చాలా అంచనాలతో వచ్చి బోలెడంత నెగెటివ్ టాక్ ని
ఎదుర్కొంటున్న స్పైడర్ సినిమాను చూసాను. నా వరకూ ఇబ్బందిగానో బోరింగ్ గానో ఏమీ
లేదు. కొన్ని విషయాలు నచ్చాయి కూడా. సరే అభిప్రాయాన్ని చెప్పడం కంటే ఏం చూసానో
కొంత చెప్పడం వల్ల చూడాలో వద్దో నిర్ణయించుకునే అవకాశం మీ చేతుల్లోకి వస్తుంది కదా
అందుకే కొన్ని మాటలు. కృష్ణగారి గూఢచారి 007 లేదా రోబో లాంటి టక్నికల్ అంటూ ముందే
ఒక ఊహతో చూడటం మొదలేస్తే బహుశా అనుకున్న మాదిరిగా వుండక పోవడంతో బోర్ కొట్టొచ్చు.
కేవలం ఒకానొక కథ వాళ్ళు పాత్రలు వరకే చూస్తే ఇలా నడుస్తుంది.
హీరో శివ
(మహేశ్ బాబు) ఫోన్ ట్యాపింగ్ ని ఉద్యోగంలా చేస్తుంటాడు. కేవలం 40 వేల ఉద్యోగమే
అయినా నలుగురికి మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తనకున్న అదనపు అర్హతలను పక్కన పెట్టి దానిలోనే కొనసాగుతుంటాడు. ఫోన్
ట్యాపింగ్ లాంటి టెక్నికల్ పనిలో తనకున్న సాప్ట్ వేర్ పరిజ్ఞానం వాడి కొత్త
పద్దతిలో ఎవరన్నా ఆపదలో వున్నా, హెల్ప్ అన్నా, లేదా ఏదన్నా థ్రెటనింగ్ మాటలు
వచ్చినా ఆ విషయం ఇతని దృష్టికి వచ్చేలా సాప్ట్ వేర్ తయారు చేసి దాని సహాయంతో
రాబోయే ఇబ్బందులను తప్పిస్తుంటాడు. నిజానికి ఇంట్రో సీన్ కూడా ఇదే ఒక అమ్మాయిని
ట్రాప్ చేసి ఆమె డబ్బు నగలు కొట్టేసి, ఆమెను ఇద్దరు మిత్రులు పంచుకుందామని ప్లాన్
వేసిన విషయాన్ని గమనించి ఆ ఉచ్చులోంచి అమ్మాయిని రక్షిస్తాడు. ఆమె నువ్వు నా
అన్నలాంటోనివి అన్న విషయాన్న ఉదాహరణగా చెప్పి అందుకోసమే తను ఉద్యోగం చిన్నదైనా
చేస్తున్నానని చెప్తాడు.
విలన్ భైరవుడు(ఎస్ జె సూర్య) తండ్రి కాటికాపరి
కావడంతో పుట్టడమే స్మశానంలో ఏడుపుల మధ్య పుట్టిన పిల్లాడు. శవాలు సామధుల మధ్యనే
పెరిగిన వాడు అతనికి ఎవరన్నా ఏడుస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. కొన్నాళ్లు తండ్రికి
పనేమీ లేకపోవడంతో ఫిట్స్ తో చావుబతుకుల మధ్య వున్న ఒకతన్ని చంపి స్మశానంలో
పనికల్పించుకోవడందగ్గర నుంచి ఒంటరిగా వున్న ఒక్కొక్కరిని చంపడం అలవాటుగా చేసుకుని
దానిలో తెగ ఆనందం వెతుక్కుంటుంటాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఒక రాత్రి
ఇంటికి గడిపెట్టి కాటికాపరి ఇల్లు మొత్తం కాల్చేస్తారు. కానీ అప్పటికే ఇంటి బయట
వున్న భైరవుడు అతని తమ్ముడూ బతికి పోతారు. కానీ ఇదంతా కళ్లారా చూడటంతో మరింత
ఉద్రేకానికి లోనై ఆ గ్రామస్తులను మరీ మరీ చంపేస్తూ వుంటాడు. కానీ కాటికాపరి
కుటుంబాన్ని చంపిన పాపం వల్లనే ఊరంతా వల్లకాడవుతోందని గ్రామస్తులు ఖాళీ చేసి
వెళ్ళిపోతారు. మరింత ప్రకోపించిన శాడిజంతో విలన్ నగరంలో పడతాడు. భైరవుడి తమ్ముడిగా
ప్రేమిస్తే సినిమాలో హీరోగా చేసిన భరత్ మహేశ్ కనిపిస్తాడు. ఫస్టాఫ్ లోనే పోతాడు
కూడా.
హీరోయిన్ మెడికల్ విధ్యార్ధిని ఛార్లీగా రకుల్
ప్రీత్ సింగ్ నటించింది. నూటికి 96 శాతం మార్కులు తెచ్చుకునే విధ్యార్ధినే కానీ
అనుకోకుండా నెట్ లో చూసిన పోర్న్ విడియోల ప్రభావంతో బ్లెండ్ డేట్ చేసి అయినా సరే ఈ
ఉత్సుకతను తగ్గించుకుని చదువుమీద ధ్యాస పూర్తిగా పెట్టాలని ఫోన్ లో తన
స్నేహితురాలితో మాట్లాడుతూ హీరో శివకు దొరికిపోతుంది. కొంచెం ఎబ్బెట్టుగా వుండే
నిజన్ని ఈ పాత్రలో చూపించినా మరీ సీరియస్ గా సినిమా మిగిలిపోకుండా కొంత రిలీఫ్ ఈ
పాత్ర.
ప్రధానమైన మలుపు : ఒకరోజు ఒంటరిగా వున్న ఇంటర్
అమ్మాయి భయపడుతున్నానన్న కాల్ ని టాప్ చేయడం ద్వారా విన్న శివ ఎందుకైనా మంచిదని తన
పోలీసు స్నేహితురాలిని ఆమెకు అండగా వెళ్లమంటాడు కానీ సైకో కిల్లర్ చేతిలో ఇద్దరూ
హతం అయ్యి ఉదయానికల్లా ఎవరి శరీరభాగాలు ఏవో తెలియనంతగా ముక్కలుగా నరకబడిపోతారు.
దీంతో బాధపడిన శివ మొదట ఉద్యోగం మానేద్దాం అనుకున్నా తర్వాత వాళ్ల నాన్న ఇలాంటివి
జరక్కుండా ఆపటం కూడా నీ విధి అనటంతో దీన్ని సీరియస్ టాస్క్ గా తీసుకోవడంతో కథ
ముడిపడుతుంది.
సెకండాఫ్ బ్రెయిన్ గేమ్: ఫస్టాప్ పాత్రల పరిచయంతో
కొంచెం సాగదీసినట్లు నడిచినా విలన్ ని పట్టుకోవడం కోసం వాడే టెక్నికల్ నాలెడ్జ్ తో
కథ కొత్త మలుపులోకి వస్తుంది. అన్నాళ్ళు ఎవ్వరికీ దొరకకుండా చీకట్లో వుంటూ నేరాలు
చేస్తున్న అన్నదమ్ములని ఒక ఫేక్ వాట్సప్ విడియోని ఎరగా వేసి వాళ్ళ స్వంతఊరువరకూ
చేరుకుని కూపి లాగుతాడు. అయినా బెదరని భైరవుడు మరింత కృరంగా వార్నింగ్ ఇస్తే అందరి
ముందూ వాడి తమ్ముడిని చంపేసి ఛాలెంజ్ విసురుతాడు శివ. హీరో తల్లి తమ్ముడిని
రక్షించే ఘట్టం, రోలర్ కోస్టర్ మీద భరత్ మహేశ్, మహేశ్ బాబుల ఫైటింగ్ సీన్, విలన్
పన్నాగంతో డొర్లుకుంటూ వస్తున్న పెద్ద బండను లారీతో అడ్డుకునే సీన్, చివర్లో లైఫ్
లైన్ సంజీవనీ హాస్పటల్ ని కూల్చుతున్నప్పుడు చేసిన ఫైటింగ్ సీక్వెన్స్ లు పీటర్
హేయిన్స్ పనితనానికి మెచ్చుతునకలు. కాకపోతే గ్రాఫిక్ వర్క్ విషయంలో ఏమంత బాగా
అనిపించలేదు. ఆ విషయంలో మరికొంత శ్రద్ద తీసుకుంటే బావుండేది.
సహాయక పాత్రలు : ప్రియదర్శి పులికొండ ప్రత్యేకమైన
కంఠం, ఆర్జే బాలాజీ నటన హీరో యూత్ ఫుల్ ట్రెండ్ కి బాగా ఉపయోగపడ్డాయి. పోలీసుక
అధికారులు వగైరా పాత్రల్లో సీనియర్ నటులు వారి పరిధి మేరకు నటించారు.
ఒక
ప్రత్యేకమైన సీన్ లో హీరో చేత కాల్చబడ్డ విలన్ సివిలియన్ ఇంట్లో వాళ్లను భందీ చేసి
రక్షణ పొందుతుంటాడు. ఆ విషయాన్ని రెండుగంటల్లో బ్రేక్ చేసేందుకు టివి శాటిలైట్
సిగ్నల్ ను ట్యాప్ చేసి సీరియల్ చూస్తున్న మహిళల సహాయంతో విలన్ నుంచి ఇంటి వాళ్లను
రక్షించడం అనే సీన్ కొత్తగా బావుంది.
టెక్నికల్ సంగతులైతే ప్రత్యేకమైన మార్కులు హ్యరీస్
జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరుకివ్వాలి. యాక్షన్ నేపద్యంలో సాగే సన్నివేశాలను
తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సక్సెస్ అయ్యారు.
ఇంత సైకో విలన్ చేసిన వీరంగం ఏమిటి? దాన్ని హీరో
ఎలా ఎదుర్కోన్నాడు. హీరోయిన్ హీరో జీవితంలోకి ఎలా వచ్చింది? కమెడియన్లంటూ
ప్రత్యేకంగా లేని సినిమాలు నవ్వుకునేందుకు ఏమేమి ఎలిమెంట్లు ఉపయోగపడ్డాయి లాంటివి
కుదిరితే తెరమీద చూడటం బావుంటుంది.
కథ, స్క్రీన్ ప్లే, డైలాగులూ డైరెక్షన్ చేసిన
మురుగదాస్ తన ముందటి సినిమాల్లాగా సమాజానికి పనికొచ్చే మెసేజ్ ను ఈ యాక్షన్
ద్రిల్లర్ లో కూడా జతచేసాడు. హడావిడీ ప్రపంచంలో మానవత్వం కరువై బ్రతుకుతున్న
మనుషులమై పోయాం. సామాజికంగా ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. లైకులు షేరులూ
మీదున్న శ్రద్ద నిజమైన జీవితం మీద ఉండటం లేదు. అందుకే మనిషిని లైక్ చేయండి,
ప్రేమను షేర్ చేయండీ అంటూ హీరో చివర్లో చెప్పే డైలాగులతోనే సినిమా ముగుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి