అదేమిటో ఖాళీ దొరకనన్నాళ్లూ తీరికేలేదు అనిపించేది. ఇప్పుడేమో ఖాళీగా కాళ్ళుచాపుకుని దేశాన్ని కాదు కాదు ప్రపంచాన్ని కాపాడే అవకాశం వచ్చేస్తే నేమో ఖాళీ ఖాళీ లాగానే అనిపిస్తోంది. కరోనా ఖర్ఫ్యూ నేపద్యంలో శార్వరీ ఉగాది కథొకటి చెప్తాను వింటానంటే. పొద్దున్నే పేపరునింకా ఆపలేదు పనమ్మాయి మానేసింది పాలబ్బాయి ఈరోజు వేయనే లేదు. దొశలు తిన్న తర్వాత కాఫీ టీ లేవీ గొంతులోకి జారి శ్వాసను తేలికగా చేయలేదనే చిరాకు బయటికి రాకుండా ఒకచేత్తో మొబైల్లో వాట్సప్ పేస్ బుక్ లను తిరగేస్తూ, మరోచేత రిమోట్ తో వార్తలను మరగేస్తుంటే. వార్నాయనా బయటికొస్తే భూతం పట్టుకుంటుందిరా అన్నా వినకుండా విచ్చలవిడిగా తిరిగేవాళ్ళ వీపులు విమానం మోత మోగిస్తున్న పోలీసులు డ్యూటీ చెయ్యాల్సి వస్తోంది విమానాల మోతలే ఆగిన రోజుల్లో. పెద్ద పెద్ద దేశాల్లో పిట్టల్లా రాలిపోతున్న జనాలను చూసి బెంబేలెత్తి పానిక్ అవుతారేమో అనుకునే రోజుల్లో బేఖాతర్ అంటూ బజార్లెంట అజ్ఞానమనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా.
సరే ఖాళీ టైం గడపటం అంటే అప్పుడెప్పుడో చదివిన యండమూరి నవల్లో చివరి సీన్ గుర్తొస్తోంది. పిళ్ళై అనే విలన్ మోర్స్ కోడ్ హిప్నటిజంతో చంపాలని ప్రయత్నించినందుకు శిక్షగా అతనికి పిచ్చిపట్టేలా చేసేందుకు వేసిన ప్రణాళిక అది. చీకటి గదిలో తలకూడా కదలకుండా కుర్చీకి కట్టేసి ప్రెష్ గా నున్నగా గీసిన అతని తలపై నెమ్మదిగా ఒక్కో చుక్కా పడేలా పైన చిల్లుపాత్ర పెడతాడు. ఒక చుక్కపడగానే ఆలోచనల్నీ దానిచుట్టూ వెళ్ళడం. అది తలపై పాకినంత సేపూ ఆలోచనలు అటూ ఇటూ దొర్లటం, మళ్ళీ మరో చుక్క కోసం సమయం లెక్కించుకుంటూ ఎదురుచూడటం. ఇలా రాత్రంతా గడిసేసరికి తెల్లారే పిళ్ళై అచ్చంగా పిచ్చొడై పోతాడు. నిర్వాపకమైన ఆలోచన నిజమే ప్రమాదకరం కదా. చిన్నప్పుడు ఇంజెక్షన్ చేసే నొప్పికంటే అది సిరంజిలోకి ఎక్కిస్తున్నంత సేపూ రాబోయే ఉపద్రవాన్న తలచుకున్న నొప్పి పెద్దది కదా.
మరో నవల మల్లాదికృష్ణమూర్తిగారిది అనుకుంటా విలన్ హీరోని ఒక చిన్నగదిలో గొలుసులతో భందిస్తాడు. చాలా చిన్న స్పేస్ పైగా గొలుసుతో వెంటనే చనిపోకుండా నరకం అనుభవిస్తూ చనిపోవాలని కొంత నీరు ఆహారపదార్ధాలు, టాయిలెట్ బకెట్స్ లాంటివి పెడతాడు. ఇతను ఆ ఖాళీకి పానిక్ అవ్వకుండా ప్రొడక్టివ్ గా వినియోగించుకోవడం మెదలుపెడతాడు. కొన్ని గులకరాళ్ళను ఎగరేసి పట్టుకోవడం దానికి స్కోరు లెక్కేసుకోవడం, గురిచూసి లక్ష్యాన్ని కొట్టడం, మెదడుకు వ్యాయామం కల్పించే లెక్కలు ఆలోచించడం లాంటివి చేస్తూ ఉన్న ఆహారాన్ని అత్యంత మితంగా తీసుకుంటూ వుంటాడు. చిత్రంగా శరీరం బాగా శుష్కించడంతో గొలుసులు వదులై బయటపడతాడు. సరే ఆ తర్వాత ఎలాగూ విలన్ పై ప్రతీకారం తీర్చుకుంటాడనుకోండి.
వాడ్రేవు చిన వీరభద్రుడు గారు బొకాషియో అనే రచయిత చెప్పిన డెకామోరాన్ కథలగురించి చెప్పారు. 14వశతాబ్దంలో ఇటలీలో ప్లేగు వ్యాధి ఉద్రుతంగా వున్నప్పుడు బొకాషియో మిత్రులతో కలిసి చెప్పిన కథల సమాహారం. బహుశా ఆదిమానవుడి రాతి చిత్రాలలో కూడా ఆపాయం గురించో, ఆహార సంపాదనగురించో లిపికి పూర్వంనాటి కథలు వుండే వుంటాయి. కథలు ఊరట కథలు సమకాలీన సంఘటనల నమోదు, కథలు మానసిక ఉత్తేజం, సాంత్వన అవును. రేపటికోసం చేయదగ్గ పనులను ఇవ్వాల్టి ఖాళీ సూది ఆధారంగా అల్లుకోవడం కూడా కథలాంటిదేనేమో కదా.
సమయం గడుస్తోంది. కరోనా మూలాలు వ్యాధి లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఏవేవో వెబ్ పేజీలను వెతుకుతూ ఆలోచనల్లో మునిగిపోయాను. హటాత్తుగా ఏదో వెబ్ సైట్ నుంచి బోధిధర్ముడి లాంటి ఆకారం వర్చువల్ ఆకారం చాటింగ్ మొదలేసింది. కరోనా వ్యాధి కొత్తది కాదు జలుబు గొంతునొప్పి ఇదే రకమైన వైరస్ తో వస్తుంది కాకపోతే అది కొంచెం కసరత్తులు చేసి కండలు పెంచుకుని వచ్చిందంతే వ్యాధి రాకముందే నీకు ఇబ్బంది కలగనివ్వని మందు చెపుతాను రాసుకో అంటున్నాడు ఆ యోగిపుంగవుడు. కాగితం కలం వెతుకున్నాను. రాయడం అలవాటు పోయింది కదా. గూగుల్ నోట్స్ ఓపెన్ చేసి పక్క విండోలో పెట్టుకుని టైపు చేసుకుంటున్ను. అతను వివరంగా చెప్తున్నాడు. పులుపు జలుబుకి దోహదం చేస్తుంది అనుకుంటారుకానీ అది తగిన మోతాదులో కఫాన్ని తెగగొడుతుంది కాకుంటే దానికి లవణం తగిన మోతాదులో కలవాలి. మూలికలు మందులు అంటే ఎక్కడొ వెతకనక్కర లేదు. భారతీయ ఆహార పద్దతిలో అనేక ఔషదాలను ఎప్పుడో చేర్చాం కదా. స్వామీ మందు తయారీ చెప్పరా ఆతృత తట్టుకోలేక అతన్ని అడిగాను. అదే చెప్తున్నాను మందులు బయటివి వద్దు కానీ షడ్రుచులు అంటాం కదా వాటికి కారణమైన ఒక్కో పదార్ధాన్ని కలుపుతూ దీన్ని తయారు చేస్తే ముందుగా జలుబు మీ దరికి చేరదు అసలు జలుబే రాకపోతే ఇక కరోనా కష్టాలు లేనట్లేకదా. అది సరే స్వామీ వీటిని ఏయే మోతాదుల్లో ఎలా కలపాలో చెప్పలేదు. అదే చెప్తున్నా ముందుగా ఒక పాత్ర తీసుకుని.
‘‘ఇదగో అబ్బా లంచ్ చేద్దామా?’’
ఆ పాత్రను శుబ్రంగా కడుక్కోవాలి దానిలో....
‘‘ లంచ్చ్ చేద్దామ్మా ....’’ చేత్తో తట్టారు ఎవరో...
కళ్ళు తెరచి చూస్తే మధ్యాహ్నం అవుతున్నట్లుంది. హోంమినిష్టర్ లంచ్ టైం హుకుం వెలువడుతోంది. ఇప్పటి దాకా ఆలోచనల నుంచి కలలోకి వెళ్ళానా హబ్బా... అయినా కొంచెం సేపు ఆగితే కలలో నైనా కెకులేకు బెంజిన్ రింగ్ తెలిసినట్లు నాకు కరోనా మందు తెలిసేది కదా. అనుకున్నాను.
‘‘ సరే సరే కొంచెం చేతులు కడుక్కుంటే ఉగాది పచ్చడి ఇస్తాను’’ అంది తను
కొద్దిగా ఉగాది పచ్చడి చప్పరిస్తుంటే కలలోని ఒకపదం గుర్తొచ్చింది.
‘‘ షడ్రుచులు’’
పెద్ద అపాయాన్ని సులభంగా తీసేసినట్లు త్వరలోనే ఒక మంచి మందు తయారవ్వాలనీ, ఈ లోగా అందరి సమయం అత్యంత ఉపయుక్తమైన పనులతో నిండిపోవాలనీ, విరామ కాలంలో కుదేలైన ఆర్ధిక వ్యవస్థ ఈ గాప్ లో నేర్చుకున్న మంచి అలవాట్లతో మరింత ప్రొడక్టివ్ గా శరవేగంగా దూపుకెళ్ళాలని కోరుకుంటున్నాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి