శాసనాలు అచ్చు తీయడం ఎలా?

చరిత్రను తారీఖులు దస్తావేజులతో సహా పునర్నింమించగలమా?

కోర్టుల్లో ఇన్ని కేసులు కుప్పలు తెప్పలుగా పెండింగ్ లో వుండటానికి కారణం సమకాలీన అంశలపై కూడా సరైన నిరుపణకు అందే ఆధారాలు దొరకక పోవడం కూడా కారణమే. ఇక పోతే మనవీ అనుకుంటున్న ప్రాంతాలలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలకు సంభందించిన వివరాలు ఎన్న తెలుసు మనకి. బహుశా ఆ రాజెక్కిన ఏనుగు పేరేమిటి? ఈ రాజుగారికి భార్యలెందరు లాంటివి ఇప్పటి మన జీవనయానానికి ఎంతవరకూ ఉపయోగపడతాయి అనేది కూడా తప్పకుండా వేసుకోవలసిన ప్రశ్నే. అలాగని గడిచిన కాలంలో ఏం జరిగినా మనకేమీ సంభందంలేదు మన రోజు మనకు గడిచిపోతే చాలులే అనుకోవడం కూడా ప్రమాదకరమే.

రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందని ఒకతను అడిగితే కిసుక్కున నవ్వారంటా పక్కనున్నవాళ్ళు అందరూ కానీ ఎందుకలా అడిగావయ్యా అంటూ కథచెప్పిన గురువుగారు అడిగితే రాముడు విష్ణువు అవతారం అంటారు కదా ఆయనకు శ్రీదేవి భూదేవి భార్యలంటారు కదా. అప్పుడు విష్ణువు మరో రూపం రాముడు అయ్యి భూదేవి బిడ్డ సీత అయినప్పుడు రాముడికి సీత ఏమవుతుంది అనే సందేహం వచ్చింది గురువుగారూ అన్నాడట. కాకతీయుల చరిత్ర ఈ మధ్యనే సినిమాలుగా కూడా చూసాక గణపతి దేవుడికి రుద్రమదేవి ఏమవుతుంది? అనే ప్రశ్న వేస్తే కొంచెం తమాషాగానే అనిపిస్తుందేమో కానీ తర్కాన్ని ఆధారంగా చరిత్ర ఇచ్చిన బలహీనమైన ఆధారాలను విశ్లేషించుకుంటూ వెళుతుంటే ఇటువంటి సందేహాలు తప్పని సరిగా కలిగి తీరతాయి. గతంలో ఎప్పుడే మారేమండ రామారావుగారి సంపదకత్వంలో వెలువడిన కాకతీయ సంచికలో ఇటువంటి అనేక చర్చలు ఉప చర్చలు కనిపిస్తాయి. అప్పట్లో భారతి వ్యాసాల్లోకూడా వీరి తేదీలపై భాందవ్యాలు ముఖ్యమైన జీవిత ఘట్టాలపై చర్చలు జరిగాయి. బయ్యారం చెరువు శాసనం దొరికే వరకూ కాకతీయ వంశ క్రమం సరిగా తెలియదు. చందుపట్ల శాసనం పరబ్రహ్మశాస్త్రిగారు విశ్లేషించేంత వరకూ రుద్రమ మరణం (శివలోకప్రాప్తి అని వుంటుంది) గురించి తేదీ గురించి స్పష్టత లేదు. రుద్రమ అంటే మనకి ఎనిమిది శతాబ్దాల క్రితపు ఒక రాజవంశపు వ్యక్తిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామన్న మాట. ఇదే మిటో తెలిసేందుకు వాళ్ళ కాలంలో గుడులు కట్టినప్పుడో, దానాలు చేసినప్పుడో వేసిన శిలాశాసనాలు తామ్ర శాసనాల్లోని సమాచారం. వారి కాలం నాటి సాహిత్య ఆధారాలు, ఏం చెపుతున్నాయో చూస్తాం. ఆ తర్వాత మరింత బలహీనమైనవి వారి తర్వాత కాలంలో చెప్పుకున్న కథలు, కథనాలు కైఫియత్తులు, ఒక ఆధారం కోసం విభిన్నమైన ఆధారాలను ఒక క్రమంలో పేర్చితే కానీ సరైన సమాధానం దొరికే పరిస్థితి చాలాసార్లు వుండదు.

ఉదాహరణకు రుద్రమకు పెళ్ళి అయ్యిందా లేదా? ఆమెకు గణపతిదేవుడు ఏమవుతాడు?

రుద్రమ కాలంలోనే వేయించిన మల్కాపురం శాసనంలో స్పష్టంగా రుద్రమ దేవి గణపతి దేవుని కుమార్తె అని రెండుచోట్లు పేర్కొంటారు. భార్య అయ్యింటే కుమార్తే అని వారి సమకాలీన శాసనాల్లో రాసుకోవలసిన అగత్యం తప్పనిసరిగా వారికివుండదనే అనుకుంటాను. మిగిలినవేవైనా దీనికి కాంట్రాడిక్ట్ అయితే వాటి నిబద్దతను సరిచూసుకోవడమే సమంజసం అనుకుంటాను. ఇప్పటివరకూ దొరికిన ఆధారాలతో గణపతిదేవుడు రుద్రమల వయోభేదం కూడా 25 నుంచి 30 ఏళ్ల తేడా కనీసం వుండటంకూడా దీన్ని బలపరుస్తుంది

క్రీ.శ. 1257 నాటి జుత్తిగ శాసనం ప్రకారం ఆమె నిడదవోలుకు చెందిన చాళుక్య వీరభద్రుని పెండ్లాడిందని. చాళుక్య వంశానికి చెందిన ఇందుశేఖరుని కుమారుడగు వీరభద్రుడు రుద్రమ భర్త వీరి రాజధాని గోదావరి మండలం నందలి తణుకు తాలూకా లోని నిరవద్య పురం అనేది మనకు రెండు శాసనాల్లో కనిపిస్తుంది.

రుద్రమదేవి పుట్టిన తేదీ ఎప్పుడు?

రుద్రమదేవి క్రీ.శ. 1261 మార్చి 25వ తేదీన ఇప్పటి ఆంధ్రప్రదేశలోని గుంటూరు జిల్లా కృష్ణా నది దక్షిణ తీరానున్న మందడం గ్రామంలో, రాజగురువు విశ్వేశ్వర శివాచార్య సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నట్లు అక్కడ దొరికిన శాసనం తెలియజేస్తోందని. దానివల్ల కూడా పుట్టినతేదీ తెలుస్తోందే తప్ప సంవత్సరం కాదు. కానీ చందుపట్ల శాసనం వివరణ రాస్తూ పరబ్రహ్మ శాస్త్రి గారు మరణించే నాటికి ఆమె వయసు 82 సంవత్సరాలన్నారు. 1289 కి 82 సంవత్సరాలంటే ఆమె 1207 ప్రాంతంలో పుట్టింది అనుకోవచ్చు.

గణపతిదేవుడికి పెళ్ళి అయ్యిందా?
మ‌హారాష్ట్రలోని దేవ‌గిరి (ఇప్ప‌టి దౌల‌తాబాద్-ఔరంగాబాద్‌కి ద‌గ్గ‌ర‌లో ఉంది) రాజ్యాన్ని పాలించిన‌, యాద‌వ వంశానికి చెందిన జైతుని కుమార్తె సోమ‌లాదేవిని గణ‌ప‌తి దేవుడికిచ్చి వివాహం చేసిన‌ట్లు చింత‌లూరి తామ్ర‌శాస‌నం పేర్కొంది.

రుద్రమదేవికి పిల్లలు కలిగారా?
చాళుక్య వీరభద్రుని పెళ్ళాడిన రుద్రమదేవికి ముమ్మడమ్మ, రుయ్యమ అనే ఇద్దరు కూతుళ్ళే తప్ప మగ సంతానం లేరు.
ముమ్ముడమ్మ కొడుకే ప్రతాప రుద్రుడు గణపతి దేవుడు చనిపోయే నాటికి ప్రతాప రుద్రుడు 6 సంవత్సరాల వయస్సు వాడట. కాకతీయ వంశపు పేరు నిలబెట్టడం కోసం రుద్రమదేవి గార్డియన్ పరిపాలకురాలిగా కొంత కాలం చేయవలసివచ్చింది. ముమ్ముడమ్మ భర్త ఎవరు అనే దగ్గర కూడా పెద్ద చర్చ నడిచింది. అతడు చాళుక్య వంశపు వాడైతే ప్రతాపరుద్రుడు కూడా చాళుక్య వంశపు వాడు కావాలి గానీ కాకతీయ వంశం ఎలా అవుతాడని సందేహాలు వున్నాయి. కానీ ముమ్ముడమ్మను వివాహమాడిన మహదేవుడు రుద్రమకు వరుసకు తమ్ముడు కావడంతో ముమ్ముడమ్మ మేనమామను వివాహం ఆడినట్లు అయ్యిందని కొన్ని ఆధారాలతో సరిచూపారు.

ప్రతాపరుద్రుడు రుద్రమదేవి బిడ్డ కొడుకేనా?
శక సంవత్సరం 1214 నాటి(క్రీ.శ 1292) రాజరుద్రుని గోరవెంకపల్లి దాన శాసనములో 8,9 శ్లోకాములలో ప్రతాపరుద్రుడు రుద్రాంబ ‘‘ తనూజా తనయ:’’ అని చెప్పారు. శక సంవత్సరం 1178 (క్రీ.శ 1256) నాటి పానుగల్లు శిలా శాసనములో రుద్రాంబకు ప్రతాప రుద్రుడు ‘‘ తత్పుత్రీ తనయః’’ అని పేర్కొన్నారు.

ముమ్ముడాంబ భర్త మహదేవుడని ప్రతాపరుద్రీయమను అలంకార శాస్త్రమును రచించిన విద్యా నాధుడు ఆ గ్రంధంలో తెలిపాడు.
ప్రతాప రుద్రుడు శ.స 1216( క్రీ.శ 1294) నాడు తాను వ్రాయించిన ‘‘ అనంతపురం’’ తామ్ర శాసనములో తన తల్లి ‘‘ ఉమాంశ సంభవయగు ముమ్మడాంబ’’ అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ముమ్మడాంబ రుద్రమ కూతురే అనేందుకు ఇది మరొక ఆధారం అవుతుంది.

రుద్రమదేవి ఎప్పుడు చనిపోయింది?

రాజ్య పర్యటనలో భాగంగా వరంగల్‌ నుండి పిల్లలమర్రి, ఇనుపాముల, చందుపట్ల మీదుగా పానగల్‌కు చేరుకుని కాకతీయులు శివపూజలు చేసేవారు. క్రీశ 1289 నవంబర్‌ 27న రాణి రుద్రమదేవి, ఆమె సేనాని మల్లికార్జుననాయకుడు వీరమరణం పొందినందుకు వారి జ్ఞాపకార్థం పువ్వులముమ్మడి అనే సైనికుడు మరణ శాసనాన్ని వేయించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి సోమనాథ దేవుడికి కొంత భూమిని దానంగా ఇచ్చినట్టు శాసనం ద్వారా తెలుస్తోంది. శాసనం ప్రకారం రాణి రుద్రమదేవి కాయస అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్టు ఉంది. అప్పటి వరకు చరిత్ర కారులు క్రీశ1296 వరకు రుద్రమదేవి జీవించి ఉందని భావించేవారు. చందుపట్ల శాసనం బయటపడ్డ తర్వాత రుద్రమదేవి మృతికి వివరాలు స్పష్టమయ్యాయి.  క్రీ.శ. 1289 నవంబర్‌ 27వ తేదీ నాటి శాసనంలో ‘శ్రీ మన్మహామండలేశ్వర’ కాకతియ్య రుద్రమ మహాదేవికి శివలోక ప్రాప్తిగాను, మల్లికార్జునాయునిం గారికి శివలోక ప్రాప్తిగాను వారి భృత్యులు పువ్వుల ముమ్మిడింగారు చండ్రుపట్ల సోమనాథ దేవరకు ఆచంద్రార్కముగా కొంత భూమిని దానం చేసినట్లుగా ఉంది.

1289లో నల్గొండ జిల్లా సర్వేల్‌ శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు పున్నెముసేసి’;
28–11–1289లో గుంటూరు జిల్లా ఈపూరు శాసనంలో ‘రుద్ర దేవ మహారాజులకు ధర్మార్థముగా’;
11–8–1291 కృష్ణా జిల్లా గుడిమెట్ట శాసనంలో రుద్రదేవ మహారాజులు’; ధనువు, సంక్రాంతినాడు గుంటూరు జిల్లా లామ్‌ శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు ధర్మువుగా’; నల్గొండ జిల్లా పానగల్‌ (ఛాయా సోమేశ్వరం గోడపై) శాసనంలో ‘రుద్రదేవ మహారాజునకు పుణ్యముగాను’;
7–6–1294లో నెల్లూరు జిల్లా వేంపాడు శాసనంలో ‘రుద్రదేవ మహారాజులకు అభివృద్ధిగాను’ ఇవి.

ప్రతాప రుద్రుడినే రాజుగా కీర్తించే శాసనాలు ఏవి వున్నాయి?
16–9–1289లో పశ్చిమగోదావరి ఖండవల్లి శాసనంలో ‘ప్రతాపరుద్రుని వంశ చరిత్ర’;
11–2–1290లో నాగర్‌కర్నూల్‌ జిల్లా మేడిమల్‌కల్‌ శాసనంలో ‘ప్రతాపరుద్ర మహారాజు’;
25–2–1290లో ఉత్తరేశ్వర శాసనంలో ‘ప్రతాపరుద్ర మహారాజు’;
21–3–1290లో నల్గొండ జిల్లా మట్టంపల్లి శాసనంలో ‘ప్రతాప రుద్ర మహారాజు’;
16–5–1290లో నల్గొండజిల్లా పానుగల్లు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు, పృథ్వీరాజ్యంబు సేయుచుండంగాను’;
5–9–1290లో పేరూరు శాసనంలో ‘రుద్రకుమారుడు పృథ్వీ రాజ్యం సేయు చుండంగాను’;
19–10–1290లో పాతర్లపాడు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యం చేయుచుండంగాను’;
7–11–1291లో గుంటూరు జిల్ల్లా జూలకల్లు శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులకు పుణ్యముగాను’;
27–11–1292లో నెల్లూరు జిల్లా భీమవరంలో ‘ప్రతాపరుద్ర మహారాజులకు బుణ్యముగాను’;
21–1–1292లో గుంటూరు జిల్లా తేరాల శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు’;
20–3–1292 కృష్ణా జిల్లా పెద్ద కల్లేపల్లి శాసనంలో ‘కుమార రుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యము సేయంగాను’;
23–3–1292లో నల్గొండ జిల్లా ఇంక్రియాల్‌ శాసనంలో ‘ప్రతాప రుద్రదేవ మహారాజులు ఓరుగంట సుఖలీలా వినోదంబులం బ్రిథ్వీ రాజ్యంబు సేయు చుండంగాను;
21–4–1292లో గుంటూరు జిల్లా పిన్నలి శాసనంలో ‘ప్రతాప రుద్రదేవ మహారాజులు ఓరుగల్లు నిజ రాజధానిగాను సుఖసంకథా వినోదంబులం బ్రిథ్వీ రాజ్యంబు సేయుచుండంగాను’;
10–3–1293లో ప్రకాశం జిల్లా కండ్లకుంట శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖ సంఖథా వినోదంబుల రాజ్యము సేయుచుండంగాను’;
10–3–1293లో ప్రకాశం జిల్లా రావినూతల శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖ సంఖథా వినోదంబుల రాజ్యము సేయుచుండంగాను’;
9–9–1293లో గుంటూరు జిల్లా గోరవెంకపల్లి శాసనంలో ‘ప్రతాపరుద్ర వంశ చరిత్ర’;
9–6–1294లో నల్గొండ జిల్లా కూరెళ్ళ శాసనంలో ‘ప్రతాపరుద్రుని రాజ్యం’;
3–3–1295లో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజ సామ్రాజ్యం’;
18–7–1295లో నల్గొండ జిల్లా ఆలుగడప శాసనంలో ‘ప్రతాపరుద్రదేవ మహారాజులు పృథ్వీ రాజ్యంబు సేయుచుండంగా’... ఇలా ఈ శాసనాలన్నీ స్పష్టంగా ప్రతాపరుద్రున్నే మహారాజుగా పేర్కొన్నాయి.
ఇలా ఏయే శాసనాలు తాళపత్రాలు, రాగిరేకులు, నాణేలు, కైఫియత్తులు ఏ విషయాలను తెలిపాయి. ఏమని నిర్ధారించాయి అని చెప్పాలన్నా, వాటిలో వచ్చే వైరుద్యాలను సరిచూడాలన్నా చిన్న విషయం కాదు. పోనీ అవ్వన్నీ పరిశీలకులకు అందుబాటులో వుంటాయా అంటే అవి కూడా అంత సులభంగా దొరికేలా లేవు. మనకి బాగా తెలుసనుకుంటున్న కాకతీయుల చరిత్రలోనే ఇన్ని చీకటి కోణాలుంటే అంతకు ముందు పరిపాలించిన వివిధ వంశాలు ఆ తర్వత పెద్దగా వెలుగు పడని విషయాలను ఎలా అర్ధం చేసుకోవాలి. నిజానికి ఫేస్ బుక్ లాంటి ప్లాట్ పాం ల మీద ఈ విషయాలను చర్చిస్తే పాఠకులు సరిచూసుకోవాలన్నా సరైన ఆధారాలు కష్టం. అసలు సీరియస్ పరిశోధకులకు కూడా సమాచారం ఒక దగ్గర దొరకటం చాలా కష్టం అవుతోంది. బహుశా చరిత్రపై శ్రద్ధ తగ్గటానికి కారణాలలో చిక్కుముడులు  గందరగోళాలతో పాటు ఇది కూడా మరో కారణం కావచ్చు.
______________________
నావి రెండు సూచనలు విన్నపాలు
............................................

అ) యూనికోడ్ పద్దతిలోకి శాసన పాఠాలు అందుబాటులోకి రావాలి
___________________________________________

నిజానికి ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానంతో ఇదే పనిని మరెంతో సులభంగా చేయగల అవకాశం వున్నసరే ఎందుకో ఆ దిశగా సరైన ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనిపించదు. ఉదాహరణకు ఇప్పటి వరకూ అనుకున్న కాకతీయ శాసనాలను మనం యూనికోడ్ లో మార్చుకుని సెర్చ్ కి అనుకూలంగా ఒక ప్లాట్ ఫాంలో వుంచాం అనుకోండి. కావలసిన తేదీ, వ్యక్తి, ప్రదేశం ఒక దగ్గర సెర్చ్ దూరంలోకి వచ్చేస్తాయి. కొంచెం వివరంగా చెప్తాను. ఇప్పుడు కాకతీయుల శాసనాలు వగైరా మూడు నాలుగొందల వరకూ అందుబాటులో వుండొచ్చు వాటిని కొనాలంటే ICHR వాళ్లు విడుదల చేసిన కాకతీయ శాసనాలు పుస్తకం మూడు వేల రూపాయిలు. దానిలో లేని మరికొన్ని శాసనాలు కూడా వేరే సొర్సు నుంచి సేకరించినవి కూడా వున్నాయి. వాటిని ఇమేజ్ నుంచి టెక్ట్స్ గా మార్చే ఆటో మాటిక్ పద్దతిలో అక్షరాలు సరిగా తయారు కావడం లేదు కాబట్టి వాటిని జాగ్రత్తగా మొదట యూనికోడ్ లో టైపు చేయించాలి. ఉదాహరణకు ఒక పదిమంది టైపింగ్ తెలిసిన వాళ్ళు నియమించ బడితే రోజుకు రెండు శాసనాలు టైపు చేసి ప్రూఫ్ రీడింగ్ పూర్తి చేసుకొని ఫైనల్ చేసుకోవచ్చు అనుకున్నా నెలలో అన్నీ యూనికోడ్ లో మొదట మారతాయి. వాటిని కాటలాగ్ పద్దతిలో వెతుక్కునేలా ఏదన్నా ప్లాట్ పాం పై అప్ లోడ్ చేయవచ్చు. నాకు తెలిసినంతలో వికిపిడియా కూడా దీనికిమంచి ప్లాట్ ఫాం. కాకతీయ శాసనాలు అన్న వికిపిడియా ఆర్టికల్ దగ్గర నేను ఇప్పటికే కేవలం ఇండెక్స్ పేర్లు వరకూ టైపు చేసి వరసలో వుంచితే ఎలా వుంటుందో చూసాను. దానికి లింక్ చేస్తూ ప్రతి శాసనం ఒక ఆర్టికల్ గా దానిలోని వ్యక్తులు, ప్రదేశాలు ఆయా పేజీలకు లంకె చేస్తూ ఒక వెబ్ పద్దతిలో వీటిని పేర్చినట్లయితే ఇలాంటి సందేహాలపై ఎవరన్నా తగినంత రీసెర్చి చేయాలనుకున్నప్పుడు అప్పటికున్న ఆధారాలు ఒక క్రమంలోసులభంగా వెతుక్కునే అవకాశం వుండటమే కాక కొత్త శాసనం ఏదన్నా వెలుగులోకి రాగానే తగిన చోట దాన్ని జతచేయడం ద్వారా అప్పటి వరకూ వున్న అనేక ప్రశ్నలకు అద సమాధానం చెప్పేదిగా కూడా వుండొచ్చు.  ఒకే మనిషి చేస్తే సంవత్సరాల సమయం తీసుకునే ఈ పని, సంస్థాగతంగా స్పాన్సరర్స్ అనుకూలించి చేస్తే ఒకటి రెండు లక్షల ఖర్చుతో ఒక రూపంలోకి వస్తుంది. ఒకవేళ ఇలా కాకతీయ వంశంపై చేసే ప్రయోగం విజయవంతం అయితే అదే పద్దతిలో విజయనగర శాసనాలు, తిరుపతి శాసనాలు, వివిధ వంశాల శాసనాలను క్రమంలో పెట్టుకోవచ్చు.  అదే విధంగా వారి వారి గ్రామ చరిత్రను అద్యయనం చేసే వారికి ఆయా గ్రామల దగ్గర కూడా దాని ప్రత్యేకతలకు సంభందించిన అంశాలు అందుబాటులో వుండేలా చేరతాయి.

ఆ) గ్రామాల వారీగా చారిత్రక సర్వే నమోదు కావాలి
________________________________

చాలా తక్కువగా మిగిలిన చారిత్రక వివరాలను సరైన సర్వే నమూనా పత్రాలతో అన్ని గ్రామాలకూ ఒక ఉద్యమంగా చేయించాల్సిన అవసరం వుంది. అప్పుడెప్పుడో మెకంజీ ప్రతి ఊరూ తిరుగుతూ ఆయా గ్రామాలగురించి చెప్పుకునే కథలను కైఫియత్తులుగానూ, తాళపత్రాలలో రాసిన సమాచారం కవిలికట్టలలో సమసిపోకుండా తిరగరాయించడం.లాంటివి చేసాడని చెప్పుకుంటాం. మరి ఒక రాష్ట్రం స్థాయిలో మనమెందుకు ఇప్పటి వరకూ అడుగడుగూ జల్లెడ పట్టేలా చారిత్రక వివరాల నమోదు చేయలేదు. చేయాలనుకుంటే అదెంత పని. సరైన ప్రణాళిక వుంటే అలా చేయడంతో పాటు మొత్తం చక్కటి పద్దతిలో కన్సాలిడేట్ చేయ్యడం కూడా సాధ్యపడుతుంది. ప్రశ్నవళి పూరించేందుకు ప్రతిగ్రామంలోనూ వున్న చరిత్ర కొంత తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులు, విలేజ్ సెక్రటరీలు, విద్యార్ధులు వంటివారు సరిపోతారు. ప్రాధమికంగా సేకరించిన సమాచారానికి అదనపు వివరాలుంటే వాటిని మరికొంత నిపుణుల బృందం పర్యవేక్షించి నమోదు చేయవచ్చు. ఇప్పటికే ఆయా గ్రామాల గురించి ఉన్న సమాచారం మొదట అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది చేయిస్తే మరింత ఉపయోగకరంగా వుంటుంది. కొన్ని ముఖ్యమైన చిత్రాలను అప్ లోడ్ చేసేలా ఈ సర్వే అనుకూలంగా వుండాలి.
దీనిలో గ్రామాల్లో ఆ ఊరి పేరుకి వెనక చరిత్ర ఏమిటి దగ్గరనుండి ఏ చెట్టుక్రిందనో పడివుండే వీరగల్లుల నుండి, పాత ఆలయాలు శిల్పనిర్మాణం, వాటిపై ఏవన్నా అక్షరాలుంటే అవి, స్థానిక అడవులు గుహలో ఏవైనా గుహ చిత్రాలుంటే అవి, ఆ ఊరి చారిత్రక వ్యక్తులు , చారిత్రక సంఘటనలు భౌగోళిక ప్రత్యేకతలు వంటివి నమోదయ్యే అవకాశం వుండాలి. బహుశా ఇటువంటివి సాకారం అయితే మరింత లోతుగా మరింత శాస్త్రీయంగా చరిత్రను అద్యయనం చేయడంతో పాటు దాని వెలుతురులో ప్రస్తుత నడకకు పనికొచ్చే అంశాలనూ ఏరుకోగలుగుతాము.
పేస్ బుక్ లింకు 



కామెంట్‌లు