ఫణిగిరి కొండ మీద విదేశీయులకూ జ్ఞానబోధ జరిగిందా? దేశ
విదేశాలనుంచి ఇక్కడ నేర్చుకునేందుకు మహామహులు సైతం వచ్చేవారా? పటిష్టమైన నిభందనలతో
ఒక యూనివర్సిటీకి మించిన స్థాయిలో బోధన సాధన జరిగేవా? అవునంటున్నాయి ఫణిగిరిలో
వెలుగుచూస్తున్న ఆధారాలు.
ప్రిలోడ్.....
అన్నీ
విదేశీయులే కనుక్కుంటున్నారు మనం అంటే కేవలం జనాభా, ఈర్ష్య లంచగొండితనం అనుకునే
రోజుల్లోంచి వెనక్కి చూసేశక్తి కూడా సన్నగిల్లింది వందేళ్ళలో నాలుగులేదా ఐదు తరాలు
గడుస్తాయి అనుకుంటే గతంలో కనీసం రెండు మూడు తరాల వెనకున్న చరిత్రను పట్టించుకునే తీరికవుండేది.
ఇప్పుడంతా రోజు గడిస్తే చాలు అనుకునే
జీవితాలు. జానెడు పొట్ట నిండటం కొన్ని మూరల చర్మం సుఖపడటం,అంగుష్టమాత్రం కూడా
కనిపించని మనసుమదం ఆనంద పడటం కోసమే మొత్తం సమయాన్ని, మొత్తం ఆలోచనలనూ ఎక్కడో
తాకట్లు పెడుతున్న రోజులు. మరి రెండువేల ఏళ్ళు అంటే కనీసం మన తాతల తాతల త...త..
త... త తాతలు 80కి మించిన తరాల వెనక జరిగిన సంగతులు ఎలా అర్ధం అవుతాయి మనకి. పోనీ
ఎవరన్నా చెప్తే విందామన్నా సాయంత్రం సప్పర్ సూపర్ గా తినేందుకు ఇవేమన్నా
తోడ్పడతాయా? అధికారి ప్రాపకాన్నో అమ్మాయి సాహచర్యాన్నో ఇస్తాయా? తూచ్ ఇవ్వన్నీ
పన్లేని యవ్వారాలబ్బాయా!! అనుకుని తీర్పులిచ్చే రోజుల్లోనే
ఈదుతున్నాం. కానీ ఒక్కక్షణం ఆగి దేశమంటే ఇవ్వాల్టి మనుషులు మాత్రమే కాదు.
ఇవ్వాల్టి మనుషులకు ఆధారమైన ఎన్నో మెట్ల దొంతరల క్రింద పేర్చిన జ్ఞానం కూడా అని
అర్ధం చేసుకుంటే మనం మరింత ఉన్నతమైన చోటుకి చేరుకునేందుకు, గర్వపడేందుకు మాత్రమే
కాదు. జీవితం అంటే ఏంటో ఎలా గడపాలో తెలుసుకునేందుకు కూడా తాతలు కొన్న ముచ్చట్లు
చెప్తారు ఫణిగిరి లో తిరుగుతూ నేను విన్న కొన్ని ముచ్చట్లు మీతో పంచుకుంటాను
వింటారా మరి.
ఒకప్పటి అత్యద్భుత విజ్ఞాన తాత్త్విక కేంద్రంగా విలసిల్లిన
ఒకానొక చోటు నిర్లక్ష్యం వల్లనయితే నేమి. పరమత ఈర్ష్యల వల్లనైతే నేమీ తరాలు
గడుస్తుండగా శిధిలమై పోతూ వచ్చింది. ఆకాలం మనుషులకు పట్టని గొప్పతనాన్ని భవిష్యత్
తరాల వారసుల కోసం నేను దాచిపెడతానని భూమితల్లి తన గర్భంలో ఆ శకలాలలను భద్రంగా
దాచుకుంది. అవి ఇప్పటికీ మట్టిఊటల ఉమ్మనీటిలో ఊపిరితీసుకుంటూ దాగివున్నాయి. అమ్మకి
నొప్పితెలియకుండా జాగ్రత్తగా సున్నితంగా తీసుకుంటే మళ్లీ అందుకునే అవకాశం వుందన్న
ఆధారాలను ఇస్తూనే వున్నాయి. అందుకేనేమో ఫనిగిరిలో చిన్న చిన్న కుంచెలు, సూదులు,
దబ్బలాలు లాంటివి కూడా వాడుతూ చేసే తవ్వకాలను చూస్తున్నప్పడు పాత పుస్తకాన్ని
నెమ్మదిగా తెరుస్తున్నట్లు, అపూర్వనిధిని నెమ్మదిగా తెరచిచూసే ప్రయత్నం
చేస్తున్నట్లు అనిపించింది.
ముచ్చటేందంటే....
ఫణిగిరిలో ఈమధ్య ఫిబ్రవరిలో ప్రారంభం అయిన 90 రోజులు
తవ్వకాలు కాలం పూర్తికావడం వల్ల, వర్షాలు రాబోతున్నాయి కాబట్టి సాధ్యం కాదు కాబట్టి
ఆగిపోతాయి ఈలోగా ఒకసారి చూసిరావాలని ది 03-06-2019(సోమవారం) బయలుదేరాము. సహచర
మిత్రులు అర్వపల్లి వీరాస్వామి, బండి శేషయ్య, ఎ. ధనమూర్తి గార్లతో కలిసి ఖమ్మం
నుంచి నేను, యువ చరిత్ర కారుడు అరవింద్ ఆర్యా వరంగల్ నుంచి బయల్దేరి ఉదయం 8
ప్రాంతానికి అటూఇటూగా ఫణిగిరిలో కలుసుకున్నాం. అక్కడ చూసిన విశేషాలు ఒక్కోక్కటీ
మీతో పంచుకుంటాను.
ఉత్తర భారత దేశాన్ని దక్షణ పథంతో కలిపే ఒకప్పటి జాతీయ
రహదారిపై విలసిల్లిన ఫణిగిరి ఫై ఒక మహాస్తూపం, చైత్యగృహాలు
(బౌధ్ధసాధకుల ఆవాసాలు), ఉద్దేశిక స్తూపాలు(ప్రార్ధనా
స్థూపాలు), బుద్ధుని ప్రతిమలు, బౌద్ధచిహ్నాలు,
జాతక కథలు, సిద్ధార్థ, గౌతముని
జీవిత ఘట్టాలను మలిచిన అపురూప శిల్పాలు, చక్కటి శిల్ప శైలితో
బుద్ధుని పాద ముద్రలు, శాత వాహన క్షేత్రాలు, ఇక్ష్వాకుల,
మహావీరుల నాణేలు, మట్టి, సున్నపు బొమ్మలు పూసలు ఇలాంటివి ఎన్నో ఇప్పటికీ వున్నాయి. అవి ఒక్కొక్కటి
బయట పడుతున్నాయి.
1941లో ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ ఖాజా మహమ్మద్
అహ్మద్ గారు వున్నప్పుడు తొలుత తవ్వకాలు ఇక్కడ ప్రారంభం అయినాయి. అలా 1944 దాకా
జరిగాయి అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందే అపూర్వమైనదిగా భావించిన
చారిత్రక సైట్లలో ఇది కూడా ముఖ్యమైనదే. ఆ తర్వాత మళ్లీ 2001 నుంచి 2010 వరకూ ఆ
తర్వాత 2013-14 లోనూ తవ్వకాలు జరిగాయి. ప్రస్తుత తవ్వకాలు 2019 పిబ్రవరి 2వ
తారీఖున ప్రారంభం అయ్యి మే నెల 15 వ తారీఖు వరకూ నిర్వహించాలి అనుకున్నారు. కానీ
అత్యద్భుత మైన ఫలితాల ఆధారంగా వాతావరణం అనుకూలించినంత మేర వీటిని పొడిగిస్తూ
వస్తున్నారు. బహుశా వర్షాకాలం మొదలయ్యేంత వరకూ ప్రస్తుతం ఇవి కొనసాగుతాయి.
ఈ మధ్యే బయటపడ్డ
అరుదైన నిలువెత్తు శిల్పం
గత ఏప్రిల్ నెలలో ఎప్పటిలాగానే తవ్వకాలు జరుపుతుండగా
ఒకచోట బొర్లపడివున్న భంగిమలో ఒక విగ్రహం కనిపించింది దాన్న అత్యంత జాగ్రత్తగా
చుట్టూవున్న మట్టిని తొలగిస్తూ చూడగా అది తెలంగాణలోనే కాదు దేశంలో ఇప్పటి వరకూ
దొరికిన విగ్రహాలలో అత్యంత పెద్దది. 1.73 మీటర్ల ఎత్తు, 35 సెంటీ మీటర్ల వెడల్పుతో
రియల్ లైఫ్ సైజులో గార లేదా పూత (stucco ) వున్న
ఈ శిల్పం బొధిసత్వుడిదిగా భావిస్తున్నారు.
మూడు కోట్ల బీమా వున్న శిల్పం ముచ్చట్లు తెలుసునా?
ఇలాగే తవ్వకాలు జరుపుతుండగా 2001లో జరిపిన తవ్వకాలలో
ఇక్ష్వాకు కాలంనాటి దాదాపు 1800 సంవత్సరాలు క్రితపు నాలుగు అడుగుల శిల్పం ఒకటి దొరికింది.
దానిలో బుద్ధుని జీవిత ఘట్టాలు చెక్కివున్నాయి. సిద్ధార్ధుడు అడవికి వెళ్ళడం,
బుద్దునిగా మారి జీవిత పరమార్ధం వివరిస్తూ తన బోధనలు విశ్వవ్యాప్తం చేయటం, చివరికి
స్వర్ఘాని చేరుకోవడం ఈ శిల్పంలో
తెలియజేస్తున్నా అంశాలు. దానిలో శిల్పుల పనితీరు కూడా అత్యద్భుతం. అమెరికాలోని
న్యూయార్క్ లో నిర్వహిస్తున్న ‘ది మెట్రోపాలిటన్
మ్యూజియమ్స్ ఆఫ్ ఆర్ట్ (ది మెట్)’150వ వార్షికోత్సవాన్ని
పురస్కరించికుని చేస్తున్న ‘‘ ట్రీ అండ్ సర్పెంట్ ’’ పేరుతో బుద్దుని ఇతివృత్తంగా
చేస్తున్న ప్రదర్శనలో ఈ శిల్పాన్ని కూడా ప్రదర్శించుకునేందుకు అనుమతి అడిగారు అంటే
దీని ప్రత్యేకత అర్ధం చేసుకోండి. అప్పటికి ఈ విగ్రహం హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో
వుంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 7దశాబ్దాలు పూర్తయిన
సందర్భంగా ఒక అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేసారు. ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం,
ఢిల్లీ నేషనల్ మ్యూజియంలతో కలిసి సంయుక్తంగా మూడు ప్రాంతాల్లో ఈ
ప్రదర్శన ఏర్పాటుకు అనుమతి వచ్చింది. గత 2017 నవంబరు నెలలో
ముంబై నగరంలో 3 నెలల పాటు, ఢిల్లీలో 3 నెలల పాటు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన కోసం కూడా ఈ ఫణిగిరి శిల్పాన్ని
ఎంపిక చేశారు.
ఇంత విలువైన శిల్పం అని ముందే గమనించిన విగ్రహ స్మగ్లర్లు
దీన్ని కొట్టసారు.గోనెపట్టాల్లో చుట్టి లారీలో సూర్యాపేటమీదుగా దాచేపల్లి తరలించి
ఒక ఇంటిలోపటి డ్రయినేజీ సంపులో దాచిపెట్టాటు ఈ క్రమంలో అది కాస్తా మూడు
ముక్కలైంది. ఈ చోరీ విషయంలో రాష్ట్రపతి కార్యాలయం కూడా తీవ్రంగా పరిగణించింది దాంతో
గట్టి ప్రయత్నాల అనంతరం ఈ శిల్పాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ నిపుణులు
సహాయంతో చాలా ఖర్చుపెట్టి మొత్తం విగ్రహాన్ని జాగ్రత్తగా పునరుద్దరించి చిన్న గీత
కూడా కనిపించకుండా అప్పటిలా అందంగా తయారు చేసారు. పాతమట్టి తవ్వుతుంటే దొరికిన
బొమ్మ మాత్రమే అనుకోవచ్చు కానీ అదిప్పుడు మన భారతదేశ ఖ్యాతిలా నిలబడింది. బుద్దుని
జీవితంతో పాటు అప్పటి శిల్పనైపుణ్యం వంటి ఎన్నో విశేషాలను ప్రపంచానికి తెలిపే
చిహ్నంలా నిలబడి వుంది.
చైత్యం అంటే కేవలం దిబ్బ మాత్రమేనా?
ప్రాచీన బౌద్ధంలో బుద్ధుని, లేదా ఇతర
"అర్హతుల" ధాతు విశేషాలను గౌరవ ప్రదంగా లేదా స్మృతి చిహ్నంగా లేదా పూజా
సంకల్పంతో భద్రపరచే ఆచారం అప్పుడు ఉండేది. అలా చేయవచ్చునని బుద్ధుడు తన శిష్యుడు
ఆనందునితో అన్నట్లు మహాపరినిర్వాణ సూత్రంలో ఉంది.
బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు.
తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి అశోకుడు అందులోని
శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడని ఒక
ప్రతీతి ఉంది. ఈ ప్రతీతిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు. కాలక్రమంలో
బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం
మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని
వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్తూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term
for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి
శబ్దరత్నాకారుడు స్తూపం అన్న పదానికి మట్టి
లాంటి వాటి దిబ్బ అని అర్థం ఇచ్చారు. అయితే దీనికి
ప్రముఖ చారిత్రికులు మల్లంపల్లి సోమశేఖర శర్మ స్తూపం
అనే పదానికి చరిత్రపరంగా వేరే అర్థం చెప్పారు. ఆయన ప్రకారం చరిత్ర అధ్యయనంలో బౌద్ధవాస్తువును
ఇటుకతోనో,
రాతితోనో కట్టిన అర్ధగోళాకారము వంటి ఘననిర్మాణమునకే స్తూపమను పేరు
రూఢియగుటవలన, దిబ్బ అయినదెల్లా స్తూపము కాజాలదు. ఈ నిర్మాణము
బౌద్ధమతము వాస్తువునకు ప్రసాదించిన విశేషము. దీని
ప్రాకృత రూపం "థూపము". అయితే ప్రాచీన (బౌద్ధ) కాలంలో
"స్తూపము" అనే పదం వాడుకలో ఉన్నట్లు కనిపించదు. అందుకు బదులు
"చైత్యము" అనే పదమే వ్యవహారంలో ఉండేది. ఒకే చైత్యము ఉంటే దానిని
చైత్యమనీ,
చాలా చైత్యాలున్నచోట ప్రధాన కట్టడాన్ని మహాచైత్యమనీ అనేవారు
కావచ్చును. "చైత్యము" అన్నపదం "చితా" శబ్దమునుండి పుట్టింది.
అన్నారు. వీటిలో మళ్ళీ రకాలున్నాయి.
ధాతుగర్భ స్తూపాలు: బుద్ధుడు లేదా ఆయన
ముఖ్యమైన అనూయాయుల జుట్టు, అస్థికలు వంటి శరీరావశేషాలను
భూస్థాపితం చేసి దానిపై నిర్మించేవారు.
పారిభోజిక స్తూపాలు: భిక్షాపాత్ర వంటి
వస్తువులపై నిర్మించినవి.
ఉద్దేశిక స్తూపాలు: ధాతువులు లేకుండా
స్మారకచిహ్నంగా నిర్మించినవి.
స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన భాగాలు ఇవి
- ఒక వేదిక (Drum)
- దానిపైన అర్ధ గోళాకృతి అండము (Semi sperical
dome)
- అండముపై ఒక హర్మిక (Pavilion)
- దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము (Umbrella)
- అండము, హర్మికల మధ్య గళము (neck)
- చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు (Railings)
ఎన్నో కాలాలకు, ఏవేవో దేశాలకు చెందిన నాణేలు దొరికాయి.
అప్పటి కాలంలో విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చినట్లు కొన్ని
నాణేలు చెప్తున్నాయి. అంతేకాదు వేర్వేరు రాజుల కాలంలో ఈ ప్రదేవం తన ప్రాభవాన్ని
చాటుకుంది అనేందుకు నిదర్శనంగా అనేక కాలాలకు చెందిన నాణేలు ఇక్కడ దొరికాయి.
ఇక్ష్వాకులు కొంచె అటు ఇటుగా శాతవాహనుల పరిపాలనా విధానాన్నే
అనుసరించారు. ఇక్ష్వాక రాజు పరిపాలనలో సర్వాధికారి. నిరంకుశుడు. అన్ని అధికారాలు
ఇతని చేతుల్లోనే ఉండేవి. ఇతడు ధర్మశాస్ర్తాలు, స్మృతులు వివరించిన
విధంగా పరిపాలించేవాడు. అమాత్యులు, మహాతలవర, మహాసేనాపతి, మహాదండనాయక, కోష్టాగారిక
మొదలైన అధికారులు పరిపాలనలో రాజుకు సహకరించే వారని శాసనాలు పేర్కొన్నాయి. మహాతలవరులు
అంటే వీరు సామంత స్థాయి కలిగిన అధికారులు, నియమించిన ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటం వీరి విధి. రక్షకులు ప్రధాన
న్యాయమూర్తులూ వీరే. ‘మహాతలవరి’ అనేవారు.
కాలక్రమంలో ‘తలవరి’ అనే పదం ‘తలారి’గా మారింది. తలారే గ్రామ రక్షకుడు
ఇక్కడ దొరికిన మహాతలవర నాణేలపై 2008లో ఆర్కియాలజీ
డిపార్టమెంట్ వారు ఒక పుస్తకమే వేశారు. 1.3 గ్రాముల బరువు 1.5 సెం.మీ వ్యాసం తో
దొరికిన పోటిన్ మెటల్ (రాగి,తగరం సీసం లను ప్రత్యేక నిష్పత్తిలో కలిపిన మిశ్రమ
లోహం వెండిలా అనిపిస్తుంది) కాయిన్ పై బొమ్మ గా ఒక మహారాజు సగం చిత్రం వెనక వైపు
3వ శతాబ్దపు ఓడ బొమ్మ వున్నాయి.
చేతివృత్తులు : ఇక్ష్వాకుల శాసనాల్లో పర్లిక శ్రేణి
(తమలపాకుల శ్రేణి), పూసిక శ్రేణి (మిఠాయి తయారీదార్లు),
కులిక ప్రముఖ (శ్రేణి నాయకుడు) అనే పదాలు అప్పటి చేతి వృత్తుల
అస్థిత్వాన్ని తెలియజేస్తున్నాయి.
ఫణిగిరి కట్టడాలు : రాతి కొండమీద నిర్మాణాలు
ప్రత్యేకమైనవి ఒక మహా చైత్యం దానికి చుట్టూ వేర్వేరు స్థూపాలు, దక్షిణాది శిల్పానికి లేని ప్రత్యేకతలు దీనిలో
వున్నాయి. బహుశా కొండమీదనుంచి వేగంగా క్రిందకి ప్రవహించే నీటి వల్ల కట్టడానికి
ఇబ్బంది రాకుండా ‘‘పెట్టెకట్టుడు విధానం’’ (Boxed Butresses) అవలంబించి
వుంటారని ఖాజామెహిద్దీన్ గారు తన పుస్తకంలో అభిప్రాయ పడ్డారు. 1941 నాటి తవ్వకాలలో
వాసపు పెంకులు (మన గూన/గోనె పెంకులు వంటివి) దొరికినట్లు
రాసారు. ఇటుకలు కూడా రెండడుగుల పొడవు, అడుగు వెడల్పు, మూడున్నర అంగుళాల మందంతో
వున్నాయి. కానీ అంచులు మొదలైన కొన్ని ప్రత్యేకమైన చోట్లలో వేర్వేరు రకాల ఇటుకలు
వాడినట్లు ఇప్సుడు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న బాక్సు గదులు వంటివి బౌద్ధ
సాధకులు ఎవరికి వారు వారి సాధనలు చేసుకునేందుకు ధ్యానానికి ఉపయోగపడేల
నిర్మించినట్లు తోస్తోంది. వీటి కప్పులుగా త్వరగా శిధిలమయ్యే ఆకులు రెమ్మలు గడ్డి
వంటి పదార్ధాలు వాడటం వల్ల వాటి అవశేషాలు ఇప్పుడు దొరికే అవకాశం లేదు. కానీ కొండ
ప్రాంతం మొత్తంగా చేయాల్సిన తవ్వకం పూర్తయితే వాటి మొత్తం రూపం దాదాపు చక్కగా
అర్దం అయ్యేలా ఏర్పడుతుంది. మామూలుగా ఎక్కడానికే కష్టమైన కొండమీదకు ఇన్ని సున్నపు
రాళ్ళను, ఇటుకలను, నాపరాళ్లను ఎలా చేర్చారో ఆశ్చర్యం వేస్తుంది. చైత్య గృహాలలోకి
చేరుకునే మెట్ల నిర్మాణం గ్రీకు రోమన్ పద్దతులను గుర్తుచేసే వయ్యారాల మెట్ల వరుసలు
వున్నాయి. ఇక్కడి సున్నపు రాతి శిల్పాలలోని ఎద్దులు కూడా సుమేరియన్, మొహెంజోధారో
వృషభాలను గుర్తుచేసేలా ఎత్తైన మూపురాలతో వున్నాయి. ఈ శిల్పాలలో వున్న జాతక కథలు,
బుద్ధని జీవిత విశేషాలను వివరించాలంటే బహుశా మరో పోస్టు రాయవలసి వుంటుంది.
ఏదేమైనా ఒకనాటికి ఈ కొండ అడుగున మట్టిలో కప్పెట్టుకు
పోయిన శిధిల సంపద వెలుగులోకి రావాలని, అది చెప్పే కథలతో మన గత చరిత్రను తలచుకుని
గర్వంగా తలెత్తుకోవడం మాత్రమే కాకుండా, మన భవిష్యత్ నడకకు దాన్ని ఆధారంగా
చేసుకోవాలనీ కోరుకుంటాను. వీలయితే ఈ పాత బొమ్మలు, నిర్మాణ అవశేషాల నుంచి త్రిమితీయ
దృశ్యవాస్తవిక రూపాలను (3D virtual reality structures) నిర్మాణం
చేయాలని కోరుకుంటున్నాను. అది ఇప్పటి సాంకేతికతకు అసంభవమైన విషయమేమీ కాదు. కాకపోతే
ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మించినంత ఖర్చు కావచ్చు, కానీ అప్పటి రూపాన్నిఇప్పుడు
ప్రపంచంలో కోరుకున్న ఎవ్వరి కళ్ళముందైనా నిలపడానికి సులభమైన సాధనం. ఒక ప్రాంతలో
దొరికిన వేర్వేరు అమూల్యవస్తువులను ప్రపంచంలో ఎక్కడెక్కడికో పంపుతున్నారు బాగానే
వుంది. కానీ అవి దొరికిన ప్రదేశంలో వాటి వివరాలతో పాటు ఫోటోలు రెప్లికాలు వున్న
ప్రధర్శన తప్పనిసరిగా వుండాలి. దానివల్లనే తదనంతర పరిశోధనలకు ఊతం అందుతుంది.
A buttress is an architectural structure
built against or projecting from a wall which serves
to support or reinforce the wall
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి