చేనును మేస్తున్న కంచె

కట్టా || చేనును మేస్తున్న కంచె ||

అ. లి. గి. తే .....
నాన్న అన్నంముద్ద పెట్టకపోతాడా అనుకున్నాము.
జబ్బలు చరుస్తూ
తప్పులు ఎన్నే మాటలు నూరుతూ
శత్రువుగా ముసుగేసి యుద్ధమే ప్రకటించాడు.
.
.
.
గొడుగై కాపాడుతాడనుకుంటే
పిడుగై కన్నీళ్లు కార్పిస్తున్నాడు.
నిలబడ్డ నేల అంతా అబద్ధమే అన్నాడు.
నిలబడలేమన్న బెంగతో పిట్టలు రాలిపోతున్నాయి.

పొడుగు మూతి కూజాలో మేతని
కొంగలా మేయలేక పోయిందని
ఇంటి కోడిపిల్లని తిడుతున్నాడు.
మషాలా నూరుతూ నీవల్ల అంతా నష్టమే
నీదిక ముగిసిన కథే అంటున్నాడు.

వేలు ఎంత పదునుగానైనా ఉండొచ్చు
తన కన్నుని నేనేననే విషయం మరిచాడా మరి??
మాటల్లోనో, ఈగోలతోనో గెలిస్తే ఏముంది!
ప్రగతి చక్రం తిరిగితేనే వెలుగు కనిపిస్తుంది.

సమస్యల ముళ్ల కంపలో చిక్కిన బట్టని
గంపెడు తర్కపు మాటలతో తిట్టినా ఏమవుతుంది?
ఎంత జాగ్రత్తగా త్వరగా తీసావన్నదే
లెక్కవుతుంది.

పిక్కలు బలంగా ఉన్నాయని బోయీలను
లాగిలాగి తంతే పల్లకీ పరుగెడుతుందా?
పదునైన గొడ్డలితో కూర్చున్న కొమ్మని
చురుకైన నాలుకతో మెలిపడ్డ బంధాన్ని
తెగనరికితే ఏమొస్తుంది?

సహనం వాడాల్సిన చోట బలాన్ని
ప్రేమని చూపాల్సిన చోట ద్వేషాన్ని
వెలుతురు పూయాల్సిన చోట తీక్షణతని
అదుపులేక వాడితే....

(సశేషం.....


మిగతా భాగం టీవీ వార్తలలో చూడగలరు... )

కామెంట్‌లు