నల్లమల మల

కట్టా శ్రీనివాస్ || #నల్లమల మల ||

నిజమే
అదేమిటో నాకు తెలియదు!
కానీ ఊపిరితిత్తులకు బొక్కపెడితేనే కరెంటు కారుతుందంటే
నాకసలే వద్దనిపిస్తుంది.

ఓయబ్బో …
ఆటంబాంబుల్ని ఆయుధాలుగా ఇస్తదంటగా?
ఇనప పళ్ల రాకాసి యంత్రాలు బండకాళ్ళతో
బతుకుల్ని తొక్కకుంటూ వెళ్ళటం కలగన్నాక.. !!
గుండెల్లోంచి రక్తంకారుతోంది.

అడవిని నమ్ముకుని అమాయకంగా
బితుకు బితుకుమంటూ ఉరుకుతున్నా సరే
నిజానికి మన బతుకుని తూసే
జీవాలన్నింటినీ త్రాసులోంచి బయటికి తోసేస్తే… !!!
అందరం చావు లోయల్లోకి చిందరవందరగా పడిపోవడం వణుకుపుట్టిస్తోంది.

కొత్త సామెతలు పలకింపు లోగిట్లోకొచ్చి
‘‘ఏందిరా బొత్తిగా నల్లమలైపోయా’’వంటూ పిలుస్తున్నప్పుడు

వురేయ్…
ఇంకా అడగాలనే అనిపిస్తాందిరా బిడ్డా?
‘‘ఉరేనియమా? ఊరేనయమా?’’ అంటూ

15-09-2019 (ఆదివారం)




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి