ఒక మనిషి పోయిన వందేళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి తలచుకుందాం.

ఒక మనిషి పోయిన వందేళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి తలచుకుందాం.

అక్టోబర్ 15వ తారీఖు 1918 నుండి 2018 నాటి అక్టోబర్ 15 కు అంతే కదా అచ్చంగా వంద ఏళ్ళు గడిచాయి.

మహారాష్ట్ర లో ఆయన నడిచిన ప్రాంతంలో తిరుగుతూ ఆయన వాడిన వస్తువులు చూస్తుంటే అనేక ఆలోచనలు సుడితిరుగాడుతున్నాయి.

1857లో ఝాన్సీ రాణి వెంటనడిచిన సేనలో ఒకడిగా పోరాట మార్గంలో ఉంటే ఏమి చేసేవాడో ఎంత పేరు వచ్చేదో తెలియదు. అసలా తొలి పోరాటంలో ఈయన ఉన్నాడనే ఆధారపు దారం ముక్కఏదీ మిగలలేదు కదా.

సాము గారిడీలకు కుస్తీ పోటీలకు గొప్ప పేరున్న షిరిడీ ప్రాంతంలో మోహిద్దీన్ తంబోలి చేతిలో ఈయన ఒడిపోకపోయివుంటే ఎలా ఉండేదో? పేరున్న మల్లయుద్ద యోధుడు అయ్యేవారా? షావోలిన్ లా గొప్ప యుద్ధ శిక్షణా కేంద్రం పెట్టేవారా? ఓటమి తర్వాత ఏదో నైరాశ్యం వేషధారణ లోనూ మార్పు తెచ్చింది మోకాళ్ళ వరకు వుండే ముస్లిం కఫని, తలకు ఒక తలగుడ్డ ఎక్కడో ఆలోచిస్తూ తిరిగాడు ఈయన. పేరు హరి బావు భూసారి అట, పుట్టింది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కానీ అందరికి గుర్తున్న విషయాలు అవేమీ కానంతగా మరో గొప్ప కోణంలో ఎదిగాడు ఈయన. అక్కడినుంచి మిగిలిన కధ అంతా తెలుగు వాళ్ళు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయనను సాయి అని తండ్రిగా భావిస్తూ సాయి బాబా అని వేరే సాయి లతో బాబాలతో కలిసి పోకుండా ఆయన పెరిగిన ఊరుకూడా కలిపి షిరిడీ సాయి బాబా అని పిలుస్తుంటారు కాబట్టి. కాకపోతే దైవ సమానుడి హోదా నుంచి దేవుడి స్థాయిలో చూడటం మొదలయ్యాక ఆయన మనిషే నంటే కూడా నమ్మానంత అభిమానం మహారాష్ట్ర తర్వాత అంతకు మించిన స్థాయిలో తెలుగు నేల మీద ప్రభావం సంతరించుకుంది. ఒక మనిషి తన జీవిత కాలంలో ఏం పని చేస్తే ప్రజలు ఇంత గుర్తుపెట్టుకుంటారు? స్వతంత్ర పోరాటాలు, విజ్ఞాన ఆవిష్కరణలు, గొప్ప సూత్రీకరణలు, కవితలు, రచనలు, తత్వం ఇంకా ఆఖరుకు ఆశయం కోసం ఆత్మ బలిదానాలు వీటన్నింటికంటే మించి ఒక మనిషి ఇంతలా ఎలా గుర్తుంటాడు? మహిమలు, సేవ, బోధనకు మన భారతీయ జీవన విధానంలో వుండే ప్రాముఖ్యత మాత్రమే కారణమా? ఏమో ఈరోజు సాయి మ్యూజియం లో ఆయన వాడిన వస్తువులు వగైరా చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది.

వెంకోసా అనే గురువు దగ్గర 12 ఏళ్ల శిష్యరికంలో ఏం నేర్చుకున్నారో?

మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి వాళ్ళు వేపచెట్టు క్రింద ఎవరినీ పట్టనట్లు నిరంతరం ధ్యానంలో కూర్చునే యువకుడిలో ఏమి గమనించి ఆకర్షితులయ్యారో?

 1858 లొనే ఒకరోజు అసలు చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్లి వేడుకలో ఒకడిగా వచ్చి ఖండోబా దగ్గర బండి దిగినప్పుడే మహల్సావతి ఆవో సాయి అని ఎందుకు పిలిచాడో? లేదా ఇదంతా తర్వాతి కధనమేనా?

1858 నుంచి 1918 వరకు ఒక పాత మసీదును ఆశ్రయంగా తీసుకుని దానికే ద్వారాకామాయి గా పేరుపెట్టుకుని గడిపిన ఈయన జీవితంలో ప్రత్యేకత ఏమిటి?

ఈయన చనిపోవడానికి పదేళ్ల ముందు నుంచే అంటే 1910 నుంచే సాయి బాబా గా పేరు మారుమ్రోగిపోయింది. మహాల్సాపతి , హేమాండ్ పంతు, శ్యామా, దాసగణు, హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్), రఘువీర్ పురందరే, హరి వినాయక్ సాఠే, నానా సాహెబ్ చందోర్కర్, బల్వంత్ నాచ్నే, దామోదర్ రాస్నే, మోరేశ్వర్ ప్రధాన్, నార్కే, ఖాపర్దే, కర్టిస్, రావు బహద్దూర్ ధూమల్, నానా సాహెబ్ నిమోన్కర్, అబ్దుల్, లక్ష్మీబాయి షిండే, బయ్యాజీ అప్పాజీ పాటిల్, కాశీరాం షింపీ, కొండాజీ,గాబాజీ,తుకారాం , శ్రీమతి చంద్రాబాయి బోర్కర్, శ్రీమతి తార్కాడ్, రేగే, రాధాకృష్ణ ఆయీ, కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ, సపత్నేకర్, అన్నా చించిణీకర్, చక్ర నారాయణ్, జనార్ధన్ గల్వంకర్ లతో పాటు మెహర్ బాబా ఉపాసనీ మహరాజ్ వంటి వారు బుద్ధుడి జాతక కదల్లాగా, సోక్రటీజ్ ను వెలుగులోకి తెచ్చిన ప్లేటో లాగా చేసిన నిరంతర కృషికి కారణం ఏమిటో?

1910 లో దాసుగణ అనే కళాకారుడు తన పాటలతో చేసిన ప్రచారము చిన్నది కాదు.

1916 లో సాయి బాబా జీవించి వుండగానే  గోవిందరావు రఘునాధ దభోల్కర్ (ఇతనికి సాయిబాబా ‘హేమాండ్ పంత్’ అనే పేరు పెట్టారు) మరాఠీలో వ్రాసిన ‘సాయి సచ్చరిత్ర' కూడా జనానికి సాయి తెలిసేలా చేసింది.తెలుగులో ప్రత్తి నారాయణరావు అనువదించిన ‘సాయి సచ్చరిత్ర’ తో పాటు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ వ్రాసిన సాయి లీలామృతము స్మృతి శ్రీనివాస్, ఆంటోనియో రిగోపోలస్ వంటి వారు వ్రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు  గణేష శ్రీకృష్ణ ఖర్పడే వ్రాసిన ‘షిరిడి దినచర్య’ వంటివి విస్తృతంగా సాయి బాబా కు ప్రాచుర్యం తెచ్చాయి. అదే ఊపులో అనేక సినిమాలు కూడా వచ్చాయి. అప్పట్లో విజయ్ చందర్ నుంచి మొన్నీమధ్య నాగార్జున వరకు తెలుగులోనూ సాయి చరిత్రను సెలెబ్రిటీ హోదాలో సేల్ చేశారు.
ఇప్పటికీ రోజుకు సగటున 20 వేల మంది, ప్రత్యేక దినాల్లో లక్షమంది ఎక్కడెక్కడినుంచో ఈ ప్రాంతానికి వస్తున్నారు. దీనివల్ల ఇదంతా? భక్తి కి కారణం కేవలం నమ్మకమేనా? నమ్మకానికి పునాది మరేదైనా ఉందా?

 యెవాలా ఆనందనాధ్ అనే హిందు సాధువు బాబను ఒక ఆధ్యాత్మ వజ్రంగా చెపితే, గంగాగిర్ అనే మరొక గొప్ప సాధువు నిజమేనన్నాడు,  బేడేకర్ మహారాజ్ 1873లో బాబాను దర్శించుకొన్నపుడు ఆయనను జగద్గురు అని సంబోధించాడు. టెంబే స్వామీజీ అనబడే వసుదేవానంద సరస్వతి కూడా బాబాను అమితంగా గౌరవించాడు.చాలా మంది శైవ సాధువులు కూడా బాబాను ఆరాధించారు.స్వామి కాళేశ్వర్ బాబాను తన దైవ సమానుడైన గురువుగా పూజించారు.

అంతేకాదు అటు పక్క సూఫీ సంప్రదాయానికి చెందిన మహమ్మదీయులు సాయిబాబాను గురువుగా నమ్మారు. మెహెర్ బాబాసాయిబాబాను కుతుబ్ ఎ ఇర్షాద్(అత్యుత్తమమైన కుతుబ్) పొగిడారు. జోరాస్ట్రియన్ మతానికి చెందిన నానీ ఫాల్కీవాలా, హోమీ భాభా వంటి ప్రముఖులు కూడా సాయిబాబాను విశ్వసించారు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది నేను తెలిసిన వాడినే అనుకునే మతగురువు స్థాయి వాళ్ళు మళ్లీ బాబా గొప్పతనం ఒప్పుకోవడం వెనకున్న నిజం ఏమిటి? బయటకు తెలియని గొప్పతనం ఆయనలో వాళ్ళు ఏమి చూసారు?

పిచ్చి వాడిలా తిరిగాడు, రాళ్లు కూడా రువ్వించుకున్నాడు, హుక్కా తాగాడు, నవ్వాడు, ఏడ్చాడు, నిరాశకు లోనయ్యాడు, ఆవేశపడ్డాడు, తిట్టాడు, కొన్నిసార్లు కొట్టాడు, ఆయన విన్న గ్రామ ఫోన్ యంత్రం రికార్డులు, తిరగలి, కర్ర అన్ని ఇంకా అక్కడే కనిపిస్తున్నాయి. ఎలా చాలా మంది గొప్ప వాళ్ళకంటే ముందు వరుసలోకి రాగలిగాడు ఆయన?
శ్రద్ద సబూరి లాంటి బోధనలు భారతీయ తాత్వికతకి మరీ అంత కొత్తవి కాదు అయినా ఆయన వల్ల మాటలకు విలువోచ్చి0దా? విలువైన మాటలు చెప్పటం వల్ల గొప్పగా భవిస్తున్నామా? అంటే పెద్దగా ఆలోచించకుండానే మొదటిదే నిజమని ఎక్కువలో ఎక్కువమంది తప్పకుండా చెప్పేస్తారు. మరి ఆయనకు మెరుపు తెచ్చిన వెలుగు ఏమిటి? మనలో అప్పటికే ఉన్న కామన్ వెలితిని పూడ్చే పని ఏదన్నా ఆయన తెలియకుండానే చేశాడా?

ఏమో ఉదయం దర్శనం దగ్గరనుండి కొన్ని ఆలోచనలు ఇలా సుడితిరుగుతున్నాయి. ఏదో ఒక హడావిడి ముగింపు మాట ఓ నాకంత తెలిసినట్లు ఇవ్వాలని లేదు. మిత్రులుగా నా ఆలోచనలు మీతో పంచుకోవాలనిపించింది. మీరే నాకు సమాధాన పడే సమాచారం చెపుతారేమో? ఏమో మీరూ నాతో పాటు నాలా ఇలా ఆయన వైపు, అయిన లాంటి వారి వైపు చూస్తారేమో?
ఎవున్నా రెండు ముక్కలు మాట్లాడుకుందాం మరి.

మీ
కట్టా శ్రీనివాస్

కామెంట్‌లు