విమ్మర్సా నిమ్మరసం

కట్టా శ్రీనివాస్ || విమ్మర్సా నిమ్మరసం ||

పచ్చటి మొక్క ఒకటి
గుంపులేని కవితలాగా
దీనంగా చూస్తోంది.
తన అస్థిత్వాన్ని నిర్ధారించే
తాఖీదు  ఇవ్వకపోతారా అని.

ఆకుపచ్చ రంగు ఆకుది కాదు
లోపటున్న పొట్లాలదంటూ
విశ్లేషకులు వీరలోతుల్లో
వున్నారు మరి.

వాలే పిట్టల
మాటల్లో పడి
కొన్నాళ్ళకు
టింబర్ డిపో లెక్కలు
మర్చిపోయింది చెట్టు.

మోయలేని బరువు వేసుకున్నావని
గుమ్మడి పాదుని గుంజీలు తియ్యమని
బుడ్డి బుడ్డి కాయలున్నందుకు
సిగ్గులేదా అని మర్రిచెట్టుని వెక్కిరించారు.
స్కేలుతో కొలిచి ఆకుల మధ్య దూరం
సరిగా లేదని చిరాకుపడ్డారు.

నీడనివ్వడం
తొడువుండటం మాత్రమే కాదు
కల్మషాన్ని శుద్ధి చేయడమూ
తన పనే  అనే
తత్త్వం తెలిసిన మొక్క
ఎప్పుడూ మాట్లాడదు.

తేదీ : 13-05-2020


నోట్స్ :
ప్యాకేట్స్ = chlorophyll in other sense bribe
శుద్ధి = CO2 into O2
నిమ్మరసం = దీక్షా విరమణ ( దీక్షానంతర ప్రతిఫలం)

కామెంట్‌లు