త్రిశంకు

కట్టా శ్రీనివాస్ || త్రిశంకు ||

అంతుదరి లేకుండా ఊరుకుతున్న
కాలప్రవాహాన్ని మరింత వెనక్కి
మరింత ముందుకి చూసేందుకు
విహంగాన్నై ఎగరగానే
స్వంత జీవితం చిన్న చుక్కలా
కుంచించుకు పోయింది.

ఎక్కడో వెనక ఆదిమానవుడి మాటలు
చెవుల్లో గలగలమంటుండగా
ముందెక్కడో ఒక UFO జుయ్ మంటూ
గాల్లోకి లేచిన అలికిడి.
ఆ రెండు కోసలు చెరోచేత్తో లాగబోతే
వెడల్పుగా సాగాల్సింది పోయి.
రెండు దూరాల మధ్య అర్థం తెలిసినట్లు
నేను
సూక్ష్మ బిందువునై అసలుకే మాయమవుతుంటాను.


నేనున్న చోటే నిజం
రక్తమాంసలతో తిరిగే మిత్రులే నిజం
వెనకది కల, ముందుది ఊహ
ఉన్నకొద్ది చోటు వదిలేసి
పదే పదే పైకెగిరితే
కాళ్ళక్రింది నేల
ఊపిరాడే నీళ్లు
దూరమవుతుంటాయి.

తేదీ : 31-03-2019




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి