యుగాంతపు హెచ్చరిక (కథ) || కట్టా శ్రీనివాస్ ||





యుగాంతపు హెచ్చరిక (కథ) || కట్టా శ్రీనివాస్ ||

‘‘మిస్టర్ త్రినేత్ర భూమండలం మీద మానవ జీవరాశి నియంత్రణకు చర్యలు చేపట్టమన్న

 ఆదేశాలు అమలు జరుపుతున్నావా?’’ అబ్జర్వేటరీ రూంలోకి ప్రవేశిస్తూనే అడిగాడు నారద

 తన ఇంటర్ ప్లానెటరీ రిపోర్టింగ్ పనివల్లనే కాక త్రినేత్రతో వున్న స్నేహ సంభందాల 

వల్లకూడా ఆ చొరవ వచ్చింది.

                   ఆ మాటలతో తలతిప్పిన త్రినేత్ర రిలాక్స్ గా ఒక పలకరింపు చిరునవ్వు నవ్వి, కూర్చోమన్నట్లు ఆసనాన్ని చూపెట్టాడు. ‘‘ నిజమే భూగోళం నివాసయోగ్యం కాకుండా మనిషి చేజేతులా నాశనం చేస్తున్నాడు. పెరిగే భూతాపం, తరిగే సమతుల్యత, అత్యంత వినాశకరమైన మారణాయుధాలు, మనస్తత్వాలు ఇలాగే కొనసాగితే భూమి మన పరిశోధనలకు పనికిరాకుండా పోయే ప్రమదం వుంది. అందుకే ఒక కామా కానీ ఫుల్ స్టాప్ కానీ పెట్టమని పైనుంచి ఆదేశాలు వచ్చయి నారద’’ ఆపకుండా చెప్పుకెళుతున్నాడు అందరిలా రెండుకళ్ళు కాకుండా జెనెటికల్ మార్పుల్లో నొసటన మూడోకన్ను వున్న త్రినేత్ర.
కప్పులో ఇవ్వబడిన వేడిద్రావణాన్ని కొంచెంగా చప్పరించి ముందుకు వంగి అడిగాడు నారద ‘‘ మరింకేం త్రినేత్ర నీ కంటి జ్వాలలను కురిపించడమో, సముద్రగర్భం నుంచి సునామీ ఉప్పెనలు లేపడమో, దృవాల మంచు కరిగించి మొత్తం ముంచేయడమో చేసేస్తే అయిపోయేదిగా మరెందుకు ఆలోచిస్తున్నావు?’’ ముఖంలోకే నిశ్చలంగా చూస్తూ తన ప్రశ్న అడిగాడు.

ఎక్కడో ఆలోచిస్తున్నట్లు త్రినేత్ర భృకుటి ముడిచి చెప్పాడు ‘‘ నిజమే చీమల పుట్టను కాలితో నలిపేసినట్లు భూమండలంపై జీవరాశిని మొత్తం నాశనం చేసి ప్రాధమికదశలోకి మళ్లీ మొదలయ్యేలా చేయడం చిన్న పనే కానీ మనలాంటి మెదడుతో వున్న జీవి మానవుడు, ఎన్నో వందల ఏళ్ళపాటు ఒక్కో ఇటుకా పేర్చినట్లు కూడబెట్టుకున్న జ్ఞానఫలాలను ఇప్పుడిప్పుడే ఆనందంగా అనుభవిస్తున్నాడు, విపత్తులను, రోగాలను తట్టుకునే శక్తి సంపాదించాడు, యంత్రంలో భాగంగా మారని జీవి ఎంతవరకూ ఎదగగలదు అనే మన పరిశోధనలకు మంచి సమాధానం వచ్చేసమయంలోకి చేరుకుంటున్నాడు, అటువంటి మానవజాతిని మొత్తంగా తుడిచిపెట్టడం అంటే కొంచెం బాధగా వుంది. ’’ బాధని మాటల్లో కనబడేలా చెప్పాడు త్రినేత్ర ఉరఫ్ శివ. ‘‘ ఎంతటి భోళా శంకరుడివయ్యా సామీ.. నువ్వేమో వాళ్లను చూసి జాలిపడుతూ ప్రేమ చూపిస్తావు, వాళ్ళేమో మాకు మించిన వాళ్ళెవరూ లేరని విర్రవీగుతారు. బాగుంది మీ చిద్విలాసకేళి, మరి పైవారి ఆజ్ఞలకు బద్దుడవు కాకుండా వారిని అలాగే వదిలేస్తున్నావా? ’’ నారద గడగడ అడిగేశాడు త్రాగటం పూర్తిచేసిన పాత్రను అక్కడి మిద్దెమీద వుంచుతూ.

‘‘లేదు నారద అలా వదిలేసినా సరే వాళ్లకు కీడుచేసినట్లే అవుతుంది. వాళ్లు పూర్తిగా సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోకి వెళ్లేప్రమాదాలున్నాయి. అందుకే వారిని స్థూల ప్రపంచ చర్యలతో నిర్మూలన చేయడం కాకుండా సూక్ష్మప్రపంచపు పదునైన హెచ్చరికలతో సర్దుకోమ్మని చెప్పడం ప్రారంభించాను.’’ త్రినేత్ర తన ప్రణాళికా విశేషాలను కంప్యూటర్ లో ఓపెన్ చేసి నారదకు వివరించడం ప్రారంభించాడు. ‘‘ ఇదే భూగోళం ఉప్పెన, అగ్గి, వరద లాంటివి కొంతమేర ప్రభావం చూపుతూ సంపదలను సైతం ధ్వంసం చేసేస్తాయి. అందుకే శ్లేష్మం వున్న ప్రతిమనిషినీ భయపెట్టేలా కిరీట ధారియైన వైరస్ అనే సూక్ష్మజీవితో దండయాత్రకు శంఖారావం మ్రోగింప జేస్తున్నాను, ఇప్పటికే వేర్వేరు పేర్లతో ఒకటి రెండు మానవ సంవత్సరాల విరామంతో హెచ్చరికలు కూడా పంపాను. ఇప్పుడీ ద్వంద్వం సంవత్సరంలో మరింత ఎక్కువ డోస్ తో వారిని కట్టడి చేస్తున్నాను. కొన్ని ఆలోచనల బీజాలను కొందరిలో మెమరీ ట్రాన్స్ ఫర్ పద్దతిలో కలగజేసి హెచ్చరికలను సరాసరి మనిషికి అందేలా చేస్తాను. ఒకవేళ వింటే ఫలిత మార్గం ఒకలాగానూ,  వినకుంటే మరొకలాగానూ  మలుపు తిరుగుతుందన్నమాట’’ అర్దం అయ్యిందా అన్నట్లు చూసాడు నారద వైపు. 

‘‘జ్ఞానబదిలీ పద్దతిలో పంపిన హెచ్చరికలా అవేమిటి శివా? ’’ కుతూహలంగా అడిగాడు నారదుడు.

‘‘ చెప్పడం ఎందుకు, నేను క్లిక్ చేస్తున్న ప్రాంతలోని విశేషాలను తమరే పరిశీలించండి అంటూ స్క్రీన్ మీద కనిపిస్తున్న గ్లోబులా తిరుగుతున్న భూమిపై చిన్న క్లిక్ ఇచ్చాడు అది ఆసియా ఖండంలోని భారతదేశంమీద ఆనింది.

అటువైపు చూస్తూనే కొంటెగా నవ్వుతూ మరోప్రశ్న వేశాడు నారద ‘‘ తెలివి మీరిన మనిషి మన ఉనికిని కూడా పట్టేస్తాడేమో!! అప్పుడేం చేస్తారు? అలా జరగాలనుకుంటున్నారా? లేక అది అర్ధం కానివ్వని మాయపొర వుంచుతారా?’’ టివిషోలో క్రిటికల్ ప్రశ్నవేసి కోణంగి నవ్వు నవ్వే యాంకర్ లా మొహం పెట్టాడు.


‘‘ చూడండి మిస్టర్ నారద కొన్ని విషయాల అవగాహనకు మెదడు స్టోరేజి స్పేసు, ప్రాసెసింగ్ శక్తికి మధ్య పరిమితులున్నాయి. అవి విస్త్రుతం కావాలనే కోరుకుంటున్నాం, అదే జరిగితే కొన్ని కోణాల్లో మంచిదే కానీ అలా అర్ధం చేసుకునేందుకు చాలాదూరంలో వున్నది మనిషి మెదడు. అటొక్కసారి చూడండి ఎంతమేరకు ఈ వంతెన కట్టబడుతుందో మీకే బోధపడుతుంది. ’’ అంటూ భారతదేశంలోని ఒక అత్యాధునిక ప్రయోగశాల మీద మరింతగా జూమ్ చేసాడు లయ ప్రాసెస్ ఛీఫ్ త్రినేత్ర.


==:==

పెద్దహాలు నిండేంత వున్న డైనోసార్ శిలాజంలోంచి చిన్న చీమతలకాయంత శాంపిల్ ఒకదగ్గర తీసుకుని దాన్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కొప్ క్రింద పరిశీలిస్తున్నాడు ప్రొఫెసర్ విద్యార్ధి. ఆయన పరిశోధనలో ముఖ్యాంశం మైక్రోఫాజిల్స్ అంటే కోట్లాది సంవత్సరాల క్రితం నాటి అత్యంత సూక్ష్మజీవుల శిలాజాలు అన్నమాట. శిలాజాలంటే తెలిసిన చాలా మందికి కూడా ఈ మైక్రోఫాజిల్స్ పై అవగాహన వుండదు అందుకే ఆ టాపిక్ లో తన పేపర్ ప్రెజెంట్ చేయాలని పరిశీలిస్తుంటే ఎవరో కావాలని ఒకదాని తర్వాత ఒకటి అందిస్తున్నట్లు ఆయనకు ప్రపంచగతిని కొత్తగా అర్ధం చేసుకోవలసిన విశేషాలు బయటపడుతున్నాయి. ఒకవైపు మైక్రోస్కోపిక్ దృశ్యాలను గమనిస్తూనే నోట్సులో రాసుకుంటున్నాడు.
అప్పుడే ఛాంబర్ లోకి ప్రవేశిస్తున్న రీసెర్స్ స్టూడెంట్ షీలా ఈయన వైపు చిత్రంగా చూస్తూ అడిగింది. ‘‘ ఏంటి ప్రొఫెసర్ రాత్రి ఇంటికెళ్ళినట్లు లేరు, కనీసం ఉదయం నుంచి ఏమన్నా తిన్నారా?’’ అంటూ.

 ఆ ప్రశ్నే  వినబడనట్లు ఆయన ‘‘ఆ షీలా వచ్చావా ఈరోజు ఫాజిల్ బోన్ మారో నుంచి చిన్న శాంపిల్ తీసిపెట్టాలి నువ్వు, నిన్న మనం అనుకున్నట్లే పెద్దఫాజిల్ దేహంలో మరేవైనా సూక్ష్మజీవుల ఫాజిల్ బాడీస్ వుంటాయేమో అని చేసిన పరిశీలన సక్సెస్ అయ్యింది. కొప్రోలైట్స్ అనబడే జంతు పెంటికల శిలజాలలో గింజలు వంటివి దొరికినట్లే శిలాజ రూపాల్లో సూక్ష్మజీవుల ఉనికి ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. అక్కడికి పెద్దగా గొప్ప విషయం లేకపోయినా ఈ పరిశీలన భూమ్మీద మహారాజులుగా బ్రతికి ప్రపంచానికి తామే ప్రభువులం అన్నట్లు ఏలిన రాక్షసబల్లుల అంతానికి కారణం దొరుకుతోంది’’ కళ్ళలో మెరుపులతో చెపుతున్నాడు ప్రొఫెసర్ విద్యార్ధి.

‘‘ ఉల్కాపాతం జరగటం వల్ల రాక్షసబల్లులు చనిపోయాయి అని చదువుకుంటున్నాం కదా’’ ఇది తెలిసిన విషయమే అన్నట్లు షీలా క్యాజువల్ గా సమాధానం ఇచ్చంది.
‘‘ మరి అదే నిజం అయితే ప్రపంచంలో వేర్వేరు చోట్ల వున్న రాక్షసబల్లుల అన్నింటి నెత్తిమీద ఒకేసారి ఉల్కలు రాలాయా? వాటి ఎత్తువల్ల అలాంటిదేదో జరిగిందిలే అనుకున్నా, ఆ బల్లుల పొదగబడుతున్న అండాలన్నింటిమీద కూడా అవే ఉల్కలు ఎంచుకుని మరీ దాడిచేసాయంటావా? అసలు అది సాధ్యపడే విషయం ఎలా అవుతుంది?’’ ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నకు షీలా దగ్గర సమాధానం లేదు.

ఆయనే చెప్పుకెళుతున్నాడు. ‘‘ అంటే ఖచ్చితంగా ఇవ్వన్నీ చనిపోడానికి పెద్ద కారణమేదో ఉండి వుండాలి. భూమి మీద వీటి మనుగడకు అతిపెద్ద అననుకూల గండం ఏర్పడి వుండాలి. అదేమిటో మొన్నటి వరకూ సరిగా తట్టలేదు కానీ ఇప్పుడు పరిశీలిస్తుంటే వైరస్ లాంటి సూక్ష్మజీవి అనిపిస్తోంది.’’ అంటూ ఆమె వింటుందో లేదో పరిశీలించి మళ్ళీ కొనసాగించాడు. ‘‘ డియన్ ఏ మార్పుల వల్లనో, దృవాల శీతలఫలకాల క్రిందనుంచో ఒక్కసారిగా వచ్చిన కొత్తరకం వైరస్ లు ఒకదాని నుంచి ఒకదానికి వేగంగా ప్రపంచం అంతా వ్యాపిస్తూ రాక్షసబల్లులను మొత్తంగా అంతచేసివుండొచ్చేమో’’ ప్రొఫెసర్ చెప్తున్నాడు.

‘‘ రియల్లీ మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెసర్, మీరు ప్రపంచానికి ఒక సంచలన విషయం తెలియజేస్తున్నారు, కానీ అది నిజమే అనేందుకు ఈ ఒక్క బోన్ లో కనిపించిని మైక్రోఫాజిల్ ఆధారం సరిపోదనుకుంటాను’’ ఆమె నిజమైన రీసెర్చి విద్యార్ధిలా ప్రశ్నిస్తోంది.
‘‘ లేదు షీలా దీన్ని నిరూపించడం కోసం ఆధారాలు సేకరించడం కంటే ముందు నాకు వేరే సీక్వెన్స్ పట్టుకోవడం అవసరం అనిపించింది.’’ పెన్నుతో స్క్రిబ్లింగ్ పై తడుతూ చెప్తున్నాడు విద్యార్ది.

‘‘ ఏంటి ప్రొఫెసర్ ఆ సీక్వెన్స్’’ కుతూహలంగా అడిగింది షీలా.

‘‘ మనిషి అంతం గురించి ’’ చీకట్లో ఉరుము శబ్దం లాగా పెటిల్మని వచ్చింది ఆయననుంచి సమాధానం

‘‘ మనిషి అంతమా? అంటే భవిష్యత్తులో మానవజాతికి రాగల ముప్పు గురించి చెప్తున్నారా ప్రొఫెసర్’’ కూర్చోవాలనే సంగతి మర్చిపోయి అడుగుతోంది షీలా.

‘‘ కాదు షీలా ఇంతకు ముందు మానవజాతి అనేక సార్లు పాక్షికంగా అంతమై పునరుత్థానం చెందటం గురించి చెపుతున్నాను’’  గోడమీద వున్న మానవ పరిణామం చిత్రంపై పెన్నును అదే వరసలో కదిపి చివర్లో క్లిక్ చేసినట్లు నొక్కుతూ చెప్పాడు విద్యార్ధి.

‘‘ మనిషి ఇప్పటి వరకూ ఆగకుండా ఒక్క వరుసగ్రాఫులో అభివృద్ది చెందుతూ వచ్చినట్లు మనం అనుకుంటున్నాం కానీ మనిషి గతంలోనే తగినంత ఉన్నత స్థాయి పరిజ్ఞానం సంపాదించుకుని అనుకోని కారణాలతో చాలా జనాభా తుడిచిపెట్టుకుపోయి, మళ్ళీ సాధారణ స్థితినుంచి జీవనం ప్రారంభించి మళ్ళీ ఎదుగుతూ రావడం అంటే అభివృద్ధి గ్రాఫ్ లో పైకి వైళ్ళి మళ్ళి క్రింద వరకూ పడిపోయి మళ్ళీ ఎదుగుతూ రావడం అన్న మాట ఇది ఒక్కసారికన్నా ఎక్కువసార్లే జరిగిందేమో అనిపిస్తోంది.’’ చెప్పుకెల్తున్నాడు ప్రొఫెసర్.

మధ్యలో అడ్డుతగులుతూ షీలా తన ప్రశ్నలాంటి అనుబంద అంశం చెప్పింది. ‘‘ అంటే వివిధ మతాల్లో యుగాంతం, యుగారంభం అంటూ చెప్పిన కథల్లాగానా ప్రొఫెసర్, బైబిల్ లోని నోవా నావలో రక్షించబడ్డవారు తప్ప మిగిలిన వారు జలసమాధి కావడం, హిందూ పురాణాలలో యుగాంతం అయ్యి పునఃసృష్టి జరగటం లాంటివి నిజంగా జరిగాయి అంటున్నారా?’’ నమ్మలేనట్లున్నాయి ఆమె మాటలు.

‘‘ అదే చెప్పబోతున్నాను షీలా మనిషి ఈ పౌరాణిక కథనాలను ఏర్పటు చేసుకున్న నేపద్యం కూడా ఇటువంటి ఒకానొక జ్ఞాపకపు అవశేషమేమో అనుకుంటున్నాను. ’’ శ్రద్దగా చెపుతున్న ప్రొఫెసర్ ని ఆపి తన ప్రశ్న వేసింది షీలా. ‘‘ కానీ ఇటువంటివి అదనపు ఆదారాలు అవుతాయి కానీ డెరివేషన్ కు ఉపయోగపడవని మీకు తెలియంది కాదుగా ప్రొఫెసర్’’ నమ్రతగానే అడిగినా ఆమె ప్రశ్నలో సైంటిఫిక్ టెంపర్ చురుకుగా ఆయన్ను తాకింది. ‘‘షీలా నేను ఏదో చెపుతుండగా నువ్వు ఈ ప్రస్తావన చేయడంతో వీటిని ఎలా అర్ధం చేసుకోవాలో ముందుగా చెప్పాను కానీ హైపాథీసిస్ కోసం పేర్చుతున్న ఆధారాలు వేరు, ఉదాహరణకు ప్రపంచంలో ప్రాచీన వైజ్ఞానికి ప్రగతికి అద్దం పట్టే పిరమిడ్ లాంటి బృహత్తర నిర్మాణాలు, స్పటిక పుర్రెలు, లాంటివి వీటిని పట్టించ్చే రెడ్ హెర్రింగ్స్ లాంటివి. మెహంజదారో, ద్వారక, అయోధ్య, కాశి అవంతిక లాంటి మహా పట్టణాలు సాంతం ఎలా అంతం అయ్యాయి? ఆధునికి సాంకేతికతకు అంతుపట్టని వైద్య ప్రక్రియలు వంటయింట్లోకి ఎలా చొచ్చుకువచ్చాయి? ఖగోళగతులను అంతముందుగా చాలా ఖచ్చితంగా ఎలా లెక్కలు కట్టారు? ఇట్లా ఎన్నో ప్రశ్నలు ఒకప్పటి మానవ ఉత్థానాన్ని సూచిస్తున్నాయి. అంతే కాదు కోట్లాది సంవత్సరాల క్రితమే దొరికిన శిలాజాలు క్షిరదాల పుట్టుకను గురించి తెలియజేస్తుంటే ఈమధ్య వేలాది సంవత్సరాల వరకు మాత్రమే మానవ చరిత్ర వుంటుందా? నిజానికి ఇవ్వన్నీ ఒక క్రమంలో పేపర్ కోసం తయారుచేయాలి షీలా నాకు డైనోసర్ మరణం అనేది ఒకచిన్న దృష్ట్యాంతం అంతే దానినుంచి మనిషి పరిణామంలోని కొత్త కోణాలపై తగిన వివరణ ఇవ్వాలనేదే ఆశయం’’ చెప్తున్నాడాయన.

‘‘చివరిగా మరో ప్రశ్న ప్రొఫెసర్’’ షీలా ఆయన పనికి మరీ అడ్డురాకూడదూ అనుకుంటూనే తన మనసులో పొడచూపిన ప్రశ్న అడగకుండా ఆగలేకపోయింది.

‘‘ ఇప్పుడు కూడా మనిషి ఎదుగుతూ వెళతాడా? లేక మళ్ళీ అంతమై మొదటినుంచి వస్తాడని మీరు ఊహిస్తున్నారా?’’ తెలుసుకోవడం కోసం అనేకంటే మనసులో బరువుదించుకోవడం కోసం అడిగినట్లు వున్నాయి ఆమె ముఖకవళికలు.

‘‘ బాగా అడిగావు షీలా, కానీ నిజానికి ఆ రిమోట్ మనిషి చేతిలోనే వుంది. కొత్త శక్తిలా వచ్చిన కొరివిలాంటి భస్మాసుర హస్తాలను శత్రు వినాశనానికి మాత్రమే వాడతాడా తన తలమీదనే పెట్టుకుని స్వీయవినాశనం చెందుతాడా అనేది మనిషి చేతిలోనే వుంది. ’’ చెప్పుకెళ్తున్నాడు విద్యార్ధి.

‘‘ అర్ధం కాలేదు ప్రొఫెసర్, మనిషి అంతం తన చేతుల్లోనే వుండటం ఏమిటి? తెలిసి తెలిసి తన జాతిని ఎందుకు, ఎలా అంతం చేసుకుంటాడు మానవుడు?’’ తెలివైన షీలా ప్రశ్నవేయకుండా ఆగలేకపోయింది.

 అప్పటిదాకా చెపుతున్న వేగాన్ని తగ్గించి ఉదాహరణతో చెప్పాలన్న ఉద్దేశ్యంతో ప్రొఫెసర్ స్క్రీన్ మీద వున్న ఏదో ఫోల్డర్ ఓపెన్ చేసి ఒక కీటకం లాంటి బొమ్మ చూపిస్తూ అడిగాడు. ‘‘ షీలా ఈ బొమ్మ ఏమిటో గుర్తుపట్టగలవా?’’  షీలా నిశితంగా చూసింది. ‘‘ ఆ ప్రొపెసర్ ఇది బెడ్ బగ్ కదా ఆర్ధోపొడా వర్గం ఒకప్పుడు మంచాలకు కుర్చీలకు బాగా పట్టేవి నల్లులు అని పిలుస్తారు’’ టక టకా చెప్పింది.

‘‘ యెస్ ఎక్సాక్ట్లీ ఇవి నల్లులే, ఇవి ఎంత టఫ్ జీవులంటే ఒకప్పుడు డైనో సర్ లను కూడా కుట్టే వుంటాయి అలా కోట్ల ఏళ్ళ నాటినుంచి ఈ మధ్య కాలం దాకా వాటి మనుగడ సాగించాయి.తమ మెండిఘటం ప్రాణాలను ఎన్నొన్నో ప్రతికూల వాతవరణాలను ఎదుర్కొంటూ నిలబెట్టుకున్నాయి. కానీ మనిషి అభివృద్ది పేరుతో చేసిన వాతావరణ మార్పులు, కృత్రిమ పంటలు, పెస్టిసైడ్స్ ప్రభావం వల్ల ఏం జరిగిందో తెలుసా? కోట్లాది ఏళ్ళ మనుగడ సామర్ధ్యం వున్న ఈ నల్లిజాతే దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. బహుశా ఏ శాస్త్రవేత్తా దీనిపై పరిశోధన చేసినట్లు లేరు. పెద్దగా వాణిజ్యప్రయోజనం లేకపోతే పరిశోధనలు కూడా జరగక పోవడం మనిషి నేర్పిన సైకాలజీ. ఖఛ్చితంగా ఇదే మార్పు మనవ మనుగడను అంతం చేయబోయేంత ఎదిగింది.’’ తన ప్రశ్నకు సమాధానం ఏదో తట్టినట్లే షీలా తలూపుతోంది.

ఆయన కొనసాగిస్తున్నారు ‘‘ నిద్రసమయంలో శరీరంలోని వ్యవస్థలు శుభ్రపడినట్లు, ఆలోచనలు తేటబారినట్లు, ఎప్పుడన్నా ప్రపంచం ఒక నెమ్మదిలోకి నెట్టబడిందంటే లోపటి శుద్ది ఏదో జరుగుతుంది. ఆ తర్వాతి మార్పు ఎలా వుండాలి అనేది మనిషి చేతుల్లోనూ, చేతల్లోనూ వుంటుంది. నా పేపర్ ఈ దిశగా సూచనలు చేసేట్లు వుండాలి అనుకుంటున్నాను ఏమంటావు అడిగాడు షీలావైపు చూస్తూ....

ఆమె పెదాలు దగ్గరకు బిగించి శబ్దం రానంత నెమ్మదిగా రెండుచేతులతో చప్పట్లుకొట్టినట్లు ఆడించి థంబ్స్ అప్ అంటూ కుడిచేతిని పైకి చూపింది.

00=O=00

ఇదంతా పరిశీలనగా చూస్తున్న నారదుడు కూడా తన కుడిచేతిని పైకెత్తి థంబ్స్ అప్ సింబల్ ముందు స్క్రీన్ వైపు చూపించి తర్వాత త్రినేత్ర వైపు తిప్పాతూ తేలికపాటి తమాషా మాటలతో ఇలా అన్నాడు.

‘‘ మొత్తానికి క్లీన్ బౌల్డ్ సేసెయ్యి సామీ అంటే అలారం బెల్లు కొట్టి మరీ ఎక్కడి దొంగలు అక్కడ్నే గాప్ చూప్ సాంబార్ బుడ్డి అంటూ మానవులను అదిలించి బెదిరించి చేస్తున్న పొరపాటు సరిచేసుకునే అవకాశం ఇస్తున్నావన్నమాట’’ అభినందిస్తున్నట్లు త్రినేత్ర వైపు చూసాడు నారద.

‘‘ ఇదేదో నా జాలి మాత్రమే కాదు నారద, ఒక ప్రయోగాన్ని నిష్పలం కాకుండా రక్షించుకునే ప్రయత్నం కూడా, బహుశా మంచిఫలితాలు రావాలని వస్తాయని ఆశిస్తున్నాను. ’’ అంటూ నారదుడి నుంచి సెలవు తీసుకుని ఎప్పటిలా తన పరిశీలనలో మునిగిపోయాడు ఛీఫ్ త్రినేత్ర.

తేలికపడ్డ మనసుతో బయటికి వస్తూ నారద ఆఫీసు నేమ్ బోర్డు వైపు మరోసారి చూసాడు.
‘‘లయకార కేంద్ర’’ అంటూ ఉబ్బెత్తు అక్షరాలతో స్పష్టంగా మెరుస్తోంది.

(ఈ కథ తయారుచేస్తున్న క్రమంలో తమ తమ సంభాషణలతో చాలా విషయాలను అందించిన భాస్కర్.కె, సునీల్ సముద్రాల, శ్రీరామోజు హరగోపాల్, అరవింద్ ఆర్యా, యజ్ఞపాల్, రక్షితసుమ లకు ధన్యవాదాలతో)






కామెంట్‌లు