దేవరాయలు వారు రాజ్యాన్ని ముట్టడించిన కరోనా సూక్ష్మక్రిమి నుంచి ప్రజలను రక్షించడం కోసం ఎవరికి వారు గృహ ఏకాంతరీకరణలోనే వుండమన్నారు. కానీ పరిస్థితులు సమీక్షించడం కోసం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దానిలో సామాజిక దూరం పాటించేలా ఆసనాలను ఏర్పాటు చేసి అష్టదిగ్గజాలనూ పిలిచారు. అందులో రామలింగని స్థానం తప్పకుండా వుంటుంది కదా. ఇప్పటి వరకూ పరిస్థితులు ఎలా వున్నాయి. తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు వంటి కార్యకలాపాల విశ్లేషణ కొంత అలసినట్లయిన రాయల వారు. రామలింగనితో కవివుంగవా కరోనా నేపద్యాన్ని పక్కదారి పట్టకుండా మనసుకు కొంత ఆహ్లాదమో ఊరటో కలిగే సంభాషణ చేయ్యండి అన్నారు.
నోటికి కట్టుకున్న శ్వేతవస్త్రాన్ని కొంచెం క్రిందకు జరిపి రామలింగడు మాట్లాడటం మొదలేసాడు. ఆయ్యా ఇంట్లోనే వుండటంతో తాళపత్రాలు ఎన్ని చదువుకున్నా కాలక్షేపం కాక పగలుకూడా నిద్రపోతున్నాను రాజా. అందుకే రాత్రి సరిగా నిద్రపట్టక దొర్లుతుంటే... ఈ మాట పూర్తికాకముందే తిమ్మరుసు అందుకుని రామా నీ సమస్యలను చెప్పమనలేదు. ఉల్లాసవచనాలను ఆశించారు రాజావారు అంటూ చురకేద్దామని చూసారు. కానీ చురకలు వేయడమే కానీ పుచ్చుకోవడం పెద్దగా అలవాటులేని రామలింగడు కరోనాలా కంగారు పడతారెందుకు తాతగారూ కథకైనా ఊపోద్ఘాతం వుంటుందని మీకు తెలియనిదా అన్నాడు.
అటునుంచి తల రాజావారివైపు తిప్పి రాత్రి అలా నేను నిద్రపట్టక మంచాన్ని కొలుస్తున్న సమయంలో దొంగలు మా పంచలో సంచరించడం గమనించాను మహారాజా అన్నాడు. రామలింగని ఇంట దొంగలు అనగానే కొందరు సరదాగా నవ్వితే మరికొందరు ఉత్సుకతగా ముందుకు వంగారు. అప్పుడు ఏం చేసావు రామలింగా జేగంట మ్రోగించి గందరగోళం చేసి పక్కవారిని కూడా నిద్రలేపే ప్రయత్నం చేసావా. ముక్కు తుడుచుకుంటూ అడిగారు నంది తిమ్మన గారు. పారిజాతం అపహరణను గురించి రాసిన వారుకదా మీకవ్వన్నీ భలే తడతాయి నాకెక్కడ వారి చేతుల్లోని ఆయుధాలేవో చూడగానే గొంతు తడారిపోయింది. పైగా సామాజిక దూరం అనుకుంటూ కుటుంబ సభ్యులం కూడా వేర్వేరుగా ఎక్కడెక్కడో దూరంగా పడుకున్నారు. పెద్దగా అరిస్తే అనారోగ్యం అనుకుని పక్కవాళ్ళు రాకపోవడానికే అవకాశం ఎక్కువ. పోనీ ఒక దండం గైకోని పోరాడదామనుకుంటే స్వీయ శారీరక బలం అందుకు సమకరించదాయే. ఈ లోగా వాళ్లు మా కిటికీ పక్కగానే వస్తూ లోపట అలికిడి వుందేమోనని శ్రద్దగా వినడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటున్నదేమి టంటే డబ్బు దొరకకపోయినా పర్వాలేదు. వీరి ఇంట ఆహారపదార్ధాలు దొరికినా ఎత్తుకెళదాం ఈ ఏకాంతర వాస సమయంలో పనులూ లేవు. పదార్ధాల అమ్మకమూ పెద్దగా లేదు. పైగా బయటకు వస్తే భటులు బూతులు తిడుతూ చితకబాదుతున్నారాయే అంటూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు పరిస్థితుల మీద బాగా కసిగా వున్నారని మాటల్లో అర్ధం అయ్యింది ఏమాత్రం సడి చేసినా ఆ కోపం మొత్తం నామీద చూపిస్తారేమో అని వణికిపోయాను అంటూ అభినయించి మరీ చెప్తున్నాడు రామలింగడు. వికటకవి ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఏం చేసాడబ్బా అనే ఉత్సుకత అందరిలోనూ పొడచూపింది. అప్పటివరకూ వార్తాంశాల హాడావిడిలో బరువెక్కిన మెదడులన్నీ ఈ ఆలోచనలో ఒకలాంటి ఊరట స్థితి కొచ్చాయి. వారి కదలికలు చూసి నా ఫాలభాగమంతా స్వేదంతో తడిచిపోయింది. వంటయింట ఏమున్నాయి. మహా అయితే అరబస్తా ధాన్యపు గింజలు కొన్నిమానికల పప్పు ధాన్యాలు, అడ్డెడు లశునాలు అంతే కదా కాకపోతే వాళ్లు ఇంట్లోకి వచ్చి దొంగిలించే పదార్ధాల వల్ల వచ్చే కష్టం కంటే చిరాకులో ఇంటివారిపై విరుచుకు పడితే వచ్చే నష్టమే ఎక్కువ కదా ఈ ఆలోచనతో తటాలున ఒక ఉపాయం తట్టింది రాజావారు. రాజా వారు ముందుకు వంగి చేతిని గడ్డానికి ఆనించుకుని అడిగారు. ‘‘ ఏం చేసావు రామా’’ అయ్యా ఆపకుండా నాలుగైదు సార్లు గట్టగా దగ్గాను. ముక్కు పొడి డబ్బానుంచి రెండు పలుకులు తీసుకుని హాచ్ హాచ్ మంటూ తుమ్మాను. మా గృహిణిని పేరు పెట్టి పిలిచి ఏమోయో నా నౌకాయానం గురించి నీతో చెప్పాలన్నాను కదా నిద్రపోతున్నవు హేమిటోయ్ అన్నాను. అంతే ఈ గృహమేదో ప్రమాదకరంగా వున్నదని వారు అట్నుంచటే పరుగు లంఘించుకున్నారు సుమీ అన్నడు.అంతే సభంతా పెళ్ళున నవ్వింది.
మనసుని తేలిక చేసావు రామా ఇదిగో నీకొక బహుమతి అంటూ పక్కనే వున్న హస్తప్రక్షాళణ ద్రవపు సీసాను ఇవ్వచూపారు. అయ్యా బహుమతి నాకు కాదు ఇవ్వాల్సింది నిజానికి ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నది కూడా మీరు వేరే వారికి బహుమతి ఇవ్వాలనే. రాజా వారు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ సమయస్పూర్తితో కష్టం నుంచి బయటపడిన నీకు కాక వెరొకరికి బహుమతి ఇవ్వవలసివుంటుందా? అది కథలో చెప్పావా?’’ సాలోచనగా తిమ్మరుసు వైపు చూసారు రాజావారు. మంత్రిగారు విషయాన్న అందుకుంటూ ‘‘ అవును మహారాజా పనులు లేకపోవడం వల్ల ప్రజలు ఆర్ధికంగా చితికి పోయారనీ, నిత్యావరసర వస్తువులు అధిక ధరల్లోకి వెళ్లాయని, భటుల అత్యుత్సాహం అవగాహన పెంచేదిగా కాక భయోత్పాతం కలిగించేదిగా కూడా వుంటుంది అని చెప్పదలచుకున్నట్లున్నాడు మన వికటకవి. అంతేనా రామలింగా’’ ప్రసన్నంగా చూస్తూ అడిగాడు తిమ్మరుసు. నూరుశాతం ఖచ్చితంగా పట్టుకున్నారు తాతగారూ నమో నమామి. రెండు చేతులు జోడించి వినమ్రంగా చెప్పాడు రామలింగడు. మరోసారి గంభీరమైన కంఠంతో మా సమావేశపు మార్గనిర్ధేశంలాంటి విషయాలు చెప్పావు రామలింగా సభ ముగించే ముందు నీకొక వరం ఇవ్వాలని వుంది కోరుకో. అన్నడు రాయల వారు.
‘‘ కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంది ఏలిన వారు మాట తప్పరు కదా’’ నోటికి కట్టుకున్న వస్త్రం వెనకనుంచే మాట్లాడుతున్నా భయానికి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని మరీ అడిగాడు.
‘‘ తప్పకుండా కోరుకో రామా’’ అభయమిస్తున్నట్లు చెప్పాడు రాయలవారు.
‘‘ అంటే తమరు మన్నించాలి అది ఒక్కరోజు ఖర్చుతో ముగిసి పోదు. ప్రతిరోజూ ఖర్చు అవుతుంది. తమరికి సమ్మతమేకదా’’ మరింత అనుమానంగా కొంచెం తగ్గు స్వరంతో అడిగాడు రామలింగడు.
‘‘ ఓహో ఏమోయి నీ సందేహాలు మాటిస్తోంది నేనని ఎరుగవా? ’’ కొంత అతిశయంతో కూడిన అసహనంగా అన్నారు రాయలవారు.
‘‘ మరోసారి మన్నించండి మహా ప్రభు కరోనాకు వైద్యం చేస్తున్న వైద్యులకు వారి సహాయకులకు రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహారం మూడుపూటలా అందించే భాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఇదే నా కోరిక. ఎందుకంటే ఈ క్లిష్ట కాలంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు సెలవులేవీ లేకుండా తప్పనిసరిగా పనిచేయవలసిందే అన్నారు. విపత్తు కాలం కాబట్టి సైనికులవలే వారు చేస్తున్నారు. కానీ ఆహారం కోసం కూడా వారు ఇబ్బంది పడకూడదు. పైగా వారికిచ్చే విలువవల్ల ఉత్సాహంగా పనిచేసేలా వుండాలని కోరుకుంటున్నాను ప్రభు. అదే నా బహుమతి’’
ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత సభంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. నిభందనల వల్ల మనసారా కౌగిలించుకోకూడదు కాబట్టి అందరూ చూపులతోనే రామలింగని అభినందించారు.
కట్టా శ్రీనివాస్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి