భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి వందేళ్లముందే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించబడింది. అంత బృహత్తర ప్రయత్నాన్ని తలకెత్తుకున్న అమ్మాయి వయసు అప్పటికి పద్దెనిమిదేళ్ళు ఆమెకు ఆ ప్రాంత కరడు గట్టిన పద్దతుల వల్ల తన తొమ్మిదేళ్ళకే పెళ్ళి అయిపోయింది. కానీ భర్త ఆదర్శభావాలను ఆలంబనగా చేసుకుని తన చొరవ చూపుతూ కుదిరినంత మేర చీకట్లను పారద్రోలుతూ వెలుతురు ప్రసరింపజేయాలనుకుంది. ఆమె సంఘసంస్కర్త, ఉపాద్యాయిని, కవి, రచయిత్రి ఉదయాన్నే తలచుకోవలసిన మాతృమూర్తి సావిత్రీ భాయి పూలే. ఈరోజు ఆ అమ్మ పుట్టిన రోజు. 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రాలోని ప్రస్తుత సతారా జిల్లా అప్పట్లో నయాగామ్ అని పిలిచేవారు అక్కడ ఒకసాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. ఇప్పటికీ మేధావులు సైతం ఆమెను భర్తచాటు భార్యగానే పరిగణిస్తారు కానీ ఆమెగా చూపిన చొరవలను, నిబద్దతనూ పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించదు. ఈ సందర్భంగానైనా కొన్ని సంగతులు చూద్దాం.
మనం పైన అనుకున్నట్లు జనవరిలో బాలికల పాఠశాల స్థాపించి, నాలుగు నెలలు తిరగకముందే మే 12 వ తేదీ 1848 నాటికి బహుజనుల కోసమే ఒకపాఠశాల స్థాపించారు. వెనకబడిన కులాలంటే తరగతిలో మూలన ఎక్కడో కూర్చోవాలనీ, లేదా గది బయటే వుండిపోవాలనీ పనికిమాలిన పాతభావాలతో పిల్లల మనసుని గాయపరిచే రోజుల్లో వారికోసమే పాఠశాల స్థాపించాలనుకోవడం నిజానికి ప్రభుత్వ యంత్రాంగాలకే తలకు మించిన భారం కానీ దాన్ని ఈ దంపతులు తలకెత్తుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత నాలుగేళ్ళలోనే మరో 20 గ్రామీణ పాఠశాలలను నెలకొల్పారు. అమ్మ తన 66 ఏళ్ల జీవిత కాలంలో మొత్తం ఏర్పాటు చేసిన పాఠశాలల సంఖ్య 52. ఈ విషయంలో అప్పటి సమాజం నుంచి ఎంత వ్యతిరేఖత వుండేదంటే 1848లో పాఠశాలలు స్థాపించిన ఒక్క సంవత్సరం గడవక ముందే గ్రామపెద్దల ఆగ్రహానికి గురయ్యి ఈ దంపతులిద్దరూ గృహ బహిష్కారానికి గురయ్యారు. అయినా వెనకడుగు వేయక తమ పని తాము చేసుకుంటూ వెళ్ళే వారు.
సావిత్రీ భాయి పాఠశాలలో స్వయంగా పాఠాలు చెప్పేందుకు వెళుతుంటే గిట్టని ఊరిజనం కొందరు ఆమెపై పేడను విసిరేసే వాళ్ళట, ఒకసారి కొపం పట్టలేక ఈమె ఒకడి చెంప పగలగొట్టి ఆదే విషయం జ్యోతిబా దగ్గర చెప్పారట, వీళ్ళ ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి ఏదన్నా చెయ్యండి అని. మన తెలుగు సినిమా స్క్రిప్టు అయితే తన ఇష్టమైన భార్యను ఇలా ఏడిపించే వారికి బుద్ది చెప్పడానికి కనీసం సైకిల్ చెన్ తెంపి ఫైటింగ్ సీన్ పెట్టేయాలేమో. కానీ ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఉన్నతంగా అనిపించేవే. మనం శిక్షించాల్సింది ఆ మనుషుల్ని కాదు సావిత్రీ వారిలోపటి మూఢ భావనలను నువ్వు పొట్లాడి వారితో గెలిస్తే విషయం అక్కడికే సర్దుమణుగుతుంది. వారి ఆగాడాలను తట్టుకుంటూ నీ లక్ష్యం వైపు సాగితే మంచిపనిమీద మరింత మందికి సానుకూల దృక్పదం ఏర్పడుతుంది. నీ సంచిలో మరో చీర పెట్టుకుని వెళ్ళు వారు ఎంత పేడ వేస్తారో వేయనియ్యి. అది నీ చీరమీదనో శరీరం మీదనో పడుతుంది అనుకోకు సరాసరి వారి పెడబుద్దులపై నే పడుతుంది. ఈ రకంగా నీ బడిలో పిల్లలకే కాదు పేడ విసిరే మూర్ఖుడికీ కూడా నువ్వు పాఠం చెపుతున్నట్లే అన్నాడట జ్యోతిబా గారు. అమె అచ్చంగా అదే విధానాన్ని అనుసరించారు. 52 పాఠశాలలను స్థాపించేందుకు ఊతంగా నిజానికి ఈ సంఘటనే వారికి ప్రజానుకూలత సాధించిపెట్టింది. అవును శత్రువు రాళ్లు విసురుతున్నాడని కంగారు పడటం కంటే వాటినే పేర్చుకుంటూ వెళితే ఒకనాటికి అదే నీకు రక్షణ గోడగా అవుతందన్న సూత్రం తప్పేమీ కాదేమో. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమా నికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభిం చాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటా యించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహ ణకు సహకరించారు.
మహిళా చైతన్యం కోసం ముందడుగు
ఈ రకంగా అప్పుడున్న అనేక రుగ్మతలకు చదువు నేర్పడం అనేది సరైన పరిష్కారం అని భావించారు. అయితే చదువు పరిష్కారాలను చూపేలోగా అప్పటి సమాజంలో జరుగుతున్న అనేక పొరపాట్లను కూడా సరిచేయాల్సి వుంటుంది అని భావించారు.
1852లో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించి ఆ భాద్యతలను పూర్తిగా సావిత్రీ భాయి చూసుకున్నారు. మహిళా హక్కులే మానవ హక్కులు అనే నినాదాన్న జెండాగా ఎగరేసారు. తన లాగానే బాల్యవివాహాలు జరిగే సంస్కృతి అప్పటి సమాజంలో చాలా ఎక్కువ దానివల్ల వయసు ఎక్కువున్న భర్త త్వరగా పోవడంతో వీళ్ళకు చిన్నవయసులోనే వైధవ్యం రావడం. సమాజం సతీసహగమనం పేరుతో చంపేయడమో శీరోముండనం చేసి జీవిత కాలపు వెలివేసినట్లు ఏ సంతోషానికీ నోచుకోకుండా మూలన కూర్చోబెట్టడమో చేసేవారు. బాల్యవివాహాలకు, సతీసహగమనం లాంటి అనేక మూఢనమ్మకాలకు బలంగా వ్యతిరేఖంగా పోరాడటంతో పాటు, వితంతు పునర్వివాహాలు చేయించారు. ఈ విషయాన్ని ఎంత ముఖ్యమైనదిగా సీరియస్ గా సావిత్రీ భాయి తీసుకున్నారంటే 1860లో క్షురకులతో సమ్మె చేయించి వితంతువులకు శిరోముండనం చేయమని వారిచేత ప్రతిజ్ఞలు చేయించారు. ఎందరో గర్భవతులకు స్వంత బాద్యతతో పురుళ్ళు పోస్తున్న నేపద్యంలోనే అలా ఒక వితంతువుకు పుట్టిన బాలుడిని దత్తత తీసుకుని పెంచుకున్నారు అతడిపేరు యశ్వంత రావు.
ఆధునిక పెళ్ళి పద్దతులకు ఆధ్యురాలు
1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సంస్థ అనే సామాజిక ఆద్యాత్మిక సంస్థను స్థాపించి దానిలో మహిళా విభాగం భాద్యతలన్నీ సావిత్రీభాయి చూసుకునే వారు. పురోహితుల హంగామా లేకుండా వివాహ విధిని మనం ఇప్పడనుకుంటున్న స్టేజి మ్యారేజీ పద్దతులను అప్పట్లోనే ప్రారంభించి అనేక వివాహాలను నిర్వహించారు.
ఇదే నేపద్యంలో 1868లో అంటరాని తనానికి వ్యతిరేఖంగా ఉదృతమైన ప్రచారం చేస్తూ సామాజిక చైతన్యం కలిగించారు.
కరువు పరిస్థితుల్లో అందరికీ అమ్మగా నిలబడ్డ సావిత్రీభాయి.
1870, 1895 కాలంలో ప్రకృతి కూడా జనంపై కన్నెర్ర జేసింది తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికేమీ దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. జోలెపట్టి అడుక్కొచ్చి మరీ అభాగ్యులకు ఆదరణ చూపారు. దాదాపు 2000 మందికి పైగా అనాధ బాలలలకు ప్రతిరోజూ ఆహారం అందేందుకు ఏర్పాట్లు చేసారంటే వారికి సమాజం పట్ల వున్న మక్కువను ఏ కొలబద్దతో కొలవగలం. నిజానికి రెండవ కరువు రావడానికి ఐదేళ్ల ముందే అంటే 1890 నవంబర్ 28న ఆమె భర్త జ్యోతీరావు పూలే మరణించారు. అయినా ఝూన్సీ లక్ష్మి భాయి యుద్దంలో తన కొడుకుని వీపుకు కట్లుకుని తిరిగినట్లు తన పెంపుడు కొడుకు యశ్వంత రావుతో కలిసి విరాళాలు సేకరించి మరీ కరుపు పరిస్థితిని ఎదుర్కొన్నారు. భర్త మరణం బహుశా ఆమెకు ఒక ఓపెన్ ఛాలెంజ్ లాంటిది ఇందరు వితంతువులను ఎదగమని ప్రొత్సహించావు కదా నీ నిబద్ధత ధైర్యం ఎంత అని విధి వేసిన ప్రశ్నలాంటిది ఆమె ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఆడవాళ్లను స్మశానం వరకూ రావద్దనే రోజుల్లో భర్త చితికి స్వయంగా కొరివిపెట్టారు. ఇద్దరూ కలిసి ప్రారంభించిన ఏ కార్యక్రమాన్నీ ఆపకుండా తనెక్కతే ఆమె మరణం వరకూ నిర్వహించుకుంటూ వచ్చారు.
సాహితీ వేత్తకూడా
భర్తవుండగా 1854లొ ‘‘కావ్యాపూలే’’ అనే కవితా సంపుటిని ప్రచురించారు ఆయన గతించాక కూడా
1891లో ‘‘ పావన కాశీ సుభోధ్ రత్నాకర్’’ ను 1892లో ఆమె ఉపన్యాసాల సంకలనాన్ని పుస్తకరూపంలోనూ వెలువరించారు.
సేవ చేస్తూనే ప్రాణాలు వదిలిన క్రాంతిభాయి ఈమె
ఆనాధ, అభాగ్య పిల్లలను అక్కున చేర్చుకోవడం అంటే ఇప్పుడు మనం మదర్ థెరీసాను గుర్తుచేసుకుంటాం కదా. అప్పుడెప్పుడే అంతటి చొరవను సావిత్రీభాయి చూపించారు. 1897లో ప్లేగు వ్యాధి పూణెను వణికించింది. ప్లేగు వ్యాధి సోకిన వారంటేనే భయపడే రోజుల్లో మాంగ్ లాంటి నిమ్మకులాలకు కనీసం వైధ్యసదుపాయం దక్కేది కాదు అటువంటి మారుమూల మాంగ్ కుటుంబాలలో ప్లేగు వ్యాధి సోకిన పిల్లలను చంకన వేసుకుని వైద్యం చేయించారు.ఈ హాడావిడిలో అదే ప్లేగువ్యాధికి ఆమె కూడా గురయ్యారు సేవా జీవితాన్ని అదే సేవ చేస్తూ చేస్తూ నే 1897 మార్చి 10న జ్యోతిభా పూలే మరణించిన ఏడేళ్ళ తర్వాత ఒంటరిగా ఒక మహోద్యమాన్ని ఒంటి చేత్తో నిర్వహించిన ఈ ధృవతార, వైతాళికురాలు రాలిపోయారు. అయినా ఆమె చైతన్యం నిత్యనూతనమై ఇప్పటికే ఎన్నో రంగాలలో తన ప్రేరణను కొనసాగిస్తూనే వుంది.
సావిత్రీభాయి పూలే || కావ్యాపూలే ||
తెలుగుసేత కట్టా శ్రీనివాస్
======1=======
మీకు జ్ఞానమంటూ లేకపోతే విద్యరానట్లే
మీకేమో దానిపై తపనలేదు.
మీరు తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు కానీ దాన్ని సంపాదించేపనిచేయరు.
మిమ్మల్నిక మనిషని ఎలా పిలవను?
======2========
పశువులు పక్షులు కోతులు మనుషులు
అందరూ జీవనం నుంచి మరణం దాకా ప్రయాణించేవారే.
కానీ ఈ విషయమై నువ్వేమాత్రమూ అవగాహన పెంచుకోకపోతే
మిమ్మల్నిక మనిషని ఎలా పిలవను?
======3=======
నిమ్నుల నుదిటిరాత
‘‘నేలపైని దేవుళ్ళ’’ చేత రాయబడుతోంది.
రెండువేల ఏళ్ళ పైనుంచీ అగ్రవర్ణ కైంకర్యసేవ
శూద్రజాతికి నిత్యకృత్యమవుతోంది.
వారి దీన దుస్థితిని చూస్తుంటే
హృదయం నిరసనతో చెమర్చుతుంది.
మెదడు గిజగిజకొట్టుకుంటుంది ఈ ఉచ్చులోంచి
బయటపడే దారివెతుక్కుంటూ
మిత్రమా
చదువొక్కటే దారి,
బయటికి నడిచొచ్చేందుకు
చదువుకొంత మనిషితనాన్ని ప్రసాదిస్తుంది.
లోపటిమృగం ఉనికినుంచి విముక్తం చేస్తుంది.
https://antharlochana.blogspot.com/2019/01/kavyaPhule.html
1-2-3 మనిషని ఎలా పిలవాలంటూ..మంచి ప్రశ్న?
రిప్లయితొలగించండిఅంతర్లోచనం వారి ప్రశ్నల మానసాయుధాలు!