కలలు మీకు కలర్లో వస్తాయా? ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా?

గత ఆదివారం ఏప్రిల్ 28వ తారీఖున సత్తుపల్లి జ్యోతినిలయం హైస్కూల్ లో 1998-99లో పదవ తరగతి చదివిన పూర్వవిద్యార్ధుల సమ్మేళనం జరిగింది. నా బిఎడ్ పూర్తి కాగానే ఎయిడ్ పోస్టులోకి అబ్జార్బ్ అయితే ఉపయోగం అన్న ఉద్దేశ్యంతో ఈ పాఠశాలలో చేరాను. అప్పటినుంచి 1998 అక్టోబర్ 26న పభుత్వ ఉద్యోగంలో ప్రవేశించే వరకూ అదే పాఠశాలలో పనిచేసాను. ఈ పిల్లలు ఆ స్కూల్ లో నా లాస్ట్ టెన్త్ బ్యాచ్. వీళ్ళకి ఒకటిన్నర సబ్జెక్టు చెప్పే వాడిని అంటే ఒక ఫుల్ పేపర్ ఇంగ్లీషు, మరో సగం పేపరు(అప్పట్లో 50 మార్కులు) బయాలజీ. అక్టోబర్ 24 వరకూ క్లాసెస్ తో పాటు సాయంత్రం స్టడీ అవర్స్ కూడా చెప్పాను. 25న కౌన్సెలింగ్ జరిగింది. 26న అశ్వారావుపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యాను. మళ్ళీ ఒకటి రెండు సార్లు జ్యోతినిలయం స్కూల్ కి వచ్చాను కానీ టీచర్లను పలకరించడం, పిల్లలకు హాయ్ చెప్పి బావున్నారా అని అడగేసి వెళ్ళిపోయాను. ఈ బ్యాచ్ కలుస్తున్నారు అనగానే మళ్లీ ఇరవైఏళ్ల వెనక్కి వెళ్ళిరావచ్చు అన్న సంతోషంతో ఈ తేదిని సంతోషంగా వాళ్ళకోసం(నాకోసం కూడా) అట్టే పెట్టేశాను.
కార్యక్రమం జరిగిన విధానం రిపోర్ట్ చెయ్యడం కాదు కానీ దానిలో షెడ్యూలింగ్ ఎలా జరిగింది నాకు ఏమేం బాగా నచ్చాయో చెప్తాను. బహుశా ఇలా పూర్వవిద్యార్ధుల సమ్మేళనం నిర్వహించుకునే ఎవరికైనా కొన్ని అంశాలు పనికి రావచ్చు, లేదా మీరిప్పుడు కొత్తగా చేసే సూచనలు ఈసారి జరిగే కార్యక్రమంలో సవరించుకునే అవకాశం కూడా వుంటుంది. దానితో పాటు నేను ఎప్పటిలాగానే గమనించిన మరోవిషయం 28 మంది వేర్వేరు ఐక్యూలెవల్స్, వేర్వేరు ఆర్ధిక స్థితులు, వేర్వేరు అభిరుచులు వున్న ఒక క్లాసు పైగా అదృష్ట వశాత్తు కో ఎడ్యుకేషన్ దీన్ని ఒక ఇరవై ఏళ్ళు ఫాస్ట్ పార్వర్డ్ చేసిన తర్వాత చూస్తే ఎవరెవరు ఇప్పుడు ఎలా స్థిర పడ్డారు. బాగా చదివే వాళ్ళే బాగా సంపాదిస్తున్నారా? అమ్మాయిలు అబ్బాయిలకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్టే ఎక్కువ సామాజిక హోదాలో కూడా ఎక్కువ స్థాయిలోనే వున్నారా? వుండకపోతే కారణం ఏమిటి? పేద కుటుంబాలలోంచి వచ్చిన పిల్లలు, ఆర్ధిక భరోసా వున్న కుటుంబాలలోనుంచి వచ్చిన పిల్లలు వీరిలో ఎవరికి స్థిరపడే అవకాశం ఎక్కువ ఏర్పడింది? మళ్ళీ వారి పిల్లల విషయంలో ఎవరెవరు ఎలాంటి శ్రద్ద తీసుకుంటున్నారు? ఇలాంటివి ఇంట్రెస్ట్ వుండి పరిశీలిస్తే నిజంగా ఒక చక్కని నమూనా కదా. ఆ వివరాలు కూడా ఒక్కొక్కటీ సేకరించాలి. ఈలోగా సమావేశ విశేషాలు కొన్ని పోటోలూ మీతో పంచుకుంటాను.

ఇరవైయేళ్ళ క్రితం పదవ తరగతిలో అడిగిన ప్రశ్న మళ్ళీ రీయూనియన్ సందర్భంగా నాకు గుర్తుచేసారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత తీరికగా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు గాయత్రి అడిగింది. సర్ అప్పుడు మీరు స్కూల్ నుంచి వెళ్ళేముందు ‘‘ఆలోచించండి తర్వాత సమాధానం చెపుతా’’నని ఒక ప్రశ్న అడిగారు కదా ఇప్పుడు చెప్తారా అంటూ. దానికి తర్వాత రవి ‘‘కలలు కలర్లో వస్తాయా బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయా?’’ అని అడిగారు అంటూ గుర్తుచేసాడు. నిజమే బియిడిలోనూ ఆతర్వాత జనరల్ బుక్స్ గానూ ప్రాయిడ్ తో పాటు సైకాలజీ అంశాలు నేర్చుకుంటున్న రోజులు. పిల్లలకు ఉత్సాహం కలిగించడంతో పాటు, నేను నేర్చుకున్న అంశాలు పంచుకోవాలని కావచ్చు. ఇటువంటి ప్రశ్నలు అడుగుతూవుంటాను. ఇప్పుడు IOT మీద పరిశోధనలు చేస్తున్న అరుణ్ లాంటి వాళ్ళు వున్న బ్యాచ్ అది. బహుశా మళ్లీ నన్నే అడగాల్సిన అవసరం లేకపోయినా నానుంచే తెలుసుకోవాలి అనుకున్నారు కావచ్చు. అప్పుడప్పుడు ఒక ప్రపంచంనుంచి మరో ప్రపంచంలోకి బదిలీ అవుతున్నప్పుడు ఇలా సగం వదిలేసిన పనులు వుంటూనే వుంటాయేమో. అయినా సరే నా ఉద్దేశ్యం అదేదో సమాధానం తెలిసిపోవడం కంటే ఆ ప్రశ్న మరింత పరిశీలనను పెంచెలా వుండాలి అనుకుంటాను కాబట్టి హమ్మయ్యా కొన్ని జ్ఞాపకాలనే కాదు పరిశీలించే పద్దతిని వీళ్ళ మనసుల్లో వదలానా అన్నది సంతోషమే అనుకున్నాను. ఇకపోతే ప్రతిబ్యాచ్ వెళుతున్నప్పుడు లేదా ఇలా రీయూనియన్ లో కలిసినప్పుడు అడిగే సాధారణమైన ప్రశ్న వీళ్ళని కూడా అడిగాను. టీచర్ గా నేను చెప్పే విధానంలో మీకు మంచిగా అనిపించి గుర్తున్నవి చెప్పండి, మీకు నచ్చని నొప్పించిన విషయాలు కూడా చెప్పండి ఎందుకంటే ఇప్పటికీ అదే రంగంలో వున్నాను కాబట్టి ఎది నాతోనే వుంచుకోవాలి ఏది వదిలేసుకోవాలి అనేది నాక్కూడా పాఠంలా పనికొస్తుంది కదా. పనిలోపని అప్పట్లో ఏదైనా మనసుకి బాధకలిగించేలా ఇమ్మెచ్యూరిటీతో అనివుంటే ఇప్పడు పదవతరగతి పిల్లలకంటే పెద్ద పిల్లలకే తల్లిదండ్రులుగా వున్న వాళ్ళందరికీ సారీని మాటగా కాక మనస్పూర్తిగానే చెప్పాను.
కార్యక్రమం జరిగిన విధానం
ఇలా ఒక రెండు పూటలు పాత విధ్యార్ధులు కలుసుకోవడానికి రెండు నెలలకు పైగా కష్టపడ్డారు ఈ బ్యాచ్ లోని చాలా మంది పిల్లలు. ముందు ఫోన్ నంబర్లు దొరికిన వారి వరకూ ఒక వాట్సప్ జట్టుగా మాట్లడుకుంటూ వచ్చారు. అందులో నాగు, రవి, మణి ప్రధాన పాత్ర తీసుకున్నారట. అమ్మాయిలలో ఎవరెవరు ఎక్కడున్నారో తెలియక అప్పట్లో క్లాసులో హుషారుగా వుండే సరస్వతి నంబరు మాత్రం దొరకడంతో తన నుంచి మరికొందరు వారినుంచి ఇంకొదరు ఇలా ఒక్కో దారం ఓపికగా అల్లుకుంటూ రాగానే 28 మంది విద్యార్ధులతో పాటు వాళ్లకి వేర్వేరు తరగతుల్లో చెప్పిన ఉపాధ్యాయులు 10వరకూ చదవకున్నా క్రింది తరగతుల్లో క్లాస్ మేట్స్ గా వుంచి సగంలో ఆపేసిన లేదా వేరే బడికి వెళ్ళిన ఇంకొందరు విద్యార్ధులు జతయ్యారు. 
వేదిక ఏర్పాటు: ఎన్నికల సామగ్రిని భద్రపరచి వుంచడంతో వారి తరగతిగదిలోనే మీటింగ్ పెట్టుకునే అవకాశం లేకుంటా పోయింది పాపం ముందుగానే తేదీలు అనుకుని ఆరోజుకు వీలుచేసుకున్న అందరికీ అది పెద్ద అడ్డంకి అయ్యింది. కానీ వివిధ అధికారులను కలిసి అదే ఆవరణలో టెంట్ వేసుకోవడం ద్వారా సమావేశం నిర్వహించేందుకు అనుమతులు సంపాదిచారు. చెట్టునీట కూడా చూసుకుని టెంట్ వేసారు. అయినా వేసవి వేడిని తట్టుకోవడం కష్టం అనే వుద్దేశ్యంతో ఎయిర్ కూలర్లను పెట్టించారు. వేదిక కుర్చీలు, మైక్ లతో పాటు ఫోటో విడియో లను రికార్డు చేసే ఏర్పటు చేసారు.
వేదిక మీదకు గెస్ట్ లను పిలిచే క్రమంలో బొకెలివ్వడం కాకుండా పూలమొక్క ఇచ్చారు. దాన్ని మట్టిరాలకుండా పట్టుకునేందుకు వీలుగా బ్లాక్ డబుల్ కవర్ లలో చక్కగా ప్యాక్ చేసారు.

వీళ్ళ బ్యాచ్ గుర్తుండేలా స్కూల్ కి ఒక చక్కటి నేమ్ ప్లేట్ చేయించి ఇచ్చారు. దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళ బ్యాచ్ నుంచే మైసూర్ వలీ వెల్డింగ్ వర్క్ చేస్తే, గోపి నిరంజన్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పట్లు చూసుకున్నారు. అజీజ్ అనే విద్యార్ధి ఆర్టిస్ట్ కమ్ పెయింటర్ గా పనిచేస్తున్నాడు తను స్వయంగా పేరు రాసిచ్చాడు. స్కూల్ వైపు చూస్తే వీళ్ళ బ్యాచ్ గుర్తువచ్చేలా బహుమతిని ఎంచుకోవడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. దీన్ని గూగుల్ మ్యాప్ లో కనిపించేలా నేను జతచేసాను.
సభా నిర్వహణ : వేదికను డ్రైగా వదిలేయకుండా జువాలజీ లెక్చరర్ గా చేస్తున్న ప్రశాంతి, ఎఈ గా చేస్తున్న రవి భాద్యతను తీనుకున్నారు. వేదికతో పాటు రవి మొత్తం కార్యక్రమం భాద్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. గంజి అరుణ్ లాంటి వాళ్లకు యూనివర్శిటీలలో ఫెస్ట్ లను నిర్వహించే అనుభవం వున్నాసరే మిత్రులు ఎవరో ఒకరు నడుపుతున్నప్పుడు మల్టీ కమాండ్ తో అడ్డురావద్దు అన్న ఉద్దేశ్యంతో రవిపైనే నిర్వహణ భాద్యతలను పూర్తిగా వదిలేసారు. వేదిక మీదకు అప్పటి ఇంగ్లీషు మీడియం హెచ్ యం లిడియా సిస్టర్, తెలుగు మీడియం హెచ్ యం కాధెరిన్ సిస్టర్(సిస్టర్ సిసీలియా) ప్రస్తుత హెచ్ ఎం ప్రసన్నసిస్టర్ చిత్రంగా ఈ సిస్టర్ పదవ తరగతి కూడా వేరేచోట్ 1999 లోనే పూర్తయ్యింది అట. రాంబాబు సర్, అప్పటి క్లాస్ టీచర్ మాధ్స్ శ్రీనివాసరెడ్డి సర్, జ్యోతి టీచర్, భవాని టీచర్, మంగ టీచర్, రామలక్ష్మీ టీచర్, లక్ష్మీటీచర్, యమహాసర్ గా పిలవబడే ఆర్ శ్రీనివాసరావు సర్, పియిటిగా చేసిన డి.గోపాలరావుగారు, ఇంగ్లీఫు బయాలజీ చెప్పిన నేను (కట్టా శ్రీనివాసరావు) వేదికమీదకు ఆహ్వానించబడ్డాము.
మెదట విద్యార్ధులు ఒక్కొక్కరు ఈ ఇరవై ఏళ్ళలో ఎంతదాకా ప్రయాణం చేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వంటి వివరాలు చెప్పారు. వీళ్ళు మాట్లాడిన వరసలో తీసుకుంటే ప్రవీణ్ హైదరాబాద్ లో సాప్ట్వేర్ ఇంజనీరు, రామకృష్ణ ఖమ్మంలో స్టీల్ ఇండియాలో సీనియర్ అధికారి, ప్రశాంతి సెయింట్ హాన్స్ లో జువాలజీ లెక్చరర్, సాహిత్య బియీడి పూర్తయ్యింది గృహిణి, నాగు బుల్లెట్ షోరూం, గాయత్రి గృహిణి, సరస్వతి గృహిణి, అజీజ్ పాషా ఆర్టిస్ట్, గోపీ ఆటో ఫీల్డ్ తో పాటు పెయింటింగ్ వర్క్, నిరంజన్ కుమార్ బిజినెస్, జెయంవి కృష్ణ సత్తుపల్లిలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో వర్క్, సంతోష్ ఐరన్ షాప్, మురళీ వ్యవసాయం, శ్రీనివాసరావు సీజనల్ పనులు, గంజి అరుణ్ జెయన్ టియు లో అసిస్టెంట్ ప్రొఫెసర్, వియస్ రవి హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ లో పనిచేస్తున్నాడు, ఇందిర గృహిణి, శిరీష యంఏ మాధ్స్ గృహిణి, వాజీద్ కంప్యూటర్ హర్డ్ వేర్ బిజినెస్, మైసూర్ వలీ గ్యాస్ వెల్డింగ్ పని, సత్యం బాబు, మణి షాఫ్ లో వర్క్, ఎ రవికుమార్ ఎలక్ట్రిక్ డిపార్ట్ మెంట్ లో ఎఈ. ఇలా ఒకరి తర్వాత ఒకరు వారివారి వివరాలతో పరిచయం చేసుకున్న తర్వాత పూర్వ ఉపాధ్యాయులను స్పందించమన్నారు.
లంచ్ బ్రేక్ : ఆహార పదార్ధాలు వృధాకానివ్వకుండా తగినంత ఫుడ్ ఏర్పాటు చేయడంతో పాటు, బఫే విధానం అయినప్పటికీ టీచర్లను మీరు కూర్చోండి మేము ప్లేటు తెచ్చిస్తాం అని ధగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. బహుశా ఇలాంటప్పుడే ఆహారం కంటే అభిమానం గొప్పగా వుంటుంది. 
మధ్యాహ్నం కూడా మరికొందరు ఉపాధ్యాయులు పాతరోజులు నెమరవేసుకోవడం తోపాటు సూచనలుకూడా చేసారు. మామూలుగా అథిదులకు ఇచ్చే జ్ఞాపికను చక్కగా తయారుచేసి ఇవ్వడంతో పాటు, తమ క్లాస్ మేట్స్ కు కూడా రవి ప్రత్యేకమైన గిఫ్ట్ ను ప్లాన్ చేసాడు. చాలా రోజుల నుంచి వారు బడిలో గడిపిన జ్ఞాపకాలను ఇప్పటి వారి ఫ్యామిలీ పోటోలనూ సేకరించి వాటిని కొల్లేట్ చేసి చక్కటి టేబుల్ టాప్ క్యాలెండర్ గా ఎవరి క్యాలెండర్ వారికి ముందస్తు ఆర్డర్ తో హైదరాబాద్ లో ప్రత్యేకంగా చేయించాడు. ఇటువంటి గిఫ్ట్ బావుంటుందని తన సహచరి సూచన అని చెప్పాడు. గ్రూఫ్ ఫోటో లతో పాటు వేర్వేరు ఫోటోలు దిగాం.

సాయంత్రం కార్యక్రమం పూర్తిఅయిన తర్వాత అందరు విద్యార్ధులు బరువుగా సాగనంపారు. ఇది మళ్లీ ఇప్పుడు ఇలా రాయడం కోసం తలచుకున్నా సరే ఒక కలలా అనిపిస్తోంది. రంగుల్లో వస్తున్న కలలా అనిపిస్తోంది.
2015 లో కలిసిన మరో బ్యాచ్ విద్యార్ధులు
https://www.facebook.com/nivas.katta74/posts/1064117146946136

కామెంట్‌లు