కట్టా శ్రీనివాస్ తో కాస్సేపు “తోలుపడవలో ప్రయాణం “ చేద్దాం రండి !! రచన : అబ్దుల్ రాజా హుస్సేన్

తోడులేని తోలుతిత్తి ఇది...ఈ జీవితం ఉత్తుత్తిదా?

కట్టా శ్రీనివాస్ తో కాస్సేపు “తోలుపడవలో ప్రయాణం “ చేద్దాం రండి !!

(ఈ ప్రయాణం కాస్తంత సుదీర్ఘం...కొంచెం ఓపిక తెచ్చుకోండి )

మనిషి దేహం ఓ తోలుతిత్తి.గాలి నింపితే ఊరుతుంది. తనంత ఎవరూలేరంటూ
ఊగిపోతుంది. అదే ఓ చిన్న చిల్లు పడిందా! తుస్సు…మంటూ గాలిపోయి
చివరకు తిత్తి మిగులుతుంది.

అమ్మ కడుపులో పడ్డప్పటినుంచి పిండం ఊపిరిపోసుకుంటుంది.అమ్మ కడుపులోంచి
బయటికొచ్చాక సొంత అస్తిత్వం కోసం పాకులాడుతుంది.పెరిగి,పెద్దయ్యాక లోభ,మోహ,
మద,మాత్సర్యాల తాపత్రయంతో విర్రవీగి అలిసిపోతుంది.తుదకు గొంతులో ఊపిరి గాల్లో
కలిసి అస్తిత్వం కనుమరుగవుతుంది.కన్నుతెరిస్తే జననం...కన్ను మూస్తే మరణం ఎలాగో...
తోలు తిత్తిలో గాలినింపితే జీవం...గాలిపోతే మరణం.ఈ రెంటి మధ్య లోలకంలా ఊగిస
లాడేదే జీవితం.మనిషి జీవితం అశాశ్వతమని తెలిసికూడా మోహధూపంలో పాకులాడటం
మానవనైజం.

మనిషి ఒంటరిగానే పుడతాడు.ఒంటరిగానే పోతాడు.వచ్చేటపుడు రిక్తహస్తాలతో ఎలాగైతే
వచ్చాడో..పోయేటప్పుడు కూడా అలాగే పోతాడు.ఈ లౌకిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.
బంధాలు,అనుబంధాలు,రక్తసంబంధాలు,ఆస్తులు అంతస్తులు ,పేరు ప్రఖ్యాతులు అన్నీ
నీటిబుడగలే.శాశ్వతమైనది ఏదైనా వుందంటే..అది మనం చేసిన‌ మంచి.మనం వున్నా
లేకున్నా మన మంచితనం మాత్రం ఈ లోకంలో శాశ్వతంగా మిగిలిపోతుంది.ఇదే మానవ
జన్మకు అర్థం,పరమార్థం.

కట్టా శ్రీనివాస్ తాత్విక దృక్పథం కలవాడు.నాస్తికుడో,ఆస్తికుడో పక్కనబెడితే ,నామటుకు నాకు
కట్టా ఓ యదార్థవాదిగా కనబడతాడు.ప్రతిదీ హేతుబధ్ధంగా చూడటం , నిజాన్ని అంగీకరించడం
కట్టాలో నేను గమనించిన గుణాలు.

చాలా కాలం కిందట ఫేస్బుక్ లోనే ఓ కవిత పోస్ట్ చేశాడు. దాని శీర్షిక “పూర్ణమేవావశిష్యతే “..
పూర్ణమంటే నిండుగా వుండేది.ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం తీసేస్తే చివరకు మిగిలేది కూడా
పూర్ణమే.మనిషి జీవితమూ అంతే.. పుట్టుకతో పూర్ణ రూపం పొందిన మనిషి మరణం తర్వాత
కూడా పూర్ణంగానే మారతాడు.మనిషి మరణించాక అతని తాలూకు అస్తిత్వం వుంటుందా?
అసలు తన తర్వాత తన గురించి లోకం మనుకుంటోంది?అన్న మీమాంసతో రచించిన కవిత
“పూర్ణమేవావశిష్యతే “.ఈ కవితలో కట్టా గొప్ప తాత్విక దార్శనికుడిగా కనిపించాడు.తిరిగి
మళ్ళీ ఇప్పుడు అంతే తాత్విక లోతులతో ప్రస్తుత కవిత “తోలు పడవలో ప్రయాణం “ రచించాడు.

కట్టా శ్రీనివాస్ కవిత “తోలు పడవలో ప్రయాణం “...పూర్తిపాఠం చదవండి

“*ఉపోద్ఘాతం…

వీలుచూసుకుని రాసేది కాదు చేసుకుని రాసేదే వీలునామా.

1.
ఒక్కోసారి
చీకటి దిగులు కమ్ముకుంటుంది.
అనుకున్నవన్నీ పూర్తయ్యేంత వరకూ
నేనీ దేహంలోనే నివాసం ఉంటానా అని
అలా చీకట్లో దూరంగా నక్షత్రాలవైపు చూస్తుంటే
శూన్య శబ్దం ఒకటి చెవులో గింగురులు తిరుగుతూ సమాధానం చెపుతుంది
వెలుతురు పంచే నీ దేహమొక్కటే దీపం కాదు
వత్తి వున్నంతసేపూ డ్యూటీ చేసివూరుకో తరువాతి శృంఖలమదే తనపని తానే చేసుకుంటూ పోతుందని
చెవిపై మూసిన శంఖంలా లోపటిదో బయటిదో తెలియని నాదం నినదిస్తూనే వుంటుంది.

2.
మరోసారి
వెలుతురు వేడి బైర్లు కమ్ముతూ ఉక్కపోత ముంచుకొస్తుంది.
అవసరమైనదానికంటే ఎక్కువ బతికేస్తున్నామేమో
ఉన్న ఆహారాన్నే శరీరం గుండా చక్రం తిప్పుతూ
పగలూ రాత్రుల చక్రపుసుడిలోదేహాన్నే డొల్లగా తిప్పుతూ
పుల్లాపుడకా రంగుకాగితాలూ ఏరుకోవడమే ఆశయం అనుకుంటూ డొర్లిస్తూ వెళుతున్నానా అని
నకనక లాడే వేడిలో మధ్యాహ్నపు సూర్యుడివైపు చూస్తాను.
వచ్చే సాయంత్రం చల్లగా వుంటుంది పదే పదే పరుగెత్తడమే కాదు కొంచె సాంత్వనపడితేనే
కొత్తదనం చిగురిస్తుంది అని చెపుతుంది.

3.
ఉన్నదేదో ఉన్నట్లు
కాదు కాదు
ఉన్నది మాత్రమే ఉన్నట్లు
ఖర్చుచేయట్లేదులే అనుకున్నంత మాత్రాన సమయం నిల్వలో అలా పడివుండే మారకద్రవ్యం కాదు.

4.
చేసిందే మిగిలినట్లు
కాదు కాదు
మిగిలేది చేస్తేనే మిగిలినట్లు
తోచిందో తోచందో చేసుకుంటూ పోతే
చేసిందంతా తలాతోకా తెలిసేలా తోచేపనిచేయదు.

5.
దిగులో గుబులో వదిలిపోతుంది వేదన కాదు
లోటో కొరతో భర్తీఅవుతుంది లోపం కాదు
ఉన్నకాస్తడొల్లనూ ప్రశ్నలతోనే నింపేస్తే జవాబులకు చొటెక్కడ?
అన్నీ జవాబులే నిండితే అవి దేనికి తగిలించాలో తెలియక తికమక గిలగిలలాడిపోతాయి.

6.
ఆరో అడుగు
పంచప్రాణాలనూ దాటుకుంటూ వచ్చాక
అర్దం అవుతుంటేనే నడకకు ఫలితం.
కొలిచేందుకు అసలిది కవితే కాదు.
లోపట వినిపించని గోలకు అక్షరాల రూపం.
అర్దం కాకూడదని రూలేం లేదు. అర్ధం అవ్వాలనీ లేదు
అవును మరి జీవితం అంటే అలాగే వుంటుంది. “.

                                                   09 – 03- 2018 (కృష్ణాష్టమి)

                                                           కవివ్యక్తిగత బ్లాగు
                           http://antharlochana.blogspot.com/2018/09/blog-post.html

కవిత విశ్లేషణ..!!

ఓ మనిషి తన జీవితకాలంలో ఎంతదూరం ప్రయాణం చేసినా..చివరకు చేరేది “ఆరడుగుల “
గుంటలోనే.ఈ ఆరడుగుల్ని కట్టా తన కవితకు సింబాలిక్ గా ‘ఆరు స్టాంజాల్లో ‘ పొందు
పరిచాడు.మనిషి నిజమైన ప్రయాణం ఈ ఆరడుగులే అన్నది కవిత చదివితే మీకే అర్థం
అవుతుంది.

ఇది జీవిత ప్రయాణం..మనిషి జీవన యానం.కాలమనే పడవలో మనిషి తన సుదీర్ఘ  జీవన
ప్రస్థానంలో సంపాదించే అనుభవాల సంపద.

కవిత ఉపోద్ఘాతంలోనే  కవి విస్పష్టమైన ప్రకటన చేశాడు.

“మనిషి వీలు చూసుకొని కాదు...వీలు చేసుకొని రాసుకునే వీలునామా “ యే జీవితం అని ..!!
మనిషి తన జీవితకాలంలో సంపాదించింది,లోకానికి మిగిల్చిందేమిటో ,ఎవరికి ఎలా పంచాలో
చరమాంకంలో వీలునామాను విధిగా రాయవలిసిందే.

'ఆకాశాత్పతితం తోయం సాగరం ప్రతిగఛ్ఛతి ‘...ఆకాశం నుండీ నీరు (నదిగా మారి ) సాగరం
వైపుకు సాగుతుంది.జీవితమూ అంతే..పుట్టుకతోనే మనిషి ప్రవాహశీలి.అమ్మ కడుపులోంచి
బాహ్య ప్రపంచంలోకి వచ్చాక కిందా పైనా పడుతూ,లేస్తూ వెనక్కూ ,ముందుకు నడుస్తూ
జీవిత ప్రయాణం కొనసాగిస్తాడు.చివరకు అలిసి సొలసి మృత్యు ఒడిలోకి చేరి సేద తీరుతాడు.
(ఎప్పటికైనా మానవ పథికుడు చేరుకునే  విశ్రాంతి మందిరం మృత్యువే )

మనిషి తన ప్రయాణంలో సంపాదించింది,వెనకేసుకున్నది,లోకానికి మిగిల్చిందేమిటో ఇక్కడే
స్పష్టంగా వీలునామా రాసుకోవాలి.ఈ విషయంలో అలసత్వం కూడదు.పనిగట్టుకొని రాయాల్సిందే.

1.ఒక్కోసారి …!!(మొదటి అడుగు )

మనిషి జీవిత ప్రయాణంలో ఆటుపోట్లు తప్పనిసరి.రాళ్ళూ ముళ్ళూ ఎదురవుతాయి.ఒక్కోసారి
చీకటి దిగులు మేఘం కమ్మేస్తుంటుంది.జీవితంలో అనుకున్నవన్నీ పూర్తయ్యేదాకా నేనీ దేహంలో
వుంటానా అని ప్రాణం సంశయిస్తుంది.అలా చీకట్లో దూరంగా నక్షత్రాలవైపు చూస్తుంటే…..శూన్య
శబ్దం చెవిలో గింగిరులు తిరుగుతూ సమాధానం చెబుతుంది “ వెలుతురు పంచే నీ దేహమొక్కటే
దీపం కాదు.వత్తి ఉన్నంత వరకూ ‘నీపని ‘ నువ్వు చేసుకుంటూ వుండు.తరువాతి శృంఖలం దాని
పని అదే చేసుకుంటూ పోతుంది.’నువ్వు నిమిత్తమాత్రుడవన్న సంగతిని మరిచిపోవద్దంటూ..చెవిపై
మూసిన శంఖంలా లోపలిదో,బయటిదో తెలీని నాదమేదో నినదిస్తూనే వుంటుంది.

'జాతస్య హి ధృవో మృత్యుః ‘...భగవద్గీత ఏనాడో జనన మరణ కాలాల్ని నిర్వచించింది.పుట్టిన వ్యక్తి
గిట్టక తప్పదు.ఉదయించే సూర్యుడు అస్తమించకా తప్పదు.అస్తమించే లోపుక్రమంగా బాలభానుడ
వుతాడు. ప్రచండ భానుడౌతాడు.సంధ్యారుణ కాంతులతో క్రమంగా అంతర్థానమవుతాడు.అలాగే
మానవ జీవన పరిణామంలో కూడా మృత్యువూ ఓ భాగమే.

జీవితం ఓ అద్భుతం.జీవన విధానం అంతకంటే అద్భుతమైంది. దేనిపైననైనా విరక్తి కలగొచ్చు కానీ..
జీవితం మీద మాత్రం విరక్తి కలగకూడదు.జీవితం 'అల్పం’ కాదు’అనల్పం ‘..ఒకవేళ జీవితం అల్పమనే
భావన వచ్చినపుడు జీవితం విలువ అపారమవ్వాలి.లౌకికమైన ప్రయోజనాలతో పాటు అలౌకికమైన
పరమార్థాన్ని సాధించే గొప్పతనం జీవితానిదని గుర్తించుకోవాలి.

2.మరోసారి…!!(రెండో అడుగు )

ఒకసారి దిగులు మేఘం నుంచి బయటపడితే ..మరోసారి వెలుతురు వేడి బైర్లు కమ్ముతూ ఉక్కపోత
ముంచుకొస్తుంది.అసలు మనం అవసరమైనదాని కంటే ఎక్కువ బతికేస్తున్నామేమో? అన్న అనుమానం
కలుగుతుంది.వున్న ఆహారాన్నే శరీరంగుండా గుండ్రంగా తిప్పుతూ,పగలూ రాత్రుల చక్రపు సుడిలో
దేహాన్ని డొల్లగా తిప్పుతూ పుల్లాపుడకా రంగు కాగితాలు ఏరుకుంటూ జీవితాన్ని దొర్లిస్తున్న సంశయం
కలుగుతుంది.అప్పుడు నకనకలాడే వేడిలో సూర్యుడ్ని చూస్తే ..వచ్చే సాయంత్రం కాస్త చల్లగా వుంటుందని,
పదే పదే పరిగెత్తకుండా కాస్త సాంత్వన పడితే కొత్తదనం చిగురిస్తుందన్న ఆశతో బతకాలి.రీ జనరేట్
అవ్వాలి.

“కర్మాణి కుర్వన్నేవ జీజివిషేత్ “..మనిషి జీవించినంతకాలం తన వంతు బాధ్యతగా కర్మల్ని నిర్వహిస్తూనే
వుండాలి.సంపూర్ణ ఆయుర్దాయంతో ప్రయాణం సాగించాలి.అని ఉపనిషత్తులు చెబుతున్నాయి.మనిషి
ఏ సందర్భంలో కూడా  డీలా పడకూడదు.పలాయన వాదాన్ని ఒంటబట్టించుకోకూడదు.జీవితంలో
సుఖమూ,దుఃఖం అన్ని దశల్నీ అధిగమించాలి.కష్టాలొచ్చినపుడు కొంత వేచి చూడాలి.గ్రీష్మతాపానికి
భయపడి పారిపోతే..ఆ తర్వాత వచ్చే వసంత విలాసాన్ని అనుభవించలేం కదా!!

3.మూడో అడుగు..!!

మనిషి జీవితంలో ఉన్నదే నిజం.మన ప్రయాణించినా..ప్రయాణించకున్నా మనకోసం సమయం
మాత్రం ఆగదు.మనం ఖర్చు చేయనంత మాత్రాన మన అకౌంట్లో వున్న బ్యాలెన్స్ సమయం
నిల్వ వుండదు.నిల్వ వుంటానికి అది మారక ద్రవ్యం కాదు. జీవితం జీవించడానికి. వాయిదా
వేసుకోడానికి కాదు.ఒకవేళ మనం వాయిదా వేసుకున్నా,ఖర్చు చేయకున్నా కాలం మాత్రం
మంచులా కరిగిపోతుంది.బతికినంతకాలం ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో నిండుగా
జీవించాలి.జీవనసారాన్ని జుర్రుకోవాలి.

4.నాలుగో అడుగు…!!

కొంతమంది చేసిందే మిగిలిందని తృప్తి పడతారు.మరికొందరు మిగిలింది చేస్తేనే మిగిలినట్లు
భావిస్తారు.మనకు తోచిందో తోచందో పని చేసుకుంటూపోతే...చేసిందల్లా తలాతోకా తెలిసేలా
తోచే పని చేయదు.మనిషి నిమిత్త మాత్రుడు.అంతా తన ఇష్ట ప్రకారమే జరుగుతుందను
కుంటాడు.నిజానికి జరిగేదే జరుగుతుంది.జరగంది అసలే జరగదు.జరిగినదానికి తృప్తిపడాలి.
అందులోనే ఆనందాన్ని వెతుక్కోవాలి.

'ఉద్యానంతే పురుష నావయానమ్ ‘..మనిషి ముందుకు నడవాలి.ఉన్నతిని సాధించాలి.
మన శిరస్సెప్పుడూ ఆకాశాన్నే చూడాలి.భూమిని కాదు.మన లక్ష్యం సమున్నతంగా వుండాలి.
అధో ముఖంగా కాదు.’ప్రేతా జయతే నరా ‘...విఘ్నాలకు వెరవకూడదు.దుఃఖాలను సహించాలి.
మనం చేసే పనిలో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి.

5.అయిదో అడుగు…!!

మనిషి దిగులు,గుబులూ శాశ్వతం కాదు.అది వదిలిపోతుంది.దాన్ని వేదనగా చేసుకోకూడదు.
జీవితంలో లోటో,కొరతో భర్తీ అవుతుంది.అది లోపం కాదు.ఉన్న కాస్త‌ డొల్ల జీవితాన్ని ప్రశ్నలతో
నింపితే..ఇక జవాబులకు చోటెక్కడుంటుంది?అలాగాక అన్నీ జవాబులే నిండిపోతే వాటిని
దేనికి తగిలించాలో తెలీక తికమకపడతాం.గిలగిలలాడిపోతాం !!

మానసిక ప్రశాంతత లోపించినపుడు,ఆత్మవిశ్వాసం సడలినపుడు,మనసు స్వాభావిక స్థితి
కోల్పోయినపుడు ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది.అది మృత్యుసమానం.ఆ స్థితి నుండి
బయటపడగలిగితేనే మన జీవితం నిలబడుతుంది. ఓ క్షణకాలం ఆత్మవిశ్వాసం కోల్పోతే
ప్రయత్నించి మళ్ళీ యథాస్థితికి చేరుకోవాలి.నిరాశా నిస్పృహలు ఆవహించినప్పుడు క్షణ
కాలం ఆలోచనలకు పదును పెడితే మన జీవితం నిలబడుతుంది.

6.ఆరో అడుగు…!!

పంచప్రాణాలు దాటుకుంటూ వచ్చాక జీవితం అర్థమవుతుంటేనే మన ప్రయాణానికి అర్థం.
మన నడకకు ఫలితం.నడిచిన దూరాన్ని కొలవడం ఉద్దేశం కాదు.నిజానికిది కవిత కూడా
కాదు.కవి అంతరంగంలో వినిపించని గోలకు అక్షరాల రూపం మాత్రమే. ఈ సొద,ఈ వ్యధ
అర్థం కావాలనేం లేదు.అలాగని అర్థం కాకూడదనీ లేదు.మరదే జీవితం అంటే..అర్థమైనట్లే
వుంటుంది.అర్థం కాదు.అర్థంచేసుకోవడము,అర్థం చేసుకోకపోవడం వారి వారి సంస్కారంపై
ఆధారపడివుంటుంది.

మనిషి చనిపోవడంలో చాలా దోషాలున్నాయి.చచ్చి సాధించేదేంలేదు.జీవించివుంటే ఎన్నో
శుభాల్ని చూడొచ్చు.మనం నిర్దేశించుకున్న అనేక కార్యక్రమాల్ని విజయవంతం చేసుకోవచ్చు!
జీవితం ఎంతో విలువైంది.ఒక్కోసారి అంతా శూన్యంలా అనిపించినా..ఆ క్షణం మనదికాదని
వదిలేసుకొని ముందడుగు వేయాలి.ఇకపై జరిగేదంతా మన మంచికోసమే అనుకోవాలి.ఆశా
వాదంతో బతకాలి.అప్పుడే మనకెవరూ తోడు లేకున్నా జీవిత ప్రయాణాన్ని వైభవంగా
ముగించగలం!అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.!!

కట్టాతో కలిసి  “తోలుపడవలో  చేసిన ప్రయాణంలో “నేను తెలుసుకున్న విషయాలివి!!
శీను…!మళ్ళీ చాలాకాలం తర్వాత నేను ఆశించిన మంచి కవిత…..అదే జీవనసారాన్ని
అందించారు... కృతజ్ఞతలు!!

కామెంట్‌లు