కట్టా శ్రీనివాస్ || 🎊 వెలుతురుల వరుస 🎊 ||

మట్టి ప్రమిదకు కూడా
గట్టి ప్యాకింగుల జాడ్యం అంటుకున్నాక
పల్లె సారె పై నవ్వు ఎలా పూస్తుంది?

వెలుతురుల ప్రమత్తతకు
విషాలు నిలువెల్లా అద్దుకున్నప్పుడు
కొవ్వు లేకుండా వత్తులెలా వెలుగుతాయి?

డజన్ల అంతస్థుల షాపింగ్ మాల్స్
ఇనుపపాదాలతో వీధికొట్లను తొక్కుకుంటూ పోతున్నాయి.

సెజ్ లలో పండించిన పూలు కంటైనర్లలో ఇంటిముందుగా ఊపుకుంటూ వెళ్తున్నప్పుడు ఉన్న ఒక్క పూలకుండీ భళ్ళున మిగిలిపోయింది.

డాల్బీ డబ్బా పడి డప్పు చితికిపోయింది.
కార్పెట్ల సరసన చాప వెలిసిపోయింది.
పెట్రోలు ప్రవాహలు కండరాల బలం లాగేసుకున్నాయి.

స్వతంత్రత స్ఫూర్తిని నింపి ఒక చిన్న దీపం వెలిగిద్దాం పట్టు. వలలా పరచుకునే చీకటి కొంచెమైనా పోతుందేమో చూద్దాం.
దొరల్లాంటి దొంగలు ఊళ్ళు పంచుకునే వేళ నిజాలను డాం డాం అని పేలుద్దాం పట్టు, దోపిడీని పరిగెత్తించే ఎరుక నిద్రలేస్తుందేమో చూద్దాం.

తేదీ 06౼11౼2018 (నరక చతుర్దశి నాటి రాత్రి )

కామెంట్‌లు