పాపులర్ మాధ్యమంలో జానపదాల జోరు ఈ మధ్య
సంతోషాన్ని కలిగించే విషయం. రంగస్థలం సినిమాలో ఎంత చక్కంగున్నావే లచ్చిమి అంటూ
లచ్చిమిని పొగిడినా ఎంతచక్కంగున్నావే గీతమా ఎంత హత్తుకున్నావే అంటూ ప్రేక్షకులు
అక్కున చేర్చుకున్నారు. అంతకు ముందు ఫిదాలో వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే అంటూ
తెలంగాణా యాసను సంస్కృతినీ అందంగా చూపించిన పాటకు సాయి పల్లవీ డాన్స్త ప్రతిభ
తోడయ్యింది. అప్పుడెప్పుడో విజయశాంతి లలూదరువాయే లస్కరు బోనాల్ పండ్గకు వస్తనని
రాకపోతివే లసీకా పూలు గోరికి లబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి తుర్ర్..... అంటూ
సాగిన గీతం కూడా గుర్తుండే వుంటుంది.
ఇకపోతే నిన్న కాక మొన్న విడుదల అయిన కృష్ణార్జున
యుద్ద సినిమాలో అచ్చంగా రాయలసీమ జానపద బాణీని అచ్చంగా పరిచయం చేస్తూ సాగిన పాట
దారి చూడు దుమ్ము చూడు అంటూ దుమ్ము దులిపేస్తోంది. @Penchanadas Putta రాసి
పాడిన ఈ పాటకు హిప్ హాప్ థమిజ(ఆదిత్య) సంగీతం, నానీ డాన్స్ అండ్ యాక్షన్ లోని
చక్కటి ఈజ్ కూడా మరింత ఆకర్షణ అయ్యింది.
దారిచూడు గేయ రచయిత పుట్టా పెంచల దాసు వృత్తి
కళాకారుడు మాత్రమే కాదు. ఆయనకు మరుగున పడిపోతున్న జానపద గేయాలను సేకరించడం
ప్రవృత్తి. శ్రమసంస్కృతిలో ప్రతి పనిని మెకానికల్ గా ఆటోమేషన్ లాగా చెయ్యడమనే
అలవాటుకు దిగజారని రోజుల్లో ప్రతి పనితో పాటూ పాట జతకట్టి వుండేది. హైలెస్సో
హైలెస్సో అంటూ పడవను నడిపినా, పట్టర పట్టూ గట్టిగ పట్టూ అంటూ బరువులు ఎత్తినా పాట
తోడుగా వుండేది ఆయాసాన్ని అలసటనూ తీర్చడం మాత్రమే కాక ఆనందాన్ని నలుగురి మధ్య
దారాన్న చేసి కుట్లేసేది. పేరంటం చేసినా పెళ్లిముచ్చట అయినా, పండగో పబ్బమో
వచ్చినా, కుప్ప నూర్చినా, తూర్పారా బట్టినా దుక్కిచేసినా, దమ్ము చేసినా ఆ పనుల
సందట్లో పాట ప్రవహించేది. అర్ధరాత్రి ఒంటరి నెగళ్ళలో పాట దీపమై వెలిగేది. గుంపుల
కోలాటాల్లోనో ఊరేగింపుల్లోనో భజనల్లోనో పాట బాగమైవుండేది. అటువంటి పాటలన్నీ
ఇప్పుడు కేవలం సినిమాలో ఐదు నిమిషాల ఐదు అతుకులుగా మాత్రమే మిగిలిపోయాయి. పాత
పనులన్నీ పద్దతులు మార్చుకుని యంత్రాల చప్పుడులో ఆయిల్ ఇంజను రొదల్లో ఎక్కడో
జారిపోయాయి. ఆ పాటలను మనసుల్లో దాచుకున్న మనుషులు రాలిపోయేలోగా వాటిని
ఒడిసిపట్టుకోకపోతే మళ్ళీ చరిత్ర క్రమంలో ఆయాపాటల ఉనికిని వాటివెనకున్న సంస్కృతినీ
చెప్పేవాళ్ళే వుండరు. పాటంటే కేవలం వాక్యాలూ, పదాలు వాటిని కూర్చిన రాగం మాత్రమే
కాదు. ఆయా పదాల వెనక వున్న సంస్కృతి ముఖ్యమైనదే.
ఈ దారిచూడులో ఒక పదం ‘గాంధారి వాన’ అలాగే
ఆకర్షించింది. ఒక మిత్రుడు ట్యాగ్ చేసిమరీ అదేమిటి అన్నతర్వాత చూసాను కానీ
వెతికితే నిఘంటువులకెక్కని జనపదంలోని వాడుకమాట అనిఅర్దం అయ్యింది. సరే పాట రాసిన
పెంచలయ్యగారే అందుబాటులోవుండగా అదనపు ఇబ్బంది ఎందుకని వారికే ఫోన్ చేసి అడిగితే.
గాంధారి వాన అంటే గుడ్డివాన అంటే ఎదుటివాళ్ళు కనబడనంత దట్టంగా కుంభవృష్టిలా కురిసే
వాన అని అర్ధం అనిచెప్పారు. అలాగే దున్నపోతుల బేరే చూడు అనే మాటలో బేరె అనేదానికి
వరుస అనే అర్ధంలో వాడానన్నారు. కడపజిల్లా చిట్వేల గ్రామానికి చెందిన ఈయన వారి
ప్రాంతంలో ఇప్పటికీ అదే పద్దతిలో ఆయా పదాలను వాడుతున్నట్లు చెప్పారు.
ఆ పాటను ఒకసారి చూడండి.
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బేరె చూడు
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బేరె చూడు
కమలపూడి కమలపూడి
కట్టమిందా మామ
కన్నె పిల్లల జోరె చూడు
కమలపూడి కట్టమిందా మామ
కన్నె పిల్లల జోరె చూడు
బులుగు సోక్కా ఏసిన వాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
బులుగు సోక్కా ఏసిన వాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
చక్కని చుక్క చక్కని చుక్క
దక్కే చూడు మామ చిత్ర కన్ను కొంటెవాడా
చిత్ర కన్ను కొంటెవాడా
చిత్ర కన్ను కొంటెవాడా
మేడలోని కుర్రాదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు
మేడలోని కుర్రాదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు
నిన్ను కోరి నిన్ను కోరి
వన్నెలాడి లైలా
కోట దాటి పేట జేరే
కురస కురస అడివిలోన పిలగా
కురిసినీ గాంధారి వాన
కురస కురస అడివిలోన పిలగా
కురిసినీ గాంధారి వాన
ఎక్కరాని ఎక్కరాని కొండలేక్కి మామ
ప్రేమలోన చిక్కినావు
ఎక్కరాని కొండలేక్కి మామ
ప్రేమలోన చిక్కినావు
పూల చత్రి పట్టుకొని పిలగా
ఊరువాడా తోడురాగా
పూల చత్రి పట్టుకొని పిలగా
ఊరువాడా తోడురాగా
జంటగానే జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
దున్నపోతుల బేరె చూడు
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బేరె చూడు
కమలపూడి కమలపూడి
కట్టమిందా మామ
కన్నె పిల్లల జోరె చూడు
కమలపూడి కట్టమిందా మామ
కన్నె పిల్లల జోరె చూడు
బులుగు సోక్కా ఏసిన వాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
బులుగు సోక్కా ఏసిన వాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
చక్కని చుక్క చక్కని చుక్క
దక్కే చూడు మామ చిత్ర కన్ను కొంటెవాడా
చిత్ర కన్ను కొంటెవాడా
చిత్ర కన్ను కొంటెవాడా
మేడలోని కుర్రాదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు
మేడలోని కుర్రాదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు
నిన్ను కోరి నిన్ను కోరి
వన్నెలాడి లైలా
కోట దాటి పేట జేరే
కురస కురస అడివిలోన పిలగా
కురిసినీ గాంధారి వాన
కురస కురస అడివిలోన పిలగా
కురిసినీ గాంధారి వాన
ఎక్కరాని ఎక్కరాని కొండలేక్కి మామ
ప్రేమలోన చిక్కినావు
ఎక్కరాని కొండలేక్కి మామ
ప్రేమలోన చిక్కినావు
పూల చత్రి పట్టుకొని పిలగా
ఊరువాడా తోడురాగా
పూల చత్రి పట్టుకొని పిలగా
ఊరువాడా తోడురాగా
జంటగానే జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కిందా
అయితే ఈ పాటను సినిమాకోసం అడిగితే 20 నిమిషాల్లో
తయారుచేసి ఇచ్చినట్లు పెంచలయ్యగారు చెపుతున్నారు కానీ దానివెనక మాతృక అయిన
జానపదగీతం ఇదే బాణిలో ఆయన సేకరించిన పాటల్లో మొదటి స్థానంలోవుంది. అందులో వచ్చిన ఈ
పదాలు ఎవరో జానపదులు వాడుకలో ఉపయోగించినవి. అందుకే ఒకసారి వాటిని మరికొంచెం
జాగ్రత్తగా చూడాల్సివచ్చింది. దానికి ముందు సినిమాపాటకు మూలగీతం అయిన జానపద
గీతంలోని చరణాలు ఏమిటో ఒకసారి చూడండి. సంగీత సహకారం లేకుండా ఇంటర్వూలో
పెంచలయ్యగారు పాడిన ఆ పాటను యూట్యూబ్ కి ఎక్కించాను. ఆ పాటను కూడా క్రింది లింకులో
చూడండి.
దారి చూడు దుమ్ము చూడు మామా
దున్నపోతుల బేరే చూడు
దున్నపోతుల బేరే చూడు
కమలపూడి కట్టమింద మామ కన్నెపిల్లల జోరే చూడు ||దారి చూడు ||
విసురు గాలి కసురుచినుకులు మామ
ఇంట్లోవాళ్నటు పొమ్మను చెప్పు మామ
వారవాకిలి ఎయ్యమని చెప్పు
ఇంట్లోవాళ్నటు పొమ్మను చెప్పు మామ
వారవాకిలి ఎయ్యమని చెప్పు
తాటిచెట్టు చక్కదనం చూడు
తాడు లేందే ఎక్కగాకు
మామ కూతురు మంచిదని మామ మనసు లేందే పొందగాకు ||దారి చూడు ||
కురస కురస అడవిలోన మామ
కరిసెనే గాంధారి వాన
తలలు తడిసే మొలలు దడిసే మామ
కసుమపూల కురులు దడిసే
బావికాడ బండమీద మామ మందునూరే మామకొడకా
మందులేల మాకులేల మామ మనసువుంటే సాలును పోరా ||దారి చూడు ||
ఉడత చారల చీర కట్టీ మామ
ఊరిముందర చక్కెర కొట్టి
ఊల్లో వుండే కొంటే వాళ్లు మామ నన్ను చూసి కన్నుకొట్టే
వచ్చిపోయే దారికాడ మామ పెంకు కోసే కోనేట్కాడా
కూడినాము కూడినాము మామ కూకటి గింజల పాయము నాడు.
దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బేరే చూడు
కమల పూడి కట్టమీంద మామ కన్నెపిల్లల జోడే చూడు ||దారి చూడు ||
చిన్న చిన్న మూటలు కట్టి మామ చిలమనేరు బాటలు బట్టి
బాటమీద పోతా వుంటే మామ దారినిండా నీదే మాట మామ ||దారి చూడు ||
దారిచూడు దారిలోని దుమ్ము చూడు మామ(మామ చిచ్చా
ఇలాంటివి సావాసగాండ్లను ఊతపదాలుగడా పిలిచే పిలువులు) దున్నపోతుల బేరే చూడు
ఈ బేర పదం వావిళ్ల సంస్కృత నిఘంటువు ప్రకారం
శరీరము, ప్రతిమ అనే అర్ధంలో చెప్పారు. దున్నపోతుల శరీరాన్ని చూడు అనే అర్ధం మరోవైపు
తెలంగాణాలో ఎడ్ల మెడక్రింది గంగడోళ్ళను బేరెడాకులు అంటారు. దున్నపోతుల గంగడోళ్ళను
చూడు అన్నారా? బిర్రు అనే పదం కూడా ఈ పలుకుబడికి దగ్గరగా మరోమాట వుంది అంటే
ధృఢత్వము, బిగుతు, అనే అర్ధాలున్నాయి. అంటే దున్నపోతుల శరీరంలోని బిగుతుని చూడు
అంటుడొచ్చా అనికూడా అనిపిస్తుంది. అదే భేరి అనే పదం అయితే శబ్దం అని అర్ధం వుంది. అదే
సమయంలో కమలాపూడి కట్టమీద వస్తున్న కన్నెపిల్లలను కూడా చెప్పారు కాబట్టి గోధూళి
రేగే వేళ ఆలమందలు ఇంటిదారిపట్టిన వేళ కట్టమీద వున్న దృశ్యం ఈ పాటలో వర్ణించారు
అనుకుంటే వరుసలో వస్తున్న దున్నపోతులు, కన్నెపిల్లలను చెప్పారు అనుకోవాలి.
గాంధారి వాన కుంభవృష్టి గురించి ఈ పాట క్రమంలో
ఎందుకొచ్చింది. కావాలన్న అమ్మాయి అందలేదన్న దుఃఖం కూడా సూచిస్తున్నాడా. లేక కల్కిగాంధారివేళ
: శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
వి. మధ్యరాత్రి (జాన) చీకటి కమ్ముకున్న వేళ
అర్ధరాత్రి అనే అర్ధంలో జానపదులు కల్కిగాంధారివేళ అనే పదాన్ని వాడతారు. అసలే చిన్న
అడవి పైగా చీకట్లు కమ్ముకుని వున్న సమయం అనుకోవటం కూడా పొసుగుతుంది కావచ్చు. గాంధారీ
పాత్రనుగురించి పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 లో ఇలా
చెప్పారు. ధృతరాష్ట్రుని భార్య. గాంధారదేశపురాజయిన సుబలుని కూఁతురు. పరమ పతివ్రత.
పెనిమిటి అంధుఁడు ఐనందున తానును పరపురుషదర్శనము చేయకూడదు అను నియమముచే ఎప్పుడును
కన్నుల గంతకట్టుకొని ఉండును. ఈమె కొడుకులు దుర్యోధనాదులు. అందు పెద్దవాఁడు అగు
దుర్యోధనుఁడు యుద్ధమునకు పోవునపుడు జయము కలుగ వరమువేడఁగా "యతో
ధర్మస్తతోజయః" అని చెప్పెను. ఈమె మతి అను దేవతాంశమున జనించినది.
జానపద వీరగాధలను గాంధారీకథలు అని జానపదవాగ్మయంలో
ప్రస్తావిస్తారు. గాంధారీ తనము అంటే రవ్వా శ్రీహరిగారి నైఘంటిక అర్ద: గయ్యాలితనం
అనే. దేవగాంధారి అనేది ఒకానొక రాగ విశేషం, గాంధారిమాంధారిప్రొద్దు : శబ్దార్థ
చింతామణి తెలుగు-ఉర్దూ (తాటికొండ తిమ్మారెడ్డిదేశాయి) 1906 [తె.]
అర్ధరాత్రము -[ఉ.] ఆధీరాత్ అనే అర్ధాలున్నాయి.
ఎన్ని రకాల వానలు వున్నాయో తెలుసా మన జానపదుల భాషలో కదలాడుతూ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.
1. గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన
2. మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన
3. మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన
4. దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన
5. సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన
6. సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన
7. బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన
8. తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
8. సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన
10. ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన
11. మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన
12. ముంతపోతవాన = ముంతతోటి పోసినంత వాన
13. కుండపోతవాన = కుండతో కుమ్మరించినంత వాన
14. ముసురువాన = విడువకుండా కురిసే వాన
15. దరోదరివాన = ఎడతెగకుండా కురిసే వాన
16. బొయ్యబొయ్యగొట్టేవాన = హోరుగాలితో కూడిన వాన
17. రాళ్లవాన = వడగండ్ల వాన
18. కప్పదాటువాన = అక్కడక్కడా కొంచెం కురిసే వాన
19. తప్పడతప్పడవాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.
20. దొంగవాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
21. కోపులునిండేవాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన
22. ఏక్దారవాన = ఏకధారగా కురిసే వాన
23. మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన
24. సాలేటివాన = భూమి తడిసేంత భారీ వాన
25. సాలుపెట్టువాన = దున్నేందుకు సరిపోయేంత వాన
విసురుగాలి కసురు చినుకుల్లో ఇంట్లోవాళ్ళని అటుపొమ్మని
వారవాకిలి వెయ్యమని చెప్పాలట, కల్లుమీద ఇష్టం వున్నా తాడిచెట్టు ఎక్కాలనుకుంటే
తాడులేకుండా ఎక్కవద్దు అలాగే మామకూతురు మంచిది కదా అని మనసు లేకుండా
పొందాలనుకోవద్దు. అని చెప్తున్నాడు. కురస(పొట్టి) అడవిలో బాగా వర్షం పడింది. తలలు
తడిచాయి, మొలలు (కటిప్రదేశము
తిరాసుముళ్ అదరకెళభాగ ) తడిచాయి, కుసుమ పువ్వుల్లాంటి కురులు
(వెంట్రుకలు) కూడా తడిచాయి. అంటే నిండా తడిచిపోయారు. బావి దగ్గర బండమీద మందు
నూరుతున్న మామ కొడకా ఇలా మందులు మాకులతో మనసులు ఎందుకు గెలుచుకోవాలనుకుంటావురా అది
సాధ్యం కాదులే కానీ మనసు వుంటే సరిపోతుంది అని చెపుతోంది ఆయమ్మి. జిగిరి నవలలో
కూడా ఎలుగుబంటిని మచ్చిక చేసుకోవడం కోసం ఇటువంటి మరుల మందు అనేదాన్ని పెట్టే
పద్దతి వున్నట్లు పెద్దింటి అశోక్ కుమార్ గారు చెప్తారు. అటువంటి నమ్మకం లేదా
కల్చర్ గురించిన ప్రస్తావన ఇలా ఈ పాటలో మిగిలి వున్నట్లన్నమాట.
ఉడత చారల మాదిరి వుండ సీరెను కట్టుకొని ఊరి ముందర
చక్కెర కొడితే (రౌండ్స్ వేస్తుంటే, గిరికీలు తిరుగుతుంటే ) ఊళ్లో వున్న కొంటె
వాళ్లు ఈమెను చూసి కన్నుకొట్టారంట. వచ్చేపోయే దారిలోనూ ఇంటికప్పుకు పెంకు కోసే
కోనేటి దగ్గర చాలా చిన్న వయసు (కూకటిగింజల ప్రాయము) నాటి నుంచే కలిసినాము కదా అని
చెపుతోంది ఆవిడ. దారి చూడు మామా దుమ్ము కూడా చూడు దున్నపోతుల వరుసలను చూడు, కమల
పూడి కట్టమీద వస్తున్న కన్నెపిల్లల జంటలను కూడా చూడు. నీగురించి నేను ఎంతలా
ఆలోచిస్తానో తెలుసా? నిన్ను గురించి ఎవరన్నా మాట్లాడితే నా మనసు ఎంత పులకరిస్తుందో
తెలుసా? చిన్న చిన్న మూటలు (మూకలు, మోకలు) కట్టుకుని చిలమనేరు దారిలో వెళుతుంటే
దారిలో అందరూ నీ గురించి చెప్పుకోవడం నాకు సంతోషం అయ్యింది మామా అని చెపుతోంది. ఆ
అమ్మి.
దీన్న సినిమాకోసం మార్చి రాస్తున్నప్పుడు బహుశా
కథలో సందర్భాన్ని కూడా పెంచలదాసు గారు అడిగివుంటారు. మేడమీద వున్న చిన్నది మన హీరో
మనసుని అర్ధ చేసుకోవడం అతనంటే ఇష్టపడటం ఊరంత మెచ్చుకునేలా వారిద్దరికీ పెళ్ళి
కావడం అనే అర్ధం వచ్చేలా పాటను మార్చి రాసారు. ఇందులో కథానాయకుడే బులుగు (బ్లూ)
రంగు చొక్కా వేసుకుంటాడు. చిత్రకన్ను చిన్నవాడు ఆయన ఈ చిత్రకన్ను అనే పదం మాండలిక
పదకోశంలో గమనించాను. మిక్కిలి వేడుకైన దృశ్యం లేదా కన్నుచెదిరే గొప్ప దృశ్యాన్ని
చిత్రకన్ను అని వాడతారు. కోస్తా మాటగా చెపుతున్నప్పటికీ తెలుగునేలమీద ఈ పదం
మంచివాడుకే కలిగివుంది. నందిని సిధారెడ్డిగారి ఒక పుస్తకం పేరు కూడా చిత్రకన్ను
అనే పెట్టారు.
పెంచలదాసు
గారు ఒక పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నారు. వంశపారం పర్యంగా వచ్చిన
కులవృత్తిని సగౌరవంగా తలమీద పెట్టుకుని
ఊరూరా తిరుగుతూ తనకొచ్చిన పాటలు పాడటమే కాక అక్కడ తనకు పరిచయం అయిన కొత్త పాటలను
జాగ్రత్తగా రాసుకుని తెచ్చుకుంటారు. వాటి బాణీలను ఒకటికి రెండుసార్లు విని
తనగొంతులోకి ఒంపుకుంటారు. ఇది కొంత మేర మంచిపనే కానీ ఆయాపాటలను వాటి వాటి
కుదుర్లలోనే సహజమైన స్థానాలలో విడియోలుగా నిక్షిప్తంచేసే పనిచేయాలి. అలామొదలేస్తే
ఎంత పనిసాధ్యం అవుతుందో ఒకసారి వరంగల్ వెళ్లినపుడు మల్లిఖార్జున శర్మగారు నాకు
అరవింద్ ఆర్యాకూ వారు సేకరించిన విడియో టేపులు, ఒక్క అమ్మపల్లి ప్రాంతపు పాటలతోనే
అచ్చులో ఒక ఉద్గ్రంధమన్ని జానపదగీతాలనూ చూపించినపుడు చాలా ఆశ్చర్యం వేసింది.
అదేపద్దతిలో కులపురాణాలు, పటం కథలు పాడే సంస్కృతి కూడా చాలా అరుదై పోయింది.
కొందరికైతే అసలు అవేమిటో కూడా తెలియదు. పెంచలయ్య గారు దాదాపు వంద నూటయాభై వరకూ గీతాలను
సేకరించారట. వీరి అన్నగారికి కూడా ఇలా పాటలు పాడటం మంచి పాటలను సేకరించడం ఒక
అలవాటుగా వుండేదట. కానీ వారి కళకు ఆదరణ లేక కడుపునింపే వేరే అవకాశాలేమీ లేక ఆయన
ఆత్మహత్య చేసుకున్నారట ఆ విషయం చెపుతుంటే అన్నమీద ప్రేమతో గొంతు పూడుకు పోతుంది
పెంచలయ్యగారికి. అంతే కాదు నిరాదరణకు కూడా చలించిపోతారాయన. అదే తెలంగాణాప్రాంతమైతే
పాటను పాటపాడే వాళ్లను నెత్తినపెట్టుకుంటారంటూ ఆయన మాటల సందర్భంతో చెప్పారు.
ఈయన
పాటగాడికంటే ముందు చిత్రకారుడు అదికూడా మామూలు బొమ్మలు కాదు బాతిక్ చిత్రాల
రూపకర్త, ఈ మైనపు గీత బొమ్మల ప్రక్రియను నేర్చుకోవడం కోసం మద్రాసుతో సహా
ఎక్కడెక్కడో తిరిగి అక్కడ కూలీనాలీ చేసుకుని ఆ డబ్బులతో బ్రతుకుతూ మరికొంత సమయం
బాతిక్ కళాకారులను బ్రతిమిలాడుకుని శుశ్రూషలు చేసి బాతిక్ పద్దతిని
వంటబట్టించుకున్నారట. ఇప్పుడు ఎవరికన్నా ఏమాత్రం శ్రద్దఉన్నా తను ఉచితంగా వారికి ఈ
ప్రక్రియలోని మెళకులవలను నేర్పిస్తున్నారు. అంతకంటే దాన్ని కమర్షియల్ చేసి
డబ్బుసంపాదించడం ఎలాగో నాకు తెలియదు అంటున్నారాయన.
నిజానికి ఈ బాతిక్ చిత్రకళ ఎంతో ప్రాచీనమైనది. ఈ కళ ఇండోనేషియా, మలేషియా
దేశాలలో బహుళ జనాదరణ పొందింది. ఇటీవలి కాలంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలచుకుని
మనం కూడా ఈ కళకు ప్రాధాన్యమిస్తున్నాము. మన దేశంలో దీనికి హస్తకళగా
గుర్తింపునిచ్చాడు.
ప్రస్తుతం అమెరికా, ఇంగ్లాండ్, రష్యా
తదితర యూరపు దేశాలలోను ఈ కళకు ఎంతో ఆదరణ ఉంది.సాధారణంగా నూలు వస్త్రం, కొన్ని సందర్భాలలో పట్టు వస్త్రంపై కూడా బాతిక్ చిత్రం వేస్తారు. అయితే
నిత్య జీవితంలో ధరించే దుస్తులు, ముఖ్యంగా చీరలు, లంగాలు, ఓణీలు, లేదా కర్టెన్లు,
టి.వి. కవర్లు, టేబుల్‌పై వేసే గుడ్డలు,
దిండు గలీబులు, దుప్పట్లు మొదలగు
గృహోపకరణాలుగా అలంకారయుతమైన ఈ బాతిక్ చిత్రాల వస్త్రాలు ఉపయోగిస్తారు.
తేనెటీగల మైనం, ప్యారాఫిన్ మైనం సమపాళ్ళలో కలిపి వేడిచేసి
మరిగిస్తారు. సన్నని వెదురు పుల్లకు రెండు ఇనుపచువ్వలు ఒక అంగుళం బయటకు ఉండేట్టు
బిగించి కండె ఆకారంలో దారం చుడతారు. మరుగుతున్న మైనంలో ఆ కలం ముంచి గుడ్డపై మొదలే
వేసుకున్న చిత్రం గీతలపై గీస్తారు. మైనం దారం, ఇనుపచువ్వల
ద్వారా స్కెచ్ గీతలపై కారి, గీతలను మైనంతో కప్పివేస్తుంది.
అప్పుడు దాన్ని కావాలనుకున్న రంగులో ముంచితే, బట్ట అంతా రంగు
అద్దుకుని, స్కెచ్ గీతలు మాత్రం మైనంవల్ల తెల్లగా
మిగిలిపోతాయి. అక్కడక్కడ మైనం పగుళ్ళు ఏర్పడి రంగులోనికెళ్ళి ఏర్పడే గీతలు
కళాత్మకంగా మిగులుతాయి. ఎన్ని రంగులు కావాలనుకుంటే అన్ని రంగుల్లో అన్నిసార్లు
ముంచవచ్చు. కానీ సాధారణంగా పసుపు, ఎరుపు, నీలం ప్రాథమిక రంగులే బాతిక్ చిత్రకళలో వాడతారు. ఎక్కడ ఏ రంగు
కావాలనుకుంటే, మరో రంగులో ముంచేముందు కావాలనుకున్న రంగుపై
మైనంతో కప్పుతారు. పెంచలయ్యగారి కొన్ని బాతిక్ చిత్రాలను దీనితో పాటు జతచేసాను
గమనించండి.
ఏదేమైనా లక్షలాది మంది తెలుగువాళ్ళు ఇష్టంగా సమయాన్ని ఇచ్చి చూసే
సినిమాలు ఇలా కొన్ని పాజిటివ్ విషయాలను
బ్రతికించేందుకు ఉపయోగపడుతున్నందుకు సంతోష పడుతూ, పెంచలయ్యగారు లాంటి సాధరణవ్యక్తి అయినా సరే నిబద్దతతో పనిచేస్తే
ఏదోఒకరోజు ఇలా గొప్ప గుర్తింపు వస్తుంది అన్న భరోసానిచ్చిన ఈ సందర్భానికి
చేతులెత్తి మొక్కుతూ. ఆయన గారు సేకరించి ఇతర గీతాలలో కొన్ని నేను కూడా విన్నాను.
చాలా బావున్నాయి. మరిన్ని చిత్రాలలో వీరిపాటలు ఇలాగే దుమ్ములేపాలని, అదే దారిలో
వేర్వేరు ప్రాంతాలలోని జానపద వాంగ్మయం విరివిగా జనాల్లో వినబడే అవకాశం ఏర్పడాలనీ
కోరుకుంటున్నాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి