నేలకొండపల్లి ఎంత తవ్వినా తరగని ఒక చారిత్రక గని

ప్రాచీన ఆదిమనవుని అడుగుజాడల నుంచి జైనం ఆనవాళ్ళు, అతిపెద్ద బౌద్ధస్థూపం, కోట్లాది రూపాయిల విలువైన బుద్ధవిగ్రహం బయటపడిన ప్రాంతం ఇదే. త్రిపీఠకాలలో ఒకటైన సుత్తపిటకములోని ఐదుమహా నికాయల్లోని మజ్జమ నికాయాన్ని ప్రతిబింబించే ప్రాచీన ప్రాకృతపదాన్ని గుండెల్లో పొదువుకున్న మజ్జిగూడెం వున్నదీ ఇక్కడే. నాసిక్ శాసనం ద్వారా గౌతమీపుత్రశాతకర్ణి ఆధీనంలో వున్న రాజ్యాలలో అస్మకకు చెందిన రాజ్యాభాగాల్లో ఇదొకటి. ఇదే. దక్షిణాపథపతి అనిపిలువబడ్డ ఇక్షాకుడు శాంతమూలుని పాలనలో క్రీస్తుశకం ప్రారంభదశల్లో వున్న ప్రాంతాల్లో ఒకటి. క్రీశ 591 ప్రాంతంలో మహదేవ వర్మ ఖమ్మం దుర్గాన్ని ఏలుతున్న కాలాన్ని పొదువుకుంది. 950 ల నాటికి ఖమ్మం కోటకు తమ గుప్తధనాన్ని వెచ్చించిన ముగ్గురు రెడ్డి సోదరులు(రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి) పాలనాదశలను చూసింది. ముదిగొండ చాళుక్యుల్లో రణమర్ధనుడి కుమారుడు మొదటి కుసుమాయుధుడి రాజకీయ కార్యకలాపాలను ప్రస్తావించిన బెజవాడ తామ్రపత్రశాసనంలో ప్రస్తవించబడిన ప్రాంతం. వేంగిదేశ సరిహద్దుప్రాంతంగా కొన్నాళ్ళు కొరవి కొండపల్లి వున్నట్లు పేర్కొన్నారు.


విదేశీయుల దృష్టిని సైతం అత్యంతంగా ఆకర్షించిన ప్రాంతం అప్పుడెప్పుడో మరీ ఒకటవ శతాబ్దం కాలంలోనే ptolemy (టోలమీ) రాసిన Ancient India లో పేర్కొన్న ‘‘Nelkynda ’’ గా తన వ్యాపార కార్యకలాపాలను మసలీపట్నం వరకూ నిర్వహించుకున్నప్రాంతం. ఏడవశతాబ్దంలో హర్షవర్ధనుడి కాలంలో చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ తన పర్యటన డైరీలో ప్రస్తావించిన ప్రాంతం. 12 వ శతాబ్దంలో ప్రఖ్యాత ఇటలీ యాత్రికుడు మర్కోపోలో చూసుకుంటూ వెళ్ళిన ప్రాంతం.

చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరాలయం , భీమేశ్వరాలయం , వేణుగోపాలస్వామి మరియు ఉత్తరేశ్వర ఆలయములను ఇప్పటికీ తన గుండెల్లో పొదవుకునే వున్న ప్రాంతం. భక్తరామదాసును కన్నతల్లిగా భద్రాద్రిరాముడి ముందు మోకరిల్లిన ప్రాంతం. ఇప్పుడంటే ఒక చిన్న ఆవాసంగా ఖమ్మంనుంచి కోదాడ వెళుతున్న రహదారిలో ఒకానొక పల్లెటూరుగా మాత్రమే ఉండొచ్చుగాక. ఇంత చరిత్రా కాలగర్భంలో మాయమై పోతుందా? లేదు ఒక్కోకాలానికీ సంభందించిన గుప్పెడు ఆధారాలను జాగ్రత్తగా తన దేహపైనే జ్ఞాపకంబొట్లుగా నిలుపుకోనే వుంచింది. వెతుక్కునే మనసూ తీరికా మనకే వుండాలి కానీ.

సరే ఇప్పటికే దొరకిన అపార సంపదగురించి రాస్తే అదే పెద్ద పుస్తకం అవుతంది కానీ ఈమధ్య గమనించిన మరికొన్ని ఆధారాలను మీముందుంచుతాను. రామదాసు ధ్యానమందిరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, గోపన్న సాహిత్యాన్ని వ్యయప్రయాలకోర్చి సేకరిస్తున్న విశ్రాంత అద్యాపకులు శ్రీయుతులు సాధురాధాకృష్ణమూర్తిగారు కాల్వొడ్డున ఒక శాసనం ఉన్నట్లుంది చూసిపోదురురమ్మని హరగోపాల్ గారినీ, నన్నూ పిలిచారు. 29నాటి తానా కార్యక్రమం ముగించుకుని హరగోపాల్ సార్ తిరుగుప్రయాణంలో వుండటంతో నేనొక్కడినే శాసనాన్ని చూద్దామని వారితో వెళ్ళాను. తీరాచూస్తే అక్కడ ఆ పాత కాల్వ ఒడ్డున, పందుల పెంపకం నడుస్తూ గందరగోళంగా వున్న ప్రదేశంలో శాసన స్థుపంతో పాటు ఆశ్చర్యపోయేంత అపార చారిత్రక ఆధారాలు నిరాధరణలో పడిపోయివున్నాయి. నల్లశానపురాయితో నిర్మించిన అమ్మవార్లవిగ్రహాలు తలలు తెగగొట్టబడివున్నవి. వేర్వేరు వీరగల్లులు అడ్డదిడ్డంగా పడేసివున్నాయి. శాసన స్థంభానికి పందులు వీపుగోక్కునేందుకు వాడుకుంటున్నాయి. చాలా కాలం క్రితం కవి బావ పోతగాని సత్యనారాయణ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి నువ్వెలాగైనా ఒకసారి వచ్చి చూడొచ్చుకదా అని అడిగారు కానీ పూర్వపు విజిట్స్ లో ప్రదేశాన్ని సరిగ్గా లొకేట్ చేయలేకపోయాను. నడుంనొప్పికోసమని పెట్టిన సెలవెటుపోయిందో కానీ ఒకపూటంతా గడిపినా నొప్పేమీ తెలీలేదు, సమయమూ సరిపోలేదనిపించింది. ఇంకా చెరువులోపట బురదమధ్యలో తూటికాడల పేరుకుని పున్న చోట్లలో కొన్ని ఇలాంటి బ్లాక్ గ్రానైట్ బండలూ, శిలలూ వున్నాయంట ఒకదానిలో అక్షరాలున్నట్లున్నాయి అని స్థానికులు చెప్పారు. కానీ సాయంత్రం వేళ వెళ్లేలా లేదు. మరికొంచెం నీళ్ళు తగ్గితే సులభం అవుతుంది అన్నారు. ఈ శాసనాన్ని మట్టిల్లోంచి బయటికి జాగ్రత్తగా పెల్లగిస్తూ శుభ్రంగా కడిగించి దానిని వైట్ ఫౌడర్ ఫోటోలుగా తీసుకున్నాను.ఇంతకు ముందే ప్రచురించిన శాసనాల్లో వుంటుందేమో నని తెలంగాణ శాసనాలు ఒకటి రెండు సంపుటాలను, ICHR ప్రచురించిన కాకతీయ శాసనాలు (SS రామచంద్రమూర్తిగారు) లో మాత్రం వెతికి చూసాను. మొదటి దాన్లో నేలకొండపల్లివి రెండు శాసనాలు వున్నాయి కానీ ఇది లేదు. రెండవదానిలో నేలకొండపల్లి శాసనాలేవీ చేర్చబడిలేవు. మరికొంత సరిచూడాలి కానీ అప్పటివరకూ ఏం రాసివుందోనన్న ఆతృత ఆగదు కాబట్టి వాటిని అచ్చుగా తీసుకున్నాను. కాకతీయుల పాలన నాటివని అయితే స్పష్టంగా తెలిసింది. కొండపల్లిఅంటూ ఊరిపేరు ప్రస్తావించబడింది. మరికొంచెం పరిశీలనగా చూసేందుకు సీనియర్ల సహకారాన్నీ కూడా తీసుకోవాలి. ఆ ఫోటలను ఇక్కడ జతచేస్తున్నాను ఒకసారి పరిశీలించండి. నేలకొండపల్ల వాస్తవ్యులు సహకరిస్తే త్వరలోనే ఈ శాసన స్థంబాన్ని రామదాసు ధ్యానమందిరం ఆవరణలోకి చేర్చాలి. ఈ విగ్రహాలను సైతం సరైన పద్దతిలో బౌధ్దస్థూపం ఆవరణలో ఒక గది కేటాయించి అమర్చగలిగితే ఇదే ఒక చారిత్రకమ్యూజియంలా వుంటుంది. వీటికి తోడు మరెన్నో ఆధారాలనూ, వాటి రెప్లికాలనూ సైతం నేలకొండపల్లి బౌద్ధస్థూపం ఆవరణలో ఏర్పాటుచేసే మ్యూజియంలో వుంచవచ్చు. స్థూపం సందర్శనకోసం వచ్చేవారికి ఏదో చూసాం వెళ్ళాం అన్నట్లు కాక నేలకొండపల్లి చారిత్రక నేపద్యాన్ని కాలానుగుణంగా అర్ధంచేసుకునే అవకాశం వస్తుంది. చూడాలి చరిత్ర గురించి నిజంగా ఆమాత్రం పట్టించుకునే శ్రద్ద ఈ నూతన సంవత్సరానికైనా వుంటుందా లేదా అన్నది.



మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
మీ కట్టా శ్రీనివాస్.
ఫోటోలను ఈ లింకు నుంచి చూడొచ్చు

కామెంట్‌లు