హోం క్వారంటైన్ లో వున్న నసీరుద్దీన్ ఉదయాన్నే
లేచి శ్రధ్దగా ఏదో రాసుకుంటున్నాడు. ‘‘ ఏమిటండీ అది, పక్కకి చూడకుండా
రాస్తున్నారు, ఏమిటంత ముఖ్యమైన సంగతి’’ వాళ్లావిడ ఒక సంచి చేత్తో పట్టుకొస్తూ
అడిగింది. రాస్తున్న పేపర్ మీదనుంచి తలెత్తకుండానే సమాధానం ఇచ్చాడు ససీరుద్దీన్ ‘‘
పేపర్ బోయ్ ఉద్యోగానికి అప్లికేషన్ పెడుతున్నాను ’’ అని, అదేమిటండీ చోద్యం ఇంత
వయసు వచ్చాక ఇంత ఎదిగాక ఇంకా పేపర్ బోయ్ ఉద్యోగం చేస్తానంటారేమిటి? బుగ్గలు
నొక్కుకుంటూ అడిగిందాయింటావిడ.
తలెత్తి ఒక చిద్విలాసపు నవ్వు నవ్వి ‘‘ ఒసే
పిచ్చిదానా పేపర్లో రాసిన సంగతి చూడలేదా, న్యూస్ పేపర్ వల్ల కరోనా వ్యాపించడట,
పేపర్ బాయ్ లు ఏ రక్షణా లేకుండా బజార్లవెంబడి ఇల్లిల్లూ తిరిగి పేపరు వేసినా లాక్
డౌన్ సమయంలో ఏ ఇబ్బందులూ కలగవట. అందుకే పేపర్ బాయ్ గా మారితే వైరస్ కూడా భయపడి
పారిపోతుంది కదా’’ గొప్ప విషయం కనుక్కున్న వాడిలా కళ్లు తిప్పుకుంటూ చెప్తున్నాడు
నసీరుద్దీన్. ‘‘ అంతే కాదు బేగం న్యూస్ పేపర్ తోనే బట్టలు కూడా కుట్టుకుంటాను.
తలుపులూ కిటికీలు మొత్తాన్నీ న్యూస్ పేపర్లతోనే మూసేస్తాను. ఎందుకంటే అదే పేపర్ లో
రాసారు న్యూస్ పేపర్ల వల్ల అస్సలు వైరస్ వ్యాప్తి కాదంట ఇంకే ఇంత చిన్న విషయం
తెలియక జనాలు ఏవేవో వాడుతున్నారు. నేనూ ఈ రహస్యం అందరికీ చెప్పను మళ్ళీ న్యూస్
పేపర్లు అందుబాటులో లేకుండా పోతాయి. చూసావా ఎంత తెలివిగా ఆలోచిస్తున్నానో’’
కళ్లెగరేసాడు మన నసీరుద్దీన్. ఆయన రెండు రోజుల ముందు వచ్చిన ఒక పెద్ద పేపర్ లోని
వార్తని పట్టుకుని ఇదంతా చేస్తున్నాడు. ప్రపంచ విపత్తు సమయంలో నిత్యావసరాలు తప్ప
అన్నీ ఆపేయాలంటే అదేం లేదు. న్యూస్ పేపర్ కోసం వార్తా సేకరణ, ప్రింటింగ్, వాటి
రవాణా, పేపర్ బాయ్స్ సేకరించి పంచుకుని ఇంటింటికీ వేయడం వీటివల్ల ఎటువంటి ఇబ్బంది
లేదని ప్రముఖ పత్రికల్లో కథనాలు రావడంతో ఈయన ఆ శాస్త్రీయసత్యాన్ని కరోనా నుంచి
తప్పించుకునేందుకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. అలా కాకుండా వాటివల్ల ప్రమాదం
వుంటే మరి ఎలక్ట్రానిక్ మీడియా వున్న రోజుల్లో దాన్ని ఆపేసేవారు కదా అని తన ప్రగాఢ
విశ్వాసం.
దీనంతటి కంటే రోజుగడవడం ఎంత అవసరమో తెలిసిన బేగం
గారు తనొచ్చిన పని గుర్తొచ్చి చేసంచీ మౌలాకిచ్చి కటువుగా ఇలా చెప్పింది. ‘‘
ఇదిగోండి నాలుగైదు రోజులకు సరిపడేలా కూరగాయలు తెండి, కొంచెం పుచ్చులున్న పర్లేదు
కానీ కారోనా ప్రభావం లేని శుభ్రమైనచోట తీసుకురండి. దాంతో పాటు హ్యాండ్ వాషు,
శానిటైజర్ కూడా మర్చిపోవద్దు, బయల్దేరండి’’ అంటూ పురమాయించింది.
ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా అని తన గాడిదకు
కూడా కొంచెం గడ్డి తీసుకురావాలని గుర్తుచేసుకున్నాడు. వంటిమీద పేపర్ వస్త్రాలు
ధరించి సంచీ ఊపుకుంటూ బయల్దేరాడు. శానిటైజరూ, సబ్బుద్రావణం దొరకింది కొంచెం గడ్డి
కూడా ఒక మూట సంపాదించాడు. కానీ కరోరా ప్రభావం లేని కూరగాయలు ఎక్కడ దొరకుతాయి అని
అడిగినా మాస్కు ఫేసుల్లోంచి పైనా క్రింద చూస్తున్నారు కానీ అటువంటి కూరగాయలు
ఎక్కడదొరుకుతాయో చెప్పట్లేదు. సర్లే ఇంటావిడతో మాటలు పడటం ఎందకు అని పక్క కూరగాయల
మార్కెటుకి ఆ పక్క కూరగాయల మార్కెటు వెతుక్కుంటూ చాలా దూరం వచ్చేసాడు.
తీరా ఇకదొరికేట్టు లేవు వెనక్కితిరుగుదాం
అనుకునే సరికి మరో పెద్ద సమస్య వచ్చి పడింది. హోం క్వారంటైన్ సమయంలో రోడ్డుమీద
వెళుతున్న వాళ్ళను పోలీసులు లాఠీలతో ఎడాపెడా పృష్టపీడన చేసేస్తున్నారు. పైగా అదంతా
మీడియాలో మంచి కవరేజీ రావాలని కెమెరాలు పెట్టించిమరీ కొడుతున్నారు. కొందరితో
గుంజీలు తీయిస్తున్నారు.
సరే ఏదయితే అదయ్యింది. కరోనా నుంచి కాపాడే పేపరు
వస్త్రాలు లాఠీ దెబ్బలను కాపాడలేవా లనుకుంటూ తప్పనిసరిగా వాళ్లమధ్యగానే నడవబోయాడు.
అలవాటుగా లాఠీని ఎత్తిన పోలీసు అనుమానంగా అడిగాడు. ‘‘ ఏమయ్యా ఇది పేపర్ డ్రస్సా ’’
అని గర్వంగా తలెగరేసి మన మౌలా చెప్పాడు ‘‘ లోపటి లంగోటీలు కూడా పేపరుతోనే
తయారుచేసుకున్నాను’’ అంటూ. ‘‘సరె సర్లే పో ’’ చెయ్యి విసురుగా చెప్పాడు లాఠీ పేపరు
మీద తగిలితే చూడాల్సిన దృశ్యాల దారుణాన్ని తలచుకుంటూ. కొంత దూరం అడుగులు వేసాక
మళ్ళీ నసీరుద్దీన్ కి ఒక అనుమానం వచ్చింది. దాంతో నెమ్మదిగా వెనక్కి వచ్చి పోలీసుల
పక్కన నిలబడి నెమ్మదిగా నసగటం ప్రారంభించాడు. ‘‘ ఇదిగో నిన్ను వెళ్ళిపొమ్మన్నా కదా
మళ్ళీ వెనక్కి వచ్చావేం ఏం రెండు
తగిలించాలా?’’ కోపంగా అడిగారు. అలాగే
నసుగుతూ ‘‘ లేదండీ చిన్న సలహా ఏమనుకోకపోతే మీ లాఠీలకు శానిటైజర్
రాద్దామనుకుంటున్నాను ’’ అన్నాడు. ‘‘ లాఠీలకు శానిటైజర్ ఏంట్రా?’’ గర్జించాడు ఒక
మీసాల పెద్ద పోలీసు. ఆ దెబ్బదో కెమెరాలు నసీరుద్దీన్ వైపు తిరిగాయి. నెమ్మదిగా ఈయన
చెప్పటం ప్రారంభించాడు. అసలు మనిషికి మనిషికీ మధ్యనే మీటర్ల కొద్దీ దూరం అన్నారు
కదా. మీరు ఒకరి బ్యాక్ మీద కొట్టిన లాఠీతో మళ్లీ ఇంకొకళ్లని వాళ్లని కొట్టిన
లాఠీతో వేరొకర్నీ కొడుతూ అందరి బట్టలమీద వైరస్ ని అందరికీ అంటించేస్తున్నరు కదా
అందుకే కనీసం కొట్టడానికీ కొట్టడానికీ మధ్య మీ లాఠీలు శానిటైజర్ తో శుభ్రం చేద్దాం
అనుకుంటున్నాను.’’ అన్నాడు.
మీడియాలో వార్త ప్రసారం అవుతోంది.
చూడాల్సిన వాళ్లు చూసారు. రావాల్సిన ఆదేశాలు వస్తున్నాయి. పాపం నసీరుద్దీన్ మాత్రం
కూరగాయలు దొరకలేదనే దిగులుతో నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటివైపు బయలుదేరాడు. ఇంటావిడ
ఈయన ఎలాగూ తెచ్చేలా లేదని కరోనాకు కొడిగుడ్లతో ఇబ్బందేం లేదని వాటిని వండటం
మొదలేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి