రాతినేల నాన్న గుండెలో దాచుకున్న నిజాలు ఈ శిలాజాలు : తెలంగాణా గడ్డమీద ఆటలాడిన రాక్షసబల్లులు



జురాసిక్ పార్క్ సినిమా చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద విచిత్రమైన డైనోసార్లు ఎక్కడో ఏ ఖండంలోనో అప్పట్లో వున్నాయి అనుకున్నారు కదా. కానీ మీరు నేను నిలబడ్డ ఇదే నేలమీద అవి పెద్ద పెద్ద అడుగులేస్తూ మన ఏనుగులని చీమల్లా చూసేంత పెద్ద జీవాలు ఇక్కడే ఇదే నేలపై పరుగులెత్తాయన్నా నిజం తెలుసా? మన తెలుగు నేలల్లో ప్రధానంగా తెలంగాణా ప్రాంతంలో రాక్షస బల్లులు ఒకప్పుడు హాయిగా ఎగురుతూ దుముకుతూ జీవించాయని తెలుసా? ఎన్నాళ్ళ క్రితం అంటారా? జస్ట్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంతే. మరి అవి వున్నాయని ఆధారాలు ఎలా? ఇదే కదా అసలు పెద్ద ప్రశ్న వాటికాలంలో మనిషే కాదు క్షీరదాలనే జీవులే పుట్టలేదు. వాటి కథను అక్షరాలుగా రాసిన వాళ్ళు లేరు. మరి లక్షల ఏళ్ళ కాలపు గీతలో మన జీవితకాలం అరవైనుంచి వందేళ్ళను పక్కన గీస్తే గీతలా కాదు చుక్కలాగా కూడా కనిపించదు. మరి మనకి వాటి ఉనికిని ఆధారంగా పట్టించేది ఎవరు?
మెన్న ఫణిగిరి సిరీస్ రాస్తున్నప్పుడు ఒకమాట అనుకున్నాం కదా. బౌద్దపు ఆనవాళ్ళను నేలతల్లి తన కడుపులో దాచుకుంది వాటిని నెమ్మదిగా తెలుసుకోవాలి అని. మరి నాన్నల దినోత్సవం తర్వాతి రోజు మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడీ లక్షల ఏళ్ళనాటి ముచ్చట్లను పాషణ హృదయుడనుకునే నాన్న తన రాతి హృదయంలోనే చెరిగిపోని ముద్రలుగా వేసుకున్నాడు. ఇప్పుడు మనం వాటినే చూస్తూ లక్షల ఏళ్ళ క్రితం నాటి ముచ్చట్లను అర్ధం చేసుకుంటాం. ఆశ్చర్యంగా అనిపించే అచ్చమైన నిజం ఇది. శిల లో పుట్టేది కాబట్టే ఆ రూపాలను శిలాజం అంటున్నాం. ఆంగ్లంలో ఫాజిల్ (Fossil) అనేది లాటిన్ ఫాడెరి(Fodere) నుంచి పుట్టింది.అప్పటి జీవులు అంటే జంతువులు కావచ్చు మొక్కలు కావచ్చు భూమిలో కూరుకుపోయి వాటిపై ఇసుక మన్ను లాంటిది పేరుకుని కాలక్రమంలో దాని కణం కణంలో ఇదే ఇసుకలాంటిది చేరుకుంటూ వేడికి మరింత ఘనీభవించి మనం మూసలు పోసిన పద్దతిలో అచ్చంగా ఆ జీవి ఆకారంలో ఒక రాతిలా ఏర్పడి మనకోసం తయారు చేసిన శిల్పమై రాళ్ళ కోశాగారంలోభద్రపరచబడి వుంటుంది. మనమే కొంచెం అర్ధం చేసుకుంటూ దాన్ని బయటికి తెచ్చుకుంటే. అప్పటి జీవి రూపాన్ని అర్ధం చేసుకోండం ఒక్కటే కాదు. జీవుల్లో జరిగిన మార్పులు, వాతావరణంలో మార్పులు వంటి ఎన్నో విషయాలను లక్షల ఏళ్ళు వెనక్కు వెళ్ళి అర్ధం చేసుకోవచ్చు. అంత ముఖ్యమైనవి శిలాజాలు.

అసలు 1669లో నికోలస్ స్టెనో అనే డానిష్ శాస్త్రవేత్త  ‘‘ఫ్రోడ్రోమస్’’ ( prodromus) పేరుతో తన సిద్దాంత పత్రం వెలువరించేంత వరకూ ప్రపంచానికి ఇలాంటి శిలాజలు అనే మహత్తర జీవ రూపాంతరాలు కొన్ని భూమిపై వున్నాయనే విషయమే తెలియదు.ఈ నాలుగొందల ఏళ్ళలో ఈ శిలాజాలపై ఆశ్చర్యం వున్నంత స్థాయిలో అవగాహన పెరగలేదనేది నిజం. నికోలస్ శిలాజాలను గురించి కనుక్కున్న విధానం భలేవుంటుంది. ఈ భూగర్భ శాస్త్ర వేత్త సముద్రం ఒడ్డున తిమింగలం పళ్ళను పోలిన రాళ్ళను గమనిస్తూ వుండేవాడు. అసలు రాళ్ళలో తిమింగలం పళ్ళవంటి రూపాలు ఎలా ఏర్పడ్డాయి? ఎందుకు ఏర్పడ్డాయి అని చాలా రోజులు ఆశ్చర్యంతో వాటిని పరిశీలించే వారు. కొన్నాళ్ళకు అసలు అవి సహజ రాళ్ళు కాదు తిమింగలమే కాల క్రమంలో అలా రాయిలా మారివుంటుంది అన్న హైపోథీసీస్ తళుక్కుమనగానే ఆ దిశగా ప్రయోగాలు చేసి జీవి ఇలా రాతిగా మారే క్రమంపై చేసిన ప్రయోగ ఫలితాలను తన సిద్దాంత పత్రంలో తెలియజేసాడు.  ఇప్పుడిక శిలాజాశాస్త్రం(Paleontology) అనేది ఒక ప్రత్యేక విభాగంగా అభివృద్ది చెందింది.


ఇలా శిలాజాలుగా ఏర్పడటం లో కూడా రకరకాలున్నాయి. జీవి ఉన్నది ఉన్న ఫళంగా అలాగే శిలాజంగా మారడాన్ని మమ్మిఫికేషన్  (Mummification) అంటారు. అంటే ఈజిస్టియన్ మమ్మీలను రసాయనాల్లో భద్రపరచినట్లు ఇవి రాళ్ళలో భద్రం అవుతాయన్నమాట. అంతే కాకుండా మంచులో కప్పబడిన శిలాజాలు (Ice embedded Fossils)కూడా మరోరకం. చెట్లనుంచి కారే ఒకానొక జిగురు వంటి ద్రవం రెసిన్ లో ఇమిడి ఉండే శిలాజాలు (Resin Fossils) ఇంకోలాంటివి. తాబేలు డిప్పలాంటి జీవుల గట్టిభాగాలు శిలాజంగా మారడంకూడా జరుగుతుంది.
మరోరకం శిలాజాలు కూడా ప్రత్యేకమైనవే దీనిలో జీవి శిలాజంగా మారటం కాకుండా వాటి వల్ల కొన్ని రూపాలు శిలాజాలుగా మారడం అంటే ఉదాహరణకు డైనోసార్ నడిచిన చోట దాని కాలి అచ్చు శిలాజంగా మరోచ్చు. వీటిని బాహ్యరూప శిలాజాలు అంటారు. వీటిలో ముద్రలు (Impressions), అచ్చులు (Moulds), పోతలు (Casts or Incrustations), శిలీభవనాలు (Petrifactions), నొక్కుడుపడ్డ శిలాజాలు (Compression Fossils), ఖనిజసంబంధ శిలాజాలు (Mineral Fossils), సూక్ష్మ శిలాజాలు (Microfossils).
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే ఉరుకుల పరుగుల లైఫ్ నుంచి కొంచెం స్థిమితంగా ముందుకు వెనక్కూ చూడలంటే మరికొంచెం నిశితమైన దృష్టి కావాలి. అటువంటి పరిశీలనలూ పరిశోధనలూ మన నేలపై జరుగుతున్నాయా?


మన పక్కనే వున్న రాష్ట్రాల్లో ఈ మధ్య శిలాజాలపై జరుగుతున్న పరిశోధనలు

పెరంబూరు జిల్లాలోని కరై - కులక్కల్‌నత్తం ప్రాంతాన్ని భూగర్భ వారసత్వ ప్రదేశంగా రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. ప్రపంచంలోని అతి ప్రాచీన సముద్ర శిలాజాలను కలిగిన కరై - కులక్కల్‌నత్తం ప్రాంతాన్ని సంరక్షించేందుకు, శిలాజాలను భద్రపరిచేందుకు, నిర్వహణకుగాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరంబూరుకి 20 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతం 107.22 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు స్థలంలో విస్తరించి ఉంది. ఇక్కడ నిర్మించిన నివాసాలు ప్రపంచంలోనే వైవిధ్యమైన సముద్ర శిలాజాలతో కూడుకున్నవిగా చరిత్రకారులు గుర్తించారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం సముద్రం అడుగుభాగాన ఉండేదని భావిస్తున్నారు. ఇక్కడ లభించిన శిలాజాలు 110 మిలియన్‌ సంవత్సరాలకు ముందువిగా అంచనా వేస్తున్నారు.నిజానికి కరై - కులక్కల్‌నత్తంకు భూగర్భ వారసత్వ ప్రదేశం గా గుర్తింపునివ్వడం వెనుక కేరళకు చెందిన పదవ తరగతి విద్యార్ధి కృషి ఉంది. శిలాజ అధ్యయనంలో భాగంగా కరై - కులక్కల్‌నత్తం చారిత్రాత్మక విశేషాలను ఆ విద్యార్ధి గుర్తించాడు. అయితే ఈ ప్రాంతం ఆక్రమణలకు గురవుతున్న విషయాన్ని గ్రహించి
, పరిరక్షించాల్సిందిగా కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో పిల్‌ వేశాడు.


చెన్నయ్ లో పన్నెండేళ్ళ అశ్విత బిజు సేకరించిన డజన్లకు డజన్లు శిలాజాలు
మన పొరుగునే వున్న చెన్నయ్ లో టీనేజ్ కి కూడా రాని ఒకమ్మాయి పేరు అశ్విత బిజు(Aswatha Biju) ఈ పాప ఒకపారి తన పాఠశాలలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ((ZSI) వాళ్ళు ఏర్పాటు చేసిన సెమినార్ విని వచ్చిన తర్వాత శిలాజాల ముచ్చట బాగా కొత్తగా ఇష్టంగా అనిపించింది. దాంతో ఇంటికి రాగానే పిల్లల ఎన్ సైక్లో పిడియా ముందేసుకుని శిలాజాల గురించి అవి కనిపంచే చోట్ల గురించి చదువుకుంది. అమ్మానాన్న నుంచి కొన్ని ముచ్చట్లు అర్ధం చేసుకుంది. సముద్రపు గుల్లలు రాళ్ళూ ఏరుకుంటూ వాటిని పుస్తకాల్లో చదువుకున్న శిలాజ లక్షణాలతో సరిపోల్చుకునేది. ఎన్నో ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రయత్నాలు అయినా విసిగిపోకుండా తన వెతుకులాటను ఒక ప్యాషన్ లా చేసుకుంటూ వచ్చింది. మొదట్లో కొన్ని శిలాజరూపాలను ట్రిచిలోని బారతీదాసన్ విశ్వవిద్యాలయం డిపార్ట్ మెంట్ హెడ్ కి చూపిస్తే వీటిలో కొన్ని శిలాజాలే కానీ మరీ అంత పాతవి కాదు. కేవలం కొన్ని వందల ఏళ్ళవి మాత్రమే అని తేల్చేశారట దాంతో చాలా నిరాశగా అనిపించినా ప్రయత్నం మాత్రం మానలేదు. ఆ తర్వాత పెరియార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ కుమార్ గారిని కలవటం ఆ పాప జీవితంలో ఒక గొప్ప మలుపుకు కారణం అయ్యింది. ఏదో లెక్చర్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న రామ్ కుమార్ గారికి ఒక్కసారి కలవాలి అంటూ ఈ పాప వచ్చింది. తన దగ్గర వున్న గుట్టలకు గుట్టల శిలాజాలు అవి ఎక్కడ ఎలా  సేకరించాను అంటూ మిలమిలా మెరిసే చిన్న కళ్ళను తిప్పుకుంటూ చెప్పింది. రామ్ కుమార్ గారికి ఆ పాప శ్రధ్ద ముచ్చటగా అనిపించి ఐదు నిమిషాలు మాట్లాడుతా అన్నాయన తర్వాత మూడు గంటల పాటు పాపతో ముచ్చట్లు చెపుతూనే వున్నారు. శిలాజాలను ఎలా ఎక్కడ గుర్తించాలి, ఎలా సేకరించాలి లాంటి వివరాలు చెపుతుంటే పాప వినడంతో పాటు త్వరత్వరగా అవగాహన చేసుకోవడం ఆయనకు సంతోషం కలిగించింది. లక్షల ఏళ్ళ క్రితం జీవుల ఆనవాళ్లను రాళ్ళలో గమనించే శక్తికోసం ఆమె కళ్ళకు ఆయన జ్ఞానోపదేశం చేసారు. అంతే కాదు అరియలూర్ బెడ్ లొ శిలాజాలు లభించడానికి అవకాశం ఆస్కారం వున్న తోవలను ఆయన సూచించారు. ఇంకే ఆ పాప కళ్ళ గాలానికి చేపలున్న చోటుచూపినట్లు అయ్యింది. గుడ్డిగా వెతకడం కాకుండా 26 రకాల జీవరాశుల శిలాజాల కోసం దృష్టిపెట్టి 79 శిలాజాల వరకూ చక్కగా గుర్తించి సేకరించేసింది. ఆరు లేదా ఏడవ తరగతి చదివే పిల్లలకు శిలాజాల గురించి పాఠం చెపితేనే ఒక పట్టాన అర్ధం కావడం కష్టం అటువంటి వయసులో శాస్త్రవేత్తలు సైతం కష్టంగా భావించే పనిని తనే స్వయంగా సాధించింది. బహుశా దేశం మొత్తంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత చిన్న వయసులో ఇన్ని శిలాజాలు సేకరించిన వ్యక్తి మరొకరు లేరనుకుంటా. వాటిని సేకరించడంతోనే పాపాయి ఆగకుండా తన పరిజ్ఞానం నలుగురికి పంచాలి అనుకుంది దానితో దగ్గరలోని పాఠశాలలు కళాశాలల్లో వీటిని ప్రదర్శిస్తూ వాటిగురించి వివరిస్తూ వస్తోంది. ఆమె కృషిని గుర్తిస్తూ ఈ మధ్యనే FICCI FLO స్పెషల్ పర్సన్ అవార్డును ప్రధానం చేసారు.  

శిలాజాల అన్వేషణలో తండ్రీ కూతుళ్ళు
మహారాష్ట్రలోని సిరొంచ సి.వి రామన్ సైన్సు కళాశాలలో పనిచేస్తున్న నుష్రత్ షేక్ అనే పరిశోధక విద్యార్ధిని ఆమె తండ్రి బాబర్ షేక్ గారితో కలిసి అనేక శిలాజాలను కనుగొనటమే కాకుండా వాటిపై అనేక పరిశోధనా పత్రాలను సమర్పించారు. జూన్ మొదటి వారంలో వీరిని కలవడం కోసమే సిరొంచ వెళ్ళినప్పుడు వారి పరిశోధనలో కనిగొన్న అనేక శిలాజాలను చూపించి వాటిగురించి వివరించారు. వాటిలో చేపలు, మెక్కలు, వెదురుకాండం తాబేలు శిలాజాలతోపాటు డైనోసార్ గుడ్డు డైనోసార్ పేడ కూడా శిలాజంగా మారిన రూపం చూపారు. నిజానికి ఇలా డంగ్ శిలాజాన్ని కొప్రాలైట్ లేదా కొప్రాలిథ్ అంటారట. ఎక్స్ రే మెషిన్ ఆపరేటర్ గా పనిచేసిన బాబర్ షేక్ ఈ శిలాజాల సేకరణకు కావలసిన పరిజ్ఞానాన్ని అనేక పుస్తకాలు చదవటం ద్వారా నేర్చుకున్నారు. వారి బిడ్డను ఇప్పుడు అదే విషయంలో పరిశోధకవిధ్యార్ధిగా తీర్చిదిద్దుతున్నారు. నిజానికి దిగువ మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో ఇంతటి కృషిచేయడం ప్రశంసనీయం. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో వీరు అనేక శిలాజ ఆనవాళ్ళనుగుర్తించారు.
తెలంగాణా శిలాజాల గుర్తింపులో మణిపూస : సముద్రాల సునీల్
గోదావరి ఖని లో నివసిస్తున్న యువకుడు సముద్రాల సునీల్ ది శిలాజాల గుర్తింపులో ఒక ప్రత్యేకమైన కథ. ప్రయివేటు సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తున్న సునీల్ తన వ్యక్తిగత ఇష్టంతో శిలాజాల గురించి తెలుసుకుని వాటి ఆనుపానులు అర్ధంచేసుకుని వెతకడం ప్రారంభించాడు. హైదరాబాదు నడిబొడ్డున వున్న బిర్లాసైన్సు మ్యూజియంలోని రాక్షసబల్లి శిలాజం తెలంగాణాలో తనకు దగ్గరి ప్రాంతంలోనిదే నని కోటసారస్ యామనపల్లేన్సిస్ అనే పేరులోని యామనపల్లి అది దొరికిన తనకు దగ్గరలోని గ్రామం వల్ల వచ్చిందే అని తెలియడంతో మరింత ఉత్సుకతకు లోనయ్యాడు. జర్నలిజం చదువుకుని కొన్నాళ్ళు మీడియాలో రిపోర్టర్ గా చేసినప్పటికీ తన మనసుకు నచ్చిన విషయంగా పేలియంటాలజీనే ఎంచుకున్నాడు. తనకు తోడుగా వుండే మిత్రుల స్థానిక మిత్రుల సహకారం తీసుకుంటూ, ఎండనకా వాననకా శిలాజాలు దొరుకుతాయి అన్న వేమనపల్లి, రాజారం, కాటారం, చెన్నూర్, జైపూర్, బుగ్గ వంటి తావుల్లో వెతుకులాడుతూ వెళ్ళాడు. వాటిని గుర్తించడం, అర్ధం చేసుకోవడం ఎలా అనే విషయాలకోసం పుస్తకాలు, నెట్ తో పాటు వివిధ పరిశోధకులను కాంటాక్ట్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. అతని శ్రమకు ఫలితం అనేక సాధారణ శిలాజాలతో పాటు ఒక ప్రత్యేకమైన మానవ శిలాజ రూపాన్ని ఈ మధ్యనే వెలుగులోకి తీసుకురాగలిగాడు. దానితో పాటు మరో చిన్న శిలాజం కూడా మానవ రూపంలో వున్నదాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ప్రపంచంలోనే అరుదైనవిగా చెప్పుకునే శిలాజ రూపాలు మన తెలంగాణ ప్రాంతంలో దొరకటం అదికూడా ఒక ఔత్సాహిక పరిశోధకుని పరిశోధనలో వెలుగుచూడటం ప్రత్యేకం. అయితే ఈ వెతుకులాట నేపద్యంలో తన ప్రయివేటు ఉద్యోగాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడినా లెక్కచేయకుండా అంకితభావంతో కృషి చేస్తున్న ఈ యువకుడికి ఏమన్నా సాయం సంస్థల నుంచి లేదా ప్రభుత్వం నుంచి అందితే తను మరిన్ని వండర్స్ సృష్టించగలడు. తన శిలాజ సేకరణల ప్రదర్శనలతోనూ, తరగతులు నిర్వహించడం ద్వారాను మన ప్రాంతాలలో శిలాజాలపై తగిన ఎవేర్ నెస్ తీసుకురాగలుగుతాడు.
వడదాం ఫాజిల్ పార్క్ : మొన్నీమధ్య జూన్ మొదటి వారంలో సిరొంచ తోపాటు మహారాష్ట్రలోని గచ్చిరోడి జిల్లా వడదాం శిలాజాల పార్క్ ను శిలాజపరిశోధక మిత్రుడు సముద్రాల సునీల్ తోపాటు శ్రీరామోజు హరగోపాల్ గారు, అరవింద్ ఆర్యా, అహోబిలం కరుణాకర్,ఉడుముల సుధాకర్ రెడ్డి గార్లు నేను కూడా సందర్శించాము. ఈ పార్కు చాలా ప్రత్యేకమైనది లక్షల ఏళ్ళనాటి మొక్కలు శిలాజాలుగా మారిన చోటునుంచి కదపకుండా అక్కడే వాటిని ప్రదర్శనగా తిలకించేందుకు ఏర్పాటు చేసారు. దేశం మొత్తంలో శిలాజాల పార్కులకు ఇచ్చిన విలువ చాలా తక్కువ అనిపిస్తుంది. దీనితో పాటు మరో నాలుగు మాత్రమే ఇటువంటి పార్కులు వున్నాయి. మధ్యప్రదేశ్ లో గుగుహ ఫాజిల్ పార్కు, హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ ఫాజిల్ పార్కు, తమిళనాడులోని తిరువక్కరైలోని నేషనల్ ఫాజిల్ వుడ్ పార్క్, గుజరాత్ ఇండ్రొడా డైనోసార్ ఫాజిల్ వుడ్ పార్క్. మరి మనం ఎందుకు ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని బెజ్జూరు రేంజ్ సలుగుపల్లి సెక్షన్ లో గల కొండపల్లి అటవీ ప్రాంతంలో గొప్ప శిలాజ ఉద్యానవనం నిర్మించేంత విస్తీర్ణంలో అనేక వుడ్ ఫాజిల్స్ పరచుకుని వున్నాయి. 75 పైగా ఎకరాల పరిధిలో విస్తరించిన 20 కోట్ల ఏళ్ల క్రితపు వృక్షశిలాజాలంటే ప్రపంచపు  చూపు తిప్పుకునే సంపద అన్నట్లు. 20 కోట్ల ఏళ్ళు అంటే భూమిపై ఖండ చలనం కూడా జరగక ముందు ఇలా ఏడు ఖండాలుగా ఏర్పడక ముందు ఒకే ముక్కగా గోండ్వానా భూమిగా వున్న కాలం నాటి మొక్కలు అన్నమాట. వాటిని సరిగా పరిశీలిస్తే భూమి ప్రారంభంనాటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం వుంది. గోండ్వానా కాలం నాటి గ్లాసిఫో పైటిస్ రకానికి చెందిన కోనిఫర్ ని పోలిన మొక్కల శిలాజాలు అలా అడవుల్లో వదిలేసే వున్నాం. ప్రాణహిత గోదావరి పరివాహక ప్రాంతాలలో యామనపల్లి వంటి చోట వున్న అనేక జంతు శిలాజాలను వెతికే అవగాహన వున్నవారు లేక, శ్రద్ద లేక కాలపు చీకట్లోకి వదిలేసుకుంటున్నాం. మనసు పెట్టాలే కానీ ఆదిమ కాలం నుంచి జీవం వున్న గడ్డమీద అనేక పరిశోధనలకు ఇంకా ఆస్కారం వుంది వుంటూనే వుంటుంది కూడా.






1)      పాఠశాల విద్యార్ధిని శిలాజాల డిస్కవరీ
2) అరియలూరు లో వంద ఎకరాల శిలాజమ్యూజియం ప్రారంభోత్సవం వార్త
3) మధ్య ప్రదేశ్ లో ఆయిస్టర్ శిలాజాన్ని కనుగొన్న వార్త
4) మహారాష్ట్రకు చెందిన రవీంద్ర మహంతీ ఎన్నో శిలాజాలను కనుగొన్నారు
5)

కామెంట్‌లు

  1. అసలు ఈ శిలాజాలు, రాక్షస బల్లుల తో ఏమి ఉపయోగం. కాలగర్భంలో అన్నీ కలిసిపోవలసిందే. ప్రస్తుతం నీళ్లు లేక జనం అల్లాడుతున్నారు. జనాభా చూస్తే నూట ముప్పై కోట్లు. ఎలక్త్రిషియన్లు ప్లంబర్లు దొరకరు. మల్లా ఉద్యోగాలు లేవంటారు.

    రిప్లయితొలగించండి
  2. మరలా రాక్షస బల్లులు వస్తే అధిక జనాభా తగ్గుతుంది. ఆ పరిశోధనలు చేయండి.

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రీయ అవగాహనా లేమికి, తనొక్కడే సుఖంగా వుండలనుకునే మనిషి స్వార్ధానికి సామాజిక స్పృహ ముసుగు తొడగటానికి ఉదాహరణ మీ కామెంట్.

    మనుషులకు ఎడతెరపి లేని తిండి నీరు దొరకాలంటే భూమి మీద మనిషి ఒక్కడు మాత్రమే ఉండాలనే కోరిక వదిలేసి, ప్రకృతిలో తను ఒక భాగం గా బ్రతకడం నేర్చుకోవాలి.

    రిప్లయితొలగించండి
  4. మిలియన్ల సంవత్సరాల క్రితం గాలిలో ఆక్సిజన్ స్థాయి ఎక్కువగా ఉండేదని, ఆ కారణంగానే అంత పెద్దగా డైనోసార్లు పెరగగలిగాయని ఒక వాదన ఉంది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి