పిరికిమందు కార్ఖానా

సుడితిరుగుతున్న సమాజంలో
కాళ్లకు కళ్ళకు మనసుకు బంధనాలు పడుతున్నాయా మిత్రమా?
పిరికివాడి కంటే పిరికిమందు పంచేవాడు ప్రమాదకారి
గొర్రె నడుపుకుపోతున్న  సింహాల మందకంటే
సింహం నాయకత్వంలోని గొర్రెల సేన గెలిచే అవకాశాలు ఎక్కువ.
మొద్దుగా పడి జీవితం గడిపే పెద్ద బురదపాముపై
సతతం చురుకుగా శ్రమించే చీమలు గెలిచేది అందుకే.
పిరికితనం ఎదురుదెబ్బ కాదు తట్టుకోవడానికి మిత్రమా!
అదొక అంటువ్యాధి.
చేవచచ్చిన చేపలు, జీవంలేని పుడకా మాత్రమే ప్రవాహంలో కొట్టుకుపోతాయి.
ఎంత తోసుకెళ్తున్న ముంపులోనైనా  ఈదే ప్రయత్నం మాననిదే జీవి.
పుట్టుకనుంచి పోయే వరకు సంఘర్షణే
అసలు చలనమే లేకుంటే కాలమూ, లోకమూ  ఉండదు.
ఎందుకలా డిప్పలోనే కూర్చొవటం
గొప్పవిషయమని భావిస్తూ, భోదిస్తావు?
పిడికిలి బిగించినప్పుడే నీమీద నీకైనా పట్టుచిక్కుతుంది.
అడుగుముందుకు పడితేనే గమ్యం చేరువౌతుంది.

●తేదీ ౾ 11-08-2018 

కామెంట్‌లు