రూమి లయాత్మక తాత్విక కవిత్వం

మౌలానా జలాలుద్దీన్ బాల్ఖి రూమి మహమ్మదీయ నాగరికత యొక్క గొప్ప ఆధ్యాత్మికవాది మరియు గొప్ప తాత్విక కవి. ఆఫ్గనిస్థాన్లో అతను మౌలానా గా,ఇరాన్లో అతను మౌలావి గా ప్రసిద్ధుడు. 2007 లో యునెస్కో లో జరిగిన రూమీ 800వ జయంతి వేడుకలలో రూమీ ఆశలు, ఆశయాల గురించి అధ్యయనం చేస్తున్నఅనేకమందికి ఉత్సాహాన్ని ఇవ్వటం ద్వారా మానవుని మదిలో శాంతికాముకతని ధృడతరం చేయాలని భావించారు. నిజానికి ప్రస్తుత తాలీబాన్ సంస్కృతితో ప్రపంచానికి తుపాకీ మొనలా తయారైన ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ గా పిలుస్తున్న ప్రాంతంలో బాక్ట్రియా లోని బల్ఖ్ ప్రాంతంలో రూమీ పుట్టారని సాంప్రదాయక చరిత్ర చెపుతోంది. తజికిస్థాన్ లోని వఖ్ష్ ప్రాంతంలో జన్మించాడనే మరో వాదమూ వుంది. కానీ ఈయన బైజాంటియన్ సామ్రాజ్యంలోని రోమన్ ప్రాంతమైన రూమ్ లో తన జీవితకాలం ఎక్కువగా గడిపాడు కాబట్టి ఇతనికి రూమి అనే పేరు వచ్చింది. విశ్వనరులను ఈ ప్రాంతం వారని కట్టడి చేయగలమా ?
భగవంతునికై క్రైస్తవులలో,శిలువపైన వెతికాను.
కానీ ఆయన నాకు కనబడలేదు.
నేను విగ్రహారాధన చేసే పురాతన దేవాలయాలలోకి వెళ్ళాను.
అక్కడా ఆయన నాకు కనబడలేదు.
నేను హిరాలో ఉన్న పర్వత గుహలలోకి,ఖాందహార్ వరకూ వెళ్ళాను.
కాని నాకు ఆయన అక్కడా కనబడలేదు.
ముందుంచబడిన ఒక పనిపై నేను కాకసస్ పర్వతాలపైకి కూడా వెళ్ళాను. అక్కడ అంకాలు నివశించడం మాత్రమే చూశాను.
అప్పుడు నా అన్వేషణని యువ వృద్ధుల మకాము అయిన కాబా వైపు మళ్ళించాను.
అక్కడా దేవుడు లేడు.
తత్వం వైపు మళ్ళి ఇబిన్ సినా ని ఆయన గురించి అడిగాను.
అతని పరిధిలో అక్కడా లేడు.
మహమ్మదు ప్రవక్త యొక్క’ రెండు ధనువుల దూరంలో ఉన్న దివ్యమైన అనుభూతి’ గురించి విని ఆయన కచేరికి వెళ్ళాను.
అక్కడకూడా ఆయన ఆచూకీ లభించలేదు.

చివరికి నేను నా హృదయంలొకి తొంగి చూశాను.
ఆయన అక్కడ కనిపించాడు. ఇంకెక్కడా లేడు.


అని చెపుతారాయన ఆరాధనలలోనో, ప్రదేశాలలోనో కాదు నీలోపలే వున్నాడు భగవంతుడు నీకు నిజంగా చూడటం వస్తే అని చెప్పినందునే ఆయన విశ్వనరుడయ్యాడు. మహమ్మదీయ కవులలో ఆంగ్లములో తర్జుమా చేయబడిన కవులు ఇద్దరు ప్రసిద్ధులు. వారు జిబ్రాన్ మఱియు జలాలుద్దీన్ రూమి (Rumi).
న్యాయవేత్త, ధార్మికపండితుడు, సూఫీతత్త్వాన్ని అవసోసన పట్టినవాడూ సుల్తానుల్ ఉలామా అనే బిరుదు సంపాదించుకున్న “బహావుద్దీన్ వలద్” రూమీకి తండ్రి. తల్లిపేరు మూమినా ఖాతూన్ సెప్టెంబరు 30 1207 న ఈయన జన్మించారు. మౌలానా జలాలుద్దీన్ ముహమ్మద్ బాల్ఖీ అనేది అసలు పేరు అయినప్పటికీ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ పేరుతో ప్రసిధ్దులు. ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు పుట్టిన ఈయన జీవిత విశేషాలను 1318 – 1353 ల మధ్య కాలంలో షంసుద్దీన్ అహ్మద్ అఫ్‌లాకి రచించినమనాఖిబుల్ ఆరిఫీన్ ద్వారా ప్రపంచానికి తెలిసాయి. అలాగే రూమీకి అత్యంత ప్రాణ స్నేహితుడు “షమ్స్ తబ్రేజ్”. వీరిద్దరూ దశాబ్దకాలం పైగా కాలాన్ని కవిత్వంతోనూ, జ్ఞానాన్నీ పంచుకోవడంతోనూ గడిపారు. తబ్రేజ్ రచించిన దీవాన్ ఎ షమ్స్ ఎ తబ్రేజీ అనే గ్రంధంలో కవిత్వం సంగీత నృత్యశైలి భరితంగా వుంటుంది. ఈ దశ తర్వాత రూమీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తిరిగాడు. షామ్ అను కలిసాడు. తాత్వికతను ప్రేమనూ నింపుకున్న కవిత్వాన్ని రాసాడు.
 ఈయన వ్రాసిన 26000 ద్విపదలతో నున్న మథ్నావి(మస్నావి) ఇస్లామీయ సాహిత్యములో కొరానుకు తరువాత అత్యున్నత గ్రంథముగా పరిగణిస్తారు. 40000 పైగా ప్రాపంచిక, దివ్వ ప్రేమను ఉద్భోదించే కవితలను రచించారని చెపుతారు.వెలిగించటానికి సిద్దంచేసిన
ఓ దీపముంది నీ హృదయంలో.
నింపేందుకు సిద్దంగా
శూన్యముంది నీ ఆత్మలో
నీకూ తెలుస్తూంది కదూ!
ఈశ్వరునితో నీ వియోగం
నీకు అర్ధమౌతూంది కదూ!
నిను నింపటానికి అతనిని ఆహ్వానించు.
అగ్నిని కౌగిలించుకో.
ప్రేమ తనంత తానే వస్తుందనీ
దానికై నీ తపన పాఠశాలల్లో నేర్పరనీ
గుర్తుచేసుకో.
రూమి – పాషనేట్ పోయమ్స్ ఆఫ్ రూమి” నుండి
రూమి 17 డిసెంబరు 1273 లో కోన్యాలో మరనించాడు.అతని పార్థివ శరీరాన్ని,అతని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు.ఆ స్థలంపై ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు.దానిపేరు,యెసిల్ తుర్బెలేదా పచ్చని గుమ్మటం. ఈనాడు అదే మెవ్లానా పురవస్తుప్రదర్శనశాల. అతని సమాధిపై వ్రాయబడిన మాటలు:


‘‘ మనం మరణించిన తరువాత మన సమాధిని భూమిలో కాక జనుల గుండెలలో చూసుకోవాలి’’

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి