నిజమే నాకిది నచ్చలేదు. బహుశా నేనో లేదా నువ్వో అర్ధంచేసుకోవలసింది చాలా మిగిలే వుందేమో
అర్జున్ రెడ్డి సినిమాకు ఇది రివ్వూ కాదు డాక్టర్ అర్జున్ రెడ్డికి అటాప్సీ కావచ్చు. సినిమా చూసాక ఏమన్నా మాట్లాడితే షార్ట్ గా రెండేముక్కలు గుర్తుంటాయి. బావుందా? బాగాలేదా? అంతే. నాన్నకు ప్రేమతో సినిమాలో జగపతిబాబు గోల్డు, సిల్వర్ బాల్స్ లో ఏదన్నా ఒక్కటి ఎంచుకోమన్నట్లు. తమ అభిప్రాయమే గోల్డు కావాలనుకుంటే దానికోసం బోలెడన్ని లాజిక్ లు వుంటాయి కదా. తెలివైన వాడు, అతి తెలివైన వాడు, అతితెలివైనవాడికన్నా తెలివైన వాడు.. ద్యావుడా చెప్పాలి... స..ర్ర్...
పిజి చేస్తున్న అన్నయ్య బిడ్డ రిలీజ్ రోజే అర్జున్ రెడ్డి సినిమాకు వెళితే ఎలావుందిరా అని మెసేజ్ పెట్టాను. చాలా బాగుంది బాబాయ్ వీడికి ఫ్యాన్స్ అయిపోయాను. అంటూ తర్వాతి మెసేజ్ లో ’’నీకు నచ్చక పోవచ్చు‘‘ అంటూ ముగించింది. చాలా మంది విశ్లేషకులు కూడా ఇది ఎక్స్ జనరేషన్ మూవీ అని పాత తరానికి నచ్చదులే అనటంతో రాజు గారి వస్త్రాలను ఏమన్నా విమర్శిస్తే వెనకబడిపోతామేమో ననే చిన్న భయం నాటుకుని మొక్క వృక్షంలా పెరిగినట్లుంది. పర్లేదు నాకనిపించింది నేను చెప్తాను. యువతరం ఎంత వేగంగా ఆలోచిస్తుందో అందుకు సరిపోయేలా పాతబడని డైలాగ్స్ సీక్వెన్స్, మెలోడ్రామాలతో చావగొట్టాల్సిన పాతపద్దతుల మూసలను తోసిరాజని సింపుల్ లైవ్ సీక్వెన్స్ తీసుకోవడం, రొడ్డ కొట్టుడు, ఊర డైలాగులు, హీరోయిజాల పాతవాసనకు దూరంగా ప్రెష్ గా ఒక సినిమా కనిపించడం సంతోషమే. అందుకే అంత ముందుగా వున్నారు కాబట్టి అటువంటి వాళ్లకే నచ్చిందా లేక కొత్తసీసాలో పాత కొక్ తాగుతూ సంబరపడుతున్న చాలా మంది జనాలు కూడా వున్నారా? ఇది అర్ధం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలకు ఏం సమాధానం తడుతుందో మీరూ చూడండి.
1) సెల్ఫీషా లేక బోల్డా(Selfish of Bold) ? నీది కూడా వాడే లాక్కుని తింటూ నేను చాలా ఓపెన్ టైప్ వాయ్ ఎటువంటి మొహమాటం లేదనే వాళ్ల రకం ఒకటుంది. వాళ్లు తప్ప మరింకేమీ పట్టని వాళ్ల భోషాణం కోరికలకు బోల్డు నెస్ అని పెట్టుకుంటారు. పాతబడి బిగుసుకుపోయిన హిపోక్రటిక్ చట్రాలను బద్దలు కొట్టుకుంటూ ఆలోచించినా కేవలం తమకోసమే కాదు. నాచుట్టూ సమాజం వుందనే బోల్డు నెస్ మనుషులతో వీళ్లని పోల్చుకోవడమే దారుణం ముందు. అర్జున్ రెడ్డి ప్రవర్తన మొత్తంలో తనకోస తను డేర్ గా వున్నాడా అంతకంటేనా? అమ్మాయి పై కర్చిప్ వేసి రిజర్వేషన్ చేసుకోవటం దగ్గర్నుంచి, ప్రెండ్ ని తన ప్రతి అవసరం కోసం వాడుకోవటం దగ్గర్నుంచి, కుటుంబాన్ని, ఉద్యోగాన్నీ జానేదో అనటం దగ్గర్నుంచి.. ఏం చేసాడు. ఈ ప్రవర్తన నుంచి ఏం నేర్చుకోవచ్చు.
2) రాగింగ్ నుంచి రక్షించాడా? అంతకంటే లోతుల్లోకి తోసేసాడా? లేక ఉన్నతమైన పరిణామాలను పద్దతులను పరిచయంగానీ చేసాడా? అమ్మాయికి మేలు కలిగించాడా? తనకు తృప్తి కలిగించుకున్నాడా?
3) ఆరుగంటలు టైం భాద్యతా రాహిత్యం: నువ్వు పెళ్ళి చేసుకుందామనుకున్న అమ్మాయి ఇంటికి వెళ్లినప్పుడు మాట్లాడే పద్దతి తెలియదు సరే, యాంగర్ ని మాత్రమే కాదు ఎమోషన్ ని హర్మోనల్ ఆతృతనీ కంట్రోల్ లో వుంచుకోవడం కుదర్లేదు సరే సరే సరే.. దాని వల్ల సహజంగా వచ్చే వాళ్ళ నాన్న కోపానికి ఆ అమ్మాయిని ఒక్కదాన్నే తాను రాజేసిన కోపపు మంటల్లో వదిలేసి, ఆమెకేమీ సహాయం చెయ్యాలన్న ఆలోచన రాకపోగా, దీనంగా ఆగమని వెంటబడుతున్నా, తన ఈగో దెబ్బతిన్నదని విసుక్కుంటూ విసురుకుంటూ వెళ్లిపోవడం. ఇంత పెద్ద సమస్యను ఆ అమ్మాయి మాటల్తో సరిచేసుకుని తనని సంతోష పెట్టేందుకు వచ్చేయాలని కేవలం పోన్ వైపు చూస్తూ కూర్చోవటం, ఆ టైం లోగా రాలేదేమో అనుకుని డాక్టర్ అయ్యివుండీ చచ్చేది కూడా తెలియనంతగా ఆల్కహాల్ ని డ్రగ్ ని తీసుకోవడం. ప్యాంట్ లోనే పాస్ పోసుకున్న మరకలతో ఇంటర్వెల్ రావడం. నిజమే కదా కొత్త తరహా నే. పాత జనాలకు అర్ధం కాదులే డియర్స్.
4) ఇలా వుండటాన్ని ఇష్టపడుతున్నారా మీరు కూడా? చదువుల్లోనూ, ఆటల్లోనూ నంబర్ వన్ అంటూ డైలాగులు చెప్పకుండా ఏదీ లెక్కలేకుండా అన్ లిమిటెడ్ ఆల్కహాల్, అన్ రెస్ట్రిక్టెడ్ కోరికలతో తిరగాలని నేటితరం కోరుకుంటోందా? దీన్ని అనుకరించేస్తేనో, అనుసరిస్తేనో పాత బందనాలన్నీ చట్ ఫట్ మని తెంపేసుకుంటూ కొత్తతరం హాయిగా బ్రతికే రోజులు వచ్చేస్తాయా?
5) పర్వర్షన్ సంతృప్తి వల్ల బావుందనే వాళ్ళెవరూ లేరా? సమాజిక నిభందనల వల్ల పద్దతుల్లో మాత్రమే దొరికేలా చేసిన శారీరకసుఖాలను హీరో సునాయాసంగా అన్ లిమిటెడ్ గా పొందాడనే విషయాన్ని పర్సానిఫై దృష్టితో బావుందను కుంటున్న వాళ్ళు ఎవ్వరూ లేరా? ఇటువంటి అమిగ్డాలిక్ ఫ్లో ఆదారంగా సినిమాలు క్లిక్ అవటం తప్పకుండా మాస్ హిస్టీరియాను క్రియేట్ చేస్తుంది. హద్దులు చెరిపిన హింస శివ సినిమాను ఊపు ఊపినట్లే, హద్దుల్లేని లవ్ మేకింగ్ ‘అరె’ ను అరాచకం చేయిస్తుంది. క్లిక్ కోసం కలెక్షన్ల కోసం అంగలార్చుతున్న సినీపరిశ్రమలో అదే దారిలో మరిన్ని సినిమాలు తప్పకుండా వచ్చితీరతాయి కదా.
6) అర్జున్ రెడ్డి అలానే వున్నప్పుడు రాని క్లైమాక్స్ మారిన తర్వాత వచ్చిందెందుకు? అర్జున్ రెడ్డి విచ్చలవిడిగా కనిపించటం ఒక మాయాపొర అయినా హీరోయిన్ ను తప్ప మరెవ్వరితోనూ శారీరక సంభందాలు లేవనే పాతపూత. హీరోయిన్ మూడో రోజే భర్తను వదిలేసింది, చిటికెన వేలు గోరుని కూడా తాకనియ్యలేదు. ఆమె కడుపులోని బిడ్డకు హీరోనే తండ్రి అబ్బో చాలా చాలా కొత్తగా ప్యాక్ చేసిన పాత మషాలా. ఇది లేకుండా సినిమాని ముగించగలిగేవారా? ఇది కానీ ఆదర్శనీయమైన రూపాన్ని హీరో(కథానాయకుడి)లో చూపించ గలిగేవారా?
7) హీరోయిన్ కి ఆత్మే లేదా? కథంతా హీరో వెర్షనే కనీస వ్యక్తిత్వం లేని అమ్మాయిలే కొత్త తరంలో వుంటారా? కర్చిప్ వేసుకుని గీత గీస్తే రింగు మధ్యలో నిలబడి సర్కస్ చేస్తారా? అతనికి నచ్చింది కాబట్టి వీళ్లూ సరెండర్ అవుతారా?ఛీ అన్నా ఛా అన్నా బేబీ బేబీ ఒక్కమాట విను అంటూప్రాధేయ పడి కన్నీళ్ళుపెట్టుకోవడం తప్ప ఏమీ రాదా పురుషులంత వేగంగా ఎదగలేదా ఈ కొత్త ఎక్స్ జనరేషన్ లో అమ్మాయిలు? వస్తాడో రాడో తెలియక పోయినా కుటుంబాన్ని వదిలేసుకుని తనదంటూ ఏమీలేకుండా రోజుల తరబడి వస్తాడో రాడో తెలియని వాడికోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా ఉంగరం కూడా లేని ఈ నవీన శకుంతలలు.
8) తాగినా వందల ఆపరేషన్లు సరిగ్గానే చేసాడట, అలా ఎలో చేసిన ఆసుపత్రికీ విషయంలో ఎటువంటి తప్పులేదట సినిమాటిక్ ఉదాత్తత హబ్బో.
9) ఇంకా మరీ వరుస పెట్టి మరెన్నో ప్రశ్నలు. ఇవి నచ్చని వాళ్ళు ఇక్కడిదాకా కూడా ఎలాగూ చదవరు. నచ్చిన వాళ్ళకు ఇంతకంటే సరైన ప్రశ్నలే మరిన్ని వచ్చేవుంటాయి.
ఇదుగోండి నా బాల్ ఇలా ముందుకు తోస్తున్నాను.
ఎవర్నా నాకు నచ్చింది మీకు నచ్చదేమో అంటే మీకంటే నేను ఎమోషనల్ లైన్ కి పైన వున్నానంటున్నానని వారన్నట్లు. మీకు నచ్చిందేమో నాకు నచ్చలేదు అనగలుగుతుంటే ఆచరణశీలతతో సరిచూసుకునే లైన్ పైన కూడా ఒకసారి నిలబడి నేను చూస్తున్నాను అని.
పంజరం బాగాలేదని తన్నుకుంటూ ఎగిరిపోయిందో పిట్ట భలే బావుందనుకున్న మెదడు కూడా తన చుట్టూ కపాలం బిగుసుకుని వుండటాన్ని తిట్టుకుంది. ఈ విషయాన్ని చూసిన గుప్పెడంత గుండె కూడా తనచుట్టూ ఎముకల జైలు బాగాలేదేమో నని విసుగుపడింది. పక్కనే ఒకడు పిడుగుకీ, బియ్యానికీ ఒకే మంత్రం ప్రాక్టీసుచేస్తున్నాడు. మరింకెవడో ఆపక్కన మోకాలికీ బోడిగుండుకీ మధ్య సాపాత్యాన్ని వివరిస్తున్నాడు.
మాటల్లో చెపితే అర్ధం అవుతుందో లేదో సినిమా చూసాక, మొత్తం మరోసారి చదువుకుని చూడండి.
ఫేస్ బుక్ లో ఈ పోస్టింగ్ పై మిత్రుల కామెంట్స్ ఇక్కడ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి