగా పక్కనే వున్న పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వత చూస్తే అంతే మందం వున్న పాము కుబుసాన్ని కూడా ఆ గుహలో గమనించాను. రెండవ గుహలో కూడా దాదాపు అదేవిధమైన స్ట్రక్చర్ కనిపిస్తోంది. అక్కడక్కడ పురాతన సహజరంగుల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.
కొత్తగూడెం మండలంలోని కారుకొండ రామవరంలో దెగోబా గుహాల ప్రాంతంలో బంగారు నాణేలు దొరికాయని ఆర్కియాలజీ సైటులో పేర్కొన్నారు. 40 బంగారు నాణేల నిధి పగిలిపోయిన కాంశ్యపేటికలో దొరకాయట. ప్రాధమిక పరిశీలనలో ఇవి విజయనగర కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ మొత్తం నాణేలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1వ రకం శ్రీకృష్ణదేవరాయల కాలం(1530-1542) కాలం నాటివి రెండవ రకం తుళువ వంశానికే చెందిన అచ్యుతరాయని కాలం(1530-1542) కు చెందినవి. ఒక్కక్క నాణెం బరువు కనీసం 1650 మిల్లీ గ్రాముల నుంచి గరిష్ణంగా 3380 మిల్లీ గ్రాముల వరకూ వున్నాయి. అన్ని నాణేలు దాదాపు గుండ్రని ఆకారంలో వున్నాయి. మొత్తం నాణేల బరువు 117.840 గ్రాములుగా వుంది. 1994-1995 సంవత్సరం కాలంలోనే కాలచక్ర పేరుతో వీటిని విజయవాడ బౌద్ధశ్రీ ప్రదర్శనశాలకు తరలించారు నేలకొండపల్లిలో దొరికిన కోట్లాది రూపాయిల విలువచేసే బుద్దవిగ్రహంతో పాటు ఇవికూడా. ఇప్పటికి అక్కడే ఉన్నాయి. ఆ నాణేలు విజయనగర కాలం నాటివని వాటిపైనున్న లిపి మరియు సంకేతాల ఆధారంగా నిర్దారించారు. అంటే విజయనగర రాజ్యపు కాలంలో ఇక్కడ విరివిగా పూజాదికాలు జరిగేయని భావించవచ్చు. బహుశా ముడుపులుగా వేసినవో లేదా ఏదైనా నిర్మాణం కోసం వాడిన నాణేలో భూగర్భంలో కలిసి ఇప్పటికి దొరికివుంటాయి. విగ్రహాలు శిధిలమైన విధానం చూస్తే కేవలం వాతావరణ కోరివేత వల్లమాత్రమే అవిధ్వసం అయినట్లనిపించదు. ప్రత్యేకంగా శత్రుమూకల దాడిలో ధ్వంసం అయినట్లు సులభంగా అర్దం అవుతుంది.
శిల్పం మధ్యలో ఇరుక్కున కుబుసాన్ని కూడా చూడండి |
గుట్టకు వేరే దిక్కుల్లో ఆధారాలుండేవా?
కారుకొండ గుట్టకు పటమటి దిక్కు పల్లంగా వుంది ఆ వైపునే కారుకొండ చెరువు కూడా వుంది. అప్పట్లో ఏ బౌద్ధ ఆరామాన్ని లేదా చైత్యాన్ని గమనించినా నీటివసతిని ఆదరవుగా చేసుకునే వాటిని ఏర్పాటు చేసినట్లు గమనించవచ్చు. అదే విధంగా ఈ నిటివసతిని ఆధారంగా చేసుకున్నారని భావిస్తే. ఇక్కడ నివసించే వారి అవసరాలకు తటాకం వినియోగపడేదని భావించవచ్చు. పైగా చెరువునుంచి ఉదయం పూట తూర్పు దిశగా తిరిగి సూర్యనమస్కారం వంటివి చేస్తే అదే దిశలో ఈ బుద్ద శిలాగోళం కూడా కనిపిస్తూ వుంటుంది. అంతమాత్రాన మిగిలిన దిశల్లో ఎటువంటి ఆధారాలు ఉండవు అనుకునేందుకు ఏమీ లేదు. బౌద్ధారామాలు విలసిల్లిన చోట పెద్దపెద్ద నగరాలవంటి నిర్మాణాలే వుండేవి. భూగర్భంలో మరింకేమైనా చారిత్రకఆధారాలు దాగున్నాయేమో మరింత లోతుగా గమనించాల్సిన అవసరం కూడా వుంది.
కారకొండ చెరువు ఇదే |
కారుకొండ తటాకం నుంచి కనిపిస్తున్న గుట్ట |
సీతమ్మ పాదాలు
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళుతున్న బైపాస్ రోడ్ లోనే కారుకొండ గుట్టకు ఉత్తరదిక్కున రోడ్డుమీద సీతమ్మ పాదాల పేరుతో రాతిమీదున్న ముద్రలను పూజిస్తున్నారు. పెద్ద రాతిమీద వస్తువులను అరగదీయటం వల్ల ఏర్పడిన నున్నటి గుంటలు మూడు వున్నాయి. వాటి పక్కనే నునుపు దేలిన పొత్రంవంటి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. రాతిపనిముట్లకాలంలో ఆదిమానవుడు ఉపయోగించిన పనిముట్లమాదిరిగా ఇవికనిపిస్తున్నాయి. ఈ క్యుప్యూల్స్ గురించి మరికొంత లోతుగా అద్యయనం చేయవలసివుంది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎప్పటినుంచో జీవరాశివుండేదని ఆదిమానవులు ఈ ప్రాంతమంతా తిరుగాడారని ఇప్పటికే అనేక నిర్ధిష్టఆధారాలతో నిరూపించబడింది. మన రైల్వే మార్గమంతా సిస్టులు, కైరెన్లు అనబడే రాక్షసగుళ్ళమీదుగానే వెళ్ళిందని ప్రఖ్యాత చరిత్ర కారులు ఆదిరాజువీరభద్రరావుగారు పలుమార్లు పేర్కొన్నారు. అటువంటి ఆదిమానవుల ఆవాసాలకు జంతువులనుంచి ఎండావానలనుంచి రక్షించుకునేందుకు ఇలా చక్కటి కొండ పక్కనే వాగు వుండటం ఎంతైనా ఉపయోగకరమైన అనువైన ఆవాసం అవుతుంది. సహజంగా జైనం కానీ ఆ తర్వాతి బౌద్ధం కానీ ప్రాధమిక ఆవాసాలను ఆధారంగా ఆలంబనగా చేసుకునే వారివారి బసదులను పునర్నించారు. వాటిని ధ్వంసం చేస్తూ ఆ తదనంతర కట్టడాలు ఏర్పడ్డాయని చరిత్ర చెపుతున్న నిజం.
సీతమ్మ పాదాలుగా పిలువబడుతున్న ప్రాంతం |
హేమచంద్రాపురం
కారుకొండ గుట్ట వున్న ప్రాంతం హేమచంద్రాపురం అనిపిలుస్తున్నారు. ఈ పేరురావడం వెనక వున్న కథను స్థానికులు చెప్పినదాని ప్రకారం. గతంలో ఈ ప్రాంతపై జమిందారుగా అధికారాలను స్వంతంగా 700 ఎకరాలను కలిగివున్న కొండపల్లి గోపాలరావుగారి అబ్బాయిపేరు హేమచంద్రరావు, ఆ హేమచంద్రరావుగారి పేరుమీదుగా ఏర్పడినదే హేమచంద్రాపురమట. అట్లాగే కారుకొండ గుట్టకు దక్షిణం వైపున వున్న జుబ్లీపురానిది మరో చిత్రమైన కథ స్థానిక CSI చర్చి జుబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా బిషప్ హజరయ్యగారిచ్చిన స్థలంలో ఏర్పాటయిన వాడకట్టుకు జుబ్లిపురంగా నామకరణం చేసారట. ఈ వివరాలను జూబ్లిపురం గ్రామస్థుడు శ్రీ కనక సుందరం తెలియజేసారు. ఈయన కొన్నాళ్ళు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యారట. మొదట్లో ఎక్కువ కుటుంబాలుండేవి వారికోసం ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేసారు అయితే కాలక్రమంలో రోడ్డుకు దగ్గరగా వుండటం కోసం వారి ఇండ్లను హేమచంద్రాపురం వైపుకు మార్చడంతో జూబ్లిపురం జనాభా దానితోపాటే బడికొచ్చే పిల్లలు ఎవరూ లేకపోవడంతో బడి భవనాలు పూర్తిగా శిధిలాలుగా వదిలేసారు. నిజానికి వాటిని కారుకొండ గుహాలయాల విశిష్టతను తెలియజేసే మ్యూజియం వనరుగా అదేసమయంలో తాత్కాలిక వసతిగృహంగా కూడా వినియోగించుకునే ఏర్పాట్లు చేయవచ్చు. దానివల్ల అంత ఖర్చుతో నిర్మించిన భవనాలు వృధాగా శిధిలమైపోవడం కాకుండా సరైన పనికి ఉపయోగపడ్డట్లవుతుంది. అన్నట్ల ఈ భవనానికి నీటి వసతి, విద్యుత్తు కూడా అందుబాటులో వున్నాయి.
గ్రామదేవతగా సడాలమ్మ పూజలందుకునేది ఇక్కడే
గిరిజనుల కొలుపులు ప్రతీకాత్మక చిత్రం |
సడాలమ్మ దేవత |
ఏదో రాయితెచ్చి పసుపుకుంకుం బొట్లు పెట్టి దణ్ణం పెట్టేస్తున్నారు పైగా కనీసం ఆకారం అందంగానైనా చెక్కిలేదు. తొచినదేదో చేస్తున్నారు గ్రామస్థులు అనుకుంటూ చాలా మంది సులభంగా ఈ గ్రామదేవతను తీసేస్తుంటారు కానీ కొంచెం లోతుగా పరిశీలస్తే గ్రామదేవతలు చాలా పురాతన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యాలు. మాతృస్వామ్య వ్యవస్థకాలంలో ప్రారంభమైన అమ్మదేవతల ఆరాధన పురుషాధిక్య సమాజపు కట్టడులనుతట్టుకుంటూ నిలబడి అనేక ఆనవాళ్ళను మనకోసం అందించేలా చేసింది ఈ గ్రామదేవతలు, సప్తమాత్రుకలు, గిరిజన దేవతలు వంటి వారే. అలాగే సమ్మక్క, సారలమ్మలు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడిని ఎదిరించి నిలబడిన శౌర్యాన్ని రెండెళ్ళకొకమారు వచ్చే జాతర ఆధారంగా గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ముసలమ్మ, నాగులమ్మ, సడాలమ్మ, బాపనమ్మ వంటి కోయ నారీమణుల గురించిన కథలు వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఆ సరిహద్దుల్లో వున్నాయి. కానీ ఆ కథలను చెప్పేవారు దొరకటం లేదు. పటం కధలు కులపురాణాల్లాగా కోయలలో డోలీలు కోయభాషలో ఆయాకథలను చెప్పేవారు. కానీ ఇప్పుడు అటువంటి వారే కనిపించడం లేదు. పైగా పోలవరం పేరుతో అత్యంత ఆదివాసులను ఉన్నచోటునుంచి తరలిస్తున్నాం. తిండి నీరు ఆవాసం దొరికేలా చేయగలమేమో కానీ వారి నరనరాల్లో ఇంకిపోయివున్న సంస్కృతి వారి తరంతోనే చచ్చిపోకుండా కాపాడగలమా. డిష్ యాంటెన్నా మధ్య, టెలిఫోన్ వైర్ల వలల్లో వారి జీవితాలు చిక్కుబడి గందరగోళపడిపోకుండా సాఫీగా నడిచేలా చేయగలమా? ఈ సడాలమ్మ కథకూడా ఎక్కడో ఏ గిరిజన డోలీ మెదడులో బ్రతికుందో వెతికి చెప్పించుకోలేకపోతే అది అతనితో పాటే చితిలో నిశ్శబ్దంగా కాలిపోవడం ఖాయం. పినపాక ప్రాంతంలోనూ సడాలమ్మ జాతర వసంతకాలం ఆరంభం అంటే మార్చినెలలో జరుగుతుంది. వనదేవత రాక సందర్భంగా లక్ష్మీదేవిని తోడ్కొని వెళ్లి కొండ ప్రాంతంలో వన దేవతకు ఎదుర్కోలు పలికి డప్పువాయిద్యాలతో గద్దెకు తరలించడం.. వనదేవత రాక సందర్భంగా పెద్దవాగు వద్ద సంతాన ప్రాప్తి కోసం అధిక సంఖ్యలో మహాళలు వేచి ఉండగా గిరిజన పూజారి వడ్డే వన దేవతను గిరిజన మహిళల పైనుంచి తోడ్కొని వెళ్లారు. తమకు ఆ వనదేవత దీవనెలు అందినట్లు భావిస్తారు. ఆ తర్వాత భక్తులు కానుకలు, బెల్లం, మొక్కుబడులను దేవతలకు సమర్పించుకుంటారు. రాత్రి వనదేవతను, సడాలమ్మ తల్లిని గోదావరికి తరలించి అక్కడ పుణ్య స్నానాలు చేయించి మళ్లి గద్దె పైకి తోడ్కొని రావడం అనేది గిరిజన ఆచారంగా పినపాక ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకోవడం మనం గమనించవచ్చు.
ప్రపంచస్థాయి మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ ప్రణాళిక
తెలంగాణలోని బౌద్ధమత అవశేషాలన్నీ ఒకచోట చేర్చి అతి పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నారు. గత మే నెలలో నాగార్జునసాగర్‌లో ప్రజాప్రతినిధులకు శిక్షణా శిబిరాలు నిర్వహించినపు సాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అక్కడ నిర్మాణంలో ఉన్న థీమ్ పార్కును సందర్శించి అభివృద్ధికి అనేక సూచనలు చేశారు. ఇక్కడ ప్రపంచస్థాయి మ్యూజియంను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మ్యూజియంతో పాటు సుమారు 500 ఎకరాల్లో మైసూరు బృందావనం మాదిరిగా ధీమ్ పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం యాదగిరిగుట్టలాగే ఒక ప్రత్యేక అథారిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇపుడు ఈ మ్యూజియంలోకి వివిధ బౌద్ధమత అవశేషాలను తరలించాల్సి ఉంది. సాగర్ డ్యామ్ పక్కన ఏర్పాటవుతున్న ఈ మ్యూజియంలోకి ఇంతకుముందు డ్యామ్ గర్భంలో లభించి తరలించిన పురాసంపదను వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది. అలాగే కాలచక్ర పేరుతో తరలించిన స్థూపాలు శిల్పాలు ఇతర ఆనవాళ్లను కూడా తీసుకురావాలి. నల్లబంగారంతో రాష్ట్రానికి సిరులవన్నెలద్దే ఈ ప్రాంతం ఇప్పుడు జిల్లా కేంద్రంగా కూడా మారింది. దీనికి సహజంగానే వున్న అత్యంత అరుదైన పర్యాటక ఆకర్షణలను వెలుగులోకి తీసుకు రావడం వల్ల ఖ్యాతితోపాటు, పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది.
Referance
ఈ గుహల గురించి ఆర్కియాలజీ వారు అధికారికంగా ప్రచురించిన సమాచారం ఇది |
తెలంగాణ మ్యూజియం లో పొందుపరచిన బొమ్మ. రాతిగోళం చుట్టూ పిచ్చిపిచ్చిగా మొక్కలూ వృక్షాలూ పెరగటాన్ని గమనించవచ్చు. |
@ సడాలమ్మ : బుద్ద విగ్రహం దగ్గర్లో కొలువొందిన దేవత, సమ్మక్క సారలమ్మల లాగానే గిరిజన వీరవనిత కావచ్చని ఒక కథనం. పాండవులలో చిన్నవాడైన సహదేవుని పేరుమీదుగా ఈ సడాలమ్మ పేరు వచ్చి వుండొచ్చని మరొక కథనం
@ దెగోబా : విచిత్ర మాంత్రిక గుహలు అన్న ఉద్దేశ్యంతో పెట్టిన పేరు. Dagobah is a solar system in the Star Wars films, The Empire Strikes Back and Return of the Jedi. It also appears in a deleted scene from Revenge of the Sith. Yoda went into exile on Dagobah after a lightsaber battle with Darth Sidious.
"That place… is strong with the dark side of the Force. A domain of evil it is. In you must go." "What's in there?" "Only what you take with you."
The Cave of Evil, also known as the dark-side cave, was a large, dark side-infested hollow located under a gnarltree on the swamp planet of Dagobah. Entering the cave gave an individual the ability to see an apparition of a possible dark future.
@ గవిడి మంగయ్య గారు శ్రీకంఠ ఉమామహేశ్వరుని ఆలయం కోసం స్థల దానం చేసిన వ్యక్తి
@ కె సాయి గోపాల్ గారి తండ్రిగారి పేరుమీదుగానే హేమచంద్రాపురాన్ని గోపాలరావు జమిందారు గారు కట్టించారట. సాయిగోపాల్ గారు ప్రస్తుతం ఇండియన్ గ్యాస్ లో మేనేజర్ గా చేస్తున్నారు నంబరు 9394775014
@ కనకసుందరం : మాజీ సింగరేణి ఉద్యోగి, జుబ్లీపురం వివరాలను తెలిపిన వ్యక్తి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి