నేను మహారాణీ రుద్రమను మాట్లాడుతున్నాను.
నా తర్వాతి తరాల అభ్యున్నత మానవులైన మీకు ముకుళిత హస్త నమస్కారాభివందనలు
ఇప్పుడెందుకు ఇలా మీకు లేఖపత్రం రాస్తున్నానని ఆశ్చర్యంగా చూస్తున్నారా?
ఇక ఇప్పుడొచ్చిన సంగతేమిటంటారా?
నా పుట్టిన రోజు ఎక్కడ జరుపుకునే దానినో మీకు తెలుసా?
అత్యంత ప్రియమైన ప్రాంతం, కలల రూపం మల్లికార్జునపురం
అప్పట్లో ఎంత కోలాహలంగా వుండేది ఈ నగరం.
కానీ దుఃఖం కలుగుతోంది
జయహో తెలుగుజాతి
జయ జయహో భారతీయ ఖ్యాతి
నా తర్వాతి తరాల అభ్యున్నత మానవులైన మీకు ముకుళిత హస్త నమస్కారాభివందనలు
ఇంకా అర్ధంకాలేదా? నేను రుద్రమను, మీకు బాగా తెలిసిన రుద్రమదేవిని, గుర్రంమీద యుద్ధానికి వెళుతున్నట్లు మీరు శిల్పాలుగా చెక్కిన మీకంటే ఎడున్నర శతాబ్దాల ముందునాటి వనితను, అప్పటి మా సామ్యాజానికి అధినేతను. కానీ మనసు మెధస్సు తరాలు మారుతూ మీరే నాకంటే మున్ముందు వున్నారని మీ కార్యాలను గమనిస్తేనే బోధపడుతోంది. అంబదేవునితో యుద్ధం తర్వాత ఒక శాశ్వత నిద్రకు లోనయినట్లు విశ్రమించిన నాకు అప్పడప్పుడు ఈ వాస్తవ ప్రపంచంలోకి చూడగానే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది.
ఇప్పుడెందుకు ఇలా మీకు లేఖపత్రం రాస్తున్నానని ఆశ్చర్యంగా చూస్తున్నారా?
ఉగాది వెళ్ళిన ఎనిమిది రోజులకే నా జన్మదినం దానితో పాటే పట్టాభిషేక మహోత్సవ సంరంభాలు జరిగిన దినం కూడా. దాన్నే మీరు ఇప్పుడు వాడుతున్న గ్రెగోరియన్ శకసంవత్సరపు క్యాలెండర్ ఆధారంగా చూస్తే మార్చి నెల 25వ తీదీ అవుతుంది. అదే రోజు మీకు ఉగాది పండగ వచ్చింది. లోహకోయం (క్రోనోగ్రామ్ లో=3: హ=8: కో=1 యం=1 అంటే 3811 కటపయాది పద్దతి ప్రకారం ఇది 1183వ సంవత్సరానికి సమానం ఆధారం : sircar Indian epigraphy pp 222, 234 ) పద్దతిలో మీవాళ్ళే కనుగొన్నది దుర్మతి నామ సంవత్సర చైత్రమాస బహుళ అష్టమి పైగా ఆడపిల్ల శుక్రవారం పుట్టింది కాకతీయ సామ్రాజ్యానికి లక్ష్మీదేవి నేనని నాన్న గణపతిదేవుడి ఎప్పుడూ అంటుండేవారు. అంబదేవుడు వంటి శత్రువులు అష్టమినాడు పుట్టింది కష్టాల పాలవుతుందని, సంవత్సరం పేరులోని దుర్మతిలా వ్యవహరిస్తున్నాననీ తిట్టుకోవడమూ ఎరుకలోనిదే. కష్టాలంటారా? ఎంత పెద్దకష్టాలను అధిరోహిస్తూ పైపైకి వస్తామో అంత ఎక్కువ మందికి కనిపిస్తాము, అంత ఎక్కువ ప్రపంచాన్ని చూడగలుగుతాము అనేది నిజం. దుష్టులపాలిత దుర్మతిగానే కాదు దనుర్ధారిణినై దుష్టసంహారిణిగా కూడా మారతాను.
ఇక ఇప్పుడొచ్చిన సంగతేమిటంటారా?
పుట్టిన రోజు సందర్భంగా మీ అందరితో సంతోషంగా మాట్లాడుదాం అనుకున్నాను. కానీ ప్రపంచం అంతా విషసూక్ష్మజీవి కరోనా ఉపద్రవంలో అల్లల్లాడిపోతోందన్న సంగతి అర్ధం చేసుకున్నాను. ఇన్ని వందల ఏళ్ళలో వైద్య పద్దతులలోనూ, ప్రావీణ్యంలోనూ మాకంటే ముందే వున్నారు నిజానికి ఇది సహజమూ సదారణమూ కానీ వున్న సాంకేతికతను ఒక క్రమంలో ఉపయోగించుకోగలుగుతున్నారా అన్నదే సందేహం. వందల వేల మందిని ఇప్పటికిప్పుడు ఏకాంతరత(క్వారంటైన్) చేయగల సదుపాయాలేవి? దారుణంగా విస్తరించకుండా తీసుకుంటున్న జాగ్రత్తలేవి? అప్పట్లోనూ గ్రామాలకు గ్రామాలనే ఇటువంటి మహమ్మారి రోగాలు కబళించుకు పోతుండేవి. పురిటి బిడ్డను పొత్తిళ్ళలో చూసుకోకుండానే బాలింతలు కన్నుమూసే వారు, మనుషులకేమిటి పశువులకు కూడా ఎన్నెన్ని రోగాలతో తుడిచిపెట్టుకు పోయేవో. వాటికోసం అప్పట్లో నేను చేసిన ఒక పని మీతో ముచ్చటిద్దామనే ఇదంతా రాస్తున్నాను.
నా పుట్టిన రోజు ఎక్కడ జరుపుకునే దానినో మీకు తెలుసా?
బహుశా మా సామ్రాజ్య రాజధాని ఓరుగల్లు లో ఏకశిలానగరపు భోగభాగ్యాల మధ్య వందిమాగధులు వింజామరలు వీస్తుంటే, సకల సామంత మండల మహీపాలు రందరూ బహుమతుల వినయవిధేయతలను సమర్పిస్తుంటే పట్టమహిషినై అక్కడి నేలపై ఓలలాడే దానిని అనుకున్నారా? కాదు కాదు కానే కాదు. ఓరుగల్లు నుంచి వందల కిలోమీటర్ల దూరం లోని ఒక గ్రామం వస్తుంటాను. అదే గ్రామంలో నా పుట్టినరరోజు జరుపుకుంటాను. ముహూర్తబలాల పంచాంగ నమ్మకాలకంటే సరళంగా పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా పట్టుబట్టి ఇక్కడే చేసుకున్నాను. అటువంటి ఈ గ్రామమంటే నాకెంత ప్రేమవుండాలో అర్ధం చేసుకోలేరా? రాజు తలచుకుంటే అన్న చందంగా మొత్తంగా రాజ్యాన్నే తరాలపాటు చెప్పుకునే అభివృద్ధికి నోచుకోవానుకునే నేను నాకిష్టమైన గ్రామాన్న ఎలా మార్చివుంటాను. ఒక ఊరు ఊరంగా బాగుండాలంటే ఏమేం చెయ్యలో వాటిని ప్రతిగ్రామానికీ అందేలా చేయడమే పరిపాలనా వ్యూహంగా బ్రతికాను. ఇక్కడి సంగతి వస్తే ముందుకు శైవ ఆగమాలు అబ్బురంగా చూసే ఒక మహోన్నత శివరూపాన్ని ప్రతిష్టించాము అదే మల్లికార్జున మహా లింగం ఆయన వల్లనే తర్వాతి తరాలు ఈ గ్రామాన్ని మల్లికార్జునపురంగా, మల్లికాపురంగా, మాలికాపురంగా, మల్కాపురంగా రూపాంతరం చెందింది. అయితే మరోమాటగా ముస్లిం నిజాముల పాలనా కాలంలో నాపై అభిమానంతో అమరావతి పాలకుడు రాజా వెంకటాద్రి నాయుడు గారు మాలికా(మహారాణి) పురంగా పేరు మార్పు చేసి జనాలకు అలా పిలిచే అలవాటు నేర్పాడని మరొక కథనం. రాజా వెంకటాద్రి నాయుడు(1761-1816) తన ఇరవై రెండేళ్ళ వయసునుంచి (1783) మరణించే వరకూ ఈ ప్రాంత పాలకుడిగా వున్నాడు అప్పుడొక సంఘటన చెప్పుకుంటారు. ఇక్కడి మల్లిఖార్జున శివలింగమే అమరావతి అమరేశ్వరాలయం ఆవరణలో వుండేదట. ఈ శివలింగానికి శక్తి(దుర్గాదేవి) ఉపాసకుడైన పిల్లలమర్రి రామకృష్ణ సోమయాజి పూజిస్తూ వుండేవారట. నిజానికి ఆయన యోగశక్తివల్లనే మల్కాపురపు శివలింగం అమరావతికి చేరుకున్నదనే కథనాలుకూడా వుండేవి. అయితే వాసిరెడ్డి రాజా వారికి ప్రజలనుంచి మరోరకమైన పిర్యాదులు కూడా అనేక సార్లు అందాయట. పిల్లలమర్రి సోమయాజులు గారు శివలింగానికి మాంసఖండాలను నైవేద్యంగా పెడుతున్నారని క్షుద్రోపాసనలు చేస్తున్నారని విషయం విచారించి తమ భయాలను పోగొట్టాలనీ రాజావారిని వేడ్కొన్నారట. అభిజ్ఞానవర్గాల సమాచారం అందుకున్న మీదట హఠాత్తుగా ఒకనాడు ఈయన విషయాన్ని పరిశీలించి తప్పుజరుగుతుండగా పట్టుకోవాలని హుటాహుటిన వెళ్లారట కానీ అందరూ ఆశ్చర్య పోయే విధంగా అప్పటివరకూ వీళ్ళు మాంస ఖండాలుగా భావిస్తున్న వన్నీ ఎర్రగులాబీలుగా మారిపోయాయట. ఆయన మహత్తుకు ముగ్ధుడైన రాజావారు ఈ ప్రాంతపు భూములను అగ్రహారంగా సోమయాజి గారికి హక్కులు రాసిచ్చారట. ఆయన వేజెండ్ల వ్యవసాయధారులకు ఈ భూములను సాగునిమిత్తం అప్పగించారట. (The Somayaji invited Vejendla family (surname) to cultivate these lands.) ఆ తర్వాతి కాలంలో ఇతర ఇంటిపేర్ల వారితో పాటు మరికొన్ని వృత్తి కులాల వారు కూడా ఆ ప్రాంతంలో జీవనం సాగిస్తూ స్థిరపడ్డారు. గోల్కొండ నవాబుల కాలంలో అమరావతి పాలకుడిగా వున్న వాసిరెడ్డి వారు నేను పాలించిన గ్రామమనే జ్ఞాపకంగా గౌరవంగా మాలికాపురం (ఉర్ధూ మాలిక = రాణీ తెలుగు పురం = ఊరు) అని పేరు పెట్టాడనీ తర్వాత అది మల్కాపురంగా రూపొందిందనీ మరో కథనం.
అత్యంత ప్రియమైన ప్రాంతం, కలల రూపం మల్లికార్జునపురం
విశ్వేశ్వర గోళకీమఠం అంటే ఒక విశ్వ విద్యాలయం, రేపటి తరాలను జ్ఞాన సంవన్నులుగా మార్చే ప్రదేశం ఇప్పట్లో మీరనుకుంటున్న మెడికల్ కాలేజీ వెటర్నరీ సైన్సు ఇంజనీరింగ్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ కల్చరల్ కాలేజీ లన్నీ అందులోనే కలిసి వున్నాయి. కేవలం వాటిని వేద వేదాంగాలుగా ఆరోగ్య శాస్త్రాలుగా, నిర్మాణ శాస్త్రాలుగా నృత్య సంగీత సాహిత్యాతి కళలుగా నేర్పడం మాత్రమే కాదు వాటిని ప్రాక్టికల్ గా ఉపయోగించి పనితనాన్ని తెలుసుకునేందుకు కళలయితే జనబాహుళ్యాన్ని రంజింప చేస్తున్నారా లేదా అన్న సంగతులు తెలుసుకునే ఏర్పాట్లు కూడా చేసాము. ద్రాక్షారామం, పుష్పగిరి, శ్రీశైలం, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో విశ్వేశ్వర శివాచార్యుల సంపూర్ణ సహకారంతో గోళకీ మఠ శాఖలు విస్తరింపజేసాము.
అప్పట్లో ఎంత కోలాహలంగా వుండేది ఈ నగరం.
రుద్రమలాంటి అమ్మతనం తెలిసిన మహిళ మహారాణిగా వున్న దేశంలో మాతృమరణాలు నన్నెంతగానో బాధఇంచేవి, ప్రసూతి వైద్యశాలలను అందుకే కట్టించాను. పురుడు పోసే నిపుణులకు శిక్షణ నిచ్చి వారికి అవసరమైన సామగ్రిని అందజేసాను. నవజాత శిశు సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేసాము. మనుషులదే కాదు పశువుల ఆరోగ్యం కోసం కూడా ఒక వెటర్నరీ ఆసుపత్రి దానికి అనుబంధంగా పరిశోధనా కేంద్రం (R&D wing) ఏర్పాటు చేసాను. వీటన్నింటికీ మందుల తయారీ చేయాలంటే ఔషద మొక్కల వనాలు పెంచాలి కదా దానికోసం దగ్గరలోని కృష్ణానదీ తీరపు రెండు లంకలను ఎంచుకుని ఆయా లంకలలో ఔషద ఉద్యాన వనాలను పెంచే ఏర్పాట్లు చేసాను. వాటిని కల్వాలలో నూరడం, పుటాలలో కాల్చడం వంటివి చేయాలి. దానికి మందుల తయారీకి మరో ప్రాంతం కేటాయించాను అదే ఇప్పటి మందడం. కల్వాలను, రోళ్ళు వంటి రాతి పనిముట్లు చేయడం కోసం ప్రత్యేకంగా రాతి పనివారిని చాలా దూరాలనుంచి తెప్పించి వారికిక్కడ మాన్యాలను ఇచ్చి స్థిరపడేలా చేసాను. సున్నిత మైన ఆపరేషన్ కుట్టు సూదుల నుంచి వివిధ లోహ పరికరాలను చేసే కమ్మరులను, ఆరోగ్యకరమైన రాగి పరికరాలను చేసే నిపుణఉలను, వీరందరికీ భవన నిర్మాణాలను చేసే ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ మేస్త్రీ విభాగాలను జతచేసాను. కుమ్మరులు, క్షురకులు వంటి దైనందిన అవసరాలు తీర్చేవారిని ఏర్పాటు చేయకుండా వుంటానా? మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే అని నాకు తెలుసు గుడి కేవలం ఆద్యాత్మిక ఆనందం మాత్రమే కాదు అది జీవితాలు అలసిపోకుండా ఒక భరోసా, ఒక సలహా కేంద్రం ఒక సాంత్వనగా నిలబెట్టాను. అక్కడే సంగీత సాహిత్య నాట్య కళాకారులు తమ ప్రదర్శనలతో గ్రామానికి రిక్రియేటింగ్ సొబగులు అద్దుతూ ఓలలాడించ ఏర్పాట్లు చేసాను విద్యాస్థానానికి దేవాలయంలో పదిమంది నర్తకులకూ, ఎనిమిది మంది మార్దంగికులలూ, కాశ్మీరు గాయకులను, పద్నాలుగురు గాయనీ మణులనూ, కరడా వాద్యంలో ఆరితేరిన కళాకారులు ఆరుగురికీ, వృత్తి మాన్యాలిచ్చి నాట్య సంగీతాలకు పోషణ కల్పించాను. ఇంత చేసిన నగరంపై శత్రువులు కన్నుకుట్టిన వారు దాడిచేసి ఇబ్బంది పెట్టకుండా గ్రామ రక్షకులుగా అరివీర భయంకర యోధులూ, మేరునగధీరులూ అయిన వీరభద్రు (VeeraBhadras) లను రక్షణగా కావలీ వుంచాను. నాకు ఓరుగల్లుకు సమాచారం చేరేలోగా శత్రుమూకలను చీల్చిచెండాడగల శిక్షణ పొందినవారు వీరు. అలాగే వీరముష్టిలనే గ్రామ చేతివృత్తుల వారు స్వర్ణకారులు, రాతిపనివారు, తాపీపనివారు, వెదురు పనివాళ్లు, కమ్మరులు, కుమ్మరులు, భవన నిర్మాతలు వడ్రంగులు, మంగలులు, చిరువ్యాపారులు వుంటారని ముందే చెప్పాను కదా (Village craftsmen called Veeramusties , who had to perform the duties of goldsmith, coppersmith, mason , bamboo workers, blacksmith, potter, architect, carpenter, barber, and artisan.) మరి ఈ లెక్కలన్నీ సక్రమంగా రాతకోతలతో సరిచూసుకుని మాకు తెలియజేయగల అకౌంటెంట్ లుగా నియమించిన వారి పేరు కాయస్థులు (Kayasthas). ఇలా సమగ్ర సుందరంగా ఏర్పడిన నగరం ప్రతి ఏడాదీ మేము బడ్జెట్ గా కేటాయించే నిధుల కోసం ఎదురుచూస్తూ వుండకూడదు. అసలు రుద్రమనే ఆవిడే లేకపోయినా, కాకతీయ సామ్రాజ్యమే పోయినా నిలచి నిలబడి స్వంతంగా బ్రతికే రికరింగ్ ఏర్పాట్లు కూడా చేసాను. నగరానికి ఆదాయాన్న సమకూర్చేలా రెండు పంటలు పండే భూములను అగ్రహారాలుగా దానం ఇచ్చి వాటి ఫలసాయాన్ని తరతరాలుగా అనుభవించే హక్కులను ఇచ్చాను.పర్యాటకులను సైతం మర్చిపోలేదు. విశాలమైన ఉచిత భోజనశాలతో కూడిన సత్రాన్ని ఉచిత విశ్రామ కేంద్రంగా మఠాన్నీ విశ్వేశ్వరాలయానికి దగ్గరలోనే స్థాపించాను. ఇతర ప్రాంతాలవారు వస్తున్నప్పుడే మల్లికార్జునుడి కీర్తి ఆయన ఆశీస్సులు దిగంతాలకు వ్యాపించడం ఇటువంటి మంచి సంస్కృతి మరిన్ని చోట్ల వ్యాపించడం జరుగుతుంది. అటువంటి కన్నుగుట్టేంత గొప్ప స్థలాలపై శత్రువులు రాజ్యదాహంతో ఒకవేళ (అమంగళం ప్రతిహతమగుగాక) కాకతీయులను గెలిచినా ఇటువంటి ఏర్పాట్లను భిన్నం చేయరులే అనే ఒక నమ్మకాన్ని మనసులో వెలిగించుకుని హమ్మయ్యా అనుకున్నాను.
కానీ దుఃఖం కలుగుతోంది
విశ్వేశ్వర గోళకీ మఠానికి హృదయస్థానంగా వున్న మల్లికార్జునాలయపు ప్రధాన లింగాన్ని కోల్పోయి శిధిలమై పిచ్చిగుడిగా పిలవబడుతోంది. పిచ్చిగుడికో లేక పట్టింపులేని వారికో మరి. నా మునిముని మనవళ్ళ తరాల వరకూ విషయం పోకూడదని ఒక పుస్తకం అంత సమాచారాన్ని పదిహేను అడుగుల ఎత్తున్న గ్రానైట్ రాతిపై నందిశాసనం గా రాయించి పెడతే నా గొప్ప కోసం కాదు మీ సంస్కృతిని కాపాడుకోవాలన్న కనీస అవగాహనతో దానికి రక్షణ పనులు కూడా చేపట్టరా? మీరు రాజధానిగా సచివుల స్థానంగా చేసుకుందామనుకున్న వెలగపూడి నిజానికి మల్కాపుర దేవాలయానికి నేనప్పట్లో మాన్యంగా ఇచ్చిన ప్రాంతం తెలుసా? సరే భూమిపై హక్కులు నిభందనలూ కాలంతో పాటు మారవచ్చుగాక. అప్పట్లో మీ ముఖ్యమైన మంత్రివర్యులు మల్కాపురాన్న సందర్శించి నందిశాసన స్థంబానికి బంతిపూల అలంకరణ చేయించి పత్రికాప్రకటనలిచ్చారు కానీ శాశ్వతకీర్తిని నిలబెట్టే చక్కటి ప్రయత్న రూపపై ముందడుగు పడలేదు. ఇప్పుడలు రాజధానుల వికేంద్రీకరణ నేపద్యంలో జరుగుతున్న అనిశ్చితిలో నావైపు నా ఊరివైపు చూసే తీరిక మీకున్నట్లు లేదు. మహారాణిగా రాజధానుల విషయంలో నా అభిప్రాయాన్న అడుగుతున్నారా? మాకంటే అప్పట్లో శత్రుమూకలనుంచి రక్షించుకునే సమస్య వుండేది కాబట్టి రాజధానిని మరింత జాగ్రత్తగా ఎంచుకుని చూసుకుని నిర్మించుకోవాలి. ఇప్పుడు మీకు అభివృద్దికి అభ్యున్నతికి తోడ్పడే పద్దతిలో ఏర్పాటు చేసుకుంటే చాలుకదా. రాజధాని ఎక్కడన్నది కాదు తమ్ముడన్నయ్యా నిజమైన అభివృద్ది వుంటుందా లేదా అన్నది కదా ప్రశ్న. ఏమో మీ వ్యవహారాలపై నేనిప్పటికి ఇంతే మాట్లాడగలను. చుట్టూ ఆక్రమణలు వున్నాయని శాసన స్థంభాన్ని మరెక్కడో ప్రదర్శన శాలకు తరలిస్తే కేవలం ఒక రాతిబండను కాపాడుకున్నట్లు దాన్ని తరలింపు ఖర్చుతోనే మరో రాతి ప్రతీకను చేయగలరు కదా. నిజమైన స్పూర్తిని నిలబెట్టాలనేది నా కోరిక. తెలిసో తెలియకో నివాసాలను ఏర్పాటు చేసుకున్న పేదలకు పునరావాసం కల్పించి మళ్లీ మన సంస్కృతిని గుర్తుచేసే ప్రధాన కేంద్రంగా కళకళలాడేలా మల్కాపురాన్ని మార్చి ఇవ్వగలరా బిడ్డలారా? మీ అమ్మలను అమ్మమ్మలను జేజమ్మలను కన్న తల్లిగా చేయిచాపి అడుగుతున్నాను. నా పుట్టిన రోజుకు ఒక మంచిమాటను కానుకగా ఇవ్వగలరా? మన తెలుగుజాతి ఔన్నత్యాన్న నిలువత్తున నిలబెట్టగలరా? మన దగ్గర నేర్చుకుని వెళ్లిన దేశాల అడుగుజాడలు చూసే అబ్బురమై పోకుండా మూలస్థానం లాంటి మన చారిత్రక ప్రాధాన్యతను దిగంతాల దిశగా ప్రసరించేలా వెలిగించలేరా? ఆ స్పూర్తితో అంతకు వేయిరెట్ల బలమైన అభ్యున్నతి కేంద్రాలను స్థాపించలేరా? అప్పుడిక ఆర్ధిక మాంధ్యాలకో కరోనా వంటి వ్యాధులకో భీతిల్లాల్సిన పనిలేని కేంద్రీకృత వ్యవస్థలపై ఆధారపడని స్వతంత్ర ప్రతిపత్తిగల సమగ్ర గ్రామాలను తయారుచేసుకోలేమా?
జయహో తెలుగుజాతి
జయ జయహో భారతీయ ఖ్యాతి
అశ్రునయనాలతో, చిరు ఆశలతో
మీ అమ్మలగన్నయమ్మ
రుద్రాంబ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి