విక్టిమ్ బ్లేమింగ్


పాపా ఇంకాసేపు మాట్లాడు పాపా
చనిపోయినంక కూడా భయమయితంది పాపా
మగముసుగు సమాజపు ముడత బిడ్డల
మితిమీరిన జ్ఞానభోధనలు చిత్రంగ హింస పెడుతున్నయ్.
వాళ్లంత తెలివి లేకపాయే ఆవేవో నంబర్లకు
ఫోను చెయ్యాలని తోచలేదు అదీ నా తప్పేనంట
అక్కడెందుకు నించున్నవ్
ఇప్పుడెందుకొచ్చినవ్ పొద్గాలే రాలేక పోయినవా
నీ ముఖానికి బ్యూటీపార్లర్ కావాల్సొచ్చిందా
అక్కడెందుకు టైం వేస్తే చేసావంటూ
మాటల సూదులతో మళ్ళీ మళ్ళీ గుచ్చుతున్నారే.
చర్మానికి వైద్యం చేయించుకోవడమూ తప్పేనా?
చుట్టూ వున్నది మనుషులేకదా అని నమ్మడమూ తప్పేనా?

చూపుల కత్తులకు దేహం కాలిపోకుండా
కాపాడుకోవాలంటే
మందమైన ఇనప పేటికల్లో పెట్టి
అందనంత లోతున
భూమిలోపట పాతెయండి పోనీ

మృగాలు తిరగటం మామూలే
మీరే కొంచెం దాక్కోండనే నీతి చెప్పదలచుకుంటే
సమాజపు ఒకదశ అంతంలో వున్నట్లే

నువ్వు జాగ్రత్త పాపా
మనం తిరుగుతున్న సమాజానికేదో
నయం కాని రోగం వచ్చింది.
నా చుట్టూ అంతా చీకటే నిండిపోయింది.
పాపా ఇంకేం మాటలు రావట్లేదు పాాపా 01-12-2019(Sunday)
కవిసంగమంలో

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి