జూల్స్ వెర్స్ భూగర్భంలోకి సాహస యాత్ర (Journey to the center of the Earth ) చదివారా? పోనీ సినిమాగా చూసారా? భూగర్భ
శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ లీడెన్బ్రాక్‌కి అతి అల్లుడు ఏక్సెల్
పరిశోధనల్లో, అధ్యయనాలలో సహకరిస్తూ ఉంటాడు. భూగర్భంలోకి,
భూమి కేంద్రం వరకు తీసుకు పోయే ఒక సహజ, రహస్య,
సొరంగ మార్గం గురించి ఉన్న ఒక పురాతన రాతప్రతి ప్రొఫెసర్
లీడెన్బ్రాక్‌కి చేతికి దొరుకుతుంది. ఆ రాతప్రతి ఆధారంగా ప్రొఫెసరు, అతడి
అల్లుడు ఒక అసామాన్య యాత్ర మీద బయలుదేరుతారు. ఐస్లాండ్‌లో ఒక నిష్క్రియమైన
అగ్నిపర్వత ముఖం ఆ మార్గానికి ద్వారం. ఆ సొరంగ మార్గంలోకి ప్రవేశించి ఆ మామ,
అల్లుళ్లు, వారికి తోడుగా వచ్చిన ఓ గైడ్ ఎదుర్కొన్న సవాళ్ల గాథ
భలే ఉత్సుకతగా వుంటుంది. తెలంగాణలో వరంగల్ ఘనపురం దగ్గరి వైల్డ్ నల్లగుట్ట గుహల
గురించి కూడా మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం కదా. భూమ్మీద, నీళ్ళమీద ఆకాశంలో
పయనిస్తుంటే మనిషికి ఎలా వుంటుందో తరచుగా తెలుస్తూనే వుంటుంది కానీ భూమి కడుపులోకి
వెలితే ఎలా వుంటుంది? అమ్మ కడుపులో పిల్లల లాగా అక్కడ కొత్త ప్రపంచం చూస్తూ
ఆటలాడుకుంటే ఆ అనుభూతి ఎంత కొత్తగా వుంటుంది. అటువంటి అనుభూతికోసం ఒక దుస్సాద్య
మైన సాహసం చేసి అందం వెనక వున్న అనుకోని ప్రమాదంలో చిక్కుకు పోయిన ముక్కుపచ్చలారని
డజను మంది థాయ్ లాండ్ చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు ప్రపంచం ఈ వ్యాసం రాసే
సమయానికి బయటపడటం ఎలా అనేదానిపై ఆందోళన పడుతున్నారు.
జూల్స్
వెర్స్ భూగర్భంలోకి సాహస యాత్ర (
చిట్టి చిన్నారులకు గట్టి ఆపద
పన్నెండు
మంది చిట్టి చిట్టి పిల్లలు అంటే కేవలం 11 నుంచి 16 సంవత్సారాల లోపు వాళ్లు ఒక సాకర్
టీం, వీళ్ల కోచ్ కూడా చిన్నవాడే కొత్తగా ఓటుహక్కు వచ్చింది కేవలం 25 ఏళ్ళ వయసు.
టీం పేరు మూపా(Moo Pa) అంటే వాళ్ళ భాషలో అడవి ఎలుగుబంటి. పేరుకు
తగ్గట్లే వీళ్ళకు ఆటతో పాటు సాహస కృత్యాలు చేయడం అంటే అమితాసక్తి. అదే వీళ్ళని అనుకోకుండా ప్రమాదంలోకి
నెట్టేసింది. పోయిన్నెల అంటే జూన్ 23వ తారీఖున శనివారమే కదా. మంచి అడ్వెంచర్
చేద్దాం అనుకున్నారు. వాళ్ళకి దగ్గర్లోని నంగనాన్ గుహ లోకి వెళదాం అనుకున్నారు.
గుహంటే గుహకాదు మరో లోకపు ప్రయాణం అది. ముందుగా క్రిందకి దిగితే అందరు టూరిస్టులకు
కనిపించినట్లే లైట్లు దానిమధ్య కొన్ని విగ్రహాలు, గుహ అందాలు కనిపిస్తాయి. కానీ
ఇంకా లోపటికి వుంది మరింత థ్రిల్ కూడా వుంది. దాన్ని వెంటాడాలని
నిర్ణయించుకున్నారు వీళ్ళు. చీకటిగా ఇరుకుగా కొన్నిచోట్ల, విశాలమై పైనుంచి రాతి
రంధ్రాల చిమ్నీ వెలుతురులు మరికొన్ని చోట్ల, దారిలో పారుతుంటే పిల్లకాలువలు,
నీటిగుంటలు, అంతేకాదు సముద్రంలాంటి సరస్సు ఒడ్డున రాతి నేల పరుచుకున్న చక్కటి బీచ్
కూడా ఇదే గుహలో వుంది దాన్ని పట్టాయ బీచ్ అంటారు. కాకపోతే మామూలు కంటే చాలా చాలా
లోపటికి వెళితేనే అది కనిపిస్తుంది. ఈ లోపటి ప్రపంచాన్ని చుట్టెయ్యాల్సిందే
అనుకున్నారు వీళ్ళు బహుశా అమ్మానాన్నలు ఇటువంటి దుష్కర సాహసాలకు అనుమతించరని ముందే
అర్ధంచేసుకున్నారో ఏమో ఇళ్ళలో చెప్పకుండానే సాకర్ ప్రాక్టీస్ అయిపోగానే సైకిళ్లు
వేసుకుని ఈ బుడింగీలంగా లీడర్ కుర్రాడితో కలిసి గుహవైపు బయలుదేరారు. దొరికినంతలో
కొన్ని చార్జింగ్ లైట్లు, కొంచెం ఆహారం తోచినంత రక్షణ చర్యలతో అన్నితమకు అర్ధం
అయిపోయాయి అన్నంత నిబ్బరంగా లోపటికి దిగారు. కొంత సేపటి తర్వాత సైకిళ్ళు
తీసుకువెళ్ళడం కుదర్లేదు నడవటం ప్రారంభించారు. ఒకరికి ఒకరు ఉత్సాహం చెప్పుకుంటూ
చీకటినీ, డొంకలనూ దాటుకుంటూ వెళ్లారు. కలుగులూ, ఇరుకులూ దాటుకున్నారు.
నీళ్లరూపంలో
ప్రమాదం
మరింత
మరింత ముందుకు చూస్తూనే వెళ్ళారు. సరైన కమ్యూనికేషన్ కానీ నావిగేషన్ గానీ లేకుండా
భూమి అడుగుకు, లోతుకూ వెళుతున్నాసరే వీళ్లకు థ్రీల్ వెనక ప్రమాదం అర్ధంకాలేదు. అదే
రోజు బయట విపరీతంగా వర్షం పడింది. దాంతో గుహలోపటికి కొంచెం కొంచెంగా నీరు
వచ్చేసింది. వచ్చిన వైపు దారి మూసుకుంటూ పోతుంటే వీళ్ళు మరింత లోపట ఎత్తైన ప్రదేశం
వైపు వెళ్ళడం తప్ప చేయదగ్గదేమీ కనిపించలేదు. ఆఖరుకి పట్టాయ బీచ్ సైతం దాటి ముందుకు
వెళ్ళి కొండరాళ్ళమధ్య బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. బయటి ప్రపంచానికి అప్పుటికి
వీళ్లెక్కడ వున్నారో తెలియలేదు. నిజానికి వీళ్ళని వెతకటం ప్రారంభించాక వీరి
సైకిళ్ళు ఆధారాన్ని పట్టిచ్చాయి. ఆ తర్వాత
వీళ్ళగుంపు అడుగుజాడల్ని వెతుక్కుంటూ సహాయక బృంద వెతుకులాడింది. నీటిమట్టం
పెరుగుతూనే వుంది. అనుభవం వున్న డైవర్లు సైతం ఆ ప్రాంతంలో నీళ్ళగుండా లోపటికి
రావడానికి ఇబ్బంది అయ్యింది ఎంత ఇబ్బంది అంటే వీళ్ళున్న ప్రాంతాన్ని
గుర్తించడానికి తొమ్మిదిరోజుల సమయం పట్టింది అంటే మొన్న జూలై రెండవ తారీఖున
తొలిసారి వీళ్లని గుహలో గుర్తించారు.
గుహల గురించి
ఇక్కడ
థామ్ లాంగ్ నంగనాన్ గుహల సముదాయం గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకోవాలి. ఇది
కొండల్లోకి ఆరుమైళ్లు చొచ్చుకుపోయిన లోతైన గుహ, థాయ్ లాండ్ లోని ఛిరాంగ్ రాయ్ కి
పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన ప్రాంతం. మన మయన్మార్ సరిహద్దుల్లో మాసాయ్ జిల్లాకు
చెందిన ప్రాంతం ఇది. అంతర్గత ప్రవాహాలు, జలపాతాలతో కలిసిన వేర్వేరు గుహసముదాయాలు ఈ
కొండల్లో వున్నప్పటికీ ఇప్పటి మన థామ్ లాంగ్ నంగనాన్ గుహతో పాటు కున్ నామ్ నంగనాన్
అనే మరోగుహ ప్రముఖమైనవి. బుద్దిస్ట్ కాలం నాటి కంటే ముందునుంచే ఈ గుహలు మనవుడికి
ఎరుకలో వున్నాయని కొన్ని ఆధారాలతో భావిస్తున్నప్పటికీ 1986 లో ఒక 8 చదరపు
కిలోమీటర్ల విశాల ప్రాంతాన్ని థామ్ లంగ్ నాన్ అటవీ ఉద్యాన వనం పేరుతో అక్కడి
ప్రభుత్వం గుర్తించి కొన్ని సౌకర్యాలను కల్పిస్తూ పర్యాటక ఆకర్షణ కలిగిస్తోంది. ఇక్కడ
పర్యాటకులు దిగిన అనేక అందమైన ఫోటోలు మనకు అంతర్జాలంలో కనివిందుచేస్తాయి.
ఈ
కొండలపై అందంతో పాటు శాపం వుందంటున్న పౌరాణిక కథనాలు
ఈ కొండ
ప్రాంతాలు మనకి తిరుపతికొండల్లో శ్రీనివాసుని ముఖం కనిపించినట్లు ఒక శనయ సుందరి
రూపం కనబడటంతో డోయ్ నంగ్ నాన్ అంటే స్లీపింగ్ లేడీ అని పిలుస్తారు. ప్రాంత ప్రజలు
చెప్పుకునే కథల్లో ఒక ప్రాచీన యువరాజి వారి రాజ్యంలో గుర్రాలుకాసే కుర్రాడితో
ప్రేమలో పడుతుంది. ఆమె గర్భవతి అయిన తర్వాత పెద్దలకు ఈ విషయం తెలుస్తుంది.
పెళ్ళికి పెద్దలు ఒప్పుకోక పోగా శిక్షిస్తారని భయపడ్డ ఇద్దరు ప్రేమికులు ఇవే
గుహల్లోకి వచ్చి దాక్కుంటారట. కానీ రాజు తన సైనికులతో అన్ని ప్రాంతాలు అణువణువూ
కసితో విస్తృతంగా గాలించడంతో ఆ గుర్రాల పిల్లాడు దొరికిపోతాడు. అతడిని కృరంగా
చంపిస్తాడు మహారాజు. ఆ దుఃఖం లోంచి అస్సలు కోలుకోలేకపోతుంది యువరాణి. రక్తనాళాలను
కత్తితో కోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె రక్తమే నీళ్ళుగా మారి ఆ గుహలలో
ప్రవహిస్తుంటాయని, ఆమె కన్నీళ్ళు ఇప్పటికీ గుహలో చుక్కలు చుక్కలుగా రాలుతుంటాయని
అక్కడి గ్రామీణులు కథలుగా చెప్పుకుంటారు. ఆవిడ దేహం అలా కొండలుగా పడిపోయిందని
నిద్రిస్తున్న సుందరిలా అందుకే అవి కనిపిస్తాయిని పర్యాటకులతో ప్రస్తావిస్తుంటారు.
అసలా పడుకున్న సుందరి ఒకసారి లేచి నిలబడితే హిమాలయాలకు మించి ప్రపంచంలో ఎత్తైన
కొండలు అవే అవుతాయనికూడా తమాషాగా చెప్తారు. ఈ కథలో విషాదం సంగతి ఏమో కానీ ఈ
నీళ్ళమధ్యలోనే ఇప్పుడు ఈ చిన్నారి పిల్లలు, ఆ కొండల దరికిచేరిన తల్లిదండ్రులు
కన్నీరు కార్చుతున్నారు.
ఖచ్చితంగా
ఎక్కడ చిక్కకున్నారు
ఈ అడవి
ఎలుగుబంట్లు చిక్కుకున్న ప్రదేశాన్ని
ఖచ్చితంగా లొకేట్ చేస్తే కానీ వారిని రక్షించే ప్రయత్నాలు సఫలం కావు. రంగంలోకి
వెంటనే దిగిన బ్రిటీష్ కేవ్ కౌన్సిల్ తమ ఆధునిక పరికరాలతో వేసిన లెక్కల ప్రకారం
పదిరోజుల ప్రయత్నం తర్వాత వీళ్లు కనిపించిన ప్రదేశం భూమట్టానికి కిలోమీటరు లోపటికి
వుంటుంది. వీళ్ళు గుహలోపటికి ప్రవేశించిన ముఖద్వారం నుంచి రెండు కిలోమీటర్లు (1.24
మైళ్ళు) లోపటికి వున్నారు. ఇప్పుడా రెండు కిలోమీటర్ల దారిలో వున్న ఇరుకు దార్లు
గోతులు డొంకలు నిండా నీళ్ళు నిండిపోయి వున్నాయి. గజ ఈతగాళ్లను సైతం గజగజ వణికించే
పదునైన రాళ్ళు పైగా మురికి దాంతో పాటు ప్రవాహాలు కొన్ని చోట్లు ఇటుచూస్తే
పిల్లలకేమో ఈతరాదు. మాస్క్ లతో డైవ్ చేసే
శిక్షణలేదు. పైగా సరైన ఆహారం నిద్ర లేక భయంతో బిక్కచచ్చిపోయి వున్నారు. ముందు
వీళ్ళు మానసికంగా సిద్దపడాలి.
ముమ్మరంగా జరుగుతున్న రక్షణ చర్యలు
ఏ
మాత్రం తాత్సారం చేయకుండా పిల్లలతో రక్షణ బృందం మాటలతో మనో ధైర్యం కలిగించారు. ఆ
తర్వాత తమ వెంట తీసుకొచ్చిన ఆహారాన్ని అందజేసారు. శరీరంపై తగిలిన గాయాలకూ,
లోపటేమైనా రుగ్మతలు అనిపిస్తే వాటికి తగన మందులను అందజేసారు. 13 మంది బృందానికీ మరో నాలుగు నెలలకు సరిపడినంత
సమతుల్యమైన ఆహారపదార్ధాలను సులభంగా అరిగేవి ఎంపికచేసి చెడిపోని ప్యాకింగ్ లలో
అందజేసారు. బయట ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు వీరి క్షేమ సమాచారాన్ని అందజేసారు.
ఫోటోలు పంపారు. క్లిష్టమైన తాత్కాలిక ఏర్పాట్లతో కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు
చేసి పిల్లలు కూడా బయటివారితో మాట్లాడే అవకాశం కల్పించారు. ఇక వర్షం వల్ల ప్రమాదం
మరింత పెరిగే అవకాశం వున్నదన్న సంగతి వాతావరణ శాఖ విపులంగా అందజేసిన నేపద్యంలో
అప్పటికే గుహలో చేరిన నీటిని పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో గాలన్ల కొద్దీ బయటికి
తోడి పారబొయ్యటం మొదలేసారు. వీరిని మొసుకు రావడం రవాణా చేయడం సాధ్యపడే విషయాలు కాదు.
కొండను పైనుంచి కిలోమీటరు లోపటికి కనీసం మీటరున్నర వ్యాసం వున్న రంధ్రాన్ని
తొలుచుకుంటూ వచ్చి ఆ రంద్రం గుండా తాళ్ళ నిచ్చెనల సహాయంతో పిల్లలను పైకి తీసుకువెళ్ళవచ్చు కానీ వీళ్ళు కూర్చున్న
ఇరుకు ప్రదేశంలో ఈ తవ్వకం వలన పెళ్ళలు విరిగిపడినా మూసుకు పోయినా ప్రమాదం మరింత
ఎక్కువ అవుతుంది. డైవింగ్ చేయిస్తూ తీసుకువెళ్లడం మరో మంచి ప్రత్యామ్నాయం దానికోసం
మామూలు ఆక్సిజన్ మాస్కులుకాకుండా తలనుంచి ఊడిపోయి పటిష్టమైన ప్రత్యేక మాస్కులను
తయారుచేయింది. ప్రతి చిన్నారికీ ఒక అనుభవజ్ఞుడైన మరో డైవరును జతచేసి సిలెండర్
బరువుకూడా చిన్నారులై పడకుండా నీటిపైభాగంలో వేసిన రోప్ లైన్ సహాయం తీసుకుంటూ ఈ
దారిని దాటుతూ రావచ్చనేది మరో ప్రత్యామ్నాయం. (దీన్ని బొమ్మలలో చూపాను) దీనివెనక
సాధక భాధకాలను ఇప్పుడు వేర్వేరు టీం లు అంచనా వేస్తున్నాయి.
నాయకులు అంటే ఇలా వుండాలని చూపిన ప్రాయుత్ ఛాన్
ఇటువంటి ఆందోళన సందర్భంలో దేశ
ప్రధాని ప్రయుత్ ఛానోఛా 29వ తారీఖున స్వయంగా ఘటనా స్థలానికి వచ్చి అక్కడవున్న
పిల్లల బంధువులు తల్లిదండ్రులతో ముచ్చటించారు. తమ ప్రయత్న లోపం లేకుండా పనులు
ముమ్మరంగా చేయిస్తున్నట్లు మాటయిచ్చారు. పనులు జరుగుతున్న పనితీరును స్వయంగా అడిగి
తెలుసుకున్నారు. పైపై బట్టీ పట్టిన ఉపన్యాసాలు చెప్పి చేతులు దులుపుకోకుండా
అవసరమైన నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయటంతో పాటు. యుద్ధ సమయంలో
అత్యవసరంగా స్పందించినట్లు సైన్యాన్నీ, నౌకా దళాలనూ దీనిలో పాల్గొని సహాయం
చేయవలసిందిగా ఆదేశించారు. ఈ సంఘటన తర్వాత అక్కడే తల్లిదండ్రులు తమ పిల్లలు ఇక
బయటికి వచ్చినట్లే అని నిజంగా నమ్మేసి సంబరాలు సైతం చేసుకున్నారు. ఆ మాట అబద్దం కాదు అన్నట్లు మరో రెండు
రోజుల్లోనే ఈ బృందాలకు చిన్నారుల ఆచూకి లబించింది కూడా.
తొందరలోనే వీళ్ళు బయటపడాలని కోరుకుందాం
తొందరలోనే వీళ్ళు బయటపడాలని కోరుకుందాం
ఏదేమైనా వీళ్ళ సాహసం మాత్రం నాకు అబ్బురం అనిపించింది. పెద్దవాళ్లనే
భయపెట్టే గుహలోకి చొచ్చుకుపోవలసిందే అన్న వీళ్ల నిర్ణయం అబ్బురమనిపించింది.
ఇటువంటి వాళ్లు ప్రమాదాన్న చూసి బయటికి వస్తున్నారు కాబట్టి మరిన్ని జాగ్రత్తలు
తీసుకుంటూ ఇంకెన్నో సాహసాలు చేయాలని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి