కరోనా తర్వాత కరువు వస్తుందా? మనం ఏం చేయవచ్చు

అతివృష్టి, తుఫాను, ఆనావృష్టి జనాలను కరువులోకి నెట్టేసాయి అప్పట్లో
______________________________________________
దాదాపు రెండువందల ఏళ్ళ క్రితం 1831లో భారీగా వర్షాలు కురిసాయి. వర్షాల సమయంలో వున్నగింజలు తినడానికి అయిపోయాయి. ప్రత్యేకంగా పంటలకోసం పెద్దగా దాచలేదు. ఈలోగా 1832లో తుఫాను వచ్చింది. ఏదో కొంత వేసారులే అనుకున్న పంటలను కాస్తా అది నాశనం చేసింది. 1833 నాటికి తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేకంగా గుంటూరు ప్రాంతంలోని ఐదు లక్షల జనాభాలో తిండిదొరకని అటువంటి దుర్భర పరిస్తితుల్లో రెండులక్షలమంది చనిపోయారట. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. ఇక బ్రతికి వున్న వారు శరీరం అంతా శుష్కించి ఎముకలకు చర్మానికీ మధ్య కనీసం కండరమన్నదే కానరాక ఎండుపుల్లల్లా డొక్కలు కనిపించేలా మారిపోయారట. అటువంటి పరిస్థితినే వాడుకలో డొక్కల కరువు అని పిలిచారు. నందన సంవత్సరంలో సంభవించిన కరువు కాబట్టి నందన కరువు అన్నారు.
ఇటువంటిదే తెలుగు నేలపై అంతకు ముప్పయి నలబై ఏళ్ళ క్రితమే 1791-95 లలో వచ్చింది. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి.
1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది.
==================
అటువంటి తీవ్ర వ్యతిరేఖ పరిస్థితుల్లో చాలా మంది మనసున్న మారాజులు ప్రజలను ఈ కరువునుంచి కాపాడేందుకు వారి చేతనైనంత సాయం చేసుకుంటూ వచ్చారు.
అప్పటి బ్రిటీష్ పాలనలో సిపి బ్రౌన్ అధికారిగా చేస్తున్నారు ఆయనను ఆనాటి కరువు పరిస్థితుల గురించి రిపోర్టులో రాసేప్పుడు కేవలం కొరతగా మాత్రమే పేర్కొనమంటే ఆయన కాదని దాన్ని కరువుగా తీవ్ర దుర్భిక్షం(drought) గా పేర్కొని ఉన్నత అధికారుల అసంతృప్తిని ఎదుర్కొన్నారు.
యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు, వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన ఏనుగుల వీరాస్వామయ్య నందన కరువులో స్వయంగా పూనుకుని వేర్వేరు చోట్ల సేకరించి మరీ చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.
చెన్నపట్టణంలో సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన
కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. నేను ఇంకా కొందరి పేర్లు ప్రస్తావించకపోయి వుండొచ్చు.
ఎందరో చేయూత నిచ్చారు.
==================
ఈ కరువు పరిస్థితుల గురించి జానపదులు పాడుకున్న ఒక పాట
ఎంత మంచి దాత కరువన్నా
భువిలోన జనులకు ఏమి కష్టముకలిగేరోరన్నా || ఎంత ||

మూడు రూపాయలిచ్చామంటే ముప్పావు కొర్రాలివ్వరూ
పది రూపాయిలిచ్చామంటే పావు జొన్నాలివ్వన్నా || ఎంత ||

సేరు బంగారిచ్చామంటే సేరు రాగూలిచ్చారన్నా
సేరు యెండి ఇస్తామంటే సేరు జొన్నలిచ్చారన్నా || ఎంత ||

సేరు గింజాలిసురూకోని అంబలైనా గాసుకుంటే
మనిసిమనిసికి వంతులేస్తే గంటేడైనా రాదురన్నా || ఎంత ||

సేసుకున్నే పెళ్ళాలను సెట్టుకిందా పండబెట్టీ
సెప్పకుండా పారిపోయే సెడ్డకాలామొచ్చేనన్నా || ఎంత ||

కలిగినమ్మా కనికరీంచి పిడికెడన్నం పిలకు బెడితే
కన్నబిడ్డల డొక్కజించే కాని కాలమొచ్చేనన్నా || ఎంత ||

యెంత మంచి ధాత కరువన్నా
భూవిలో జనులకు ఏమి కష్టము కలిగేరోరన్నా.

ఎంతటిది ఈ ధాత నామ సంవత్సరంలో వచ్చిన కరువు భూమి మీద వున్న జనాలకు ఎంత కష్టం కలిగింది అని ఈ జానపదుడు వాపోతూ అప్పటి కొన్ని విషయాలను చెప్తున్నారు. మూడు రూపాయిలు అంటే అప్పట్లో చాలా పెద్ద మొత్తమే ఇస్తే ముప్పావు కొర్రలు ఇవ్వట్లేదట. పది రూపాయిలు ఇచ్చినా పావు (కిలో) జొన్నలు ఇవ్వట్లేదు. ఇక వెండి బంగారాల పరిస్థితి కూడా అలాగే దిగజారిందట. సేరు బంగారం ఇస్తే సేరు రాగులు ఇస్తున్నారు. సేరు వెండి ఇస్తే సేరు జొన్నలు ఇస్తున్నారు. సరే ఏదో రకంగా ఒక సేరు గింజలు తెచ్చుకుని ఇసుర్రాయి మీద ఇసురు కుని దానితో అన్నం వండుకుని తినేంత ఎక్కువ లేదు కాబట్టి బాగా నీళ్ళు పోసి కాగబెట్టి అంబలిలాగా కాస్తే అది కూడా మనిషి మనిషికీ కుటుంబంలో పంచుకుంటూ వచ్చే సరికి ఆకలి తీరకుండా కేవలం గంటెడు అయినా రాలేదుగా అని దీనంగా చెప్తున్నారు.
పెళ్ళాం బిడ్డల పరిస్థితిమీద చెపుతూ చేసుకున్న భార్యను చెట్టు క్రింద పడుకోబెట్టి (సేటు కాకపోవచ్చు) సెప్పకుండా పారిపోయే రోజులు వచ్చాయంటున్నారు. ఇక చివరిది మరీ నమ్మశక్యం కానంత అతిశయోక్తి కలిసినట్లు అనిపిస్తొంది. కలిగిన వారు ఎవరన్నా పిల్లల మీద దయదలచి వాళ్ళు వుండగనే పిల్లలు తినడం కోసం ఏమన్నా పెడితే వారు అటువెల్లగానే పిల్ల డొక్కలు చించి దానిని తీసుకుని పంచుకునే రోజులు వచ్చాయి అని పాటలో చెపుతున్నారు. డొక్కల కరువు అనగానే ఈ జానపదులు డొక్కచించడం వంటి సమాసాల ప్రభావంతో పరిస్థితిని కొంచెం ఎక్కువ చేసి చూపాలనుకున్నారేమో.
సరే ఆ తర్వాత కాటన్ దొర పుణ్యమా అని గోదావరి ఆనకట్ట నిర్మాణం అనేక వేల ఎకరాలు సాగులోకి రావడం. ఆధునిక పద్దతులు వ్యవసాయాన్ని తక్కువ నీళ్ళతో చేయగలగటం, పరిపాలనలోని ముందు చూపుతో ఎగుమతి దిగుమతుల ఏర్పాట్లుం వుండటం లాంటివి. ఎలాంటి వ్యతిరేఖ వాతావరణంలోనూ కరువు అంత తీవ్రంగా ఏర్పడక పోవడం మనకి తెలుసు.
================================
ఏదేమైనా మనకు పాత అనుభవాలు చెపుతున్నది, మన సాధారణ అవగాహనకు అర్దం అయ్యేది ఏమిటంటే.మనిషి బ్రతకాలంటే ముందు తప్పని సరిగా ప్రాధమిక అవసరాలు తీరాలి. బంగారం వెంటి వంటి లోహాలకంటే , బహుళ అంతస్తుల మేడలకంటే ముందు తినడానికి ఇంత దొరకాలి.
కరోనా కష్ట కాలం ప్రపంచాన్ని గదిలో పెట్టి తాళం వేసినా సరే మనం మరింత జాగ్రత్తగా చూసుకోవలసిన కొన్ని రంగాలు వున్నాయి.
వైద్యం చేస్తూ చేస్తూ అలా చేసినందుకు తగిన రక్షణ పరికరాలు లేక వైద్య సిబ్బంది అనారోగ్యం పాలవ్వకూడదు. సమాజపు అనాదరణ వల్ల వారు నిరాసక్తతకు గురికాకూడదు. అలాగే ఇటువంటి వ్యతిరేఖ పరిస్థితుల్లో రక్షక భటులు పారిశుధ్య సిబ్బందిని జాగ్రత్తగా చూసుకునే భాద్యత సమాజానిదే.
రేపటి కష్టం రాకూడదు అంటే....
రైతును కాపాడుకోవాలి.
పండి చేతికి వచ్చిన పంటను తగిన రేటుతో కొనుగోలు చేయడం పాడవ్వకుండా నిల్వచేయడం, బ్లాక్ మార్కెట్ భయపెట్టకుండా రేపటి పంపిణీలకు ఏర్పాట్లు చేయడం వంటివి నిపుణుల ముందున్న సవాళ్ళు.
అదే విధంగా వైద్యులు తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలతో ( personal protection Equipme) తగిన సమయంలో తమ విధులు నిర్వహించడం ఎంత అవసరమో. వ్యాధికి గురికాని వాతావరణం ఏర్పాట్లతో రైతుకు పనిచేసుకునే వాతావరణం అందజేయటమూ అంతే అవసరం. ఆహార వ్యవసాయం ఇప్పుడు మొక్కల రూపంలోనూ పౌల్ట్రీ లాంటి పరిశ్రమల్లో జంతురూపం లోనూ సాగుతోంది.
నిజానికి పట్టణాలలో భవన నిర్మాణం లాంటి పనులు చేసుకునే అనేకమంది కూలీలు వారి వారి స్వంత గ్రామాలకు తిరిగి వెళ్లారు. వారు ఉపాధిని అక్కడే వెతుక్కుంటారు. వీరికి కూడా ఉపాది లేకపోతే వారి వారి కుటుంబాలు గడవటమూ కష్టమే. ఇటువంటి ఉపాదులు ప్రాధమిక రంగంలో ఏర్పాటయ్యేలా చూడగలిగితే. ఉత్పత్తులు ఆగిన ప్రపచానికి సమశీతోష్ణ మండలంలోని భారతదేశం ఆదుకునే ఆపన్న హస్తం కూడా కాగలుగుతుంది.
యుద్ద విద్యల్లో ఒక ముఖ్య సూత్రం చెపుతుంటారు.
ప్రస్తుతం వచ్చిన పంచ్ వరకూ డిఫెన్స్ చేసి ఊరుకుంటే చాలదు.
రాబోయే దెబ్బను ఊహించి ఎలా ఎదుర్కొవాలో ముందే ఆలోచించాలి.
మరింత ముందుకు వెళ్ళాలంటే థ్రెట్ ని ఆపర్చునిటీగా మార్చుకోవాలి.
విసిరే రాళ్ళనే పేర్చుకుంటూ ప్రహారీ నిర్మించుకోగలగాలి,.

కామెంట్‌లు

  1. చాలా బాగా రాసారు సార్.. మంచి సమాచారాన్ని అందించారు. నాటి కరువులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సార్. ధన్యవాదాలు.

    యాదృచ్ఛికంగా నేను కూడా 15 రోజుల క్రితం నా బ్లాగ్ లో కూడా "కరువు కరువు" అని ఓ చిన్న ఆర్టికల్ రాసుకున్నాను. థాంక్స్ సర్.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి